Gundlakamma River
-
వంతెనపై నుంచి దూకి విద్యార్థిని బలవన్మరణం
సాక్షి, అద్దంకి(ప్రకాశం) : గుండ్లకమ్మ నది వంతెనపై నుంచి దూకి 9వ తరగతి విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. అందిన సమాచారం మేరకు మండలంలోని మోదేపల్లి గ్రామానికి చెందిన పాలెపోగు మార్తమ్మ పదేళ్ల నుంచి అద్దంకి పట్టణంలోని సంజీవనగర్‌లో మూడేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఈమెకు పాలెపోగు దేవి (15) అనే కుమార్తె ఉంది. బాలిక ప్రకాశం ప్రభుత్వ బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ, బీసీ హాస్టల్లో ఉంటోంది. అయితే ఏమైందో ఏమో కానీ ఆదివారం మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ నదిపైన వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అద్దంకి వైపు నుంచి దర్శి వైపు వెళ్తున్నమాజీ ఎస్సై సుబ్బరాజు వంతెనపై జనం గుమికూడి ఉండడం, ఒక దిమ్మెపై గాజులు, వాచీ మరి కొంత దూరంలో సూసైడ్ నోట్ దానిపై ఐదు రూపాయల నాణెం పెట్టి ఉండటాన్ని గమనించి విషయాన్ని స్థానిక ఎస్సై ఎం.శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లతో మృతదేహం వెలికితీత.. బాలిక నదిలో దూకిన తరువాత ఆమె మృతదేహం బయటకు తీయడం కోసం ఎస్సై శ్రీనివాసరావు గజ ఈతగాళ్లను పిలిపించారు. అలాగే ఒంగోలుకు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందానికి కబురు చేశారు. అక్కడకు చేరుకున్న ఈతగాళ్లు వలల్లో గాలిస్తూ మూడు గంటల తర్వాత బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. అదే సమయంలో ఒంగోలు నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడకు చేరుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక తల్లి మార్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీవు నా బెస్ట్ ఫ్రెండ్‌వి.. బాలిక వంతెనపై నుంచి దూకే ముందు ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టి నీళ్లలోకి దూకింది. అందులో ‘నేను ఎందుకంటే నెత్తురుతో రాసింది. నీవు నా బెస్ట్ ఫ్రెండ్‌వి, నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా..’ అని రాసి ఉంది. ఆత్మహత్యకు గల కారణం ఏమిటనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
చిగురిస్తున్న వరి ఆశలు
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్లయిపోయింది గుండ్లకమ్మలో నీటి పరవళ్లు చూసి. సరైన వర్షాలు లేక, సాగర్ నీరు విడుదల కాక నది రూపురేఖలే కోల్పోయింది. పరీవాహక ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలు సైతం మూలన పడ్డాయి. మాగాణి భూములు కొంత మెట్టగా మరికొంత బీడుగా మారిపోయింది. రైతులు వరి సాగు ఊసు మర్చిపోయి ప్రత్యామ్నాయంగా కంది, పత్తి వంటి మెట్ట పంటల వైపు మళ్లారు. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత గుండ్లకమ్మలో కృష్ణమ్మ పరవళ్లు చూసి అన్నదాతల్లో మాగాణి ఆశలు చిగురిస్తున్నాయి. సాగర్ నీటి విడుదలతో వరి సాగుకు భూములు సిద్ధం చేస్తున్నారు. ప్రకాశం, అద్దంకి: నాగార్జున సాగర్ నుంచి గత పది రోజులుగా విడుదలవుతున్న నీటితో గుండ్లకమ్మ నది కళకళలాడుతోంది. దీంతో ఎత్తిపోతల పథకాల ద్వారా వరి పంటను సాగు చేసే రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ఏడాదైనా వరి పండించుకోవచ్చని ఆశ పడుతున్న అన్నదాతలు వరి సాగు కోసం సమాయత్తం అవుతున్నారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేసేందుకు సోమవారం ఎమ్మెల్సీ కరణం బలరాం ట్రయల్ కూడా వేశారు. త్వరలో 1245 ఎకరాలకు సాగు నీటిని విడుదల చేయనున్నారు. నాలుగేళ్లుగా మెట్టతో సరి.. అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి బల్లికురవ మండలాల నుంచి ప్రవహించే గుండ్లకమ్మ నది నాలుగేళ్లుగా ఎండిపోవడంతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు మూలనపడ్డాయి. ఫలితంగా 5,000 ఎకరాల మాగాణి భూములు మెట్ట, బీడు భూములుగా మారాయి. సాగరు డ్యామ్ నిండడంతో ప్రభుత్వం ఎట్టకేలకు నీటిని నదికి విడుదల చేయడంతో నియోజకవర్గంలోనివివిధ గ్రామాల రైతుల్లో వరి మాగాణి ఆశలు చిగురించాయి. బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం నుంచి 750 ఎకరాలు, నది మీద మోటార్లు మోటార్ల ద్వారా సాగు అవుతున్న 150 ఎకరాలు, అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగయ్యే 1245 ఎకరాలు, మోటార్ల ద్వారా సాగయ్యే 570 ఎకరాలు, కొటికలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా వరి సాగు చేసే భూములు నాలుగేళ్లుగా నీరు లేక మెట్ట భూములుగా మారాయి. తిమ్మాయపాలెం పథకం పునఃనిర్మాణం.. తిమ్మాయపాలెం ఎత్తిపోతల పథకాన్ని రూ.5.45 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో మూడు 110 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్లను బిగించడంతోపాటు, 7 కిలోమీటర్ల మేర 900 ఎంఎం నుంచి 450 ఎంఎం వైశాల్యం కలిగిన పైప్ లైన్ ద్వారా అక్కడక్కడ 45 ఔట్ లెట్ తొట్ల నిర్మాణంతో నీరు భూములకు చేరే విధంగా నిర్మించారు. మోటార్ల సాగు భూముల రైతుల్లో చిగురించిన ఆశలు నదిలో నీరు వస్తే వరి మాగాణి సాగు చేయడం కోసం చిన్న గుంతల్లో నిల్వ ఐన నీటితో వరి నారును పెంచిన రైతుల్లోనూ నదికి నీరు రావడంతో వరి మాగాణి ఆశలు చిగురించాయి. దీంతో వారు భూములను తడిపి దమ్ము చేసే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం మీద ప్రస్తుతం నదికి విడుదల చేసిన నీరు కొన్ని రోజుల్లో నిలిచిపోయినా, ఇప్పటికే సాగరు కాలువకు నీరు విడుదల చేయడంతో, తద్వారా సాగు చేసిన వరి మాగాణి భూములు నుంచి నదికి చేరే నీటితో వరి సాగుకు ఢోకా లేదనేది రైతుల ఆభిప్రాయంగా ఉంది. దీంతో ఇప్పటికే కంది, పత్తి వేసిన భూముల్లో సైతం వరి మాగాణి సాగు చేయడం కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. -
గుండ్లకమ్మ.. కన్నీటి చెమ్మ
చెట్టంత కొడుకులు.. పుస్తకాలు పట్టుకుని కాలేజీ చదువులకు వెళుతుంటే ఆ తల్లిదండ్రుల మురిపెం అంతా ఇంతా కాదు..‘అయ్యా నా బిడ్డ పెద్ద నౌకరీ చేత్తాడు. మన కష్టాలు తీరుత్తాడు’ అంటూ అప్పుడప్పుడు ఆ తల్లుల గుండెల్లో కన్న ప్రేమ ఉప్పొంగుతూనే ఉండేది. రోజూలాగే వెళ్లొస్తామంటూ చెప్పిన బిడ్డలు శుక్రవారం ఇంటికి తిరిగొచ్చే వేళ గుండె పగిలే విషాదం గుమ్మానికి చేరింది. ఈతకని గుండ్లకమ్మలో దిగిన ముగ్గురు ప్రాణ స్నేహితులను మృత్యు సుడిగుండం అమాంతం లాగేసింది. కాపాడండని గొంతుపెగిలేలోపే ఊపిరాగిపోయింది. నూజెండ్ల మండలం ఉప్పలపాడు వద్ద గుండ్లకమ్మ వాగులో ముగ్గురు మిత్రులు పెట్టిన చావు కేక జిల్లా గుండెపై కన్నీటి చెమ్మై ద్రవించింది. నూజెండ్ల : వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న వినుకొండ మండలం చాట్రగడ్డపాడుకు చెందిన తమ్మిశెట్టి కోటయ్య (17), ఇదే మండలానికి చెందిన ఏనుగుపాలెంకు చెందిన సయ్యద్ నాగూర్వలి (17), శావల్యాపురం మండలం కనమర్లపూడికి చెందిన కొక్కెర నాగేశ్వరరావు (17), స్థానిక డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ముక్కమళ్ల హనీశ్వరరెడ్డి శుక్రవారం నూజండ్ల మండలం ఉప్పలపాడు సమీపంలోని గుండ్లకమ్మ నదిలో ఈతకు వెళ్లారు. లోతు తక్కువ ఉన్న ప్రాంతంలో ఈత కొడుతున్న నలుగురు యువకులు ఇంకా ముందుకు వెళ్లారు. లోతుగా ఉన్న ప్రాంతంలో ఉన్నట్టుండి మునిగిపోయారు. ఊపిరాడక కొట్టుకుంటున్న నలుగురిని గమనించిన ఉప్పలపాడుకు చెందిన నక్కా నాగిరెడ్డి అనే వృద్ధుడు తన ఒంటిపై ఉన్న పంచెను నదిలోకి విసిరి హనీశ్వరరెడ్డిని అతికష్టంపై బయటకు తీయగలిగాడు. మిగిలిన వారు గల్లంతై మృత్యువాత పడ్డారు. మిన్నంటిన రోదనలు.. ముగ్గురు యువకుల మృతివార్త తెలుసుకున్న వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. తమ్మిశెట్టి కోటయ్య తండ్రి శ్రీను, బంధువులు, కొక్కెర నాగేశ్వరరావు తండ్రి నాగరాజు, సయ్యద్ నాగూర్ వలి తండ్రి అల్లాభక్షూ, బంధువులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్కో మృతదేహం వెలికి తీస్తున్న దృశ్యాలు వారిని కంటతడి పెట్టించాయి. స్పందించిన గ్రామస్తులు, యంత్రాంగం.. విద్యార్థులు గుండ్లకమ్మలో మునిగిపోయారన్న సమాచారం అందుకున్న ఉప్పలపాడు, సమీప గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో నది ఒడ్డుకు చేరకున్నారు. దాదాపు 4 గంటల పాటు శ్రమించి మూడు మృతదేహాలను వెలికితీశారు. టౌన్ సీఐ టీవీ శ్రీనివాసరావు, ఐనవోలు ఎస్సై వెంకటప్రసాద్, స్థానిక ఎస్సై శివాంజనేయులు, తహసీల్దార్ పద్మాదేవి, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు బొల్లా ఓదార్పు.. గుండ్లకమ్మలో ముగ్గురు యువకులు మృతిచెందారన్న సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతదేహాల వెలికితీతలో సహాయ సహకారాలు అందించారు. మృతదేహాలను శవపంచనామా అనంతరం పోలీసులు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో మృతదేహాలను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు సందర్శించారు. -
గుండ్లకమ్మ నదిలో నీరు
నూజెండ్ల : రెండురోజులగా కురుస్తున్న వర్షాలకు గుండ్లకమ్మ నదికి ఒక మోస్తరుగా నీరు చేరింది. మండలంలోని ఉప్పపాడు వద్ద గుండ్లకమ్మ నది ప్రవహిస్తుంది. రెండేళ్ల నుంచి చుక్కనీరు కూడా లేక ఎండిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నదిపై సాగు,తాగునీరు కోసం 20కి పైగా గ్రామాల ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఎగువన కురిసిన వర్షాలకు నదికి నీరు రావడంలో కొంత మేర నీటి సమస్య తీరిందని పలువురు అంటున్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. గుంటూరు జిల్లాలో నూజెండ్ల మండలంలోని కొండలరాయునిపాలెం- పువ్వాడ గ్రామాల మధ్య ఉన్న గుండ్లకమ్మ నదిలో గురువారం మధ్యాహ్నం స్థానికులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఐనవోలు ఎస్సై విజయ్‌చరణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం మొండెం మాత్రమే ఉంది. కాళ్లు, చేతులు నరికేసి ఉన్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. -
ఇసుక అక్రమ రవాణా: 3 ట్రాక్టర్లు సీజ్
గుంటూరు(నూజెండ్ల): అనుమతులు లేకుండా ఇసుకను తరిలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని ములకలూరు గ్రామంలో ఉన్న గుండ్లకమ్మ నది నుంచి ఇసుకను తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. అనంతరం ట్రాక్టర్లను పోలీసుస్టేషన్‌కు తరలించి యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. -
పథకం పూర్తి.. ఫలితం నాస్తి
మేదరమెట్ల, న్యూస్‌లైన్: సాగునీటి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు ఏటికేడు నిరాశే మిగులుతోంది. 23 ఏళ్ల క్రితం శంకుస్థాపన రాయి పడిన తమ్మవరం-2 ఎత్తిపోతల పథకం అడుగడుగునా అవాంతరాలతో ఎట్టకేలకు ఏడాది క్రితం పూర్తయింది. నిర్మాణం పూర్తయిన తరువాత కూడా ఆ పథకం ద్వారా సాగునీరు అందడం లేదు. కొరిశపాడు మండలంలోని రైతులు పూర్తిగా వర్షాధారంగా పంటలు సాగు చేస్తుంటారు. రైతుల ఇక్కట్లను గుర్తించిన నాటి ప్రభుత్వం 1990లో గుండ్లకమ్మపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి సాగునీరందించాలని సంకల్పించి తమ్మవరం-2 ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే రాజకీయ కారణాల దృష్ట్యా ఆ పథకం శిలాఫలకానికే పరిమితమైంది. ఆ తరువాత తొమ్మిదేళ్లకు పథక నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. 2008లో గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్మాణంతో పథకం పూర్తిగా ముంపునకు గురైంది. 2009లో పథకాన్ని పునర్నిర్మించడంతో పాటు మరమ్మతులకు కలిపి రూ. 11 కోట్లు ఖర్చు చేసి 2012 నాటికి సిద్ధం చేశారు. నిర్మాణం పూర్తయి ఏడాదైనా ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు. పథకం పనిచేస్తే మండలంలోని తమ్మవరం, యర్రబాలెం, మేదరమెట్ల, సోమవరప్పాడు, దైవాలరావూరు, తిమ్మనపాలెం గ్రామాలతో పాటు నాగులుప్పలపాడు మండలం కే తక్కెళ్లపాడు, కొత్తకోట గ్రామాల పరిధిలోని 4,950 ఎకరాలకు సాగునీరందుతుంది. దీని కోసం తమ్మవరంలో గుండ్లకమ్మ నది ఒడ్డున పంప్‌హౌస్ నిర్మించారు. గుండ్లకమ్మ నదిలో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉంది. ఎత్తిపోతల పథకంలోని విద్యుత్ మోటార్లు నిరంతరం పనిచేసేందుకు ప్రత్యేకంగా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. గతంలో పంప్‌హౌస్ నుంచి మేదరమెట్ల, సోమవరప్పాడు, దైవాలరావూరు తదితర గ్రామాలకు పైపులైను నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు పొలాల్లో సాగునీటి కాలువలను కూడా తవ్వారు. అయితే కాలువలు తీసి ఏళ్లు గడవడంతో ప్రస్తుతం తీసిన కాలువల జాడ కూడా కనిపించకపోవడంతో ఇటీవల కొంతమేర పొలాల్లో పైపు లైను వేశారు. ఇరిగేషన్ అధికారులు అలసత్వాన్ని వీడి పథకం ప్రారంభానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే దీని ద్వారా సుమారు 2 వేల మంది రైతులకు చెందిన పొలాలకు సాగునీరందుతుందని, తద్వారా పంటల దిగుబడి పెరుగుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నిధులు రాకే జాప్యం వై.వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు గతంలో తీసిన కాలువలు పూడిపోవడంతో వాటి మరమ్మతులకు కలెక్టర్ నిధుల నుంచి రూ. 30 లక్షలు, ముఖ్యమంత్రి నిధుల నుంచి రూ. 75 లక్షలు ఇస్తామని ఉన్నతాధికారులు చెప్పడంతో అంచనాలు వేసి పంపించాం. ఈ ఏడాది కనీసం 500 ఎకరాలకు నీరందించాలని భావించాం. కానీ సమైక్య ఉద్యమ నేపథ్యంలో అందరూ సమ్మెలో ఉండటంతో పనులు నిలిచిపోయాయి. రైతులు సహకరిస్తే స్కీమ్‌ను సొసైటీకి అందజేస్తాం. వ్యవసాయ సీజను కావడంతో పైర్లు ఉన్నందు వల్ల పొలాల్లో కాలువలు తీసేందుకు రైతులు వ్యతిరేకిస్తున్నారు. రావాల్సిన నిధులొస్తే త్వరలోనే అన్ని పనులు పూర్తిచేసి రైతులకు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తాం.