కొత్త డిస్టిలరీలు వచ్చేస్తున్నాయ్! | Increased demand in the state on Cheap liquor | Sakshi
Sakshi News home page

కొత్త డిస్టిలరీలు వచ్చేస్తున్నాయ్!

Published Sat, Dec 12 2015 5:16 AM | Last Updated on Mon, Aug 20 2018 2:21 PM

కొత్త డిస్టిలరీలు వచ్చేస్తున్నాయ్! - Sakshi

కొత్త డిస్టిలరీలు వచ్చేస్తున్నాయ్!

♦ రాష్ట్రంలో చీప్ లిక్కర్‌కు పెరిగిన డిమాండ్
♦ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయలేకపోతున్న ప్రస్తుత కంపెనీలు
♦ కొత్తగా దరఖాస్తు చేసుకున్న రెండు కంపెనీలు
♦ అందులో ఎంఎస్ డిస్టిలరీస్‌కు ఇప్పటికే అనుమతి మంజూరు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన మద్యం డిమాండ్‌కు అనుగుణంగా కొత్త డిస్టిలరీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తోంది. పల్లెలు, కార్మిక వాడల నుంచి గుడుంబాను తరిమికొట్టడంలో మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలు తాగే ఆర్డినరీ మద్యం (చీప్ లిక్కర్)కు డిమాండ్ పెరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో ఇప్పుడున్న కొన్ని డిస్టిలరీలు డిమాండ్‌కు అనుగుణంగా మద్యం(చీప్ లిక్కర్) ఉత్పత్తి చేయడం లేదు. దీంతో అనేక జిల్లాల్లో గుడుంబాకు ప్రత్యామ్నాయంగా మారిన చీప్ లిక్కర్‌కు కొరత ఏర్పడుతోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో నాలుగైదు జిల్లాలకు డిమాండ్‌కు సరిపడా చీప్ లిక్కర్‌ను అందించడంలో ఆబ్కారీ శాఖ విఫలమైంది.

ఈ పరిస్థితిని ముందే ఊహించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిస్టిలరీలకు నోటిఫికేషన్ జారీ చేయగా, భారీ ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. అలాగే ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు మరో రెండు కంపెనీలు దరఖాస్తు చేసుకొన్నాయి. వీటిలో సంవత్సరానికి 150 లక్షల ప్రూఫ్ లీటర్ల మద్యాన్ని అందించే లక్ష్యంతో మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఏర్పాటు చేయతలబెట్టిన ఎంఎస్ డిస్టిలరీస్‌కు ప్రభుత్వం ఈనెల మొదటి వారంలోనే అనుమతి మంజూరు చేసింది. అధునాతన యంత్రాలతో ఈ డిస్టిలరీ త్వరలోనే మద్యాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

అదనపు మద్యం ఉత్పత్తికి ముందుకొచ్చిన ఆర్.కె. డిస్టిలరీస్ (200లక్షల పీఎల్), రైజోమ్ డిస్టిలరీస్ (46 లక్షల పీఎల్)లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక 649 లక్షల ప్రూఫ్ లీటర్ల భారీ సామర్థ్యంతో సంగారెడ్డిలోనే అల్లయిడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ (ఏబీడీ) సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన పరిశ్రమ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. చీప్ లిక్కర్‌ను ఉత్పత్తిచేసే అతిపెద్ద డిస్టిలరీల్లో ఒకటైన ఏబీడీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే ‘ఆఫీసర్స్ ఛాయిస్’ బ్రాండ్ మద్యాన్ని ఉత్పత్తి చేస్తోంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా 5 సొంత ఉత్పత్తి యూనిట్లు ఉన్న ఈ కంపెనీ రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభిస్తే ఇతర మద్యం కంపెనీలకు దెబ్బ అనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్లు సమాచారం. ఏబీడీ కంపెనీ చీప్ లిక్కర్‌లో అనేక బ్రాండ్లను ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం ఏబీడీ సంస్థ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ కంపెనీకి కూడా అనుమతి మంజూరు అయ్యే అవకాశం  ఉందని ఉన్నతస్థాయి అధికార వర్గాలు తెలిపాయి.

 15 డిస్టిలరీలలో మద్యం ఉత్పత్తి ..
 రాష్ట్రంలో 17 డిస్టిలరీలు రిజిస్టర్ కాగా, అందులో 15 మాత్రమే మద్యం ఉత్పత్తి చేస్తున్నాయి. ఏటా 17.55 కోట్ల ప్రూఫ్ లీటర్ల సామర్థ్యంతో ఉన్న ఈ కంపెనీల్లో 550 లక్షల ప్రూఫ్ లీటర్ల సామర్థ్యం గల మల్కాజిగిరికి చెందిన ఓ కంపెనీ చీప్‌లిక్కర్ ఉత్పత్తిని తగ్గించింది. ఇలాగే మరో రెండు కంపెనీలు కూడా ‘చీప్’ తయారీని తగ్గించాయి. రాష్ట్రంలోని 15 డిస్టిలరీల్లో ఐదు కంపెనీల్లోనే చీప్ లిక్కర్ ఉత్పత్తి జరుగుతుండగా, వాటిలో కూడా ఉత్పత్తి తగ్గడంతో ఆ ప్రభావం జిల్లాలపై పడింది. గతంలో ప్రతి నెలా లక్షన్నర ప్రూఫ్ లీటర్ల  చీప్ లిక్కర్ రాష్ట్రంలోని మందుబాబుల అవసరాలను తీర్చేది. కాగా, గుడుంబాపై పోరు, గుడుంబా రహిత జిల్లాల ప్రకటనల నేపథ్యంలో అక్టోబర్ నుంచి నెలకు 3 లక్షల ప్రూఫ్ లీటర్లకు పైగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వడంతో పాటు ఇప్పుడున్న కంపెనీలు అదనపు ఉత్పత్తి చేసే అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
 
 మైక్రో బ్రూవరీలకు 50 దరఖాస్తులు
 గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు వరంగల్‌లో కూడా మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేసేందుకు మద్యం వ్యాపారులు అమితాసక్తి కనబరిచారు. డ్రాట్ బీరును ఉత్పత్తి చేసి, అక్కడే వినియోగదారులకు అందించే వీలు గల ఈ మైక్రో బ్రూవరీల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా, 50 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 49 దరఖాస్తులు జీహెచ్‌ఎంసీ నుంచే రాగా, ఒక దరఖాస్తు మాత్రం వరంగల్ నుంచి వచ్చింది. వీటి పరిశీలన ఇంకా పూర్తి కావలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement