‘మద్యం’తర సూచనలకు మంగళం
♦ హైవేలపై 100 మీటర్లలోపు ఉన్న బార్లను తొలగించాలన్న సుప్రీంకోర్టు సాధికార కమిటీ సూచనలు బేఖాతరు
♦ పాత నిబంధనల మేరకే మద్యం దుకాణాల రెన్యూవల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు, బార్లకు సంబంధించి సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ చేసిన సూచనలను ప్రభుత్వం పక్కన పెట్టింది. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా రాష్ట్ర, జాతీయ రహదారులకు వంద మీటర్లలోపు ఉన్న మద్యం దుకాణాలు, బార్లను తొలగించాలని సుప్రీం సాధికారిక కమిటీ గతంలో సూచించింది. అయితే, బార్లు, మద్యం దుకాణాలను యథాతథంగా కొనసాగించడమేగాక వచ్చే సంవత్సరానికి లెసైన్సులను పునరుద్ధరిం చాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో జూన్ నెలాఖరుకు ము గియనున్న 804 బార్ల లెసైన్సుల పునరుద్ధరణకు అడ్డంకులు తొలగిపోయాయి. అధికారికంగా ఉత్తర్వులు లేకున్నా గుట్టుచప్పుడు కాకుండా బార్లను రెన్యూవల్ చేయాలని ఉన్నతాధికార వర్గాలు ఎక్సైజ్ శాఖకు సూచించినట్లు సమాచారం.
న్యాయ సలహా మేరకే..
రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటైన సాధికారిక కమిటీ హైవేలకు 100 మీటర్లలోపు మద్యం విక్రయాలను అనుమతించవద్దని, ఇప్పుడున్న వాటిని వెంటనే మూసివేయాలని గత సెప్టెంబర్‌లో, డిసెంబర్‌లో ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ సుమారు వెయ్యికిపైగా మద్యం దుకాణాలు, బార్లకు నోటీసులు జారీ చేశారు. అయితే, ఎక్సైజ్ చట్టంలో హైవేలపై వంద మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకూడదనే నిబంధన లేదని మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించడంతో కథ మొదటికొచ్చింది. ముందు ఆ నిబంధనలను మార్చి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఎక్సైజ్ అధికారులు అడ్వకేట్ జనరల్‌ను ఆశ్రయించారు. ఎక్సైజ్ శాఖ నిబంధనలను పరిశీలించిన ఏజీ కార్యాలయం సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ సూ చనలు, సిఫారసులను పాటించాల్సిన అవసరం లేదని సర్కార్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం.
జూలై నుంచి కొత్త ఎక్సైజ్ సంవత్సరం..
ప్రతి ఏటా జూలైలో కొత్తగా ఎక్సైజ్ సంవత్సరం మొదలవుతుంది. కొత్త ఎక్సైజ్ పాలసీ, లెసైన్సుల పునరుద్ధరణ తదితరాలన్నీ ఆ నెల నుంచే ప్రారంభవుతాయి. అయితే ఈసారి బార్లు మాత్రమే జూన్ 30లోగా లెసైన్సులను రెన్యూవల్ చేయించుకోవలసి ఉంటుంది. దీంతో బార్ల యజమానులు ఎక్సైజ్ అధికారులను సంప్రదించగా సుప్రీంకోర్టు కమిటీ సిఫారసులను అమలు చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేయకపోవడంతో పాత పద్ధతిలోనే లెసైన్సుల రెన్యూవల్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని 804 బార్లు, 17 క్లబ్బుల్లో జూన్ నెలాఖరుకల్లా లెసైన్సులను పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. పాత నిబంధనల మేరకు అక్టోబర్‌లో మద్యం దుకాణాల రెన్యూవల్స్ చేయించుకోవలసి ఉంటుంది.