మృతదేహాన్ని బయటకు తీస్తున్న ఈతగాళ్లు, బాలిక మృతదేహం
సాక్షి, అద్దంకి(ప్రకాశం) : గుండ్లకమ్మ నది వంతెనపై నుంచి దూకి 9వ తరగతి విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. అందిన సమాచారం మేరకు మండలంలోని మోదేపల్లి గ్రామానికి చెందిన పాలెపోగు మార్తమ్మ పదేళ్ల నుంచి అద్దంకి పట్టణంలోని సంజీవనగర్‌లో మూడేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఈమెకు పాలెపోగు దేవి (15) అనే కుమార్తె ఉంది. బాలిక ప్రకాశం ప్రభుత్వ బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ, బీసీ హాస్టల్‌లో ఉంటోంది. అయితే ఏమైందో ఏమో కానీ ఆదివారం మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ నదిపైన వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అద్దంకి వైపు నుంచి దర్శి వైపు వెళ్తున్నమాజీ ఎస్సై సుబ్బరాజు వంతెనపై జనం గుమికూడి ఉండడం, ఒక దిమ్మెపై గాజులు, వాచీ మరి కొంత దూరంలో సూసైడ్ నోట్ దానిపై ఐదు రూపాయల నాణెం పెట్టి ఉండటాన్ని గమనించి విషయాన్ని స్థానిక ఎస్సై ఎం.శ్రీనివాసరావుకు సమాచారం అందించారు.
గజ ఈతగాళ్లతో మృతదేహం వెలికితీత..
బాలిక నదిలో దూకిన తరువాత ఆమె మృతదేహం బయటకు తీయడం కోసం ఎస్సై శ్రీనివాసరావు గజ ఈతగాళ్లను పిలిపించారు. అలాగే ఒంగోలుకు చెందిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందానికి కబురు చేశారు. అక్కడకు చేరుకున్న ఈతగాళ్లు వలల్లో గాలిస్తూ మూడు గంటల తర్వాత బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. అదే సమయంలో ఒంగోలు నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం అక్కడకు చేరుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక తల్లి మార్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నీవు నా బెస్ట్ ఫ్రెండ్‌వి..
బాలిక వంతెనపై నుంచి దూకే ముందు ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టి నీళ్లలోకి దూకింది. అందులో ‘నేను ఎందుకంటే నెత్తురుతో రాసింది. నీవు నా బెస్ట్ ఫ్రెండ్‌వి, నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా..’ అని రాసి ఉంది. ఆత్మహత్యకు గల కారణం ఏమిటనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment