
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రకాశరావు
ప్రకాశం, కందుకూరు: వ్యవసనాలకు బానిసలైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు చైన్‌స్నాచర్ల అవతారమెత్తారు. మహిళల మెడల్లో బంగారు గొలుసులు దొంగలిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రకాశరావు నిందితుల వివరాలు వెల్లడించారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామానికి చెందిన మెలకులపల్లి రవితేజ అమరావతిలోని చలపతి కాలేజీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన దామచర్ల కార్తీక్ ఫేస్ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు.
బెట్టింగ్, తాగుడు వంటి వ్యసనాలకు బానిసైన రవితేజ చదువు మానేసి ప్రస్తుతం ఒంగోలు డీటీడీసీలో పనిచేస్తున్నాడు. కార్తీక్ కూడా వ్యవసనాలకు బానిసయ్యాడు. వీరు స్నేహితులుగా మారారు. జల్సాల కోసం డబ్బులు అవసరమై చైన్‌స్నాచర్ల అవతారం ఎత్తి కందుకూరు ప్రాంతంలో ఇద్దరు మహిళల మెడల్లో బంగారు గొలుసులు లాక్కెళ్లారు. గత జులై నెలలో కందుకూరు మండలం విక్కిరాలపేట గ్రామం వద్ద గేదెలు కాస్తూ ఒంటరిగా ఉన్న మహిల మెడలోంచి తాళిబొట్టు సరుడు, ఆగస్టు 2వ తేదీ పట్టణంలోని కోటారెడ్డినగర్‌లో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోంచి తాళిబొట్టు సరుడు లాక్కొని వెళ్లారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పట్టణంలో జరిగిన దొంగతనంలో సీసీ పుటేజ్‌లో ఇద్దరూ నమోదయ్యారు. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వీరి నుంచి రూ.1.40 లక్షల విలువ చేసే 66 గ్రామల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రకాశరావు వివరించారు. ఆయనతో పాటు సీఐ వెంకటేశ్వరరావు, పట్టణ ఎస్‌ఐ ఉన్నం వేమన ఉన్నారు.