ఇక ఎంఆర్‌పీతో పనిలేదు | No MRP Rates for Liqour InEluru Minister Constituency | Sakshi
Sakshi News home page

ఇక ఎంఆర్‌పీతో పనిలేదు

Published Wed, Dec 13 2017 11:02 AM | Last Updated on Wed, Dec 13 2017 11:02 AM

No MRP Rates for Liqour InEluru Minister Constituency - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : మంత్రిగారి జిల్లాలో ఎక్సైజ్‌ శాఖ అధికారులు రెచ్చిపోతున్నారు. తాము అడిగినంత ఇస్తే ఎంఆర్‌పీ ధరలకు అమ్మాల్సిన పనిలేదని పెంచి అమ్మకాలు చేసుకోవచ్చని అనధికారిక ఆదేశాలు జారీ చేశారు. మామూళ్లు ఇచ్చినందుకు నజరానాగా బుధవారం నుంచి చీప్‌లిక్కర్‌ క్వార్టర్‌ బాటిల్‌కు పది రూపాయలు, మిగిలిన బ్రాండ్లకు ఐదు రూపాయలు అదనంగా పెంచుకోవచ్చని అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఈ పెంపుదల జిల్లా వ్యాప్తంగా అమలులోకి రానుంది. ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెంలో షాపుకు పది వేల రూపాయల చొప్పున ఆగస్టు నుంచి వసూలు చేస్తున్నారు. ఈ నెల నుంచి మొత్తాన్ని రూ. 15 వేలకు పెంచారు. జిల్లాలో 474 వైన్‌షాపులు, 17 బార్లు ఉన్నాయి. వీటి నుంచి ఇకపై ప్రతి నెలా ఈ మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏప్రిల్‌లో మద్యం షాపులు కేటాయించినప్పుడు రెన్యువల్‌ మామూలు పేరుతో గ్రామీణ ప్రాంతాల షాపుల నుంచి 50 వేల రూపాయలు వసూలు చేశారు.

ఇప్పుడు పట్టణాలలో ఉన్న షాపుల వారు రెన్యువల్‌ మామూలు చెల్లించాలని ఎక్సైజ్‌ శాఖ నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. బార్ల నుంచి ఏకంగా లక్ష రూపాయల చొప్పున ఇండెంట్‌ వేసినట్లు తెలిసింది. బెల్ట్‌షాపులు ఉన్నా చూసీచూడనట్లు వ్యవహరించడానికి, ఎంఆర్‌పీ ధరలకు అమ్మకపోయినా పట్టించుకోకుండా ఉండటానికి ఈ మామూళ్లు నిర్ణయించారు. రెన్యువల్‌ పేరుతో వసూలు చేసే మొత్తం రెండున్నర కోట్ల రూపాయల వరకూ ఉండగా, ప్రతి నెలా మామూళ్ల పేరుతో రూ. 70 లక్షలకు పైగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాలలో వైన్‌షాపులు నడవాలంటే బెల్ట్‌షాపులు ఉండటం తప్పనిసరి. లేకపోతే వారికి గిట్టుబాటు కాదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల దందాకు శ్రీకారం చుట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్‌షాపుల నియంత్రణ పేరుతో హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎక్సైజ్‌ అధికారులు మొక్కుబడిగా కేసులు పెట్టారు. ప్రభుత్వ ఒత్తిడి కూడా ఆ శాఖ అధికారులకు కలిసి వచ్చింది.

దీన్ని అడ్డం పెట్టుకుని షాపులపై ఇండెంట్లు పెంచేశారు. ఇకపై ప్రతిషాపు యజమాని రూ. 15 వేల రూపాయలు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు సమాచారం. గతంలో ప్రతి షాపు నుంచి వసూలు చేసిన 10 వేల రూపాయలు సీఐ స్థాయి నుంచి డీసీ స్థాయి వరకే పంచుకుని, కింది సిబ్బందికి వాటా ఇవ్వకపోవడం ఆ శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కిందిస్థాయి సిబ్బందికి కూడా ఇవ్వడం కోసం మరో ఐదు వేలు పెంచి రూ 15 వేలు చేసినట్లు సమాచారం. జిల్లాలో ఆ  శాఖ ఉన్నతాధికారులు కూడా మూడేళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. బదిలీ కావాల్సి ఉన్నప్పటికీ సామాజిక వర్గ బలంతో కొందరు ఎమ్మెల్యేల మద్దతుతో వారు ఇక్కడే కొనసాగుతున్నారు. ఒక ఉన్నతాధికారి విదేశీ యాత్రకు వెళ్తూ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. మంత్రిగారి సొంత జిల్లాలోనే ఈ దందా జరుగుతుంటే ఆయన ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement