
సేవించిన పురుగుల మందు చికిత్స పొందుతున్న బేతపూడి సాయి
ఒంగోలు: క్రికెట్ బెట్టింగ్ భూతం ఒక యువకుడ్ని ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించేలా చేసింది. ఈ ఘటన స్థానిక ఒంగోలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పక్కన ఉన్న విద్యుత్‌శాఖ సబ్‌స్టేషన్ ఆవరణలో ఉదయం 8.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. స్థానిక సీతారామపురానికి చెందిన బేతపూడి సాయి గత 12 సంవత్సరాలుగా విద్యుత్‌శాఖలో షిఫ్టు ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం డ్యూటీ ఎక్కాడు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఇతను డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లాలి. ఈ నేపథ్యంలో అక్కడ ఉండే వాచ్‌మేన్‌ను పేపర్ తీసుకురమ్మని పంపాడు. అతను పేపర్ తీసుకొని వచ్చేసరికి సాయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతని వద్ద కీటకాల సంహరణకు వినియోగించే మందు డబ్బా కనిపించింది.
భయభ్రాంతులకు గురైన వాచ్‌మేన్‌ను అతికష్టంమీద బైక్ ఎక్కించుకొని రిమ్స్‌కు తరలించాడు. మార్గమధ్యంలోనే వాంతులు కూడా చేసుకున్నాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సాయి తండ్రి వెంకట్రావు కథనం ప్రకారం నిత్యం నలుగురు లేదా అయిదుగురు వ్యక్తులు ఇంటికి వస్తుంటారని, ఎవరంటే స్నేహితులు అని చెబుతుండేవాడన్నాడు. తాము విచారిస్తే బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడని తెలిసిందని తెలిపాడు. ఎంత మొత్తం అనేది మాత్రం చెప్పలేదన్నాడు. బెట్టింగ్ బాధలు తట్టుకోలేక తన ఉద్యోగాన్ని ఎవరికైనా ఇస్తే డబ్బులు వస్తాయేమోనని యత్నించాడని, చివరకు అది కూడా ఫలించక ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నామన్నాడు. సాయికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మరో 48 గంటలపాటు గడిస్తే కాని సాయి ఆరోగ్యంపై ఒక స్పష్టతకు రాలేమని వైద్యులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment