Fake alcohol
-
అక్రమ మద్యం, గంజాయిపై నిఘా పెంచండి: కేఎస్ జవహర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమ మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీస్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డా.కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అక్రమ మద్యం, గంజాయి తదితర మాదక ద్రవ్యాల రవాణా, వాడకంపై ఉక్కుపాదం మోపేందుకు సరిహద్దు రాష్ట్రాల డీజీపీలతో సమన్వయం చేసుకోండి. వీటితో సంబంధం ఉన్న కింగ్ పిన్‌లను గుర్తించి పీడీ యాక్టు కింద అరెస్టు చేయండి. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులలో నిఘాను మరింత పటిష్టం చేయండి. ముఖ్యంగా గంజాయి సాగు చేసే గిరిజనులను ఆపరేషన్ పరివర్తన్ కింద ప్రత్యామ్నయ పంటల సాగు వైపు ప్రోత్సహించండి. ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వచ్చే అవకాశాలున్నందున సరిహద్దులతో పాటు రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టుల్లో నిఘాను అధికం చేసి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాదక ద్రవ్యాల సేవనం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోండి’ అని ఆదేశించారు. ఎస్ఈబీ కమిషనర్ యం.రవిప్రకాశ్ మాట్లాడుతూ.. గంజాయికి సంబంధించి 90 శాతం ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా నుంచి.. 10 శాతం కోరాపుట్ నుంచి ఏపీలోకి వస్తోందని తెలిపారు. ఒడిశా డీజీపీ సమన్వయంతో గంజాయి రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. గంజాయి రవాణాకు సంబంధించి 25 మంది కింగ్ పిన్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.4.38 కోట్ల విలువైన అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. మద్యం సరఫరాకు సంబంధించి రాష్ట్రంలోని ప్రతి డిస్టిలరీకి ఒక సహాయ కమిషనర్ స్థాయి అధికారిని ఇన్చార్జ్గా పెట్టామని చెప్పారు. మద్యం రవాణా చేసే వాహనాలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అధికారులు దేవకుమార్, వాసుదేవరావు, రజత్ భార్గవ, డా.మల్లిఖార్జున, ఢిల్లీ రావు, రవిశంకర్ అయ్యన్నార్, కాంతిరాణా టాటా, విజయ సునీత, రవి సుభాష్, తుహిన్ సిన్హా, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దు రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డా.కేఎస్.జవహర్‌రెడ్డి ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ‘నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయండి. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు.. ప్రతిరోజూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలి. తాగునీటి సరఫరా విధానాన్ని పర్యవేక్షించేందుకు రూపొందించిన యాప్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి’ అని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. 9 జిల్లాల్లో తాగునీటికి ఇబ్బంది లేదని కలెక్టర్లు నివేదించినట్లు చెప్పారు. మిగిలిన 17 జిల్లాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపేందుకు అవసరమైన నీటిని కాలువల ద్వారా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రూపొందించిన యాప్‌ను శుక్రవారం అందుబాటులోకి తెస్తామన్నారు. గ్రామ స్థాయిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధిత ఇంజనీర్ ఆమోదంతో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా డిమాండ్‌ను యాప్‌లో అప్లోడ్ చేసి జిల్లా కలెక్టర్ ద్వారా పంపిస్తే ఆమోదిస్తామని తెలిపారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, నారాయణరెడ్డి, జాన్ సత్యరాజ్, బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో జోరుగా నకిలీ మద్యం దందా
► ఆసిఫాబాద్‌కు చెందిన రాజేష్ మూడు రోజుల కిందట గుండి రహదారిలో ఉన్న ఓ మద్యం దుకాణానికి వెళ్లి క్వార్టర్ మద్యం తీసుకున్నాడు. ఇంటికెళ్లి బాటిల్ మూత తీయగానే స్పిరిట్ వాసన గుప్పుమంది. తాజాగా తయారైన మద్యం అనుకుని గ్లాసులో పోసుకుని తాగగా.. నిజంగా స్పిరిట్ తాగిన భావన. నిత్యం తాగే బ్రాండ్ ఇలా ఉందేమని.. మరుసటి రోజు బ్రాందీ షాపుకెళ్లి ఫిర్యాదు చేశాడు. సాయంత్రానికి షాపు లైసెన్సుదారుడు రాజేష్‌కి ఫోన్ చేసి ‘ఏ బ్రాండు తీసుకున్నావు? స్పిరిట్ వాసన వచ్చిందా? నేను చెక్ చేస్తాను.. ఎవరితో చెప్పకు’ అని కోరాడు. ► శ్రీధర్ అనే మరో వ్యక్తి రెండు రోజుల కిందట ఖరీదైన విస్కీ బ్రాండు మద్యం బాటిళ్లు కొనుగోలు చేశాడు. స్నేహితులతో కలిసి పార్టీలో మద్యం బాటిళ్లను ఓపెన్ చేసి గ్లాసుల్లో పెగ్‌లు పోయగా.. వాటిని తాగిన స్నేహితులందరూ ఇది నకిలీ మద్యం.. స్పిరిట్ వాసన వస్తోందని అనడంతో శ్రీధర్ కంగుతిన్నాడు. ఆసిఫాబాద్‌లోని చిర్రకుంట వెళ్లే రహదారిలో ఉన్న ఓ మద్యం దుకాణంలో శ్రీధర్ ఈ బాటిళ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. జిల్లావ్యాప్తంగా ఈ రకం మద్యం విక్రయించని వైన్స్ లేదంటే అతిశయోక్తి కాదు. నిబంధనలకు విరుద్ధంగా అనేక మద్యం షాపుల్లోనూ లభి స్తోంది. నవంబర్ తర్వాత పాత వైన్స్ షాపుల స్థానంలో కొత్తవి రానుండడంతో పాత షాపుల య జమానులు కొందరు నకిలీ మద్యం దందాను ప్రో త్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఉ న్నతాధికారులు, ఆబ్కారీ ఉన్నతాధికారులకు మా మూళ్లు ఇస్తున్నామనే భావనతో.. చివరి రోజుల్లోనైనా కొంత లాభాలు దక్కించుకునేందుకు లైసెన్సుదారులు నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనిని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో తనిఖీలు గాలికొదిలేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగజ్‌నగర్ అడ్డాగా.. జిల్లాలో 32 మద్యం దుకాణాలు, 3 బార్లు ఉన్నా యి. ఏటా రూ.250 కోట్ల మద్యం అమ్ముడవుతోంది. వీటికి అనుసంధానంగా మండల కేంద్రాల్లో ప దుల సంఖ్యలో బెల్టు షాపులు ఉండగా.. జిల్లావ్యాప్తంగా వాటి సంఖ్య 800 వరకు ఉంటుంది. నవంబర్‌తో ప్రస్తుత మద్యం షాపులకు గడువు పూర్తవుతోంది. డిసెంబర్ నుంచి కొత్తగా మద్యం దుకా ణాలను టెండర్ల ద్వారా దక్కించుకున్న లైసెన్సుదారులు ఏర్పాటు చేయనున్నారు. ఇదే అదనుగా ప్రస్తుతం ఉన్న లైసెన్సుదారులు తమ మద్యం దు కాణాల్లో నకిలీ మద్యం విక్రయాలకు తెరలేపినట్లు సమాచారం. ముఖ్యంగా కాగజ్‌నగర్ అడ్డాగా నకిలీ మద్యం తయారవుతోంది. అసలు బాటిళ్ల మా దిరిగా ఉండే నకిలీ బ్రాండ్లను షాపుల్లో ఉంచి మందుబాబులకు అంటగడుతూ రూ.లక్షలు అర్జిస్తున్నారు. ఒకప్పుడు చీప్ లిక్కర్లలో కల్తీ జరిగేది. కానీ ప్రస్తుతం ఖరీదైన బ్రాండ్లనూ నకిలీగా తయారు చేయడం విశేషం. ఇదే విషయమై జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారి జ్యోతికిరణ్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. జోరుగా దందా.. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల నిర్వహణ గడువు ఈ ఏడాది నవంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఇటీవలే కొత్త దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించిన విషయం తెలిసిందే. ఇదే తరుణంలో ప్రస్తుతం ఉన్న మద్యం లైసెన్సుదారులు అక్రమార్జనకు అడ్డదారులు వెతుక్కున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బీరు, ఇతర ప్రీమియం మద్యం బాటిళ్లపై ధర పెంచి విక్రయించి సొమ్ము చేసుకున్న సంగతి విధితమే. ఇప్పుడంతకు మించి అర్జించాలంటే నకిలీ మద్యం ఒక్కటే మార్గమని భావించి అసలు బ్రాండ్ల స్థానంలో నకిలీ మద్యం బ్రాండ్ బాటిళ్లను ఉంచి విక్రయిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో కేవలం కొన్ని దుకాణాల్లో మాత్రం నకిలీ మద్యం విక్రయాలు జరగడం లేదని తెలుస్తోంది. స్థానికుల్లో చాలా మంది మంచిర్యాల, పొరుగున ఉన్న మహారాష్ట్రకు వెళ్లి మద్యం బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారంటే జిల్లాలో నకిలీ మద్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. చాటుగా కాకుండా ఏకంగా మద్యం దుకాణాల్లోనే నకిలీ మద్యం బాటిళ్లను ఉంచి విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. -
గుట్టు రట్టు
అద్దంకి: కర్నూల్లో తీగ లాగితే అద్దంకిలో నకిలీ మద్యం, పురుగుమందుల తయారీ భాగోతం బట్టబయలైంది. పట్టణం నడిబొడ్డున నకిలీ మద్యం, పురుగుమందులు బయో ఉత్పత్తులు తయారీ కేందాన్ని బుధవారం గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు అవాక్కయ్యారు. దాడుల్లో నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే రెట్టిఫైడ్ స్పిరిట్, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా పట్టణానికి చెందిన రావూరి శ్రీనివాసరావు తన ఇంటికి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కారు పెట్టుకునేందుకు వేసిన రేకుల షెడ్డులో చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావుతో పాటు ఆయన భార్య శ్రీదేవిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ డీసీ శ్రీమన్నారాయణ కథనం ప్రకారం..మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో నకిలీ మద్యం తయారీ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుల సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా స్టేట్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హరికుమార్ అప్రమత్తమయ్యారు. ఆయన ఆదేశాల మేరకు పట్టణంలోని సాయి నగర్లో నివాసం ఉంటున్న రావూరి శ్రీనివాసరావు గృహంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అతని ఇంటి పక్కన వేసిన రెకుల షెడ్డులో 125 నకిలీ ఇంపీరియర్ బ్లూ క్వార్టర్ బాటిళ్లు, మద్యం తయారు చేసేందుకు ఉపయోగించే 175 లీటర్ల (నాలుగు క్యానుల్లో ఉంచిన) రెట్టిఫైడ్ స్పిరిట్, 510 ఎంసీ విస్కీ ఖాళీ బాటిళ్లు, 40 లీటర్ల ఖాళీ క్యానులు రెండు, 20 లీటర్ల ఖాళీ క్యాను ఒకటి సీజ్ చేశారు. 172 లీటర్ల నకిలీ పురుగు మందుల (బయో ఉత్పత్తులు) డబ్బాలు, ఖాళీ డబ్బాలు, వాటికి వేసే స్టిక్కర్లు, పురుగుముందుల డబ్బాలకు మూతలు అమర్చే మిషన్‌ను స్వాధీనం చేసుకుని వాటిని వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. నిందితుడు రావూరి శ్రీనివాసరావును విచారించగా తాను కర్నూలు జిల్లాకు చెందిన రాంబాబు ద్వారా నకిలీ మద్యం తయారు చేసే వినోద్ఖల్లాల్కు రూ.లక్ష అప్పుగా ఇచ్చానని, ఆ బాకీ ఇవ్వకపోవడంతో తనకు 2019 ఫిబ్రవరి నెలలో 14 క్యానుల స్పిరిట్, నకిలీ మద్యం బాటిళ్లు ఇచ్చారని చెప్పకొచ్చాడు. ఆగస్టులో రెండు దఫాలుగా వచ్చి 10 క్యానుల స్పిరిట్ తీసుకుని 128 ఖాళీ బాటిళ్లు ఇచ్చాడని చెప్పాడు. వినోద్ఖల్లాల్ మొత్తం 315 క్వార్టర్ నకిలీ మద్యం బాటిళ్లు ఇవ్వగా నాలుగు నెలల కాలంలో 190 బాటిళ్లను విక్రయించినట్లు శ్రీనివాసరావు అంగీకరించాడు. నకిలీ మద్యం బాటిళ్లపై ఉన్న కోడ్‌ను స్కాన్ చేయగా ఆ మద్యం బాటిళ్లు కర్నూలు నుంచే వచ్చినట్లు గుర్తించామని డీసీ చెప్పారు. నిందితుడిపై పీడీ యాక్ట్, 420 కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరింత లోతుగా విచారిస్తే నకిలీ మద్యం కేసుకు సంబంధించి మరికొంత మంది దొరికే అవకాశం ఉందని డీసీ వివరించారు. సమావేశంలో ఈఎస్ జి. నాగేశ్వరరావు, ఏఈఎస్ శ్రీనివాసులునాయుడు, ఎన్ఫోర్స్మెంట్ సీఐలు లీనా, తిరుపతయ్య, అద్దంకి ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి ముడిసరుకు నకిలీ పురుగుమందులకు సంబంధించిన ముడిసరుకును నిందితులు హైదరాబాద్‌లోని ముత్తుస్వామి, పొన్నుస్వామిల వద్ద తెస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామ్మూర్తి చెప్పారు. నకిలీ పురుగు మందులు తయారీ కేంద్రాన్ని గుర్తించినట్లు తెలుసుకున్న జేడీఏ అద్దంకి ఎక్సైజ్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ నిందితుడు శ్రీనివాసరావు వైరల్ హిట్ పేరుతో పురుగుమందు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆ మందును పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. నిందితుడిపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. విచారణలో మరింత సమాచారం రావాల్సి ఉందని జేడీ చెప్పారు. ఆయనతో పాటు ఏడీఏలు మాలకొండారెడ్డి, ధన్‌రాజ్, వ్యవసాయాధికారి వెంకటకృష్ణ ఉన్నారు. -
నకిలీ మద్యం ‘ముఠా’ గుట్టురట్టు!
కర్నూలు : నకిలీ మద్యం ముఠా గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏఈఎస్ ఆర్.వి.సుధాకర్, సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిఘా వేసి ఏపీ21 ఏఈ 8159 నంబరు గల టాటా సుమోలో తరలిస్తున్న 1400 మెక్‌డోవెల్స్ క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని రవాణాదారుడితో పాటు ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తిమ్మాపురం కేంద్రంగా వ్యాపారం... ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం కేంద్రంగా నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన రంగస్వామి రెండేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం. కృష్ణగిరి, గోనెగండ్ల, దేవనకొండ, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం మండలాల్లో బెల్టు దుకాణాలే లక్ష్యంగా ఈ వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎల్లాగౌడ్పై గతంలో పీడీ యాక్ట్... నకిలీ మద్యం వ్యాపారి ఎల్లా గౌడ్ గతంలో కూడా ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి దాదాపు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈయనపై పీడీ యాక్ట్ నమోదు కావడంతో కొంతకాలం పాటు వ్యాపారానికి విరామం ప్రకటించి అధికార పార్టీకి చెందిన నాయకుల అండతో రెండేళ్లుగా మళ్లీ ఈ దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. నకిలీ మద్యం తయారీ ఇలా... రాయచూరు జిల్లా గిలకసుగూరు గ్రామానికి చెందిన ఎల్లాగౌడ్ అదే గ్రామంలో ఓ రహస్య ప్రదేశంలో మెక్‌డోవెల్స్ కంపెనీకి చెందిన పాత సీసాలను పెద్దఎత్తున పోగుచేసి కలర్ నీళ్లలో స్పిరిట్ కలిపి సీసాలకు నింపి ప్రత్యేక మిషన్‌తో ప్లాస్టిక్ మూతలు బిగించి జిల్లాలోని బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మండలాల వారీగా ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బంటుపల్లె గ్రామానికి చెందిన బాలా గౌడ్, వీరాంజనేయులు దేవనకొండ మండలంలో బెల్టు షాపులకు స్పూరియస్ లిక్కర్ (విషపూరితమైన మద్యం) సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులు నిఘా వేసి పట్టుకున్నట్లు సమాచారం. రెండు నెలలుగా నిఘా... ఎక్సైజ్ అధికారులు తిమ్మాపురం రంగస్వామిపై రెండు నెలలుగా నిఘా ఉంచి ఈదులదేవరబండ నుంచి వెంబడించి బేతపల్లె గ్రామ సరిహద్దులో పట్టుకున్నట్లు తెలుస్తోంది. గిలకసుగూరు నుంచి మాధవరం చెక్‌పోస్టు మీదుగా జిల్లాలోకి నకిలీ మద్యం రవాణా అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఐదుగురు కానిస్టేబుళ్లను గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు, దేవనకొండ మండలం ఈదులదేవరబండ దగ్గర కాపలా ఉంచి పక్కా సమాచారంతో నకిలీ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్కార్ట్‌గా మరో వాహనంలో వెళ్తున్న ఏజెంట్లు బాలాగౌడ్, వీరాంజనేయులును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పత్తికొండ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారుల అదుపులో ఉన్న ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. చెక్‌పోస్టులకు ముందే సమాచారం... జిల్లా సరిహద్దు గ్రామాలకు గిలకసుగూరు ఆనుకుని ఉండటంతో కర్ణాటక పోలీసుల నిఘా కొరవడింది. దీంతో నకిలీ మద్యం రవాణాదారులు చెక్‌పోస్టులలో మామూళ్లు ముట్టజెప్పి వ్యాపారాన్ని య«థేచ్ఛగా సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని దాదాపు పది మండలాలను కేంద్రంగా చేసుకుని నెలకు రెండుసార్లు గిలకసుగూరు నుంచి బెల్టు దుకాణాలకు ఎల్లా గౌడ్ ఏజెంట్ల ద్వారా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. నకిలీ మద్యం తరలించే వాహనాల నంబర్లు చెక్‌పోస్టులో ఉన్న అధికారులకు ముందుగానే చేరవేస్తారు. దీంతో తనిఖీలు లేకుండానే అక్కడి అధికారులు వదిలేస్తుండటంతో నకిలీ మద్యం వాహనాలు జిల్లాలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. -
కల్తీ మద్యం బుసబుస
తెనాలి: నకిలీ మద్యం కుంభకోణానికి ఇంకా తెరపడలేదు. ఖాళీ సీసాల్లో నకిలీ, చౌక మద్యం అమ్మకాల గుట్టు రట్టయి, నిందితులెవరో నిగ్గు తేలినప్పటికీ తవ్వేకొద్దీ అన్నట్టుగా కొత్త కేసులు వెలుగు చూస్తూనే వున్నాయి. ‘సాక్షి’ వరుస కథనాల్లోని అంశాలు పక్కా వాస్తవాలుగా బహిర్గతమవుతున్నాయి. ఆ క్రమంలోనే శుక్రవారం స్థానిక మార్కెట్ సెంటర్లోని బజారులో మూసి ఉంచిన కూరల దుకాణంలో కొత్త మూతల డంప్ పట్టుబడటం ఇందుకు నిదర్శనం. దుకాణం లోపల ఉంచిన వివిధ రకాల మద్యం బ్రాండ్లకు చెందిన వేలాది మూతలను అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం గుట్టు రట్టు రేపల్లె సమీపంలోని తుమ్మల పంచాయతిలోని గాదెవారిపాలెంలో ఒక ప్రైవేటు ఇంటిలో నడుస్తున్న నకిలీ మద్యం రాకెట్ జనవరి 16న బహిర్గతమైన విషయం తెలిసిందే. దీనికి కొన్ని నెలల ముందు నుంచి ఈ అక్రమ వ్యాపారం నడుస్తోంది. మ హారాష్ట్ర టు అదిలాబాద్, విజయవాడకు రెక్టిఫైడ్ స్పిరిట్‌ను తెప్పించి, రంగు కలిపి నకిలీ మద్యం తయారు చేయటం, ఖాళీ మద్యం సీసాల్లో నింపటం ఒకరకమైతే, మధ్య రకం ఖరీదు కలి గిన బ్రాండ్ల ఖాళీ సీసాల్లో చౌకమద్యం కలపటం మరో రకం. ముందే తెప్పించుకున్న కొత్త మూతల్ని క్యాప్ ఫిట్టింగ్ మిషనుతో సీలు వేస్తున్నారు. ‘ఎక్సైజ్’లోని ఆరితేరిన కొందరు ఉద్యోగులు, మద్యం లైసెన్సుదారులు కుమ్మక్కయి, తెనాలి డివిజనువ్యాప్తంగా ఈ అక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ‘సాక్షి’ కథనాలతో తెనాలికేసి చూపు గాదెవారిపాలెం కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్, అతడి బంధువు సహా పలువురు నిందితులని తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెనాలి సమీపంలోని క్రాప, ఈమని గ్రామాల్లో పలు కేసులు వెలుగు చూశాయి. అయితే, పట్టించుకోకుండా అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. అధికారుల కనుక మేల్కొంటే కల్తీ, నకిలీ వ్యవహారం ముందే వెలుగుచూసేదని అదే నెల 21న ‘సాక్షి’ కథనంలో పేర్కొనటంతో ఆ దిశగా దర్యాప్తుచేసిన అధికారులు కొత్త మూతల సరఫరాదారును గత నెల మొదటివారంలో అదుపులోకి తీసుకున్నారు. తమదైన ట్రీట్మెంట్తో ఇందులో భాగస్వాములైన లైసెన్సుదారుల పేర్లను వెల్లడించినట్టు తెలిసింది. సందేహాలకు తావిస్తున్న ‘ఎక్సైజ్’ గోప్యత ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీసులు ఈ కేసులో గోప్యతను పాటిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. గత నెలలో పట్టుబడిన మూతల సరఫరాదారు వెల్లడించిన లైసెన్సుదార్లపై విచారించారా? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే అంశంపై అధికారులు మౌనాన్ని వీడటం లేదు. కీలకమైన రెక్టిఫైడ్ స్పిరిట్‌ను తన పేరుతో దిగుమతి చేసుకుంటూ కల్తీ మద్యం వ్యాపారం కేసులో నిందితుడైన తెనాలి ఎక్సైజ్ కార్యాలయం ఉద్యోగిని ప్రధాన నిందితుల్లో ఒకరుగా కాకుండా చివరి వరుసలోకి చేర్చి, పక్షపాతం చూపారనే విమర్శలున్నాయి. పక్కదారి పట్టించేందుకు ఎత్తుగడ మార్కెట్ సెంటర్లో పట్టుబడిన కొత్త మూతల డంప్ కేసు నీరుగార్చే ప్రయత్నంలో భాగమేనని విశ్వసనీయ సమాచారం. నిజానికి కూరగాయల దుకాణం యజమాని ఆకుల సత్యనారాయణ, అద్దెదారుకు వివాదం నడుస్తోంది. కొద్దినెలలుగా దుకాణం మూసివేసి ఉంటోంది. లోపల బూజు పట్టి వున్న దుకాణంలో మూతలు, వుంచిన సంచీ ఎలాంటి మట్టీమరకలు లేకుండా ఉండటం చూస్తుంటే, ఒకటి రెండురోజుల ముందే ఎవరో అక్కడ పడేసి వుంటారనీ, అందుకు మార్గం కూడా ఉందని చెబుతున్నారు. కేవలం కేసును పక్కదారి పట్టించేందుకు ఇప్పటికే ఆరోపణలున్న దుకాణం యజమానిపై నెట్టే ప్రయత్నంలో ఇదొక భాగమనీ, లైసెన్సుదార్లు తప్పించుకునే వ్యూహమన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో పెద్దఎత్తున డబ్బు చేతులుమారినట్టు మద్యం వ్యాపారవర్గాలు గుసగుసలాడుతున్నారు. మద్యం కల్తీ కోసం దాచిన మూతలు స్వాధీనం తెనాలి రూరల్ : మద్యం కల్తీ చేసి విక్రయించేందుకు దాచి ఉంచిన మూతలను ఎక్సైజ్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పట్టణంలోని మార్కెట్ కూడలికి వెనుక వైపున ఉన్న షాపులో కల్తీ మద్యం ఉందన్న సమాచారంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేశారు. మూసి ఉన్న షట్టర్‌ను తెరిచి చూడగా, శ్లాబుకు కన్నం వేసి ఉంది. దానికి ఆసరాగా ఉన్న నిచ్చెన సాయంతో శ్లాబు పైభాగంలో వెతకగా, మద్యంలోని వివిధ బ్రాండులకు చెందిన మూతలు ఉన్నాయి. సీసాల్లో మద్యం కల్తీ చేసి, వాటిని బిగిస్తారు. షాపు గత 15 సంవత్సరాలుగా ఆకుల సత్యనారాయణ అనే వ్యక్తి పేరున ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో ఎక్సైజ్ ఏఈఎస్ అరుణకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. మూతలు తెనాలికి సరఫరా ఇటీవల కొల్లూరు మండలం క్రాపలో పట్టుబడిన నకిలీ మూతలు తెనాలికి సరఫరా అవుతున్నట్లు గుర్తించామని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అరుణకుమారి తెలిపారు. సత్యనారాయణ దుకాణంలో ఈ నేపథ్యంలోనే సోదా చేసినట్టు వివరించారు. బ్రాండెడ్ మద్యాన్ని చీప్ లిక్కర్‌తో కల్తీ చేసి, వాటికి ఈ మూతల్ని బిగిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని, సత్యనారాయణ కొలకలూరు, దుగ్గిరాల గ్రామాల్లో మద్యం వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. -
ఇంటి దొంగల పనే !
సాక్షి, తెనాలి: నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో తెనాలిలోని ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ జూనియర్ అసిస్టెంట్ తుమ్మల కిరణ్‌కుమార్ పాత్ర స్పష్టమైంది. విజయవాడలోని ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల్లో భారీ మొత్తంలో పట్టుబడిన రెక్టిఫైడ్ స్పిరిట్ (ఆర్ఎస్) దిగుమతి చేసుకోవటం ఇందుకు నిదర్శనం. రేపల్లె ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని తుమ్మల పంచాయతీ శివారు గాదెవారిపాలెంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం కోసమే ఆర్ఎస్ను తెప్పిస్తున్నట్టు రూఢీ అయినట్టే. గాదెవారిపాలెంలో నకిలీ మద్యానికి కీలకమైన పూర్ణిమ వైన్స్ లైసెన్సుదారుడు గుమ్మడి సాంబశివరావు, కిరణ్‌కుమార్ బినామీగా, నకిలీ మద్యం తయారీ సూత్రధారి అతడేనన్న లింకూ స్పష్టమైనట్టే. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు అక్కడ నుంచి విజయవాడకు ఆర్ఎస్ను తెప్పిస్తూ నకిలీ మద్యాన్ని యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఏజెంటు సాధుల ఆదిత్యను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు, అతడికి సప్లయి చేస్తున్న మహారాష్ట్ర స్మగ్లర్ వేటకు బయలుదేరి వెళ్లారు. పట్టిచ్చిన ఫోన్ కాల్ జాబితా... నకిలీ మద్యం సూత్రధారి తుమ్మల కిరణ్‌కుమార్‌కు డిపార్టుమెంటులో సంబంధాలు బలంగా ఉన్నాయి. నకిలీ మద్యం రాకెట్‌ను పట్టుకున్న రోజున, తెనాలి జూనియర్ అసిస్టెంట్ ఫోన్ కాల్ జాబితాను పరిశీలించిన అధికారులకు ఈ విషయం స్పష్టమైంది. అతడి నుంచి రేపల్లె సర్కిల్ కార్యాలయానికి దాదాపుగా అరవై కాల్స్ వెళ్లాయి. మళ్లీ అటువైపు నుంచి అదే సంఖ్యలో కాల్స్ ఇతడికీ వచ్చినట్టు తెలుసుకున్నారు. నకిలీ మద్యం సూత్రధారికి, సర్కిల్ కార్యాలయంతో ఉన్న అనుబంధంతోనే రెస్క్యూ కోసం పడరానిపాట్లు పడ్డారని ఫోన్ కాల్స్ జాబితా చెబుతోంది. పూర్వ భాగస్వామి సమాచారంతోనే..! తెనాలి జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్, దుగ్గిరాల సర్కిల్లో పని చేస్తూ ‘సిండికేట్ కింగ్’గా పేరు తెచ్చుకున్న కానిస్టేబుల్, తెనాలి డివిజనులో మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు. మద్యం వ్యాపారంలో వీరితో గత కాలంలో భాగస్వామిగా వ్యవహరించిన ఒకరి పక్కా సమాచారంతోనే తుమ్మల పంచాయతీ నకిలీ మద్యం రాకెట్‌ను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్/ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఛేదించగలిగారని సమాచారం. కొంచెం అప్రమత్తమైతే నాడే వెలుగులోకి.. కొల్లూరు మండలం క్రాపలో అనధికార దుకాణం పట్టుబడ్డ కేసును పట్టించుకున్నట్టయితే ఆనాడే నకిలీ మద్యం బాగోతం వెల్లడయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెనాలికి సమీపంలోని వేమూరులో లైసెన్సు దుకాణం నుంచి క్రాపలో అనధికార దుకాణం నడుపుతున్నారు. దుగ్గిరాల ఎక్సైజ్ సర్కిల్ పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడ 4–5 కేసుల మద్యం, బస్తా కొత్త మూతలు దొరికాయి. అక్కడ అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ప్రశ్నిస్తే, తెనాలి ఓవర్ బ్రిడ్జి దగ్గర్లోని వైన్స్‌లో పని చేసే శంకర్ అనే యువకుడు, తానూ కలిసి సీసాలకు మూతలు వేసి బెల్టు షాపులకు వేస్తున్నట్టు చెప్పాడు. దీనికి ముందు గతేడాది దుగ్గిరాల సర్కిల్లోని ఈమని గ్రామంలో టాస్క్‌ఫోర్స్ దాడిలో సుమారు 20 కేసుల మద్యం, బస్తా కొత్త మూతలు దొరికాయి. ఈ రెండు ఘటనల్లోనూ కీలకమైన యువకుడిని విచారిస్తే తుమ్మలకు చేరుతున్న ఆర్ఎస్, ఈ చివరకూ మద్యం రూపంలో అందుతోందని రూఢీ అయ్యేదనే వాదన ఉంది. తుమ్మల ఘటన తర్వాతనైనా అటుకేసి దృష్టి సారిస్తారో? లేదో? వేచి చూడాలి. -
సారొస్తారొస్తారు..!
ఎక్సైజ్ బదిలీల్లో ‘అడ్వాన్స్’ ఫిక్సింగ్! - ఓ సారు కోసం కీలక పోస్టు బ్లాక్ చేసిన వైనం - మార్కెట్లో రంగారెడ్డి, మెదక్ ఎక్సైజ్ డీసీ పోస్టులు సాక్షి, హైదరాబాద్: బస్సు, రైలు, సినిమా టికెట్లు రిజర్వ్ చేసుకొని బ్లాక్ చేస్తారని తెలుసు...కానీ ప్రభుత్వ పోస్టులను కూడా బ్లాక్ చేసి పెడతారని తెలుసా? ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం కాన్సెప్టులో అది సాధ్యమేనంటున్నారు పలువురు ఉద్యోగులు! జిల్లా ఎక్సైజ్ ఆదాయం పడిపోతున్నా, ఎక్సైజ్ నేరాలు పెరిగి పోతున్నా ఓ సారు కోసం డిప్యూటీ కమిషనర్ పోస్టును 6 నెలలుగా అట్టిపెట్టారు. ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్‌ల ఫిక్సింగ్‌కు ఇది పరాకాష్ట. ఎక్సైజ్ ఆదాయానికి రంగారెడ్డి కీలకం. ఎక్సైజ్ నేరాల రేటు– నకిలీ మద్యం, అక్రమ మద్యం(ఎన్డీపీఎల్) ఎక్కువగా ఉండేది ఇక్కడే. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి వీటిని నియంత్రిస్తుంటారు. 10–15 రోజులకు మించి ఈ పోస్టును ఖాళీగా ఉంచటం ప్రమాదకరం. అయినా 6 నెలలుగా ఈ పోస్టు ఖాళీగా ఉంటోంది. దీనికో ‘లెక్కుంది’.. తెలుగు రాష్ట్రాల్లోనే రంగారెడ్డి, మెదక్ ఎక్సైజ్ శాఖలో డీసీ పోస్టులకు విపరీతమైన క్రేజ్ ఉంది. రూ.లక్షల్లో ధర పలికే ఈ పోస్టును ఓ అధికారి కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రేజీ పోస్టు లోనే పనిచేస్తున్న ఆ అధికారి కోసం రంగారెడ్డి జిల్లా పోస్టును రిజర్వ్ చేసి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన వచ్చే వరకు ఆ స్థానాన్ని ఖాళీగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. 2 నెలల కిందట వరకు కేఏబీ శాస్త్రి, నర్సారెడ్డి ఇద్దరు డీసీలు ఖాళీగానే ఉన్నారు. నిబంధనల ప్రకారం ఈ ఇద్దరిలో ఒకరికి రంగారెడ్డి డీసీగా పోస్టింగ్ ఇవ్వొచ్చు. కానీ నర్సారెడ్డికి ఎక్సైజ్ అకాడమి డీసీగా పో స్టింగ్ ఇచ్చారు. మరో డీసీ కేఏబీ శాస్త్రికి పోస్టులు లేకుండా ఖాళీగా ఉంటున్నారు. విచిత్రం ఏమిటంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీసీ కార్యాలయాలు ఆబ్కారీ భవన్‌లోనే ఉన్నాయి. ఈ 2 పోస్టుల్లో ఏదీ ఖాళీ అయినా పక్కనే ఉన్న మరో డీసీగా ఇన్చార్జికి బాధ్యతలు అప్పగిస్తారు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లా (సంగారెడ్డి) డీసీకి ఇక్కడ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కాలక్రమంలో ఆయనకే ఫుల్ చార్జి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. -
జాతరలో నకిలీ మద్యానికి చెక్
పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, రెండు డిపోల ఏర్పాటు ఈసారి గిరిజనులకే అమ్మకాల లెసైన్ ములుగు : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో పోలీసు, ఎక్సైజ్ శాఖల సంయుక్త పర్యవేక్షణలో నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకుస్ సబర్వాల్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి సారిలా కాకుండా ఈసారి జాతరలో నకిలీ మద్యం, గుడుంబా అరికట్టేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్ జిలాల్ల నుంచి ఎన్డీపీ మద్యం తరలించేందుకు అవకాశమున్న గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా, ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అంతేకాకుండా ఏడు మొబైల్ బృందాలు, 11 చోట్ల చెక్‌పోస్టులు, 12 సెక్టోరియల్ టీంలు ఏర్పాటుచేయడమే కాకుండా, పోలీసు శాఖ సహకారంతో ఈసారి వాకీటాకీలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. జాతర సందర్భంగా బెల్లం విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, ములుగు, పరకాల, ఏటూరునాగారం, భూపాపల్లి, ములుగులో విస్తృత తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు. మద్యం అమ్మకాల కోసం గతంలో 22 షాపులకు తాత్కాలిక లెసైన్సులు ఇవ్వగా, ఈసారి స్థానిక గిరిజనులకే వారం పాటు అమ్మకాలకు లెసైన్సులు మంజూరు చేస్తామని అకున్ సబర్వాల్ వెల్లడించారు. మద్యం సరఫరాకు తాడ్వాయిలో ప్రధాన డిపో, రెడ్డిగూడెంలో మినీ డిపో ఏర్పాటుచేస్తామన్నారు. గత జాతరలో రూ.1.40కోట్ల మేర మద్యం విక్రయాలు జరగగా, ఈసారి రూ.2కోట్ల వరకు జరగొచ్చనే అంచనా ఉందని తెలిపారు. కాగా, జాతర ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ర్ట ఎకై ్సజ్ కమిషనర్ శుక్రవారం జిల్లాకు రానున్నారని ఆయన వివరించారు. సమావేశంలో ఓఎస్డీ శ్రీనివాస్‌రావు, మహబూబాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సాయిశేఖర్, ములుగు సీఐ ఇంద్రప్రసాద్, ఎస్సైలు మాన్సింగ్, సరిత తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మద్యం రాకెట్ గుట్టురట్టు
- నలుగురిని అరెస్టు చేసిన ఎన్ఫోర్సుమెంట్ - ముగ్గురు అనంతపురం వాసులు చిత్తూరు (అర్బన్): జిల్లాలో నకిలీ మద్యం విక్రయించే వారి గుట్టును ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్సుమెంటు అధికారులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో నలుగురు వ్యక్తులను జిల్లా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. గతనెల 24న పులిచెర్ల మండలం కె.కొత్తకోట వద్ద ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద 500 మద్యం బాటిళ్ల మూతలు, 43 నకిలీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకుని రామచంద్రానాయక్, క్రిష్ణానాయక్లను అరెస్టు చేశారు. అదేనెల 13న కుప్పంలో బాటిళ్లకు బిగించే 1.30 లక్షల మూతలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీ నం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలతో ఇక్కడ అంతర్రాష్ట్ర ముఠా ఉందని ప్రాథమిక ని ర్ధారణకు వచ్చిన జిల్లా డెప్యూటీ ఎక్సైజ్ కమిషనరు సత్యప్రసాద్ విచారణకు సీఐలు మోహన్‌కుమార్, వాసుదేవచౌద రి, సత్యనారాయణ, ఎస్ఐ మధుసూదన్‌నాయుడుతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. శనివారం అనంతపు రం జిల్లా కదిరిలో నలుగురు నిందితులను అరెస్టు చేసి, పలు విషయాలు రాబ ట్టారు. మద్యం దుకాణాల్లోని మద్యం బాటిళ్లకు ఉండే మూతలను జాగ్రత్తగా తొలగించి అందులో ఉన్న బ్రాండెడ్ మద్యాన్ని సగం తీసి, మరో ఖాళీ బాటిల్లోకి పోసి రెండు బాటిళ్లలో నీళ్లను కలుపుతారు. మళ్లీ బాటిల్‌కు తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న కొత్త మూతలను సీల్ చేసి దుకాణాల్లో ఉంచి మద్యం ప్రియులకు విక్రయిస్తామని అంగీకరించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన గేట్ నాగరాజ్ (28)ను ప్రధాన సూత్రధారిగా తేల్చారు. ఇతనిపై కర్ణాకటలో పలు కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతనితో పాటు అనంతపురం జిల్లా కదిరికి చెందిన వెంకటరమణ (25), ముంగుబ్బకు చెందిన జనార్దన్‌రెడ్డి (30), గోరంట్లకు చెందిన విజయభాస్కర్ (28)ను జిల్లా ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పాకాలకు చెందిన మద్యం దుకాణ యజమాని, గుమాస్తాపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం వ్యాపారుల గుండె గుబిల్లు
సాక్షిప్రతినిధి, అనంతపురం : మద్యం అమ్మకాల్లో సరికొత్త విధానానికి ఎక్సైజ్ శాఖ శ్రీకారం చుట్టింది. నకిలీ మద్యాన్ని నివారించే చర్యలకు ఉపక్రమించింది. నాణ్యతతో పాటు మద్యం తయారీ, అమ్మకాలపై పారదర్శకత పాటించేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. మద్యం సీసాలపై హోలోగ్రామ్‌లు వేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తె చ్చిపెడుతున్న ఎక్సైజ్ శాఖలో సరికొత్త విధానాలను అవలంభించడం ద్వారా సేవలను విస్తృతం చేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చనేది ఈ కొత్త పంథా ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త కంప్యూటర్ బిల్లింగ్, హోలోగ్రామ్ విధానం డిసెంబరు నుంచి అమలు చేసేందుకు కసరత్తు మొదలెట్టారు. ప్రతీ మద్యం దుకాణంలో ఆన్లైన్ కంప్యూటర్ బిల్లు ఇచ్చేందుకు పరికరాలను ఏర్పాటు చేస్తారు. సూపర్ మార్కెట్ తరహాలో మద్యం విక్రయించగానే కంప్యూటర్ స్క్రాచ్ ద్వారా బిల్లు వేసి, బిల్లు ప్రతిని కొనుగోలు దారుడికి అందజేయాలి. ఈ బిల్లు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎకై ్స జ్ కమిషనర్ కార్యాలయానికి చేరుతుంటాయి. ప్రతీ మద్యం సీసాపై హోలోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. దానిపై ఒక సీరియల్ నెంబర్‌ను ముద్రిస్తారు. ఆ నెంబర్‌కు సీసాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. బాటిల్‌పై ఓ టోల్‌ఫ్రీ నెంబరును ముద్రిస్తారు. తాను కొన్న మద్యం సీసా గురించి తెలుసుకోవాలనుకునే కొనుగోలుదారుడు సీసాపై ఉన్న టోల్‌ఫ్రీ నెంబరుకు ఎస్ఎంఎస్ పంపితే చాలు. ఆ సీసా ఎప్పుడు.. ఎక్కడ తయారు చేశారు.. ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది.. ఏ దుకాణానికి చేరింది.. అనే వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. అక్రమ ప్రవాహానికి అడ్డుకట్ట ప్రస్తుతం మద్యం సీసాలపై లేబుల్స్ ఉన్నాయి. కొందరు మాఫియా అవతారమెత్తి నకిలీ లేబుళ్లను తయారు చేసి, నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి మద్యాన్ని భారీగా దిగుమతి చేస్తున్నారు. కర్ణాటకలో మద్యం ధరలు తక్కువ. పైగా ట్యాక్స్ వెసులుబాటు ఉంటుంది. దీంతో మద్యం వ్యాపారులు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కొత్త విధానం ద్వారా వీటిని పూర్తిగా నివారించే అవకాశం ఉంది. నకిలీ మద్యంలో ప్రమాదకర రసాయనాల కారణంగా దాన్ని తాగిన వారు అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ప్రతీ నెలా 75 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కొత్త విధానం అమలైతే మద్యం మాఫియా ఆగడాలకు బ్రేక్‌పడుతుంది. కల్తీ, అక్రమ మద్యం సరఫరా నిలిచిపోతుంది. దీంతో ఎకై ్సజ్ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కొత్త విధానంపై మద్యం వ్యాపారులు గుర్రుగా ఉన్నారు. అయితే ఎకై ్సజ్ అధికారులు మాత్రం తమ పని సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. కాగా, తమ అదనపు ఆదాయం తగ్గుతుందని కొందరు అధికారులు దిగాలుగా ఉన్నారు. వ్యాపారులకు ముచ్చెమటలు ఆన్లైన్ విధానం అమలుపై మద్యం వ్యాపారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఎమ్మార్పీ కంటే 10-15 రూపాయల అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఆన్లైన్ బిల్లు అంటే ఇది కుదరదు. పైగా కంప్యూటర్ల కోసం 90 వేల రూపాయలు చెల్లించాలి. దీనికి కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేయలేకపోతే తామే కంప్యూటర్లను ఏర్పాటు చేస్తామని, ప్రతీ నెలా 5 వేల రూపాయలు అద్దె రూపంలో వసూలు చేస్తామని చెబుతోంది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లినా ఫలితం కనపడ లేదు. తాడిపత్రి, రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండలోని వ్యాపారులు సొంతంగా కొనుగోలు చేశారు. తక్కిన వ్యాపారులు అద్దె వాటిపై మొగ్గు చూపారు. డిసెంబరు 1 నుంచి అమలుకు కృషి డిసెంబరు 1నుంచి ఆన్లైన్, హోలోగ్రామ్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో 90 శాతం మద్యం దుకాణాలకు ఆన్లైన్ బిల్లింగ్ సామగ్రి ఏర్పాటు, మద్యం దుకాణాల నుంచి ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయానికి సాప్ట్వేర్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఒకవేళ డిసెంబర్ నుంచి అమలు చేయలేకపోతే, జనవరి నుంచి కొత్త విధానం కచ్చితంగా అమలు చేస్తాం. - జీవన్‌సింగ్, డిప్యూటీ కమిషనర్, ఎకై ్సజ్ శాఖ. -
నకిలీ.. మకిలీ
ప్రథమ పౌరుడి పదవీ పాట్లు సాక్షి, కర్నూలు: జిల్లా ప్రథమ పౌరుడు నకిలీ మద్యం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పదవిని కాపాడుకునేందుకు.. కేసు నుంచి బయటపడేందుకు టీడీపీ ముఖ్య నేతకు కోట్లాది రూపాయలు సమర్పించుకున్నట్లు ఆ పార్టీ వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. కేసు నమోదయ్యాక ఎక్సైజ్ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలో గడిపిన ఆయన.. జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పాల్గొన్న కార్యక్రమాల్లో మాత్రమే తారసపడ్డారు. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల్లో.. కలెక్టరేట్లో నిర్వహించే సమీక్ష సమావేశాల్లోనూ వేదికను అలంకరిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్య నేత భరోసాతోనే ఆయన జనజీవన శ్రవంతిలోకి వచ్చినట్లు పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. నకిలీ మద్యం కేసులో ఎ-5గా ఉన్న జెడ్పీ చైర్మన్ అరెస్టుకు ఎక్సైజ్ పోలీసులు మీనమేషాలు లెక్కిస్తుండటం వెనుక భారీగా డబ్బు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ కేసుతో జెడ్పీ ప్రతిష్ట మంటగలిసింది. ‘నకిలీ మద్యం వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేసుకోండని.. ఎలాంటి ఇబ్బందులొచ్చినా తాను అండగా నిలుస్తా’నంటూ స్వయంగా జెడ్పీ చైర్మన్ తమకు భరోసానిచ్చినట్లు ఆ కేసులో నిందితులుగా ఉన్న రామన్‌గౌడ్, ఉమామహేశ్వరగౌడ్‌లు పోలీసుల ఎదుట అంగీకరించారు. జెడ్పీ చైర్మన్ పీఏ రాజశేఖర్ సహకారంతో చైర్మన్‌ను కర్నూలులోని మౌర్యాఇన్ హోటల్లో కలిసినట్లు వారు స్పష్టం చేయడం తెలిసిందే. ఆ మేరకు పీఏపైనా ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టు తర్వాత చైర్మన్‌ను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కొందరు తక్షణమే రాజశేఖర్‌గౌడ్‌ను చైర్మన్ పదవి నుంచి తప్పించాలని.. లేకపోతే పార్టీ పరువు, ప్రతిష్ట దెబ్బతింటుందనే అభిప్రాయాన్ని అధినేత ముందుంచారు. రూ.4 కోట్లకు డీల్! వ్యయప్రయాసలకోర్చి జెడ్పీ పీఠం దక్కించుకున్న రాజశేఖరగౌడ్.. ఆ సంతోషం మూన్నాల్ల ముచ్చట కాకూడదనే ఉద్దేశంతో పదవిని కాపాడుకునేందుకు ముప్పుతప్పలు ఎదుర్కొంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఎంతో కష్టం మీద టీడీపీకే చెందిన ఓ ముఖ్యనేత, ఆయన సోదరుల ఆశీస్సులు పొందినట్లు తెలుస్తోంది. ఒక దశలో జెడ్పీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని వారు సూచించడంతో కాసుల బేరానికి దిగినట్లు సమాచారం. కేసు నుంచి తప్పించడమో.. లేదంటే అరెస్టు కాకుండా చూడటమో చేస్తే రూ.4కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు వినికిడి. ఆ తర్వాతే జెడ్పీ చైర్మన్ రాజశేఖరగౌడ్ అజ్ఞాతం వీడినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో నందికొట్కూరుకు చెందిన టీడీపీ నేత కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. డీల్‌కు సంబంధించిన మొత్తాన్ని కూడా ఆయనే సమకూర్చినట్లు సమాచారం. ఇదిలాఉంటే నకిలీ మద్యం కేసు నుంచి బయటపడేందుకు చైర్మన్ రాజశేఖర్‌గౌడ్ తన పీఏ రాజశేఖర్ అలియాస్ చిక్కా నాగశేఖరప్పను కూడా బలిపశువును చేసేందుకు వెనుకాడటం లేదని చర్చ కొనసాగుతోంది. -
మద్యం మత్తుకు పల్లెలు చిత్తు
దుబ్బాక: పల్లెల్లో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఫలితంగా పచ్చని సంసారాలు కూలిపోతున్నాయి. గ్రామాల్లో కూరగాయలను అమ్మినట్లుగా మద్యం బాటిళ్లను కూడా రాబోయే రోజుల్లో సారా.. బీపీ.. ఐబీ.. రాయల్ స్టాగ్ మద్యాన్ని కొంటారా అంటూ విక్రయించే పరిస్థితి నెలకొనే ప్రమాదం లేకపోలేదు. దుబ్బాక మండలంలోని 32 గ్రామాల్లో బెల్టు దుకాణాలు ‘మూడు పువ్వులు ఆరు కాయల్లాగా’ విరాజిల్లుతున్నాయి. గ్రామాల్లోని కల్లు వ్యాపారులు, హోటళ్లు, కిరాణా షాపుల్లో అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రతి పల్లెల్లో కనీసం 25 కుటుంబాలు మద్యం విక్రయాలు చేస్తున్నట్లు అంచనా. మండల కేంద్రంలోని మూడు వైన్స్ దుకాణాల యజమానులకు గ్రామాల్లోని మద్యం విక్రయదారులు ఎస్ఎంఎస్ చేస్తే చాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ద్విచక్ర, ఆటోలు, టాటా ఏసీ వాహనాల్లో మద్యాన్ని తరలిస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు మండల కేంద్రంలోని వైన్స్ వద్దకు వచ్చి మద్యం బాటిళ్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేనేలేదు. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో సైతం వైన్స్ యాజమానులు ఏర్పాటు చేసుకున్న మద్యం వాహనాలే దర్శనమిస్తున్నాయి. బెల్టు షాపుల్లో మద్యం తాగుతున్న గ్రామవాసులు పిట్టల్లా రాలిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 14 ఏళ్ల పిల్లవాడి నుంచి పండు ముసలివాళ్ల వరకు మద్యం మత్తులోపడి ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నారు. బెల్టు షాపులకు వచ్చే మందు అసల్దా లేకా నకిలీదా అన్న విషయం తెలియకుండానే పీకల దాకా తాగేవారున్నారు. ఇంట్లోని భార్యా పిల్లలను కొడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మద్యానికి బానిసలైన చాలా మంది యువకులు కాళ్లు చేతులు సన్నబడి, 20 ఏళ్లకే నెరిసిన జుత్తుతో 60 ఏళ్ల ముసలివారి అవతారం ఎత్తుతున్నారు. నకిలీ మద్యాన్ని పీకల దాకా తాగి రోగాల బారినపడి మరణిస్తున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. తాగిన మైకంలో ఆడవాళ్లపై అగాయిత్యాలకు పాల్పడడమే కాకుండా మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను నిర్వహించుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? వైన్స్‌లో విక్రయించకుండా బెల్టు షాపులకు సరఫరా చేయాలన్న ప్రభుత్వ అనుమతులేవైనా ఉన్నాయా? బెల్టు షాపులు నిర్వహించకుండా ప్రభుత్వ అంక్షలు ఏవైనా ఉన్నాయా? లేవా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తాగిన మైకంలో ఆడవాళ్లపై అగత్యాలు జరిగినా సంసారాలు కూలిపోతున్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇవేమి ఎక్సైజ్ అధికారులకు చెవికెక్కడం లేదు. అక్రమ మద్యం, బెల్టు షాపులను నిరోధించాల్సిన ఎక్సైజ్, పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతోనే పల్లెల్లో మద్యం ఏరులై పారుతోందన్న విమర్శలున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుని మద్యాన్ని విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టు
పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలంలో నకిలీ మద్యం తయారీ ముఠాను గంగవరం పోలీసులు పట్టుకున్నారు. దండపల్లె సమీపంలో గల జోగిండ్లు వద్ద ఓ కోళ్లఫారమ్‌లో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు చేశారు. రూ.8 లక్షల విలువజేసే నకిలీ మద్యం, తయారీ వస్తువులు, ఖాళీ బాటిళ్లు, క్యాన్లు, డ్రమ్ములు, ఓ కారును సీజ్ చేశారు. ప్రధానమైన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఎలా పట్టుబడ్డారంటే.. పెద్దపంజాణి పోలీసులు ఆదివారం రాత్రి బట్టందొడ్డి వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారులో నాలుగు కేసుల మద్యం కంటపడింది. ఆరా తీయగా అది నకిలీ మద్యమని తేలింది. కారులోని ఓ వ్యక్తి పరారుకాగా బద్రీ అనే వ్యక్తి చిక్కాడు. మద్యంతో పాటు కారును సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు బద్రీ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన గంగవరం సీఐ రామకృష్ణ తన సిబ్బందితో కలసి గంగవరం మండలంలోని దండపల్లె సమీపంలో గల జోగిండ్లు కోళ్లఫారమ్‌లో తయారవుతున్న నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు. సోమవారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 68 కేసుల మద్యం, తయారీ పరికరాలు సీజ్.. ఈ కోళ్లఫారమ్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న 68 కేసుల (3264 క్వార్టర్ బాటిళ్ల) మద్యం పట్టుకున్నారు. ఆరుబస్తాల్లో నిల్వ ఉన్న ఖాళీ క్వార్టర్ బాటిల్ సీసాలు, కార్క్‌లు (బిరడాలు), మద్యం తయారీకి వినియోగించే డ్రమ్ము, 35 లీటర్ల ఖాళీ క్యాన్లు 8, లేబుళ్లు (హైవార్డ్స్, ఓల్డ్టావెర్న్)లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం త యారీకి ఉపయోగించే రెక్టిఫైడ్ స్పిరిట్, బ్రాందీ, విస్కీ ఎసెన్స్‌లు, ఎక్సైజ్ శాఖకు చెందిన నకిలీ హోలోగ్రాఫిక్ లేబుల్స్ దొరికాయి. వీటిని స్టేషన్‌కు తరలించారు. ఎలా తయారు చేస్తున్నారంటే.. గంగవరానికి చెందిన బద్రీ ఆరు నెలల క్రితం జోగిండ్లుకు చెందిన జయమ్మ కోళ్లఫారాన్ని లీజుకు తీసుకున్నాడు. అందులో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. బెంగళూరుకు చెందిన రమేష్‌కుమార్‌తో పాటు కోలార్ ప్రాంతానికి చెందిన ఓ బ్యాచ్ దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తయారు చేసినా మద్యాన్ని స్థానికంగానే కాస్త తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. నెల క్రితం వచ్చిన కొత్త హోలోగ్రాఫిక్ లేబుల్స్తోనే.. గత నెల ఒకటో తేదీ ఎక్సైజ్ శాఖ కొత్త హోలోగ్రాఫిక్ లేబుల్స్‌తో మద్యం దుకాణాలకు సరుకును సప్లై చేసింది. ఆ హోలోగ్రాఫిక్ లేబుల్స్ ఇక్కడ దొరికిన నకిలీ మద్యంపై కనిపించాయి. నెల రోజుల వ్యవధిలోనే నకిలీ హోలోగ్రాఫిక్ లేబుల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేస్తున్నారు. గంగవరం, పలమనేరు పరిధిలోని మద్యం దుకాణాల్లో సైతం ఎన్ఫోర్స్మెంట్ సీఐ వాసుదేవచౌదరి తన సిబ్బందితో హోలోగ్రాఫిక్ లేబుల్క్ను తనిఖీ చేయడం గమనార్హం. స్థానిక ఎక్సైజ్ సీఐ నాగభూషణం సైతం కూపీ లాగే పనిలో ఉన్నారు. -
మద్యం నకిలీ బ్రాండ్ టీడీపీ!
పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా అధికార టీడీపీలోని వర్గపోరు నకిలీ మద్యం రాకెట్‌ను వెలుగులోకి తెచ్చింది. ప్రభుత్వం మనదే.. ప్రజాప్రతినిధులం మనమే.. ఇక మన జోలికి ఎవరొస్తారన్న ధీమాతో టీడీపీ నేతలు మద్యం రాకెట్‌కు ప్రాణప్రతిష్ఠ చేసి.. పొరుగునున్న ఒడిశా నుంచి నకిలీ మద్యాన్ని జిల్లాలోకి పారిస్తున్నారు. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందా అదే పార్టీలోని ప్రత్యర్థి వర్గానికి ఆయుధంగా మారింది. అంతే ఎక్సైజ్ శాఖకు ఉప్పందించారు. ఆ వెంటనే ఎక్సైజ్ ఉన్నతాధికారులు వేట మొదలుపెట్టడంతో నకిలీ రాకెట్ బండారం బద్దలైంది. శ్రీకాకుళం క్రైం: ఒడిశాకు అనుకొని ఉన్న జిల్లా సరి హద్దు ప్రాం తాల్లో గత రెం డు రోజులుగా ఎక్సైజ్ ఉన్నతాధికారులు జరుపుతు న్న విస్తృత దాడుల్లో పట్టుబడిన నకిలీ మద్యం నిల్వలు టీడీపీకి చెందిన మద్యం వ్యాపారులవని విశ్వసనీయంగా తెలిసింది. ఆ పార్టీలో ఉన్న అంతర్గత పోరు కారణంగా నకిలీ మద్యం రాకెట్ విషయంవెలుగులోకి వచ్చినా, అధికార పార్టీకి చెం దిన వ్యవహారం కావడంతో అనుకున్న స్థాయిలో మద్యం నిల్వలను పట్టుకోలేకపోయారు. ఏదేమైనా నకిలీ రాకెట్‌ను ఛేదిం చడం మాత్రం టీడీపీ, అధికార వర్గాల్లో కల కలం సృష్టిస్తోంది. బార్ కోడింగ్ స్టిక్కర్లూ నకిలీవే ఇచ్ఛాపురం కేంద్రంగా కొన్నాళ్లుగా నకిలీ మద్యం దందా జోరుగా సాగుతోంది. ఇటీవల సర్కారు ప్రవేశపెట్టిన బార్ కోడింగ్ స్టిక్కర్లు సైతం నకిలీవి సృష్టించి అసలు ఏదో.. నకిలీ ఏదో పోల్చుకోలేని విధంగా చెలామణీ చేస్తున్నారు. ఒడిశాలో తయారవుతున్న నకిలీ మద్యాన్ని చీకటి దారుల్లో ఇచ్ఛాపురానికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి టీడీపీ నేతలకు చెందిన, వారి సన్నిహితుల మద్యం షాపు ల్లో పెట్టి విక్రయాలు జరుపుతున్నారు. లాటరీ ద్వారా జరిపిన కేటాయింపుల్లో ఒడిశాకు చెందిన ఓ ఇద్దరు వ్యక్తులకు ఇచ్ఛాపురంలో మద్యం దుకాణాలు వచ్చాయి. అనపర్తికి చెందిన మరో ఇద్దరికి కూడా ఇక్కడే షాపులు దక్కా యి. వీరంతా టీడీపీకి చెం దిన వారే కావడంతో అంద రూ కలిసి నకిలీ మద్యం దందా మొదలుపెట్టినట్లు తెలిసింది. కాగా గతంలో ఇచ్ఛాపురంలో కొన్ని దుకాణాలు అనపర్తికి చెందిన వేరొకరికి వచ్చాయి. ఈసారి ఆ వర్గానికి దుకాణాలు దక్కకపోవటంతో, ప్రస్తుతం దుకాణాలు కైవసం చేసుకున్న వర్గంపై కన్నేశారు. నకిలీ వ్యవహారం గురించి తెలుసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి ద్వారా జిల్లాకు చెందిన కీలక టీడీపీ నేతను ఆశ్రయించి.. ఆయన ద్వారా ఎక్సైజ్ అధికారులకు ఉప్పందించడమే కా కుండా.. దాడులు జరిపి సరుకు స్వాధీనం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. పక్కా ప్రణాళికతో దాడులు ఈ సమాచారం అధారంగా ఎక్సైజ్ అధికారులు నకిలీ ముఠాపై నిఘా పెట్టారు. దాడులకుప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ విషయంలో విఫలమైతే ఆ కీలక నేత నుంచి ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో రెండు రోజులపాటు కసరత్తు చేసిన అనంతరమే మంగళవారం దాడులు జరిపారు. జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులందరూ ఉదయం నుంచి రాత్రి వరకు ఇచ్ఛాపురంలోనే తిష్ట వేసి దాడులను పర్యవేక్షించారు. ఎవరికీ అనుమానం రాకుండా జిల్లాలో ఉన్న ఎక్సైజ్ సిఐలు, ఎస్సైలతోపాటు సిబ్బందిని వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలకు పురమాయించారు. నకిలీ రాకెట్‌పై దాడి చేసే సమయానికి వారందరూ ఇచ్ఛాపురం వచ్చేలా ప్రణాళిక రచించి అమలు చేశారు. దీనికి ముందు నకిలీ మద్యాన్ని నిల్వ ఉంచిన ఓ ఇటుక బట్టీ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఓ వ్యక్తిని పం పారు. ఆ స్ధలంలో లారీ వెళ్లిన ఆనవాళ్లు కని పించడంతో అక్కడే మద్యం నిల్వలు ఉన్న ట్లు నిర్ధారణకు వచ్చారు. ఎక్కడికి వెళుతున్న దీ చెప్పకుండా.. సిబ్బంది అందరి సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించి ఒక్కసారిగా ఇటుకబట్టీ వద్దకు తీసుకువెళ్లి దాడులు చేపట్టారు. ఇంత చేసినా నకిలీ రాకెట్ నిర్వహకులకు విషయం తెలిసిపోయింది. దాంతో వారు చివరి క్షణంలో చాలా స్టాక్‌ను వేరే చోటుకు తరలించేసినట్లు తెలుస్తోంది. దీంతో పది కేసుల ఓసీ నిబ్ బాటిళ్లు మాత్రమే దొరికాయి. డీసీని ఇంటికి పిలిపించిన ప్రజాప్రతినిధి దాడుల్లో పట్టుబడిన నలుగురు మద్యం దుకాణాల యాజమానులను తప్పించే ప్ర యత్నంలో ఓ ప్రజాప్రతినిధి ఎక్సైజ్ డిప్యూ టీ కమిషనర్‌ను తన ఇంటికి పిలిపించి, 40 నిమిషాలు చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ నలుగురు వ్యక్తులు తమకు చెం దిన వారేనని ఎలాగైనా ఈ కేసు నుంచి తప్పించాలని కోరినట్టు తెలుస్తొంది. అయితే ఈ విషయంలో తన నిస్సహాయతను డీసీ ఆయనకు వివరించారు. అయితే పట్టుకున్నది ఒడిశా మద్యం అయినందున ఒడిశా అధికారులకు కేసును బదలాయిస్తే అక్కడ తాము చూసుకుంటామని ఆ ప్రజాప్రతినిధి సలహా ఇచ్చినట్లు తెలిసింది. మొత్తానికి రెండు వర్గాల టీడీపీ నేతల ఒత్తిళ్ల మధ్య ఈ కేసును ఎలా డీల్ చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బరంపురం ఎక్సైజ్ అధికారులకు అప్పగించాం దాడుల్లో దొరికిన మద్యం బరంపురానికి చెందినది కావడంతో కేసును బరంపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉదయ్‌కుమార్‌కు అప్పగించామని డీసీ నాగలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదన్నారు. ఈ దాడుల్లో అనుమానితులుగా పట్టుకున్న వారి పేర్లను బరంపురం ఎక్సైజ్ అధికారులకు తెలియజేశామని, ఇక్కడ కూడా విచారణ జరుపుతామని చెప్పారు. -
నకిలీ మద్యం తయారీ స్థావరంపై అర్ధరాత్రి పోలీసుల దాడి
పాల్వంచ రూరల్, న్యూస్‌లైన్: పాల్వంచ పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి నకిలీ మద్యం గుట్టు రట్టు చేశారు. జనావాసాల మధ్య గుట్టుగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తుండగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు రూ. 5లక్షల విలువైన కల్తీ మద్యంతో పాటు వివిధ కంపెనీలకు చెందిన బ్రాందీ, విస్కీ స్టిక్కర్లు, స్పిరిట్, ఖాళీ సీసాలు, రెండు ద్విచక్ర వామనాలు, రూ. 3800 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ఎస్సై షణ్ముఖచారి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని బొల్లోరిగూడెంలో సముద్రాల నాగేశ్వరరావు ఇంట్లో కొంత మంది ఓ గదిని అద్దెకు తీసుకుని కొంత కాలంఆ నకిలీ మద్యం తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా కల్తీ మద్యాన్ని తయారుచేసే స్పిరిట్, వివిధ కంపెనీలకు చెందిన లేబుల్స్ (స్టిక్కర్లు), విస్కీ, బ్రాంది స్టిక్కర్లు, ప్లాస్టిక్ బాటిళ్లలో నింపిన కల్తీ మద్యం, వేలాది ఖాళీ సీసాలు, నకిలీ సీసాలకు వినియోగించే సీల్ మూతలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం తయారుచేస్తున్న బాదె హేమాంబరదరరావు, ఇంటి యజమాని నాగేశ్వరరావులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరిద్దరితో పాటు బ్రాందీ షాపు యజమాని చావా శ్రీనివాసరావు, సాయి అనే మరో వ్యక్తిపై కేసు నమోదు చేశామని తెలిపారు. పరారీలో ఉన్న వీరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నకిలీ మద్యం తయారీ కేంద్రంగా పాల్వంచ... నకిలీ మద్యం స్థావరంపై పోలీసులు దాడిచేసి నకిలీ మద్యం సీసాలను పట్టుకోవడంతో పట్టణంలో కలకలం రేగింది. వివిధ కంపెనీలకు చెందిన ఒరిజినల్ మద్యాన్ని తలపించే విధంగా నకిలీ మద్యాన్ని తయారుచేస్తున్న సూత్రదారులు పోలీసుల అదుపులో ఉన్న వారేనా..? లేక వారి వెనుక బడా వ్యాపారులు ఎవరైనా ఉన్నారా..? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎంత కాలం నుంచి మద్యం విక్రయిస్తున్నారు..? కేవలం పాల్వంచలోనేనా.. ? లేక కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో కూడా విక్రయించారా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నకిలీ మద్యం పాల్వంచలో తయారు చేస్తుండడంతో ఈ ప్రాంత మద్యం ప్రియుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.