మృతదేహాలను వెలికి తీస్తున్న గ్రామస్తులు
చెట్టంత కొడుకులు.. పుస్తకాలు పట్టుకుని కాలేజీ చదువులకు వెళుతుంటే ఆ తల్లిదండ్రుల మురిపెం అంతా ఇంతా కాదు..‘అయ్యా నా బిడ్డ పెద్ద నౌకరీ చేత్తాడు. మన కష్టాలు తీరుత్తాడు’ అంటూ అప్పుడప్పుడు ఆ తల్లుల గుండెల్లో కన్న ప్రేమ ఉప్పొంగుతూనే ఉండేది. రోజూలాగే వెళ్లొస్తామంటూ చెప్పిన బిడ్డలు శుక్రవారం ఇంటికి తిరిగొచ్చే వేళ గుండె పగిలే విషాదం గుమ్మానికి చేరింది. ఈతకని గుండ్లకమ్మలో దిగిన ముగ్గురు ప్రాణ స్నేహితులను మృత్యు సుడిగుండం అమాంతం లాగేసింది. కాపాడండని గొంతుపెగిలేలోపే ఊపిరాగిపోయింది. నూజెండ్ల మండలం ఉప్పలపాడు వద్ద గుండ్లకమ్మ వాగులో ముగ్గురు మిత్రులు పెట్టిన చావు కేక జిల్లా గుండెపై కన్నీటి చెమ్మై ద్రవించింది.
నూజెండ్ల : వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న వినుకొండ మండలం చాట్రగడ్డపాడుకు చెందిన తమ్మిశెట్టి కోటయ్య (17), ఇదే మండలానికి చెందిన ఏనుగుపాలెంకు చెందిన సయ్యద్ నాగూర్‌వలి (17), శావల్యాపురం మండలం కనమర్లపూడికి చెందిన కొక్కెర నాగేశ్వరరావు (17), స్థానిక డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ముక్కమళ్ల హనీశ్వరరెడ్డి శుక్రవారం నూజండ్ల మండలం ఉప్పలపాడు సమీపంలోని గుండ్లకమ్మ నదిలో ఈతకు వెళ్లారు. లోతు తక్కువ ఉన్న ప్రాంతంలో ఈత కొడుతున్న నలుగురు యువకులు ఇంకా ముందుకు వెళ్లారు. లోతుగా ఉన్న ప్రాంతంలో ఉన్నట్టుండి మునిగిపోయారు. ఊపిరాడక కొట్టుకుంటున్న నలుగురిని గమనించిన ఉప్పలపాడుకు చెందిన నక్కా నాగిరెడ్డి అనే వృద్ధుడు తన ఒంటిపై ఉన్న పంచెను నదిలోకి విసిరి హనీశ్వరరెడ్డిని అతికష్టంపై బయటకు తీయగలిగాడు. మిగిలిన వారు గల్లంతై మృత్యువాత పడ్డారు.
మిన్నంటిన రోదనలు..
ముగ్గురు యువకుల మృతివార్త తెలుసుకున్న వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. తమ్మిశెట్టి కోటయ్య తండ్రి శ్రీను, బంధువులు, కొక్కెర నాగేశ్వరరావు తండ్రి నాగరాజు, సయ్యద్ నాగూర్ వలి తండ్రి అల్లాభక్షూ, బంధువులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్కో మృతదేహం వెలికి తీస్తున్న దృశ్యాలు వారిని కంటతడి పెట్టించాయి.
స్పందించిన గ్రామస్తులు, యంత్రాంగం..
విద్యార్థులు గుండ్లకమ్మలో మునిగిపోయారన్న సమాచారం అందుకున్న ఉప్పలపాడు, సమీప గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో నది ఒడ్డుకు చేరకున్నారు. దాదాపు 4 గంటల పాటు శ్రమించి మూడు మృతదేహాలను వెలికితీశారు. టౌన్ సీఐ టీవీ శ్రీనివాసరావు, ఐనవోలు ఎస్సై వెంకటప్రసాద్, స్థానిక ఎస్సై శివాంజనేయులు, తహసీల్దార్ పద్మాదేవి, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు బొల్లా ఓదార్పు..
గుండ్లకమ్మలో ముగ్గురు యువకులు మృతిచెందారన్న సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతదేహాల వెలికితీతలో సహాయ సహకారాలు అందించారు. మృతదేహాలను శవపంచనామా అనంతరం పోలీసులు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో మృతదేహాలను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment