కొరియర్‌ చేసేందుకు వెళ్తుండగా.. కళ్లల్లో కారం కొట్టి.. కత్తితో గాయపరిచి..  | Robbery While Going Courier Attack Knife Pipper In Eyes At Chowrasta | Sakshi
Sakshi News home page

కొరియర్‌ చేసేందుకు వెళ్తుండగా.. కళ్లల్లో కారం కొట్టి.. కత్తితో గాయపరిచి.. 

Published Wed, Dec 7 2022 10:47 AM | Last Updated on Wed, Dec 7 2022 10:55 AM

Robbery While Going Courier Attack Knife Pipper In Eyes At Chowrasta - Sakshi

సాక్షి, రాంగోపాల్‌పేట్‌: కొరియర్‌లో పంపించేందుకు రూ. 27.12 లక్షల విలువ చేసే గోల్డ్, డైమండ్‌ నగలను తీసుకెళుతున్న యవకుడి కళ్లల్లో కారంకొట్టి, కత్తితో దాడి చేసి నగలను దోచుకెళ్లిన సంఘటన మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కావేటి శ్రీనివాస్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెస్ట్‌ మారేడుపల్లి రైల్వే కాలనీకి చెందిన సతీష్‌ కుమార్‌ సైనీ పాట్‌ మార్కెట్‌లో జై మాతా లాజిస్టిక్‌ పేరుతో కొరియర్‌ నిర్వహిస్తూ బంగారు నగలను  ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నాడు. అతడి వద్ద పవన్‌కుమార్‌ కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

సోమవారం సాయంత్రం సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు పవన్‌కుమార్‌ జీరాలోని శ్రీ జై అంబే కొరియర్స్‌ నుంచి రూ.8.65 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు బిస్కెట్‌లను తీసుకున్నాడు. అనంతరం హయత్‌నగర్‌లోని శ్రీ రాధే డైమండ్స్‌కు వెళ్లి రూ.18,47,472 విలువైన 148.492 గ్రాముల డైమండ్‌ నెక్లెస్‌ను తీసుకుని బైక్‌పై పాట్‌మార్కెట్‌కు బయలుదేరాడు. ఈ ఆభరణాలను ముంబైకి పంపాల్సి ఉంది. రాత్రి 9.45 ప్రాంతంలో పవన్‌కుమార్‌ ఆర్పీరోడ్‌లోని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు రాగానే బైక్‌పై  వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడి కళ్లలో కారంపొడిని చల్లారు. అయితే అతను హెల్మెట్‌ పెట్టుకోవడంతో కారంపొడి కళ్లలో పడలేదు. దీంతో అప్రమత్తమైన పవన్‌కుమార్‌ వేగంగా బైక్‌ను ముందుకు నడిపించాడు. అదే సమయంలో సిటీలైట్‌ చౌరస్తాలో సిగ్నల్‌ పడటంతో ట్రాఫిక్‌ ఆగిపోయింది.

హెచ్‌పీ పెట్రోల్‌ బంకు సమీపంలో  ఆటోను ఢీకొట్టడంతో అతను వాహనంతో సహా కిందపడిపోయాడు. దీంతో వెనక నుంచి వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు వాహనం దిగి పవన్‌కుమార్‌ దగ్గర ఉన్న బ్యాగును లాక్కునేందుకు యత్నించగా అతను తీవ్రంగా ప్రతిఘటించాడు. దీంతో అతను కత్తితో పవన్‌కుమార్‌ ఎడమవైపు చేతిపై పొడిచి బైక్‌పై పరారయ్యాడు. ట్రాఫిక్, వాహనాల మధ్య క్షణాల్లో జరిగిపోయింది. గాయపడిన పవన్‌కుమార్‌ యజమానికి సమాచారం అందించడంతో అతను మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌ అపోలోకు తరలించారు. ప్రస్తుతం పవన్‌కుమార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలాన్ని ఉత్తర మండలం డీసీపీ చందనా దీప్తి, ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్‌ కావేటి శ్రీనివాస్‌ పరిశీలించారు.  బాధితుడితో మాట్లాడి వివరాలు సేకరించారు. సతీష్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇటీవల నాగోల్‌లో బంగారం షాపు యజమానిపై కాల్పులకు తెగబడి దోపిడీకి యతి్నంచిన గ్యాంగుకు దీనికి సంబంధం లేదని పోలీసులు పేర్కొన్నారు.   

(చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement