
తిమ్మాయపాలెం వద్ద గుండ్లకమ్మ నది పరవళ్లు
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్లయిపోయింది గుండ్లకమ్మలో నీటి పరవళ్లు చూసి. సరైన వర్షాలు లేక, సాగర్ నీరు విడుదల కాక నది రూపురేఖలే కోల్పోయింది. పరీవాహక ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలు సైతం మూలన పడ్డాయి. మాగాణి భూములు కొంత మెట్టగా మరికొంత బీడుగా మారిపోయింది. రైతులు వరి సాగు ఊసు మర్చిపోయి ప్రత్యామ్నాయంగా కంది, పత్తి వంటి మెట్ట పంటల వైపు మళ్లారు. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత గుండ్లకమ్మలో కృష్ణమ్మ పరవళ్లు చూసి అన్నదాతల్లో మాగాణి ఆశలు చిగురిస్తున్నాయి. సాగర్ నీటి విడుదలతో వరి సాగుకు భూములు సిద్ధం చేస్తున్నారు.
ప్రకాశం, అద్దంకి: నాగార్జున సాగర్ నుంచి గత పది రోజులుగా విడుదలవుతున్న నీటితో గుండ్లకమ్మ నది కళకళలాడుతోంది. దీంతో ఎత్తిపోతల పథకాల ద్వారా వరి పంటను సాగు చేసే రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ఏడాదైనా వరి పండించుకోవచ్చని ఆశ పడుతున్న అన్నదాతలు వరి సాగు కోసం సమాయత్తం అవుతున్నారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేసేందుకు సోమవారం ఎమ్మెల్సీ కరణం బలరాం ట్రయల్ కూడా వేశారు. త్వరలో 1245 ఎకరాలకు సాగు నీటిని విడుదల చేయనున్నారు.
నాలుగేళ్లుగా మెట్టతో సరి..
అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి బల్లికురవ మండలాల నుంచి ప్రవహించే గుండ్లకమ్మ నది నాలుగేళ్లుగా ఎండిపోవడంతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు మూలనపడ్డాయి. ఫలితంగా 5,000 ఎకరాల మాగాణి భూములు మెట్ట, బీడు భూములుగా మారాయి. సాగరు డ్యామ్ నిండడంతో ప్రభుత్వం ఎట్టకేలకు నీటిని నదికి విడుదల చేయడంతో నియోజకవర్గంలోనివివిధ గ్రామాల రైతుల్లో వరి మాగాణి ఆశలు చిగురించాయి. బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం నుంచి 750 ఎకరాలు, నది మీద మోటార్లు మోటార్ల ద్వారా సాగు అవుతున్న 150 ఎకరాలు, అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగయ్యే 1245 ఎకరాలు, మోటార్ల ద్వారా సాగయ్యే 570 ఎకరాలు, కొటికలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా వరి సాగు చేసే భూములు నాలుగేళ్లుగా నీరు లేక మెట్ట భూములుగా మారాయి.
తిమ్మాయపాలెం పథకం పునఃనిర్మాణం..
తిమ్మాయపాలెం ఎత్తిపోతల పథకాన్ని రూ.5.45 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో మూడు 110 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్లను బిగించడంతోపాటు, 7 కిలోమీటర్ల మేర 900 ఎంఎం నుంచి 450 ఎంఎం వైశాల్యం కలిగిన పైప్ లైన్ ద్వారా అక్కడక్కడ 45 ఔట్ లెట్ తొట్ల నిర్మాణంతో నీరు భూములకు చేరే విధంగా నిర్మించారు.
మోటార్ల సాగు భూముల రైతుల్లో చిగురించిన ఆశలు
నదిలో నీరు వస్తే వరి మాగాణి సాగు చేయడం కోసం చిన్న గుంతల్లో నిల్వ ఐన నీటితో వరి నారును పెంచిన రైతుల్లోనూ నదికి నీరు రావడంతో వరి మాగాణి ఆశలు చిగురించాయి. దీంతో వారు భూములను తడిపి దమ్ము చేసే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం మీద ప్రస్తుతం నదికి విడుదల చేసిన నీరు కొన్ని రోజుల్లో నిలిచిపోయినా, ఇప్పటికే సాగరు కాలువకు నీరు విడుదల చేయడంతో, తద్వారా సాగు చేసిన వరి మాగాణి భూములు నుంచి నదికి చేరే నీటితో వరి సాగుకు ఢోకా లేదనేది రైతుల ఆభిప్రాయంగా ఉంది. దీంతో ఇప్పటికే కంది, పత్తి వేసిన భూముల్లో సైతం వరి మాగాణి సాగు చేయడం కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment