దొరకని డ్రైవర్ రేణుకాప్రసాద్, మరో ఇద్దరి జాడ
వారి ఆచూకీ కోసం నగరంలో జల్లెడ పడుతున్న బీదర్ పోలీసులు
నిందితులు వారేనని అనుమానిస్తున్న పోలీసులు
బీదర్‌లోని ఓ క్లబ్ నుంచి బయటకొస్తున్న దృశ్యాలు స్వా«దీనం
హత్య మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామంటున్న బీదర్ పోలీసులు
కుత్బుల్లాపూర్: కాపు సంఘం నేత, రియల్ వ్యాపారి మధు హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. రియల్టర్ మధు ఈనెల 24న ఉదయం బయలుదేరి వెళ్లి అదే రోజు రాత్రి హత్యకు గురి కావడం కుత్బుల్లాపూర్‌లో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈనెల 27వ తేదీన ‘ఎవరు చంపారు.. ఎందుకీ దారుణం’అనే కథనం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అందరితో కలివిడిగా ఉండే మధు హత్య విషయం వెలుగులోకి రావడంతో అసలు హత్య ఎలా జరిగింది.. ఎవరు చేశారు? అని చర్చించుకోవడం కనిపించింది.
డ్రైవర్ రేణుకాప్రసాద్‌తో పాటు లిఖిత్ సిద్ధార్థరెడ్డి, మరో మైనర్‌తో కలిసి కారులో వెళ్లినట్లు గుర్తించారు. హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు డ్రైవర్ రేణుకాప్రసాద్‌తో పాటు మరో ఇద్దరి జాడ దొరకలేదు. వారి ఫోన్లు సైతం స్విచ్చాఫ్ రావడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ఒంటిపై ఉన్న సుమారు రూ.20లక్షల విలువచేసే నగలతో పాటు ఇంటి నుంచి తీసుకెళ్లిన రూ.5లక్షల నగదు సైతం మాయంకావడంపై విచారణ కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. బీదర్ సమీపంలో ఉన్న క్లబ్ బయటకు వస్తున్న దృశ్యాలను అక్కడ సీసీ కెమెరా నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు పుకార్లు..
మధు హత్య కేసులో కీలకంగా భావిస్తున్న డ్రైవర్ రేణుక ప్రసాద్ బీదర్ పోలీసులకు పట్టుబడ్డట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. డ్రైవరే ఈ హత్య చేసినట్లు పలువురు భావిస్తున్నారు. మధు భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తూ వస్తున్న డ్రైవర్ రేణుకాప్రసాద్ అందరితో ఇంట్లో కలివిడిగా ఉండేవాడు. కొంతమంది మధు పెద్ద కుమార్తెతో ప్రేమ వ్యవహారమే కారణమని చెబుతుండగా అటువంటిది ఏమీ లేదని కుటుంబ సభ్యులు కొట్టి పారేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్న పుకార్లు అని స్పష్టం చేశారు. హత్య కేసు మిస్టరీ త్వరలోనే ఛేదిస్తామని బీదర్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment