అనుమానంతో ఉసురు తీశాడు | Husband Killed Wife in Prakasam | Sakshi
Sakshi News home page

అనుమానంతో ఉసురు తీశాడు

Jan 17 2019 1:27 PM | Updated on Jan 17 2019 1:27 PM

Husband Killed Wife in Prakasam - Sakshi

పార్వతి, శరభయ్యల పెళ్లి ఫొటో పార్వతి (ఫైల్‌)

ప్రకాశం , మార్కాపురం:   అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. తాళికట్టిన భార్యను కిరాతకంగా గొడ్డలితో నరకటంతో అక్కడికక్కడే చనిపోయింది. సంక్రాంతి పండుగ రోజున ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. పోలీసుల కథనం మేరకు.. మార్కాపురంలోని కంభం రోడ్డులో శ్రీనివాస థియేటర్‌ పక్కన వీధిలో నివాసం ఉంటున్న ఎన్‌.శరభయ్య తన భార్య పార్వతి (30)ని బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో గొడ్డలితో నరికి పరారయ్యాడు. ఈ సంఘటనలో పార్వతి అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు జ్ఞానేశ్వర్‌ (10), వైశాలి(8) ఉన్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్‌రెడ్డి, పెద్దారవీడు ఎస్సై ముక్కంటి పరిశీలించి మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

పార్వతి పిల్లలు, పార్వతి మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్రీధర్‌రెడ్డి

వివరాలు పట్టణంలో నివాసం ఉండే బలభద్రుని రంగయ్య, లక్ష్మీదేవిల మూడో కుమార్తె పార్వతిని కంభం రోడ్డులో నివాసం ఉండే శరభయ్యకు ఇచ్చి పదేళ్ల కింద ట వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. పార్వతి ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుండగా, శరభయ్య ముఠా కూలీగా ఉన్నాడు. ఇటీవల కాలంలో భార్యపై అనుమానం పెంచుకుని తరచుగా వేధించసాగాడు. మద్యానికి అలవాటు పడి భార్యను కొట్టేవాడు. విషయం పార్వతి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు వచ్చి కూతురు, అల్లుడితో మాట్లాడి కలిసి ఉండాలని సర్ది చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన శరభయ్య గొడ్డలితో పార్వతి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలం నుంచి శరభయ్య పరారయ్యాడు.

విలపించిన తల్లిదండ్రులు: సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు లక్ష్మీదేవి, రంగయ్యలు కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. పార్వతిని గొడ్డలితో కొట్టడంతో రక్తం ధారలా ప్రవహించింది. పార్వతి పిల్లలు ఇద్దరూ తల్లి మృతదేహాన్ని చూసి రోదించారు. తల్లిని పట్టుకుని లేమ్మా అంటూ పిలవటం అక్కడ ఉన్న వారి కంట కన్నీరు తెప్పించింది. వృద్ధాప్యంలో తమకు కడుపు కోత మిగిల్చి పోయిందని పార్వతి తల్లిదండ్రులు విలపించారు. మృతదేహాన్ని చూసేందుకు ఆ ప్రాంత ప్రజలు తరలివచ్చారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆ ప్రాంత పిల్లలకు ట్యూషన్‌ చెబుతూ ఉండే పార్వతి చని పోవడం చూసి మహిళలు ఆవేదనకు గురయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement