గుట్టు రట్టు | Adulterated Alcohol Gang Arrest in Prakasam | Sakshi
Sakshi News home page

గుట్టు రట్టు

Published Thu, Jan 2 2020 12:21 PM | Last Updated on Thu, Jan 2 2020 12:21 PM

Adulterated Alcohol Gang Arrest in Prakasam - Sakshi

నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న ఎక్సైజ్‌ పోలీసులు

అద్దంకి: కర్నూల్‌లో తీగ లాగితే అద్దంకిలో నకిలీ మద్యం, పురుగుమందుల తయారీ భాగోతం బట్టబయలైంది. పట్టణం నడిబొడ్డున నకిలీ మద్యం, పురుగుమందులు బయో ఉత్పత్తులు తయారీ కేందాన్ని బుధవారం గుర్తించిన ఎక్సైజ్‌ పోలీసులు అవాక్కయ్యారు. దాడుల్లో నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే రెట్టిఫైడ్‌ స్పిరిట్, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా పట్టణానికి చెందిన రావూరి శ్రీనివాసరావు తన ఇంటికి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కారు పెట్టుకునేందుకు వేసిన రేకుల షెడ్డులో చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావుతో పాటు ఆయన భార్య శ్రీదేవిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్‌ డీసీ శ్రీమన్నారాయణ కథనం ప్రకారం..మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో నకిలీ మద్యం తయారీ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుల సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా స్టేట్‌ ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ హరికుమార్‌ అప్రమత్తమయ్యారు. ఆయన ఆదేశాల మేరకు పట్టణంలోని సాయి నగర్లో నివాసం ఉంటున్న రావూరి శ్రీనివాసరావు గృహంపై ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అతని ఇంటి పక్కన వేసిన రెకుల షెడ్డులో 125 నకిలీ ఇంపీరియర్‌ బ్లూ క్వార్టర్‌ బాటిళ్లు, మద్యం తయారు చేసేందుకు ఉపయోగించే 175 లీటర్ల (నాలుగు క్యానుల్లో ఉంచిన) రెట్టిఫైడ్‌ స్పిరిట్, 510 ఎంసీ విస్కీ ఖాళీ బాటిళ్లు, 40 లీటర్ల ఖాళీ క్యానులు రెండు, 20 లీటర్ల ఖాళీ క్యాను ఒకటి సీజ్‌ చేశారు. 172 లీటర్ల నకిలీ పురుగు మందుల (బయో ఉత్పత్తులు) డబ్బాలు, ఖాళీ డబ్బాలు, వాటికి వేసే స్టిక్కర్లు, పురుగుముందుల డబ్బాలకు మూతలు అమర్చే మిషన్‌ను స్వాధీనం చేసుకుని వాటిని వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు.

నిందితుడు రావూరి శ్రీనివాసరావును విచారించగా తాను కర్నూలు జిల్లాకు చెందిన రాంబాబు ద్వారా నకిలీ మద్యం తయారు చేసే వినోద్‌ఖల్లాల్‌కు రూ.లక్ష అప్పుగా ఇచ్చానని, ఆ బాకీ ఇవ్వకపోవడంతో తనకు 2019 ఫిబ్రవరి నెలలో 14 క్యానుల స్పిరిట్, నకిలీ మద్యం బాటిళ్లు ఇచ్చారని చెప్పకొచ్చాడు. ఆగస్టులో రెండు దఫాలుగా వచ్చి 10 క్యానుల స్పిరిట్‌ తీసుకుని 128 ఖాళీ బాటిళ్లు ఇచ్చాడని చెప్పాడు. వినోద్‌ఖల్లాల్‌ మొత్తం 315 క్వార్టర్‌ నకిలీ మద్యం బాటిళ్లు ఇవ్వగా నాలుగు నెలల కాలంలో 190 బాటిళ్లను విక్రయించినట్లు శ్రీనివాసరావు అంగీకరించాడు. నకిలీ మద్యం బాటిళ్లపై ఉన్న కోడ్‌ను స్కాన్‌ చేయగా ఆ మద్యం బాటిళ్లు కర్నూలు నుంచే వచ్చినట్లు గుర్తించామని డీసీ చెప్పారు. నిందితుడిపై పీడీ యాక్ట్, 420 కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరింత లోతుగా విచారిస్తే నకిలీ మద్యం కేసుకు సంబంధించి మరికొంత మంది దొరికే అవకాశం ఉందని డీసీ వివరించారు. సమావేశంలో ఈఎస్‌ జి. నాగేశ్వరరావు, ఏఈఎస్‌ శ్రీనివాసులునాయుడు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐలు లీనా, తిరుపతయ్య, అద్దంకి ఎక్సైజ్‌ సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు.  

హైదరాబాద్‌ నుంచి ముడిసరుకు  
నకిలీ పురుగుమందులకు సంబంధించిన ముడిసరుకును నిందితులు హైదరాబాద్‌లోని ముత్తుస్వామి, పొన్నుస్వామిల వద్ద తెస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామ్మూర్తి చెప్పారు. నకిలీ పురుగు మందులు తయారీ కేంద్రాన్ని గుర్తించినట్లు తెలుసుకున్న జేడీఏ అద్దంకి ఎక్సైజ్‌ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ నిందితుడు శ్రీనివాసరావు వైరల్‌ హిట్‌ పేరుతో పురుగుమందు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆ మందును పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. నిందితుడిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. విచారణలో మరింత సమాచారం రావాల్సి ఉందని జేడీ చెప్పారు. ఆయనతో పాటు ఏడీఏలు మాలకొండారెడ్డి, ధన్‌రాజ్, వ్యవసాయాధికారి వెంకటకృష్ణ ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement