కల్తీ మద్యమే ఉసురు తీసింది!
♦ కల్తీకి పాల్పడుతున్న మద్యం మాఫియా
♦ పొరుగు రాష్ట్రాల నుంచి జోరుగా ఎన్డీపీ మద్యం
♦ ఎక్సైజ్ చెక్‌పోస్టుల్లో కేసులు నమోదు నామమాత్రమే
♦ ఎన్‘ఫార్సు’మెంట్‌గా తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారుల స్వార్థం అమాయకుల ఉసురు తీస్తోంది. మద్యం మాఫియా కల్తీకి పాల్పడుతున్నా.. కల్తీ మద్యం అమ్మకాలు చేపడుతున్నా ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంటు విభాగం చేష్టలుడిగి చూస్తోంది. బెల్టు షాపులు పుట్టగొడుగులు మాదిరి పుట్టుకొస్తున్నా.. ఈ షాపుల్లో సుంకం చెల్లించని మద్యం అమ్మకాలు చేపడుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా మొన్న అనంతపురంలో కల్తీ మద్యం తాగి ఇరువురు మరణించగా, సోమవారం విజయవాడలో ఐదుగురు దినసరి కూలీలు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో తెల్లవారు జామునే మద్యం అమ్మకాలు చేస్తున్నారనేందుకు విజయవాడలో ఉదయం 10.30 గంటలకే మద్యం తాగి మరణించిన సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది.
కల్తీ మద్యంతో పాటు సమయపాలన లేని అమ్మకాలు అరికట్టాల్సిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంటు విభాగం మామూళ్ల మత్తులో జోగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించని మద్యం (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) భారీగా దిగుమతి అవుతున్నా స్టేట్ టాస్క్‌ఫోర్సు విభాగం (ఎస్టీఎఫ్) చేష్టలుడిగి చూస్తోందని తెలుస్తోంది. కల్తీ మద్యం సరిహద్దులు దాటి వస్తున్నా ఎక్సైజ్ చెక్‌పోస్టుల్లో పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది.
అక్రమ మద్యం ఎలా చేరుతుందంటే...
కర్ణాటక, తమిళనాడు, యానాంల నుంచి సరఫరా అవుతున్న ఎన్డీపీ మద్యం విక్రయాలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలిరాకుండా ఉండేందుకు ఎకై ్సజ్ శాఖ మొత్తం 39 చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేసింది. వీటిలో రాష్ట్ర విభజన తర్వాత ఒక్క తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కొత్తగా 14 చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేసింది. అయినా వీటి నిర్వహణ మాత్రం మొక్కుబడిగానే సాగుతోంది. రాష్ట్రంలోకి అక్రమ మద్యం ప్రవేశిస్తుందని ఎకై ్సజ్ శాఖకు పూర్తి సమాచారమున్నా, కేసులు నమోదు, వాహనాల సీజ్ మాత్రం అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు అక్రమ మద్యంపై నమోదైన కేసులు, ఎన్ని వాహనాలు సీజ్ చేశారనే సమాచారం ఎక్సైజ్ శాఖ వద్ద లేకపోవడమే ఇందుకు నిదర్శనం. యానాం నుంచి ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు, తమిళనాడు నుంచి చిత్తూరు, నెల్లూరు, కర్ణాటక నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలకు అక్రమ మద్యాన్ని సిండికేట్లు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చీప్ లిక్కర్ కొరత ఉండటంతో దీన్ని అవకాశంగా తీసుకుని దిగుమతి చేసుకున్న చీప్ లిక్కర్‌లో కల్తీకి పాల్పడుతున్నారు.
చెక్‌పోస్టుల్లో తనిఖీలేవీ?
మద్యం డిమాండ్‌ను బట్టి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మద్యం సరఫరా అవుతుంది. ఈ మద్యం సరఫరా చేసుకునేందుకు ట్రూ ట్రాన్స్‌పోర్టు పర్మిట్లు కేటాయిస్తారు. వీటిని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేస్తారు. ఏపీలో ఐదు అంతరాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. వీటిని ట్రాన్స్‌పోర్టు, కమర్షియల్ ట్యాక్స్ తదితర శాఖలతో కలిసి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులుగా నిర్వహిస్తున్నారు. ఈ ట్రూ ట్రాన్స్‌పోర్టు పర్మిట్లను అడ్డుపెట్టుకుని మద్యం మాఫియా ఎన్డీపీ మద్యం దిగుమతి చేసుకుంటోంది. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్లతో చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టడం లేదని విమర్శలున్నాయి.