Woman thief
-
మహిళా దొంగల హల్చల్.. పట్టపగలే బట్టల దుకాణంలో చోరీ
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పట్టపగలు మహిళా దొంగలు హల్చల్ చేశారు. బట్టల దుకాణంలోకి కస్టమర్ల మాదిరిగా ప్రవేశించిన నలుగురు మహిళలు చీరల చోరీకి పాల్పడ్డారు. యాజమాని పవన్ కన్నుగప్పి 20 వేల రుపాయల విలువ చేసే చీరలు అపహరించారు. కిలేడీల చోరీ బాగోతం పీపీ కెమెరాలో రికార్డు అయింది. సీసీ పుటేజ్ ఆధారంగా ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు షాప్ నిర్వాహకులు. మరో ముగ్గురు పారిపోగా. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అయిదుగురు మహిళలు గుంటూరు నుంచి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. కొత్తగూడ లో శుక్రవారం అంగడి కావడంతో సందడిగా మారిన షాప్‌లో చోరీకి యత్నించిన మహిళా చోరులు.. నిఘా కళ్ళతో అడ్డంగా బుక్కయ్యారు. -
కి‘లేడి’.. మహిళ చెయ్యి పడిందంటే ఇక అంతే!
సాక్షి, మెదక్: చోరీలు చేస్తున్న మహిళను పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి అరెస్ట్ చేశారు. గురువారం నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం కంగ్టి మండలం చుక్కల్ తీర్థ్ గ్రామానికి చెందిన విఠాబాయి ఈనెల 16 తేదీన హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్‌కు వచ్చింది. స్టీలు దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసింది. దుకాణదారుడికి డబ్బులు చెల్లించేందుకు తన బ్యాగ్‌లో నుంచి నగదు తీస్తుండగా మరో మహిళ చూసింది. ఆమె చాకచక్యంగా బ్యాగులో నుంచి రెండు బంగారు ఉంగరాలు, కొంత నగదు చోరీ చేసింది. బంగారు ఉంగరాలు, నగదు పోగొట్టుకున్న బాధిత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 17 తేదీన పట్టణంలోని మార్కెట్లో మరో మహిళ పర్సును చోరీ చేసేందుకు యత్నించింది. చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ ఫుటేజీలో చోరీకి యత్నిస్తున్న దృశ్యం కనిపించడంతో నిందితురాలిని అరెస్ట్ చేశారు. నిందితురాలు మహారాష్ట్రలోని డెగ్లూర్కు చెందిన దుర్గావాడేకర్గా గుర్తించారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్రలో పలు చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించినట్లు ఎస్ఐ వివరించారు. చదవండి: మహిళ అక్రమ నిర్బంధం.. అయిదుగురు జీఎస్టీ అధికారులపై కేసు -
ముగ్గురు మాయ లేడీలు.. భలే దోపిడీలు!
సాక్షి, చాంద్రాయణగుట్ట: దృష్టి మరల్చి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను శాలిబండ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పురానీ హవేలీలోని తన కార్యాలయంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ కేసు వివరాలు వెల్లడించారు. సయ్యద్ అలీ చబుత్రా ప్రాంతానికి చెందిన లెక్చరర్ తహమీనా సయీద్ ఈ నెల 3న మధ్యాహ్నం 2.30 గంటలకు నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని ఆశా టీ జంక్షన్ వద్ద ఉన్న పారిచంద్ జ్యువెల్లరీకి వెళ్లింది. మెరుగులద్దించుకున్న అనంతరం తిరిగి వచ్చేందుకు ఆటోలో ఎక్కింది. లాల్‌దర్వాజా మోడ్ వద్దకు రాగానే ఆటోలో ఎక్కిన ముగ్గురు మహిళలు ఆమె దృష్టి మరల్చి బంగారంతో ఉన్న పర్సును చోరీ చేసి పరారయ్యారు. అనంతరం గమనించిన ఆమె శాలిబండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. 50 సీసీ కెమెరాలు పరిశీలించి ఎట్టకేలకు నిందితురాళ్ల జాడను గుర్తించారు. తుకారంగేట్ మాంగరు బస్తీకి చెందిన రూప (31), ఉష (30), నిషా (23)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ సయ్యద్ రఫిక్, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, శాలిబండ అదనపు ఇన్స్పెక్టర్ మునావర్ షరీఫ్, ఎస్సై టి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కేసును త్వరగా చేధించిన స్టాప్‌ను ఈ సందర్భంగా డీసీపీ అభినందించారు. -
3 పేర్లు,పది అరెస్టులు: ఓ లేడీ సింగర్ క్రైం కథ
ముంబై : విలాసవంతమైన జీవితాన్ని గడపటం కోసం దొంగతనాలను ఎంచుకుందో ఆర్కేస్ట్రా సింగర్. షాపింగ్ మాల్స్, మార్కెట్లు, బ్యూటీ పార్లర్ల వద్ద ఖరీదైన వస్తువులు దొంగలిస్తూ.. తాజా అరెస్ట్‌తో కలిపి మొత్తం 11 సార్లు జైలు పాలయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన మున్మున్ హుస్సేన్ అలియాస్ అర్చనా బారువా అలియాస్ నిక్కి భర్తతో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ఉండేది. భర్త బిజినెస్‌లో ఉండగా నిక్కి ఆర్కేస్ట్రాలో పాటలు పాడేది. అయితే బిజినెస్‌లో నష్టం కారణంగా వారి కుటుంబం అప్పుల పాలైంది. దీంతో వారు కోల్‌కతాకు పరారయ్యారు. అనంతరం భర్తకు విడాకులు ఇచ్చిందామె. ఎంత వెతికినా ఉద్యోగం దొరకకపోవటంతో విలాసాలకు అలవాటుపడ్డ ఆమె దొంగతనాలకు పూనుకుంది. వివిధ నగరాలు తిరుగుతూ షాపింగ్ మాల్స్, మార్కెట్లు, బ్యూటీ పార్లర్ల వద్ద ఖరీదైన వస్తువులను దొంగలించసాగింది. ( రూ. 40 వేలు.. ఓ విస్కీ బాటిల్) ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో దొంగతనాలు చేసింది. 2008లో హైదరాబాద్ పోలీసులు, 2009లో కోల్‌కతా పోలీసులు.. 2012-2019 వరకు చాలా సార్లు బెంగళూరు పోలీసులు నిక్కిని అరెస్ట్ చేశారు. అయినా ఆమెలో మార్పురాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులో ఉంటోన్న ఆమెపై 2018నుంచి ముంబై పోలీసులు నిఘా పెట్టారు. 2019 ఏప్రిల్‌లో ముంబైలోని లోయర్ పారెల్ ఏరియాలోని షాపింగ్ మాల్లో ఓ మహిళ బ్యాగ్‌ను దొంగలించిందామె. అందులో 13 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 50 వేల నగదు, ఐఫోన్ ఉంది. 2020, నవంబర్ 29న ఈ కేసు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు చేరింది. రంగంలోకి దిగిన వారు ఈ మంగళవారం ఆమెను అరెస్ట్ చేశారు. -
కిలాడీ లేడీ.. 30 ఏళ్లుగా..
ముంబై : 30 ఏళ్లుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళను తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. వనితా గైక్వాడ్ అనే మహిళ పని కావాలంటూ ఇళ్ల చుట్టూ తిరిగేది. ఏ ఇంట్లోనైనా పని దొరకగానే.. కొన్ని గంటల్లోనే డబ్బు, విలువైన వస్తువులు దోచేసి అక్కడినుంచి పరారయ్యేది. ఈ నెల 19న బాంద్రాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఇంట్లో నగదు, బంగారు వస్తువులు, వజ్రాలు కాజేసి పరారయింది. ఇంటి యాజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనితతో పాటు ఆమెకు సహాయం చేసిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ( 14 రోజుల తర్వాత టాయిలెట్లో శవమై..) ఆమె 1990నుంచి దాదాపు 30 ఏళ్లుగా 40కిపైగా దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారినుంచి కాజేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వనిత 2019లో శాంతాక్రజ్‌లోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో పనిలో చేరిన గంటల్లోనే దొంగతనానికి పాల్పడిందని, 5.3లక్షల రూపాయల విలువైన నగలను కాజేసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కూడా ఆమెను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. -
మహిళా దొంగ: సీసీ కెమెరాలు పగలగొట్టి..
సాక్షి, చిత్తూరు : తిరుమలలో ఓ మహిళా దొంగ హల్చల్ చేసింది. మూసి ఉన్న దుకాణాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడింది. ఈ చోరీలకు సంబంధించిన వీడియోలు బయటకు రావటంతో సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా తిరుమల వీధుల్లో జనసంచారం లేకపోవటంతో ఓ పారిశుద్ధ్య కార్మికురాలి కన్ను.. మూసి ఉన్న దుకాణాలపై పడింది. తరచుగా సీసీ కెమెరాలను పగలకొట్టి దుకాణాల్లోకి చొరబడేది. అందినకాడకి సరుకులను దోచుకెళ్లిపోయేది. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డవటంతో మహిళ దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి : కత్తెరతో పొడిచి..ఆయువు తీసి... -
నమ్మకంగా ఉంటూ చోరీలు
ఒంగోలు: నమ్మకం నటిస్తూ వీలు చూసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న మాయ లేడి పన్నిబోయిన శ్రీదేవిని అరెస్టు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితురాలు గతంలో పలు నేరాలకు పాల్పడిందన్నారు. బాపట్ల పోలీసులు ఆమెను మూడు కేసుల్లో అరెస్టు చేసి రిమాండ్‌కు కూడా పంపారని తెలిపారు. రిమాండ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఆమె తర్వాత గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకరోడ్డులోని టి.నగర్ నుంచి కొత్తపట్నం మండలానికి మకాం మార్చిందన్నారు. ఇక్కడ మొక్కలు అమ్మడం ప్రారంభించి ప్రజలను నమ్మిస్తూ వారు ఇంటి తాళాలను ఎక్కడ పెడుతున్నారనేది గమనించేదన్నారు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో గమళ్లపాలెంలో బలగాని వెంకటేశ్వర్లు ఇంట్లో 12 సవర్లు, ఈ ఏడాది జనవరి 25న కె.పల్లెపాలెంలో నాయుడు అంకమ్మ ఇంట్లో 4 సవర్లు, జనవరి 27న కె.పల్లెపాలెం బీచ్‌లో కె.రాజేష్ అనే వ్యక్తికి చెందిన 4 సవర్ల బంగారపు ఆభరణాలను చోరీ చేసిందన్నారు. వరుసగా జరుగుతున్న నేరాల్లో నిందితుల కోసం ఒంగోలు టూటౌన్ సీఐ రాజేష్, కొత్తపట్నం ఎస్సై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించగా కొత్తపట్నం పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న జియోలు సాయి, బాలులు కీలక సమాచారాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ క్రమంలో తమ సిబ్బంది కె.పల్లెపాలెం బీచ్‌వద్ద అనుమానాస్పదంగా కనిపించిన శ్రీదేవిని అదుపులోకి తీసుకుని విచారించగా మూడు నేరాలను ఒప్పుకోవడంతో పాటు మూడు కేసుల్లో 18 సవర్ల బంగారు ఆభరణాలు ఆమె వద్ద లభ్యమయ్యాయన్నారు. ఈ సందర్భంగా కేసు చేధించేందుకు కృషిచేసిన వారందరినీ డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
ఆమె కన్ను పడితే నగలు నడిచొస్తాయి
కర్ణాటక, శివాజీనగర: జల్సాలకు అలవాటుపడి భర్తతో కలిసి చోరీలకు పాల్పడుతున్న కిలేడీ ఎట్టకేలకు కటకటాల వెనక్కు చేరింది. ఆమెనుంచి పోలీసులు లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఆగ్నేయ విభాగపు డీసీపీ డాక్టర్ బోరలింగయ్య వెల్లడించిన వివరాల మేరకు... శివాజీనగర తిమ్మయ్యగార్డన్ రోడ్డులో నివాసం ఉంటున్న శాంతి (38) ధనవంతుల ఇళ్లల్లో గృహకార్మికురాలిగా చేరి విశ్వాసం గడించి చోరీలకు పాల్పడేది. గతంలో పులికేశీనగర పోలీసు స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఇంటిలో దొంగతనం చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లింది.బయటకు వచ్చిన తర్వాత మళ్లీ చోరీలకు అలవాటు పడింది. మొదటి భర్త మృతి చెందగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవీ అనే వ్యక్తిని ప్రేమించి రెండో వివాహం చేసుకొని కోరమంగళలోస్థిరపడింది. జిమ్‌లలో, అపార్ట్మెంట్లలో ఇంటిపని కావాలని నెపంతో వెళ్లేవారు. ఈ సమయంలో తలుపులు తెరిచి ఉంటే క్షణంలోనే విలువచేసే వస్తువులను దొంగలించి అదృశ్యమయ్యేవారు. కోరమంగళలోని ఓ అపార్ట్మెంటులో ఇంటిపనికి చేరుకుని యజమానిని నమ్మకంగా మెలిగారు. ఇంట్లో బంగారు ఆభరణాలు ఉండటాన్ని గమనించారు. వాటిని పోలిన నకిలీ నగలు తయారు చేయించారు. వాటిని లాకర్లో ఉంచి అసలైన నగలతో ఉడాయించారు. దానిని తాకట్టు పెట్టి షాపింగ్ చేయడం, పబల్‌కు వెళ్లి జల్సాలు చేసేవారు. నకిలీ నగలతో మోసపోయినవారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితురాలిని అరెస్ట్ చేశారు. రూ.5 లక్షలు విలువచేసే 170 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
కటకటాల్లో కి‘లేడి’
నాగోలు: బుర్ఖా వేసుకుని నగల షాపుల్లో సేల్స్‌మెన్ దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న మహిళను చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి 4.8 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ జాయింట్ సీపీ సుధీర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బడా రేఖ(29) నగరానికి వచ్చి కూకట్పల్లి మూసాపేట్లో నివాసముంటోంది. 2007లో ప్రేమ వివాహం చేసుకున్న రేఖ ఆర్ధిక పరిస్థితులు సరిగాలేకపోవడంతో వివిధ షాపుల్లో పనిచేసింది. వచ్చే జీతం సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో బుర్ఖా వేసుకొని నగల షాపులకు వెళ్లి సేల్స్‌మెన్ దృష్టి మళ్లించి చోరీలు చేసేది. ఈ క్రమంలో చైతన్యపురి సరూర్‌నగర్ పంజాగుట్ట పరిధిలోని నగల షాపులలో చోరీలకు పాల్పడింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు సీసీ కెమరాల ఆధారంగా ఆమె గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె వద్ద రూ.4 లక్షల 80 వేల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఇన్చార్జి డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎల్బీనగర్ ఎసీపీ పృథ్వీధర్‌రావు, చైతన్యపురి డీఐ రాము, సీఐసుదర్శన్, ఎస్ఐ వెంకటేష్ పాల్గొన్నారు. -
మాయ‘లేడి’.. నగలు దోచే ‘కేడీ’
సాక్షి, హైదరాబాద్ : నగల దుకాణాలలో నకిలీ ఆభరణాలను పెట్టి అసలు ఆభరణాలతో ఉడాయిస్తోందో మహిళ. సిబ్బంది దృష్టి మళ్లించి ఈ దొంగతనాలకు పాల్పడుతూంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ గుర్తు తెలియని మహిళ పంజాగుట్టలోని మలబార్ గోల్ట్ నగల దుకాణంలో సిబ్బంది దృష్టి మళ్లించి రూ.420 విలువ చేసే రోల్డుగోల్డు ఛైన్‌ను పెట్టి 36గ్రాముల బంగారు ఆభరణాలను తస్కరించింది. అదే విధంగా లలితా జువెలర్స్‌లో రూ.600 విలువ చేసే నకిలీ ఛైన్‌ను పెట్టి 28గ్రాముల బంగారు ఆభరణాలతో ఉడాయించింది. నగలు నకిలీవని గుర్తించిన సిబ్బంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆమె టార్గెట్ బ్యూటీపార్లర్
మారేడుపల్లి : నగరంలోని బ్యూటీపార్లర్లలో చోరీలకు పాల్పడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఓ ఘరానా మహిళా దొంగను మారేడుపల్లి పోలీసులు శనివారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపిన మేరకు.. కడప టౌన్‌కు చెందిన పైడికాల్వ డైసీ మార్టిన్ అలియాస్ డైసీ అలియాస్ వందన అలియాస్ లక్ష్మి అలియాస్ ప్రియ (36) ఇలా కొత్త కొత్త పేర్లతో పరిచయం చేసుకుంటూ బ్యూటీపార్లర్లలో గత మూడు నెలలుగా 17 బ్యూటీపార్లర్లలో చోరీలకు పాల్పడింది. నిర్వాహకులను మాటలతో నమ్మించి మాయచేసి వారి బంగారు ఆభరణాలను చోరీ చేసేది. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిఘా ఉంచి నిందితురాలిని అరెస్టు చేశారు.ఆమె నుంచి రూ. 17 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీన పర్చుకున్నారు. డైసీ తక్కువ కస్టమర్లతో ఉన్న బ్యూటీపార్లర్లను ఎంచుకుని బ్యూటీపార్లర్ల నిర్వాహకులను దోచుకుంది. సందర్భాన్ని బట్టి తాను బ్యూటీపార్లర్‌కు సంబంధించిన కాస్మొటిక్స్ సరఫరా చేస్తానని, మంచి ఆఫర్లు ఉన్నాయంటూ బ్యూటీపార్లర్ నిర్వాహకులను నమ్మిస్తుంది. కాస్మొటిక్స్ పెట్టుకునే ముందు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసి పక్కనపెట్టాల్సిందిగా సూచిస్తుంది. కాస్మొటిక్స్ మొఖానికి రాసిన తర్వాత నెమ్మదిగా బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడి నుండి పరారవుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి ,2018 నుండి మే వరకు హైదరాబాద్ నగరంలో 9, సబరాబాద్‌లో 5, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 చొప్పున బ్యూటీపార్లర్లలో చోరీకి పాల్పడినట్లు డీసీపీ సుమతి తెలిపారు. విద్యావంతుల కుటుంబానికి చెందిన డైసీ బీఏ ఇంగ్లీష్ చదివింది. మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వాణి అనే బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేశారు. నిందితురాలిని బిహెచ్ఈఎల్లో సంచరిస్తుందనే సమాచారంతో మారేడుపల్లి పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.. నిందితురాలిపై పీడీయాక్టు నమోదు చేయనున్నట్లు డీసీపీ సుమతి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాసులు, డీఐ అప్పలనాయుడు పలువురు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో కిలాడీ లేడీ అరెస్ట్
-
ఘరానా మహిళ అరెస్టు.. 3 నెలల్లో 17 దొంగతనాలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఓ మహిళ 2009 నుంచి దొంగతనాలు చేస్తోంది. అందరి కళ్ళు కప్పి తప్పించుకుని తిరిగసాగింది. చివరికి పోలీసులకు చిక్కింది. వివరాలివి.. నగరంలో బ్యూటీ ప్లారర్లో దొంగతనాలకు పాల్పడుతున్న డైసి అనే ఘరానా మహిళను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె స్వస్థలం కడప. బ్యూటీ పార్లర్లే టార్గెట్‌గా మహిళ దొంగతనాలు చేసేది. డైసీ బీఏ లిటరేచర్ చదివింది.. దొంగతనాలకు అలవాటు పడింది. ఆమె నుంచి రూ. 17 లక్షల విలువ చేసే 63 తులాల బంగారాన్ని మారేడుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి మాట్లాడుతూ.. ఆమె 2009 నుంచి నగరంలో దొంగతనాలు చేస్తోంది. మూడు నెలల్లోనే 17 దొంగతనాలు పాల్పడిందని తెలిపారు. ఆమె హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9, సైబారాబాద్‌లో 5, రాచకోండలో 3 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు డీసీపీ చెప్పారు. నగరంలో ఆమె దొంగలించిన సోత్తును మొత్తం రికవరీ చేశామన్నారు. అంతేకాక ఆ మహిళపై పీడీ యాక్ట్ పెడుతామని డీసీపీ సుమతి తెలిపారు. -
నమ్మిన ఇంటికే కన్నం పెట్టిన స్నేహితురాలు
సాక్షి, హైదరాబాద్ : నమ్మి ఇంట్లోకి రానిస్తే స్నేహితురాలి ఇల్లుగుళ్ల చేసిందో మహిళ. ఈ ఘటన హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్నేహితురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన వంగావోలు సునితదేవిని, దొంగిలించిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన గోశిక నరసింహ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4.2లక్షల విలువైన 140 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. డీసీసీ వెంకటేశ్వరరావు ఎల్బీ నగర్‌లోని తన కార్యాలయంలో మీడియాకి వివరాలను వెల్లడించారు. -
స్నేహితురాలి ఇంటికే కన్నం
ప్రొద్దుటూరు క్రైం : సుజాత తరచూ విజయలక్ష్మి ఇంటి వద్దకు వస్తుండటంతో.. వారి మధ్య స్నేహం ఏర్పడింది. అయితే స్నేహ ధర్మాన్ని మరిచిన సుజాత తన స్నేహితురాలు ఇంట్లో లేనపుడు ఆమె ఇంటికే కన్నం వేసింది. దురాశ దుఃఖానికి చేటు అన్నట్లుగా.. చివరికి కటకటాల పాలైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రామేశ్వరం వీధికి చెందిన వద్ది విజయలక్ష్మి ఈ నెల 22న ఇంటికి తాళం వేసి తాడిపత్రికి వెళ్లారు. తిరిగి 25న ఇంటికి రాగా ఎవరో తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 13 తులాల బంగారు నగలను దోచుకొని వెళ్లారు. ఈ మేరకు ఆమె అదే రోజు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటశివారెడ్డి బాధితురాలితోపాటు వీధిలో విచారణ చేశారు. అదే వీధికి చెందిన తుడిమలదిన్నె సుజాత ఆమెతో చనువుగా ఉంటూ ఇంటి వద్దకు వచ్చి వెళ్లేదని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో సుజాతను సీఐ విచారణ చేయగా.. చోరీ చేసినట్లు ఆమె అంగీకరించింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయలక్ష్మి ఇంట్లో ఉన్న రెండు తాళం చెవిలలో ఒకటి తీసుకొని తన వద్ద ఉంచుకున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. నిందితురాలి వద్ద ఉన్న 13 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను రిమాండుకు పంపిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ వెంకటశివారెడ్డి, ఎస్ఐ చిన్నపెద్దయ్య, కానిస్టేబుల్ ఇజ్రాయేల్ పాల్గొన్నారు. -
కి'లేడీ' అరెస్ట్
► పోలీసుల అదుపులో సహకరించిన మరో మహిళ ► రూ.7.75 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం ► 100 కేసుల్లో నేరస్తురాలిగా ఉన్న లక్ష్మి మేడ్చల్: తాళం వేసిన ఇళ్లల్లో పగటిపూట దొంగతనాలకు పాల్పడుతూ.. 100 నేరాలతో సంబంధం ఉన్న పాత నేరస్తురాలిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరించిన మరో మహిళతోపాటు రూ.7 లక్షల 75 వేల విలువ చేసే 24.8 తులాల బంగారం, 72.8 తులాల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, సైబరాబాద్ నేర విభాగం ఏసీపీ ఉషారాణి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటకు చెందిన గడ్డం లక్ష్మి అలియాస్ చెంచులక్ష్మి అలియాస్ గుండ్లపోచమ్మ(34) తన 14వ ఏట నుంచే దొంగతనాలు చేయడం మొదలుపెట్టింది. ప్రతిరోజూ కూలీ పనిచేస్తున్నట్లు నమ్మిస్తూ.. తాళం వేసిన ఇళ్లల్లో పగటిపూట దొంగతనాలకు పాల్పడుతూ.. దొంగిలించిన సొమ్మును తన వదిన అయిన మంగమ్మ వద్ద దాచిపెట్టేది. అయితే నిరుడు జూలై నెలలో మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మేడ్చల్ పట్టణంలోని ఉమానగర్, వినాయక్‌నగర్, వెంకటరామయ్య కాలనీల్లో తాళం వేసి ఉన్న పలు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. దీంతో నిందితులను పట్టుకునేందుకు పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, బాలానగర్ నేరవిభాగం ఏసీపీ ఉషారాణి, సైబరాబాద్ సీసీఎస్ (క్రైమ్ కంట్రోల్ స్టేషన్) సీఐ సైదులు, మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దర్యాప్తు జరపగా.. పాత నేరస్తురాలైన చెంచులక్ష్మి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో సోమవారం ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో చెంచులక్ష్మి, మంగమ్మలను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో పోలీసులు విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 100 కేసుల్లో లక్ష్మి నిందితురాలు.. మేడ్చల్, కేపీహెచ్‌బీ, దుండిగల్, శామీర్‌పేట్, జీడిమెట్ల, పేట్‌బషీరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా అయిజ, కర్నూలు జిల్లా చెగలమర్రి పోలీస్స్టేషన్ల పరిధిలో లక్ష్మి గత జులై నుంచి 11 దొంగతనాలకు పాల్పడింది. గతంలో ఆమెపై హైదరాబాద్ కమి షనరేట్ పరిధిలోని ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, నల్లకుంట, లంగర్‌హౌజ్, వులక్‌పేట్, కుల్సుంపుర, తిరుమలగిరి, బోయిన్పల్లి, సైబరాబాద్ పరిధిలోని చందానగర్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, శంషాబాద్, నార్సింగి, సనత్‌నగర్, మెదక్ జిల్లా రామచంద్రాపురం, మహబూబ్‌నగర్ జిల్లా అమ్మిగనూరు పోలీస్స్టేషన్ల పరిధిలో దాదాపు 100 నేరాలకు పాల్పడి పలుమార్లు జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చింది. ప్రస్తుతం శంషాబాద్, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఆమెపై నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. లక్ష్మిపై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. -
పట్టుచీరల దొంగ.. ఉన్నతాధికారి భార్య?
వస్త్రాల దుకాణంలో చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులను పంజగుట్ట పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే... పంజగుట్ట వెంకటరమణ కాలనీలో వసుధ శారీస్‌ను వాణికుమారి నిర్వహిస్తోంది. ఈమె దుకాణంలోకి శనివారం రాత్రి ఇద్దరు మహిళలు వచ్చి చీరలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి ఒక్కో చీర రూ. 40 వేల విలువ చేసే మొత్తం ఆరు చీరలను దొంగలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దొంగతనం చేసింది ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి భార్య అని గుర్తించి... ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈమెతో పాటు ఆమెకు సహకరించిన మరో యువతిని కూడా అరెస్టు చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులు తాము ఎవరిని అరెస్టు చేయలేదని చెబుతున్నారు.