Wines stores
-
ఎనీ టైం.. మందు ఫుల్!
సిటీలో మద్యం విక్రయాలకు వేళాపాళా లేకుండా పోయింది. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి...తెల్లవారుజాము వరకు ఎనీటైం యథేచ్ఛగా మద్యం దొరుకుతోంది. తాగి ఊగే మందుబాబులకు ప్రధాన వీధుల్లో ఉన్న వైన్ షాపులు, బార్లు అడ్డాగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకే లిక్కర్ అమ్ముతున్నారు. వాస్తవంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం షాపులకు అనుమతి ఉంది. కానీ చాలా చోట్ల రెండు గంటల ముందే తెరవడం..అర్ధరాత్రి దాటాక మూసివేయడం చేస్తున్నారు. నిబంధనలు పాటించని, షాపులపై కొరడా ఝళిపించాల్సి ఉన్నా...అలాంటి దాఖలాలు లేవు. మంగళవారం సాక్షి క్షేత్రస్థాయిలో వైన్ షాపులు, బార్ల వద్ద పరిస్థితులను పరిశీలించగా ఈవిషయాలు వెల్లడయ్యాయి. సాక్షి, సిటీబ్యూరో/సాక్షి నెట్వర్క్: గ్రేటర్లో వేళాపాళా లేకుండా తాగుతూ.. ఊగుతున్న మందుబాబులకు ప్రధాన వీధుల్లో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు అడ్డాలుగా మారుతున్నాయి. ప్రధాన రహదారులు, సమీప కాలనీలు, బస్తీల్లో మందుబాబుల ఆగడాలు శృతిమించుతుండడంతో మహిళలు, విద్యార్థినులు, పాదచారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు) సుమారు 400 మద్యం దుకాణాలు, 500 బార్లు ఉన్నాయి. ఏటా సుమారు రూ.2 వేల కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. యేటికేడాది వీటి విలువ 15–20 శాతం పెరుగుతోంది. ఆబ్కారీ శాఖ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు. బార్లను ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. అయితే పలు మద్యం దుకాణాలు ఉదయం 9 గంటలకు తెరుచుకోవడంతో పాటు రాత్రి 1 గంట వరకు అమ్మకాలు జరుగుతున్నాట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ప్రధాన శివార్లలో ఇదే పరిస్థితి నెలకొంది. బార్లు అర్ధరాత్రి 2 గంటల వరకు తెరచి ఉండటం గమనార్హం. అయితే ఆబ్కారీ శాఖ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.మందుబాబుల ఆగడాలు శృతి మించినపుడు స్థానికులు ఫిర్యాదు ఇచ్చినపుడే ఆబ్కారీ, పోలీసుల విభాగాలు హడావుడి చేస్తున్నాయి. అరకొర జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు.ఎక్కడా లైసెన్సులు రద్దు చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. సమయపాలన, పార్కింగ్, పర్మిట్ రూమ్‌ల నిబంధనలు పాటించని దుకాణాలు, బార్లపై చర్యలు లేకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన అంశాలివీ... ఎల్బీనగర్, మలక్‌పేట్ నియోజకవర్గాల పరిధిలో.. దిల్సుఖ్నగర్ నుంచి చాదర్‌ఘాట్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న వైన్‌షాపులు, బార్ల యజమానులు నియమ, నిబంధనలను ఖాతరు చేయడం లేదు. పలుదుకాణాలను ఉదయం 9 గంటలకే తెరుస్తుండడం గమనార్హం. దిల్సుఖ్నగర్ బస్‌డిపో సమీపంలోని వైన్‌షాప్ ఉదయం 9 గంటలకే తెరుచుకోగా. మలక్‌పేట్ యశోద ఆస్పత్రి పక్కన ఉన్న వైన్‌షాపు 9.30 గంటలకు తెరిచి యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారు. కొన్ని వైన్‌షాపుల యజమానులు షాపుల వెనుక వైపు నుంచి ఉదయం 8 గంటల నుంచే మద్యం విక్రయాలు జరుపుతున్నారు. మైనర్లకు సైతం మద్యం విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. దిల్సుఖ్నగర్ బస్టాప్ సమీపంలో దేవాలయానికి ఆనుకునే మద్యం దుకాణం ఏర్పాటు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.కొన్ని మద్యం షాపుల యజమానులు సర్వీస్ రోడ్లపైనే పార్కింగ్‌ను ఏర్పాటు చేసి బహిరంగంగా మద్యం విక్రయిస్తున్నారు. కుత్బుల్లాపూర్‌లో... నియోజకవర్ పరిధిలో మందుబాబుల ఆగడాలకు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. కుత్బుల్లాపూర్ పరిధిలో పలు వైన్ షాపులు నిబంధనలను పట్టించుకోవడం లేదు.మద్యం దుకాణాలకు ఆనుకొని ఉన్న పర్మిట్ రూమ్‌లను నిబంధనలకు విరుద్ధంగా సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసి మందుబాబులకు అడ్డాగా తీర్చిదిద్దుతున్నారు. పలు దుకాణాల వద్ద మైనర్లే పనులు చేస్తూ కనిపించారు. సుచిత్రా నుంచి కొంపల్లి రూట్లో మద్యం షాపుల వద్ద అక్రమ పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చింతల్, కుత్బుల్లాపూర్ గ్రామం సర్కిల్ కార్యాలయం రోడ్డు, గాజులరామారం రోడ్డులోని వైన్స్ వద్ద నడి రోడ్డుపైనే మందుబాబులు మద్యం సేవిస్తూ కనిపిస్తున్నారు. నాంపల్లి.. ఆబిడ్స్‌లో.. సమయ పాలన పాటించకుండా తమ ఇష్టానుసారంగా మద్యం దుకాణాలను కొనసాగిస్తున్నారు. ఆబిడ్స్ జోన్ పరిధిలోని పురానాపూల్, జియాగూడ, జుమేరాత్ బజార్, కోఠి, ఎగ్జిబిషన్ గ్రౌండ్, గుడి మల్కాపూర్ తదితర ప్రాంతాలలోని పలు మద్యం దుకాణాల వద్ద ఇదే దుస్థితి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద నున్న ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఉదయం 8 గంటల నుంచే దొడ్డి దారిన తెరిచి విక్రయాలు కొనసాగించడం గమనార్హం. మద్యంతో పాటు తాటి, ఈత కల్లులను కూడా ఒకే ఆవరణలో విక్రయిస్తున్నారు. పురానాపూల్ చౌరస్తాలోని ఓ వైన్ షాప్ ఉదయం 9.15 గంటలకే తెరిచి విక్రయాలు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లోని పలు వైన్స్‌లు, బార్లలో పార్కింగ్ సదుపాయం లేక రోడ్లపైనే మందుబాబులు వాహనాలు నిలుపుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సికింద్రాబాద్‌లో... సికింద్రాబాద్‌లోని పలు వైన్ షాపులు, బార్ల ముందు ఉన్న ప్రధాన రహదారులు వాహనాల పార్కింగులతో నిండిపోయాయి. చిలకలగూడలోని దీంతో ఈ రోడ్డులో తరచూ ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. బౌద్ధనగర్ వారాసీగూడ చౌరస్తాలోని ఓ వైన్ షాపు ముందు ఇదే పరిస్థితి. అసలే ఇరుకైన రోడ్డు దానికి తోడు వాహనాల పార్కింగులతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. -
కాస్టిలీ బాటిల్...చీప్ మిక్సింగ్!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: 28.01.2018: వీరఘట్టంలో జనాతా వైన్స్ పేరుతో నిర్వహిస్తోన్న దుకాణంలో కల్తీ మద్యం వెలుగుచూసింది. బ్రాండెడ్ మద్యం బాటిళ్ల మూతలను పోలిన నకిలీ మూతలను హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున తయారీ చేయించి తీసుకొచ్చినట్లు ఆధారాలు దొరికాయి. 01.02.2018: ఆమదాలవలస పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు సమీపంలో బెల్ట్‌షాప్‌పై టాస్క్‌ఫోర్స్ అధికారులు చేశారు. అక్కడ దొరికిన మద్యం బాటిళ్లపై ఉన్న కోడ్ నంబర్లు ఆధారంగా ఆరా తీశారు. ఆ సరుకు సమీపంలోని రవితేజ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి వచ్చినట్లు తేలింది. అంతేకాదు ల్యాబ్‌లో తనిఖీ చేయిస్తే కల్తీ మద్యం అని రూఢీ అయ్యింది. దీంతో ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు ఈ నెల 15వ తేదీన సీజ్ చేశారు. రాజధాని స్థాయిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్తేనో, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేస్తేనో ఈ రెండు అక్రమ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి! అసలే మద్యం మహమ్మారి ఇల్లూ ఒళ్లూ గుల్ల చేస్తుంటే మరోవైపు చాపకింద నీరులా కల్తీ మద్యం మరింత ప్రమాదకర స్థాయిలో పట్టణాల్లో, గ్రామాల్లో విస్తరిస్తోంది. గత నెల రోజు వ్యవధిలోనే 11 మద్యం దుకాణాలను ఇదే కారణంతో సీజ్ చేశారంటే పరిస్థితి ఊహించవచ్చు. ఈ కల్తీ భూతం విస్తరణకు బెల్ట్‌షాపులే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. నెల రోజుల్లో 210 బెల్ట్‌షాపులపై దాడులు చేసి 192 మంది నిర్వాహకులను ఎక్సైజ్ శాఖ అధికారుల అదుపులోకి తీసుకున్నా ఏమాత్రం నకిలీ మద్యం జోరు తగ్గట్లేదు. ఈ అక్రమార్కులకు అధికార పార్టీ నాయకుల నుంచి అండదండలు పుష్కలంగా ఉండటమే దీనికికారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న విపరీత ధోరణిపై విమర్శలు వస్తున్నా తీరు మారట్లేదు! చంద్రబాబు సంతకం చేసినా.... బెల్ట్ షాపులు మూసేయిస్తానని చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తొలిరోజే చేసిన సంతకం చెల్లుబాటు కావట్లేదు! బెల్ట్‌షాపులు మూతపడలేదు సరికదా కల్తీ మద్యం అక్రమాలకు కేంద్రాలుగా మారాయి. అక్రమార్కులు బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో చీప్‌లిక్కర్, తక్కువ ఖరీదు మద్యం కల్తీ చేసి నకిలీ మూతలను టాంపరింగ్ చేస్తున్నారు. ఈ సరుకు బెల్ట్‌షాపులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో కోటబొమ్మాళి, శ్రీకాకుళం, పాతపట్నం కూడా భారీఎత్తున నకిలీ మూతలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ మూతల రంగు, టైటిల్, లెటరింగ్, లేబుళ్లు... అన్నీ మక్కీకిమక్కీగా రూపొందిస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఈ నకిలీ మూతల తయారీకే ఒక పరిశ్రమ నడుస్తోందన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. మూతకు రూపాయి చొప్పున కొనుగోలు చేస్తున్న వ్యాపారులు జిల్లాకు తీసుకొచ్చి మద్యం అక్రమార్కులకు రూ.3 నుంచి రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. షాపుల్లో, ఇళ్లల్లో కల్తీ.. టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో పట్టుబడిన నకిలీ మూతలను బట్టిచూస్తే మద్యం కల్తీ అంతా వైన్ షాపుల్లో లేదంటే అక్రమార్కుల ఇళ్లల్లో జరుగుతుందనే విషయం తేటతెల్లమవుతోంది. జిల్లాలో 239 మద్యం దుకాణాలు, 17 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిద్వారా మద్యం అమ్మకాలు నెలకు సగటున రూ.60 కోట్ల వరకూ జరుగుతున్నాయి. మరోవైపు దుకాణానికి నెలనెలా రూ.50 వేల చొప్పున అధికార పార్టీలో కీలక నాయకుడి అనుచరులు మామ్మూళ్లు వస్తున్నారు. వీటన్నింటికీ తోడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తాపత్రయంతో వైన్‌షాపుల నిర్వాహకులు కొందరు బ్రాండెడ్ మిక్సింగ్‌కు తెగిస్తున్నారు. బ్రాండెడ్ మద్యం బాటిళ్ల మూతలను తొలగించి అందులోనుంచి కొంత మద్యం తీసేస్తున్నారు. ఆ మేరకు తక్కువ ఖరీదు మద్యం, చీప్ లిక్కర్ కల్తీ చేస్తున్నారు. కొన్నిచోట్ల నీళ్లు కలిపేస్తున్నారు. ఇటీవల రాజాంలో ఈ తరహా ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాటిళ్లకు నకిలీమూతలను బిగించేసి యథావిధిగా నకిలీ సీళ్లనే వేసేస్తున్నారు. ఈ కల్తీ సరుకు విక్రయాలు బెల్ట్‌షాపుల్లో జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో బెల్ట్‌షాపుల్లో విక్రయాలు ఎక్కువగా రాత్రిపూట జరుగుతున్నాయి. వెలుతురు సరిగా లేని ఆ దుకాణాల్లో నకిలీ మూతలను మందుబాబులు గుర్తించలేకపోతున్నారు. ఈ కల్తీ మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యమే కారణమా? కల్తీ మద్యం వ్యవహారాలను అరికట్టేందుకు తరచుగా తనిఖీలు నిర్వహించాలి. వైన్‌షాపుల్లో మద్యం శాంపిళ్లు తీసి ల్యాబ్‌ల్లో పరీక్ష చేయించాలి. మరోవైపు నకిలీమూతల తయారీదారులు, పంపిణీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడే మద్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్సైజ్ శాఖలో ఈ తరహా చర్యలు కనిపించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలు, మామూళ్ల వ్యవహారాలే ఈ అలక్ష్యానికి కారణమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబరు 3వ తేదీన సాక్షాత్తూ జిల్లా ఎక్సైజ్ శాఖ ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ ఎం.శివప్రసాద్ ఇంట్లోనే ఏసీబీ అధికారులు రూ.4.50 లక్షల భారీ మొత్తాన్ని పట్టుకున్న వ్యవహారమే దీనికి పరాకాష్ట. గతంలో జిల్లా కలెక్టరుగా పనిచేసిన ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కమిషనర్ పి.లక్ష్మీనరసింహం కార్యాలయానికి కూడా జిల్లాలో అక్రమ మద్యం వ్యవహారాలపై ఫిర్యాదులు వెళ్తున్నట్లు తెలిసింది. -
మద్యం మత్తుకు పల్లెలు చిత్తు
దుబ్బాక: పల్లెల్లో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఫలితంగా పచ్చని సంసారాలు కూలిపోతున్నాయి. గ్రామాల్లో కూరగాయలను అమ్మినట్లుగా మద్యం బాటిళ్లను కూడా రాబోయే రోజుల్లో సారా.. బీపీ.. ఐబీ.. రాయల్ స్టాగ్ మద్యాన్ని కొంటారా అంటూ విక్రయించే పరిస్థితి నెలకొనే ప్రమాదం లేకపోలేదు. దుబ్బాక మండలంలోని 32 గ్రామాల్లో బెల్టు దుకాణాలు ‘మూడు పువ్వులు ఆరు కాయల్లాగా’ విరాజిల్లుతున్నాయి. గ్రామాల్లోని కల్లు వ్యాపారులు, హోటళ్లు, కిరాణా షాపుల్లో అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రతి పల్లెల్లో కనీసం 25 కుటుంబాలు మద్యం విక్రయాలు చేస్తున్నట్లు అంచనా. మండల కేంద్రంలోని మూడు వైన్స్ దుకాణాల యజమానులకు గ్రామాల్లోని మద్యం విక్రయదారులు ఎస్ఎంఎస్ చేస్తే చాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ద్విచక్ర, ఆటోలు, టాటా ఏసీ వాహనాల్లో మద్యాన్ని తరలిస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు మండల కేంద్రంలోని వైన్స్ వద్దకు వచ్చి మద్యం బాటిళ్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేనేలేదు. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో సైతం వైన్స్ యాజమానులు ఏర్పాటు చేసుకున్న మద్యం వాహనాలే దర్శనమిస్తున్నాయి. బెల్టు షాపుల్లో మద్యం తాగుతున్న గ్రామవాసులు పిట్టల్లా రాలిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 14 ఏళ్ల పిల్లవాడి నుంచి పండు ముసలివాళ్ల వరకు మద్యం మత్తులోపడి ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నారు. బెల్టు షాపులకు వచ్చే మందు అసల్దా లేకా నకిలీదా అన్న విషయం తెలియకుండానే పీకల దాకా తాగేవారున్నారు. ఇంట్లోని భార్యా పిల్లలను కొడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మద్యానికి బానిసలైన చాలా మంది యువకులు కాళ్లు చేతులు సన్నబడి, 20 ఏళ్లకే నెరిసిన జుత్తుతో 60 ఏళ్ల ముసలివారి అవతారం ఎత్తుతున్నారు. నకిలీ మద్యాన్ని పీకల దాకా తాగి రోగాల బారినపడి మరణిస్తున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. తాగిన మైకంలో ఆడవాళ్లపై అగాయిత్యాలకు పాల్పడడమే కాకుండా మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను నిర్వహించుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? వైన్స్‌లో విక్రయించకుండా బెల్టు షాపులకు సరఫరా చేయాలన్న ప్రభుత్వ అనుమతులేవైనా ఉన్నాయా? బెల్టు షాపులు నిర్వహించకుండా ప్రభుత్వ అంక్షలు ఏవైనా ఉన్నాయా? లేవా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తాగిన మైకంలో ఆడవాళ్లపై అగత్యాలు జరిగినా సంసారాలు కూలిపోతున్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇవేమి ఎక్సైజ్ అధికారులకు చెవికెక్కడం లేదు. అక్రమ మద్యం, బెల్టు షాపులను నిరోధించాల్సిన ఎక్సైజ్, పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతోనే పల్లెల్లో మద్యం ఏరులై పారుతోందన్న విమర్శలున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుని మద్యాన్ని విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.