పట్టుబడిన మహిళలు
సాక్షి, చాంద్రాయణగుట్ట: దృష్టి మరల్చి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను శాలిబండ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పురానీ హవేలీలోని తన కార్యాలయంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ కేసు వివరాలు వెల్లడించారు. సయ్యద్ అలీ చబుత్రా ప్రాంతానికి చెందిన లెక్చరర్ తహమీనా సయీద్ ఈ నెల 3న మధ్యాహ్నం 2.30 గంటలకు నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని ఆశా టీ జంక్షన్ వద్ద ఉన్న పారిచంద్ జ్యువెల్లరీకి వెళ్లింది. మెరుగులద్దించుకున్న అనంతరం తిరిగి వచ్చేందుకు ఆటోలో ఎక్కింది. లాల్‌దర్వాజా మోడ్ వద్దకు రాగానే ఆటోలో ఎక్కిన ముగ్గురు మహిళలు ఆమె దృష్టి మరల్చి బంగారంతో ఉన్న పర్సును చోరీ చేసి పరారయ్యారు.
అనంతరం గమనించిన ఆమె శాలిబండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. 50 సీసీ కెమెరాలు పరిశీలించి ఎట్టకేలకు నిందితురాళ్ల జాడను గుర్తించారు. తుకారంగేట్ మాంగరు బస్తీకి చెందిన రూప (31), ఉష (30), నిషా (23)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ సయ్యద్ రఫిక్, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, శాలిబండ అదనపు ఇన్‌స్పెక్టర్ మునావర్ షరీఫ్, ఎస్సై టి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కేసును త్వరగా చేధించిన స్టాప్‌ను ఈ సందర్భంగా డీసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment