నిందితురాలు శాంతి, స్వాధీనం చేసుకున్న నగలు
కర్ణాటక, శివాజీనగర: జల్సాలకు అలవాటుపడి భర్తతో కలిసి చోరీలకు పాల్పడుతున్న కిలేడీ ఎట్టకేలకు కటకటాల వెనక్కు చేరింది. ఆమెనుంచి పోలీసులు లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఆగ్నేయ విభాగపు డీసీపీ డాక్టర్ బోరలింగయ్య వెల్లడించిన వివరాల మేరకు... శివాజీనగర తిమ్మయ్యగార్డన్ రోడ్డులో నివాసం ఉంటున్న శాంతి (38) ధనవంతుల ఇళ్లల్లో గృహకార్మికురాలిగా చేరి విశ్వాసం గడించి చోరీలకు పాల్పడేది. గతంలో పులికేశీనగర పోలీసు స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఇంటిలో దొంగతనం చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లింది.బయటకు వచ్చిన తర్వాత మళ్లీ చోరీలకు అలవాటు పడింది.
మొదటి భర్త మృతి చెందగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవీ అనే వ్యక్తిని ప్రేమించి రెండో వివాహం చేసుకొని కోరమంగళలోస్థిరపడింది. జిమ్‌లలో, అపార్ట్‌మెంట్లలో ఇంటిపని కావాలని నెపంతో వెళ్లేవారు. ఈ సమయంలో తలుపులు తెరిచి ఉంటే క్షణంలోనే విలువచేసే వస్తువులను దొంగలించి అదృశ్యమయ్యేవారు. కోరమంగళలోని ఓ అపార్ట్‌మెంటులో ఇంటిపనికి చేరుకుని యజమానిని నమ్మకంగా మెలిగారు. ఇంట్లో బంగారు ఆభరణాలు ఉండటాన్ని గమనించారు. వాటిని పోలిన నకిలీ నగలు తయారు చేయించారు. వాటిని లాకర్‌లో ఉంచి అసలైన నగలతో ఉడాయించారు. దానిని తాకట్టు పెట్టి షాపింగ్ చేయడం, పబల్‌కు వెళ్లి జల్సాలు చేసేవారు. నకిలీ నగలతో మోసపోయినవారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితురాలిని అరెస్ట్ చేశారు. రూ.5 లక్షలు విలువచేసే 170 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment