సాక్షి, బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని ఫేజ్–2 ప్లాట్ నెంబర్ 26ఏలో కొనసాగుతున్న శమంతక డైమండ్స్ ఎల్‌ఎల్‌పీ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురైనట్లు షోరూం యజమాని నల్లబోతు పవన్‌కుమార్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి నల్లబోతు చెంచురామయ్య మనువడు పవన్‌కుమార్ వజ్రాభరణాల వ్యాపారం చేస్తున్నాడు.
2016 నుంచి ఈ వ్యాపారంలో కొనసాగుతున్న ఆయన వజ్రాభరణాలు తయారు చేయించి కస్టమర్లకు పంపిణీ చేసేవాడు. మూడు రోజుల క్రితం మాదాపూర్ నుంచి శమంతక డైమండ్స్ షోరూంను ఫిలింనగర్ వెంచర్–2కు మార్చారు.. ఈ నెల 20న రాత్రి ఉద్యోగి జీవన్ కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయాడు. 21న ఉదయం షాప్ తెరిచి చూడగా షోరూంలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. క్యాబిన్లు, డ్రాలు తెరిచి ఉండటంతో వాటిని పరిశీలించగా కబోర్డ్‌లో ఉండాల్సిన వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారు హారాలు కనిపించలేదు.
చోరీ జరిగిందని గుర్తించిన బాధితుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 200 క్యారెట్ల డైమండ్లు, నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, కిలో గోల్డ్ సెట్ హారం, నాలుగు ఉంగరాలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ షోరూం వెనుకాల కిటికీ గ్రిల్ తొలగించి దొంగలు లోనికి ప్రవేశించి ఆభరణాలను సంచుల్లో వేసుకుని అదే దారి నుంచి బయటికి వెళ్లినట్లుగా గుర్తించారు.
షాపు వద్ద సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఫిలింనగర్ నుంచి రహదారులపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా నెంబర్ ప్లేట్ లేని యాక్టీవాపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మంకీ క్యాప్‌లు ధరించి లోపలికి వెళ్లడమే కాకుండా ఓ బ్యాగ్‌లో ఆభరణాలు పెట్టుకుని సీవీఆర్ న్యూస్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు?
కాగా చోరీ వ్యవహారంలో అనుమానితుడిని గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీ ఫుటేజీల ఆధారంగా ఒకరిని గుర్తించినట్లు తెలుస్తుంది. పట్టుబడిన వ్యక్తి ద్వారా మరొకరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరో అనుమానితుడు చిక్కితే నగలు జాడ చిక్కే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment