ఏసీబీకి చిక్కిన స్టేషన్ రైటర్ వీర్రాజు
ప్రకాశం, మద్దిపాడు: మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జి.వీర్రాజు మంగళవారం ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ట్రాన్స్‌పోర్టు కంపెనీ లారీకి యాక్సిడెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.5 వేలు డిమాండ్ చేయడంతో విధిలేని పరిస్థితిలో ఏసీబీని సదరు కంపెనీ మేనేజర్ ఆశ్రయించాడు. అందిన వివరాల ప్రకారం మండల పరిధిలోని దొడ్డవరప్పాడు సమీపంలో ఈనెల 15 తేదీ తెల్లవారు జామున లారీ ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ వద్దకు తరలించారు. ఈ నేపథ్యంలో ముందు వెళ్తున్న వాహనానికి సంబంధించిన వ్యక్తి తనకు కేసు అవసరం లేదంటూ వెళ్లిపోయాడు. లారీ డ్రైవర్ ట్రాన్స్‌పోర్టు కంపెనీ మేనేజర్ కరీమ్ ఖాన్‌కు ఫోన్ చేయగా అతను 15వ తేదీ, సాయంత్రం వచ్చి స్టేషన్‌లో విచారించాడు. ఈక్రమంలో లారీ ముందు భాగం దెబ్బతినడంతో ఇన్‌స్రూెన్స్ నిమిత్తం యాక్సిడెంట్ సర్టిఫికెట్ కోసం స్టేషన్ రైటర్ వీర్రాజును సంప్రదించగా అతను సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. స్టేషన్ రైటర్ మాట్లాడిన మాటలను వీడియో రికార్డింగ్ చేసి తాను అంత ఇవ్వలేనని తెలుపగా రూ.5 వేలు లేకపోతే నీపని కాదని రైటర్ కరాఖండిగా చెప్పడంతో కరీంఖాన్ నేరుగా ఒంగోలు చేరుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించి వీడియో క్లిప్పింగ్‌లు చూపాడు.
వారు విషయాలను పరిశీలించి నిర్ధారణకు వచ్చిని ఏసీబీ అధికారులు కరీంఖాన్‌కు ఐదు వేల రూపాయల నగదు ఇచ్చి మంగళవారం ఉదయం మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌కు పంపారు. అతను నగదు రైటర్‌కు ఇచ్చిన వెంటనే ఏసీబీ అడిషనల్ ఎస్పీ గుంటూరు, ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి ఏ సురేష్‌బాబు తన సిబ్బందితో కలిసి దాడిచేసి రైటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన నగదును రైటర్ టైబుల్ డ్రాయర్‌లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో స్టేషన్ ఎస్‌ఐ ఖాదర్‌బాషా వేరే కేసు నిమిత్తం ఘటనా స్థలికి వెళ్లగా ఎస్‌ఐను పిలిపించి విషయం తెలిపారు. వీర్రాజును కస్టడీలోకి తీసుకుని నెల్లూరు ఏసీబీ కోర్టులో బుధవారం ప్రవేశ పెట్టనున్నట్లు ఏసీబీ ఏఎస్‌పీ తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎన్.రాఘవరావు ఎ.వెంకటేశ్వర్లు ఏసీబీ సిబ్బంది పలువురు ఉన్నారు. దాదాపుగా 8 సంవత్సరాల తరువాత మద్దిపాడు మండలంలో ఏసీబీ అధికారులు దాడి చేయడం ఇదే ప్రథమం. గతంలో రెవెన్యూశాఖలో పని చేస్తున్న ఆర్‌ఐ రామానాయుడు ఇసుక ట్రాక్టర్ యజమాని వద్ద డబ్బులు డిమాండ్ చేసి లంచం తీసుకుంటున్న సమయంలో ఒంగోలులోని లింగయ్య భవనం సమీపంలో ఏసీబీ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. ఆ తరువాత తాజాగా మంగళవారం ఏసీబీ అధికారులు మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో రైటర్‌ను పట్టుకోవడం మండల ప్రజల్లో చర్చనీయాంశమైంది.
రెండు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పిబెదిరించాడు
రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిప్పి బెదిరించాడు. ఎస్‌ఐ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పినా రైటర్ డబ్బు డిమాండ్ చేసి ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తాననడంతో ఏసీబీని ఆశ్రయించాల్సి వచ్చింది.– కరీంఖాన్,విజయవాడ ట్రాన్స్‌పోర్టు కంపెనీ మేనేజర్
బాధితులు ఎవరైనా ఫిర్యాదుచేయవచ్చు
ఎవరైనా ఏసీబీకి ఫిర్యా దు చేయవచ్చు. తగిన ఆధారాలతో వారిని అరెస్టు చేస్తాం. ఎవరైనా అధికారులు అవినీతి పనులు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తే మాకు తెలియచేయండి. ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉంటాం.– ఏ.సురేష్‌బాబు, ఏసీబీ అడిషనల్ ఎస్‌పీ ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి
Comments
Please login to add a commentAdd a comment