వివరాలు వెల్లడిస్తున్న ఒంగోలు డీఎస్పీ టి.రాథేష్‌మురళి
ఒంగోలు: డిపాజిటర్లు, భాగస్తులను మోసం చేసి పరారైన గణేష్ ఫైనాన్స్ అండ్ ఆటో ఫైనాన్స్ సంస్థ వర్కింగ్ పార్టనర్ కందిమళ్ల రామాంజనేయులును సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సుజాతనగర్‌లోని ఆయన నివాసం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకునట్లు ఒంగోలు డీఎస్పీ తాళ్లూరి రాథేష్ మురళి తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక తాలూకా పోలీసుస్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కందిమళ్ల రామాంజనేయులు, మరో 8 మంది కలిసి గణేష్ ఫైనాన్స్ అండ్ ఆటోఫైనాన్స్‌ను 1992లో ప్రారంభించారు. వర్కింగ్ పార్టనర్‌గా వ్యవహరించే రామాంజనేయులు భాగస్తులను మోసం చేసి రూ. 44 లక్షలు స్వాహా చేశాడని, అదే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసూ ఒంగోలు, చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలను నమ్మించి భారీగా డిపాజిట్ల రూపంలో అధికవడ్డీ, లాభాల్లో వాటా కూడా ఇస్తానని నమ్మించి మోసం చేశాడన్నారు. ఇప్పటివరకు 250 మంది నుంచి మొత్తం రూ. 28 కోట్ల మేర మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ చెప్పారు.
లుక్ అవుట్ నోటీసులు జారీ:
స్థానిక సుజాతనగర్‌లో నివాసం ఉంటున్న కందిమళ్ల రామాంజనేయులు స్వగ్రామం మద్దిపాడు మండలం బసవన్నపాలెం. 2017లో చీటింగ్ చేసి అమెరికా పారిపోవడంతో అనేకమంది తమకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీ సత్య యేసుబాబు దృష్టికి తెచ్చారు. దీంతో తాలూకా పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కందిమళ్ల రామాంజనేయులు కోసం అన్ని ఎయిర్‌పోర్టులకు లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. ఈ నేపథ్యంలో వీసా రెన్యూవల్ కోసం హైదరాబాద్ చేరుకున్న నిందితుడు తిరిగి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఒంగోలుకు చేరుకోగా అరెస్టు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈమేరకు తమకు 250 మంది నుంచి మోసపోయినట్లు ఫిర్యాదులు అందాయని దీనిపై మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రూ. 22 కోట్ల మేర ఆస్తులు గుర్తింపు:
కందిమళ్ల రామాంజనేయులును అరెస్టు చేసిన అనంతరం 1992 తరువాత ఆయన సంపాదించిన ఆస్తులపై దృష్టిసారించామన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా రామాంజనేయులు, అతని కుటుంబసభ్యుల పేర్ల మీద ఉన్న స్థిరాస్తులను గుర్తించామన్నారు. ఒంగోలు సీతారామపురం, మార్కాపురం, వెంగముక్కలపాలెం, కొత్తమామిడిపాలెం, కర్నూల్ రోడ్డు, సమతానగర్, మంగమూరు డొంక, హైదరాబాద్ వంటి పలుచోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైందన్నారు. వీటిలో వ్యవసాయ భూములతోపాటు ఇళ్లస్థలాలు కూడా ఉన్నాయని వీటి విలువ ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ. 24 కోట్లు ఉంటుందన్నారు. ఇక ప్రైవేటు మార్కెట్ విలువ ఇంకా చాలా భారీగా ఉండే అవకాశం ఉందన్నారు.
ప్రాథమికంగా రామాంజనేయులు వద్ద రూ. 4,30,70,000లు, ఆయన భార్య శ్రీదేవి పేరున రూ. 16,62,00,000లు , కందిమళ్ల అలియాస్ పుట్టె జ్యోత్స్న (పెద్దకుమార్తె) పేరుమీద రూ. 1.40 లక్షలు, కందిమళ్ల అలియాస్ పచ్చవ ప్రవీణ (చిన్న కుమార్తె) పేరుమీద రూ. 1.50 లక్షలు, పుట్టా సుధాకర్‌బాబు (పెద్ద అల్లుడు) పేరుమీద రూ. 1,47,500లు ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. తాము గుర్తించిన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పిస్తున్నామని, న్యాయస్థానంలో నిందితుడైన రామాంజనేయులు తన, తన కుటుంబ సభ్యుల పేర్లమీద 1992 తరువాత గుర్తించిన ఆస్తుల వివరాలను ఎలా కొనుగోలుచేసింది, అందుకు అవసరమైన మొత్తం ఏ రూపంలో ఆయనకు లభించిందనే వివరాలను కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం కోర్టులో వెలువడే తీర్పు ప్రకారం స్థిరాస్తులను వేలం వేసి బాధితులు అందరికీ న్యాయం చేసేందుకు అవకాశం కలుగుతుందని డీఎస్పీ రాథేష్ మురళి పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వారు కూడా తగు ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చని డీఎస్పీ విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్సై రాజారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment