మద్యం మత్తుకు పల్లెలు చిత్తు
దుబ్బాక: పల్లెల్లో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఫలితంగా పచ్చని సంసారాలు కూలిపోతున్నాయి. గ్రామాల్లో కూరగాయలను అమ్మినట్లుగా మద్యం బాటిళ్లను కూడా రాబోయే రోజుల్లో సారా.. బీపీ.. ఐబీ.. రాయల్ స్టాగ్ మద్యాన్ని కొంటారా అంటూ విక్రయించే పరిస్థితి నెలకొనే ప్రమాదం లేకపోలేదు. దుబ్బాక మండలంలోని 32 గ్రామాల్లో బెల్టు దుకాణాలు ‘మూడు పువ్వులు ఆరు కాయల్లాగా’ విరాజిల్లుతున్నాయి.
గ్రామాల్లోని కల్లు వ్యాపారులు, హోటళ్లు, కిరాణా షాపుల్లో అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రతి పల్లెల్లో కనీసం 25 కుటుంబాలు మద్యం విక్రయాలు చేస్తున్నట్లు అంచనా. మండల కేంద్రంలోని మూడు వైన్స్ దుకాణాల యజమానులకు గ్రామాల్లోని మద్యం విక్రయదారులు ఎస్‌ఎంఎస్ చేస్తే చాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ద్విచక్ర, ఆటోలు, టాటా ఏసీ వాహనాల్లో మద్యాన్ని తరలిస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు మండల కేంద్రంలోని వైన్స్ వద్దకు వచ్చి మద్యం బాటిళ్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేనేలేదు.
మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో సైతం వైన్స్ యాజమానులు ఏర్పాటు చేసుకున్న మద్యం వాహనాలే దర్శనమిస్తున్నాయి. బెల్టు షాపుల్లో మద్యం తాగుతున్న గ్రామవాసులు పిట్టల్లా రాలిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 14 ఏళ్ల పిల్లవాడి నుంచి పండు ముసలివాళ్ల వరకు మద్యం మత్తులోపడి ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నారు. బెల్టు షాపులకు వచ్చే మందు అసల్దా లేకా నకిలీదా అన్న విషయం తెలియకుండానే పీకల దాకా తాగేవారున్నారు. ఇంట్లోని భార్యా పిల్లలను కొడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
మద్యానికి బానిసలైన చాలా మంది యువకులు కాళ్లు చేతులు సన్నబడి, 20 ఏళ్లకే నెరిసిన జుత్తుతో 60 ఏళ్ల ముసలివారి అవతారం ఎత్తుతున్నారు. నకిలీ మద్యాన్ని పీకల దాకా తాగి రోగాల బారినపడి మరణిస్తున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. తాగిన మైకంలో ఆడవాళ్లపై అగాయిత్యాలకు పాల్పడడమే కాకుండా మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
గ్రామాల్లో బెల్టు షాపులను నిర్వహించుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? వైన్స్‌లో విక్రయించకుండా బెల్టు షాపులకు సరఫరా చేయాలన్న ప్రభుత్వ అనుమతులేవైనా ఉన్నాయా? బెల్టు షాపులు నిర్వహించకుండా ప్రభుత్వ అంక్షలు ఏవైనా ఉన్నాయా? లేవా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తాగిన మైకంలో ఆడవాళ్లపై అగత్యాలు జరిగినా సంసారాలు కూలిపోతున్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇవేమి ఎక్సైజ్ అధికారులకు చెవికెక్కడం లేదు.
అక్రమ మద్యం, బెల్టు షాపులను నిరోధించాల్సిన ఎక్సైజ్, పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతోనే పల్లెల్లో మద్యం ఏరులై పారుతోందన్న విమర్శలున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుని మద్యాన్ని విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.