సారొస్తారొస్తారు..!
ఎక్సైజ్ బదిలీల్లో ‘అడ్వాన్స్’ ఫిక్సింగ్!
- ఓ సారు కోసం కీలక పోస్టు బ్లాక్ చేసిన వైనం
- మార్కెట్‌లో రంగారెడ్డి, మెదక్ ఎక్సైజ్ డీసీ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: బస్సు, రైలు, సినిమా టికెట్లు రిజర్వ్ చేసుకొని బ్లాక్ చేస్తారని తెలుసు...కానీ ప్రభుత్వ పోస్టులను కూడా బ్లాక్ చేసి పెడతారని తెలుసా? ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం కాన్సెప్టులో అది సాధ్యమేనంటున్నారు పలువురు ఉద్యోగులు! జిల్లా ఎక్సైజ్ ఆదాయం పడిపోతున్నా, ఎక్సైజ్ నేరాలు పెరిగి పోతున్నా ఓ సారు కోసం డిప్యూటీ కమిషనర్ పోస్టును 6 నెలలుగా అట్టిపెట్టారు. ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్‌ల ఫిక్సింగ్‌కు ఇది పరాకాష్ట. ఎక్సైజ్ ఆదాయానికి రంగారెడ్డి కీలకం. ఎక్సైజ్ నేరాల రేటు– నకిలీ మద్యం, అక్రమ మద్యం(ఎన్‌డీపీఎల్) ఎక్కువగా ఉండేది ఇక్కడే. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి వీటిని నియంత్రిస్తుంటారు. 10–15 రోజులకు మించి ఈ పోస్టును ఖాళీగా ఉంచటం ప్రమాదకరం. అయినా 6 నెలలుగా ఈ పోస్టు ఖాళీగా ఉంటోంది.
దీనికో ‘లెక్కుంది’..
తెలుగు రాష్ట్రాల్లోనే రంగారెడ్డి, మెదక్ ఎక్సైజ్ శాఖలో డీసీ పోస్టులకు విపరీతమైన క్రేజ్ ఉంది. రూ.లక్షల్లో ధర పలికే ఈ పోస్టును ఓ అధికారి కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రేజీ పోస్టు లోనే పనిచేస్తున్న ఆ అధికారి కోసం రంగారెడ్డి జిల్లా పోస్టును రిజర్వ్ చేసి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన వచ్చే వరకు ఆ స్థానాన్ని ఖాళీగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. 2 నెలల కిందట వరకు కేఏబీ శాస్త్రి, నర్సారెడ్డి ఇద్దరు డీసీలు ఖాళీగానే ఉన్నారు. నిబంధనల ప్రకారం ఈ ఇద్దరిలో ఒకరికి రంగారెడ్డి డీసీగా పోస్టింగ్ ఇవ్వొచ్చు. కానీ నర్సారెడ్డికి ఎక్సైజ్ అకాడమి డీసీగా పో స్టింగ్ ఇచ్చారు. మరో డీసీ కేఏబీ శాస్త్రికి పోస్టులు లేకుండా ఖాళీగా ఉంటున్నారు.
విచిత్రం ఏమిటంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీసీ కార్యాలయాలు ఆబ్కారీ భవన్‌లోనే ఉన్నాయి. ఈ 2 పోస్టుల్లో ఏదీ ఖాళీ అయినా పక్కనే ఉన్న మరో డీసీగా ఇన్‌చార్జికి బాధ్యతలు అప్పగిస్తారు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లా (సంగారెడ్డి) డీసీకి ఇక్కడ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కాలక్రమంలో ఆయనకే ఫుల్ చార్జి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.