సర్కారుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో అవినీతి, అక్రమాలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం... ఐదు జిల్లాల్లో 85 మంది అవినీతి అధికారులను గుర్తించింది. వారిని వెంటనే అప్రాధాన్య ప్రాంతాలకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మద్యం ద్వారా అధిక ఆదాయం లభించే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పనిచేస్తున్న ఎక్సైజ్ అధికారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రహస్యంగా నిఘా పెట్టింది. ఈ ఐదు జిల్లాల్లోని ఐదుగురు ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో పాటు 24 మంది ఇన్‌స్పెక్టర్లు, 56 మంది సబ్ ఇన్‌స్పెక ్టర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో పాటు 10 మంది అధికారుల అవినీతి భారీ స్థాయిలో ఉన్నట్లు సమాచారం. లంచాలు తీసుకుని నాటుసారా తయారీని, నాన్ డ్యూటీ పెయిడ్(ఎన్‌డీపీ) లిక్కర్, కల్తీ కల్లు విక్రయాలను చూసీ చూడనట్లుగా వదిలేయడం, ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మకాలు, నిషేధిత రోజుల్లోనూ మద్యం విక్రయాలు, బెల్ట్‌షాపులను ప్రోత్సహించడం వంటి వాటికి అధికారులు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నివేదికను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ప్రభుత్వానికి నివేదించారు. ఈ అధికారులను ఆయా పోస్టుల నుంచి తప్పించి, అప్రాధాన్య స్థానాల్లో నియమించాలని ఐదు జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఆదేశించినట్లు సమాచారం. దీంతోపాటు వారిపై శాఖాపరమైన విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఇక మిగతా ఐదు జిల్లాల్లోనూ అవినీతి అధికారులపై నిఘా కొనసాగుతున్నట్లు సమాచారం.
ఆబ్కారీ శాఖలో 85 మంది అవినీతి అధికారులు
Published Thu, Apr 7 2016 2:48 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement