లాకర్‌నే లాక్కెళ్లారు..  | Massive Theft In Sri Pujitha Auto Finance Company | Sakshi
Sakshi News home page

లాకర్‌నే లాక్కెళ్లారు.. 

Published Tue, Jun 30 2020 12:17 PM | Last Updated on Tue, Jun 30 2020 12:17 PM

Massive Theft In Sri Pujitha Auto Finance Company - Sakshi

శ్రీకాకుళంలోని పద్మపూజిత ఫైనాన్స్‌ కార్యాలయం

ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఏ వస్తువూ చెక్కుచెదరలేదు. షట్టర్‌ తాళం పగలగొట్టి లోనికొచ్చారు. రూ.36 లక్షల సొమ్మున్న 50 కేజీల ఐరన్‌ లాకర్‌ మోసుకెళ్లారు. సీసీ ఫుటేజి హార్డ్‌ డిస్‌్క ను సైతం తస్కరించి చల్లగా జారుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ చోరీ జరగగా.. సోమవారం ఉదయం ఉద్యోగులు విధులకు వచ్చే వరకు విషయమే తెలీదు. ఇంత పక్కాగా జరిగిందంటే ఇంటి దొంగల ప్రమేయం ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

శ్రీకాకుళం రూరల్‌: జిల్లా కేంద్రంలోని పెదపాడు రోడ్‌ పరిధిలో గల పద్మపూజిత ఆటో ఫైనాన్స్‌ (నీలమణి దుర్గా ఆటో కన్సల్టెన్సీ) కంపెనీలో భారీ చోరీ జరగడంతో ఒక్కసారిగా యజమానులు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. సోమ వారం ఉదయం 9 గంటలకు షాపు తెరిచేందుకు వచ్చిన ప్యూన్‌ తాళాలు తీసి కార్యాలయం తుడిచి వాహనాలు బయట పెట్టే పనిలో ఉన్నాడు. విధులకు వచ్చిన ఉద్యోగి బసవ సత్యనారాయణరాజు ఆఫీస్‌ క్యాబిన్‌లోకి వెళ్లి.. థంబ్‌ ఇంప్రెషన్‌తో బయోమెట్రిక్‌ హాజరు వేసుకుంటూ.. సీక్రెట్‌ లాకర్‌ రూమ్‌ తెరిచి ఉండటాన్ని గమనించారు. క్యాషియర్‌ హరిగోపాల్, అసిస్టెంట్‌ క్యాషియర్‌ తేజ సుబ్రమణ్యంలకు సమాచారం ఇచ్చారు. వీరు వచ్చి లాకర్‌లో ముందు రోజు ఉంచిన రూ.36 లక్షల సొమ్ము చోరీకి గురయ్యిందని గ్రహించి అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని కంపెనీ పార్టనర్స్‌ ఫణికుమార్, సత్యనారాయణలకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

దొంగతనం ఎలా జరిగిందంటే.. 
ఆదివారం ఆఫ్‌ డే కావడంతో మధ్యాహ్నం రెండు గంటలకు పనిముగించుకొని ఉద్యోగులు వెళ్లిపోయారు. అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల మధ్యలో ఈ దొంగతనం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దుండగులు షాప్‌ వెనుక భా గంలో ఉన్న షట్టర్‌ తాళాలు విరగ్గొట్టి లోనికి వచ్చారు. అక్కడ నుంచి ఆఫీస్‌ క్యాబిన్‌ రూమ్‌లోకి వెళ్లి సీక్రెట్‌ లాకర్‌ రూమ్‌లో ఉన్న ఐరన్‌ లాకర్‌ను పట్టుకుపోయారు. దీంతోపాటు సీక్రెట్‌ కెమెరాల్లో రికార్డయ్యే హార్డ్‌ డిస్క్‌లను సై తం తస్కరించారు. షట్టర్‌ను దించేసి, ఆ పక్కనే బాత్‌రూంలో ఉన్న సర్ఫ్‌ పౌడర్‌ను నీటిలో కలిపి, తమ వేలిముద్రలు గుర్తించకుండా నురగను ఆ పరిసరాల్లో పోసి పరారయ్యారు.    

డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం రాక 
విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్‌ టీంతోపాటు డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. పోలీసు శునకం ఫైనాన్స్‌ కంపెనీ పక్క భవ నంపైకి వెళ్లి కార్యాలయం లోపలికి వచ్చి చుట్టూ తిరిగి కంపెనీ వెనుక గల ముళ్లపొద ల వద్దకు వెళ్లి తిరిగి వచ్చింది. క్లూస్‌టీం వేలిముద్రల జాడలను సేకరించింది. ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్న 25 మంది సిబ్బంది వేలిముద్రలను సైతం పోలీసులు తీసుకున్నారు. వీరి పాత్రతోపాటు 25 మంది కలెక్షన్‌ ఏజెంట్ల గురించి కూడా ఆరా తీస్తున్నారు. 50 కేజీల లాకర్‌ను మోసుకెళ్లారంటే.. నలుగురైదుగురు ఈ ఘటనలో పాలుపంచుకున్నారని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. 26, 27 తేదీల్లో వచ్చిన నగదు లాకర్‌లో ఉందని హెడ్‌ క్యాషియర్‌ చెబుతున్నారు. 

ఇంటి దొంగల పనేనా? 
దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే ఇది ఇంటిదొంగల పనే నా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా దుండగులు సునాయాసంగా లోనికి ప్రవేశించినట్టు అక్కడి పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల హస్తం ఉండి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎంట్రన్స్‌లో ఉన్న కెమెరాను పగలకొట్టి లోపలికి వచ్చారు. మరే కెమెరాను ముట్టుకోలేదు. ఏకంగా సీసీ ఫుటేజి రికార్డయ్యే హార్డ్‌ డి స్‌్కలను తస్కరించడంతో ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దొంగతనమని అర్థమవుతోంది. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ డీఎస్‌ఆర్‌వీఎస్‌ఎన్‌ మూర్తి సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది గురించి ఆరా తీశారు. ఆయనతోపాటు వన్‌టౌన్‌ సీఐ అంబేద్కర్, రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మణరావులు ఉన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement