రమణారెడ్డి మృతదేహం తీవ్రంగా గాయపడిన భార్య లక్ష్మీకుమారి
ప్రకాశం, బేస్తవారిపేట: ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గురువారం వేకువ జామున 2 గంటల సమయంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట జరిగింది. మండలంలోని కొత్తపేటకు చెందిన మద్దుల రమణారెడ్డి (46) ఆర్మీ ఉద్యోగి. పదవీ విరమణ అనంతరం భార్య లక్ష్మీకుమారి, ఇద్దరు పిల్లలతో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉన్న కాంప్లెక్స్‌లో 11 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. ముగ్గురు దుండగులు ముఖానికి గుడ్డ చుట్టుకుని నివాస గృహం కటాంజనం తలుపు తాళం పగలకొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. నిద్రపోతున్న రమణారెడ్డిపై ముగ్గురూ కత్తులతో దాడి చేసి తలపై పొడిచారు. పక్కనే నిద్రపోతున్న భార్య లక్ష్మీకుమారి తేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆమె తలపై కూడా కత్తితో పొడిచి పక్కకు నెట్టేశారు. కత్తులతో పొడిచి పారిపోతున్న ముగ్గురిని వెంబడిస్తూ దంపతులు గృహం ముందున్న రోడ్డుపైకి వచ్చారు. తీవ్ర కత్తి పోట్లకు గురైన రమణారెడ్డి రోడ్డుపై కుప్పకూలాడు. భార్య గట్టిగా కేకలు వేస్తూ స్థానికులను పిలిచి బంధువులకు ఫోన్‌లో సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దంపతులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే రమణారెడ్డి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
నగలు, డబ్బు ఇస్తామన్నా వదల్లేదు
డబ్బు ఎంత కావాలన్నా ఇస్తామని వేడుకున్నానని, అలాగే నగలూ ఇస్తానని చెప్పినా దుండగులు పట్టించుకోకుండా తన భర్తను చంపేశారని మృతుడి భార్య లక్ష్మీకుమారి భోరున విలపిస్తోంది. అన్యాయంగా తమ కుమారుడి ప్రాణాలు తీశారని, తమ కుటుంబానికి దిక్కెవరంటూ మృతుడి తల్లిదండ్రులు వీరారెడ్డి, వెంకటమ్మ, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు.
కిరాయి హంతకుల పనా?
రమణారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వడ్డీకి నగదు ఇస్తుంటాడు. ఈ వ్యవహారాల్లో ఎవరితోనైనా వివాదం జరగడంతో హత్యకు దారితీసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ కంభం–బేస్తవారిపేట పరిసర ప్రాంతాల్లో వెంచర్లు వేసి ప్లాట్ల అమ్మకాలు చేస్తూ వచ్చాడు. ఇటీవల నుంచరి గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా రమణారెడ్డి వెంచర్లు వేశాడు. అక్కడే ఎక్కువ రోజులు గడుపుతున్నాడు. ఆర్థిక అంశాలతోనే కిరాయి హంతకులతో హత్య చేయించి ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. రెండు రోజుల క్రితం స్వగ్రామం కొత్తపేటలో పీర్ల పండుగ కోసం వచ్చాడు.
ఆధారాలు సేకరించిన పోలీసులు
సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. తలుపు, తాళం, పలు వస్తువులపై వేలిముద్రలు సేకరించారు. దుండగులు ఇంట్లో వదిలేసిన చేతి రుమాలును పోలీసు జాగిలం వాసన చూసి వైఎస్సార్ నగర్ సమీపంలో నూతనంగా కడుతున్న ఓ గృహం వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి మృతుడి ఇంటి వద్దకు, అక్కడి నుంచి కడప–తోకపల్లె హైవేపై వెళ్లింది.
ఉలిక్కిపడిన బేస్తవారిపేట
2012లో బంగారు నగల వ్యాపారి పచ్చిపులుసు వెంకట నారాయణరావును గాంధీ బజార్‌లోని ఆయన ఇంటికి సమీపంలో దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. అప్పుడు బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఇప్పుడు రియల్టర్‌ను ఇంట్లోకి చొరబడి దారుణంగా చంపడంతో బేస్తవారిపేట వాసులు భయాందోళన చెందుతున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
మార్కాపురం డీఎస్పీ ఎన్‌వీ రామాంజనేయులు, సీఐ వి.శ్రీరామ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండ చర్యలు తీసుకున్నారు. కంభం ప్రభుత్వ వైద్యశాలలో రమణారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య లక్ష్మీకుమారితో మాట్లాడారు. ఆర్థిక లావాదేవీల్లో ఎమైనా గొడవలు ఉన్నాయా, ఎవరి మీదనైనా అనుమానం ఉందా.. అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐ కిశోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment