మున్‌మున్ హుస్సేన్ అలియాస్ అర్చనా బారువా అలియాస్ నిక్కి
ముంబై : విలాసవంతమైన జీవితాన్ని గడపటం కోసం దొంగతనాలను ఎంచుకుందో ఆర్కేస్ట్రా సింగర్. షాపింగ్ మాల్స్, మార్కెట్లు, బ్యూటీ పార్లర్ల వద్ద ఖరీదైన వస్తువులు దొంగలిస్తూ.. తాజా అరెస్ట్‌తో కలిపి మొత్తం 11 సార్లు జైలు పాలయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన మున్‌మున్ హుస్సేన్ అలియాస్ అర్చనా బారువా అలియాస్ నిక్కి భర్తతో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ఉండేది. భర్త బిజినెస్‌లో ఉండగా నిక్కి ఆర్కేస్ట్రాలో పాటలు పాడేది. అయితే బిజినెస్‌లో నష్టం కారణంగా వారి కుటుంబం అప్పుల పాలైంది. దీంతో వారు కోల్‌కతాకు పరారయ్యారు. అనంతరం భర్తకు విడాకులు ఇచ్చిందామె. ఎంత వెతికినా ఉద్యోగం దొరకకపోవటంతో విలాసాలకు అలవాటుపడ్డ ఆమె దొంగతనాలకు పూనుకుంది. వివిధ నగరాలు తిరుగుతూ షాపింగ్ మాల్స్, మార్కెట్లు, బ్యూటీ పార్లర్ల వద్ద ఖరీదైన వస్తువులను దొంగలించసాగింది. ( రూ. 40 వేలు.. ఓ విస్కీ బాటిల్)
ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో దొంగతనాలు చేసింది. 2008లో హైదరాబాద్ పోలీసులు, 2009లో కోల్‌కతా పోలీసులు.. 2012-2019 వరకు చాలా సార్లు బెంగళూరు పోలీసులు నిక్కిని అరెస్ట్ చేశారు. అయినా ఆమెలో మార్పురాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులో ఉంటోన్న ఆమెపై 2018నుంచి ముంబై పోలీసులు నిఘా పెట్టారు. 2019 ఏప్రిల్‌లో ముంబైలోని లోయర్ పారెల్ ఏరియాలోని షాపింగ్ మాల్‌లో ఓ మహిళ బ్యాగ్‌ను దొంగలించిందామె. అందులో 13 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 50 వేల నగదు, ఐఫోన్ ఉంది. 2020, నవంబర్ 29న ఈ కేసు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు చేరింది. రంగంలోకి దిగిన వారు ఈ మంగళవారం ఆమెను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment