పథకం పూర్తి.. ఫలితం నాస్తి | Rs. 11 crore with the completion of the tammavaram - 2 waterfalls Scheme | Sakshi
Sakshi News home page

పథకం పూర్తి.. ఫలితం నాస్తి

Published Sat, Oct 19 2013 7:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Rs. 11 crore with the completion of the tammavaram - 2 waterfalls Scheme

మేదరమెట్ల, న్యూస్‌లైన్: సాగునీటి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు ఏటికేడు నిరాశే మిగులుతోంది. 23 ఏళ్ల క్రితం శంకుస్థాపన రాయి పడిన తమ్మవరం-2 ఎత్తిపోతల పథకం అడుగడుగునా అవాంతరాలతో ఎట్టకేలకు ఏడాది క్రితం పూర్తయింది. నిర్మాణం పూర్తయిన తరువాత కూడా ఆ పథకం ద్వారా సాగునీరు అందడం లేదు. కొరిశపాడు మండలంలోని రైతులు పూర్తిగా వర్షాధారంగా పంటలు సాగు చేస్తుంటారు. రైతుల ఇక్కట్లను గుర్తించిన నాటి ప్రభుత్వం 1990లో గుండ్లకమ్మపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి సాగునీరందించాలని సంకల్పించి తమ్మవరం-2 ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే రాజకీయ కారణాల దృష్ట్యా ఆ పథకం శిలాఫలకానికే పరిమితమైంది.
 
 ఆ తరువాత తొమ్మిదేళ్లకు పథక నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. 2008లో గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్మాణంతో పథకం పూర్తిగా ముంపునకు గురైంది. 2009లో పథకాన్ని పునర్నిర్మించడంతో పాటు మరమ్మతులకు కలిపి రూ. 11 కోట్లు ఖర్చు చేసి 2012 నాటికి సిద్ధం చేశారు. నిర్మాణం పూర్తయి ఏడాదైనా ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు. పథకం పనిచేస్తే మండలంలోని తమ్మవరం, యర్రబాలెం, మేదరమెట్ల, సోమవరప్పాడు, దైవాలరావూరు, తిమ్మనపాలెం గ్రామాలతో పాటు నాగులుప్పలపాడు మండలం కే తక్కెళ్లపాడు, కొత్తకోట గ్రామాల పరిధిలోని 4,950 ఎకరాలకు సాగునీరందుతుంది. దీని కోసం తమ్మవరంలో గుండ్లకమ్మ నది ఒడ్డున పంప్‌హౌస్ నిర్మించారు. గుండ్లకమ్మ నదిలో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉంది. ఎత్తిపోతల పథకంలోని విద్యుత్ మోటార్లు నిరంతరం పనిచేసేందుకు ప్రత్యేకంగా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు.
 
 గతంలో పంప్‌హౌస్ నుంచి మేదరమెట్ల, సోమవరప్పాడు, దైవాలరావూరు తదితర గ్రామాలకు పైపులైను నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు పొలాల్లో సాగునీటి కాలువలను కూడా తవ్వారు. అయితే కాలువలు తీసి ఏళ్లు గడవడంతో ప్రస్తుతం తీసిన కాలువల జాడ కూడా కనిపించకపోవడంతో ఇటీవల కొంతమేర పొలాల్లో పైపు లైను వేశారు. ఇరిగేషన్ అధికారులు  అలసత్వాన్ని వీడి పథకం ప్రారంభానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే దీని ద్వారా సుమారు 2 వేల మంది రైతులకు చెందిన పొలాలకు సాగునీరందుతుందని, తద్వారా పంటల దిగుబడి పెరుగుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
 
 నిధులు రాకే జాప్యం
 వై.వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు
 గతంలో తీసిన కాలువలు పూడిపోవడంతో వాటి మరమ్మతులకు కలెక్టర్ నిధుల నుంచి రూ. 30 లక్షలు, ముఖ్యమంత్రి నిధుల నుంచి రూ. 75 లక్షలు ఇస్తామని ఉన్నతాధికారులు చెప్పడంతో అంచనాలు వేసి పంపించాం. ఈ ఏడాది కనీసం 500 ఎకరాలకు నీరందించాలని భావించాం. కానీ సమైక్య ఉద్యమ నేపథ్యంలో అందరూ సమ్మెలో ఉండటంతో పనులు నిలిచిపోయాయి.  రైతులు సహకరిస్తే స్కీమ్‌ను సొసైటీకి అందజేస్తాం. వ్యవసాయ సీజను కావడంతో పైర్లు ఉన్నందు వల్ల  పొలాల్లో కాలువలు తీసేందుకు రైతులు వ్యతిరేకిస్తున్నారు. రావాల్సిన నిధులొస్తే త్వరలోనే అన్ని పనులు పూర్తిచేసి రైతులకు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement