సంఘటన స్థలంలో బోల్తా పడిన లారీ
సాక్షి, యర్రగొండపాలెం: కొందరు కూలీలు పొట్ట చేతబట్టుకొని రోడ్డుపైకి వచ్చారు. సహచర కూలీలతో కలిసే పని ప్రదేశానికి వెళ్తుండగా మృత్యు పంజా విసిరింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మండలంలోని మెట్టబోడు తండాకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న లారీ బోల్తా పడింది. నరసాయపాలెం, అమానిగుడిపాడు గ్రామాలకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందగా సుమారు 30 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నరసాయపాలేనికి చెందిన ఈర్ల వింగయ్య (58), గాయం సుబ్బులు(54) అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు.. మండలంలోని నరసాయపాలెం, అమానిగుడిపాడు గ్రామాలకు చెందిన కొందరు కూలీలు పనుల కోసం తరుచూ సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు.
అక్కడ పనులు ముగించుకొని తిరిగి తమ స్వగ్రామాలకు లారీలు, ఇతర వాహనాల్లో చేరుతుంటారు. ఆ విధంగా వెళ్తేనే వారికి పూటగడిచేది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాలకు చెందిన కూలీలు వారం రోజులుగా దాదాపు 130 కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా ఆలియా ప్రాంతానికి బత్తాయి కోతల కోసం వెళ్తున్నారు. బత్తాయి కోతలు ముగించుకొని తిరిగి స్వగ్రామాలకు లారీలో వస్తున్నారు. మెట్టబోడు తండా వద్ద హైవేపై ఓ గేదె చనిపోయి ఉంది. దాన్ని లారీ డ్రైవర్ గుర్తించలేక పోయాడు. వేగంగా వస్తున్న లారీ మృతి చెందిన గేదెను బలంగా ఢీకొంది. లారీ అదుపుతప్పి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా 30 మంది కూలీలు గాయపడ్డారు. లారీని అదుపులోకి తెచ్చేందుకు డ్రైవర్ విశ్వప్రయత్నాలు చేశాడు.
వర్షం వస్తే కూలీలు తడవకుండా ఏర్పాటు చేసిన పట్ట ఘోర ప్రమాదం జరగకుండా కాపాడిందని పలువురు కూలీలు చెబుతున్నారు. లేకుంటే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ ముక్కంటి ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి క్షతగాత్రులకు సకాలంలో వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన నరసాయపాలేనికి చెందిన ఆరుగురు, అమానిగుడిపాడుకు చెందిన ఐదుగురిని మెరుగయిన వైద్యం కోసం గుంటూరు, నరసరావుపేట వైద్యశాలలకు తరలించారు.
మంత్రి ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్థానిక వైఎస్సార్ సీపీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన మార్కాపురం ఆర్డీఓ ఎం.శేషిరెడ్డి, తహసీల్దార్ కె.నెహ్రూబాబు, సీఐ మారుతీకృష్ణ, ఎస్‌ఐ ముక్కంటిలకు ఫోన్లు చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆర్డీఓ బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అధైర్యపడొద్దని కూలీలకు ఆయన ధైర్యం చెప్పారు.
మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ నెహ్రూబాబు క్షతగాత్రులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం తక్షణమే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తక్షణ సహాయక చర్యలకు రూ.40 వేలు అందజేశారని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కె.కిరణ్‌గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment