కాస్టిలీ బాటిల్‌...చీప్‌ మిక్సింగ్‌! | Adulterated Alcohol in Wines Stores | Sakshi
Sakshi News home page

కాస్టిలీ బాటిల్‌...చీప్‌ మిక్సింగ్‌!

Published Sat, Feb 24 2018 1:54 PM | Last Updated on Sat, Feb 24 2018 1:54 PM

Adulterated Alcohol in Wines Stores - Sakshi

అసలు–నకిలీ

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: 28.01.2018: వీరఘట్టంలో జనాతా వైన్స్‌ పేరుతో నిర్వహిస్తోన్న దుకాణంలో కల్తీ మద్యం వెలుగుచూసింది. బ్రాండెడ్‌ మద్యం బాటిళ్ల మూతలను పోలిన నకిలీ మూతలను హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున తయారీ చేయించి తీసుకొచ్చినట్లు ఆధారాలు దొరికాయి.
01.02.2018: ఆమదాలవలస పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు సమీపంలో బెల్ట్‌షాప్‌పై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు చేశారు. అక్కడ దొరికిన మద్యం బాటిళ్లపై ఉన్న కోడ్‌ నంబర్లు ఆధారంగా ఆరా తీశారు. ఆ సరుకు సమీపంలోని రవితేజ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నుంచి వచ్చినట్లు తేలింది. అంతేకాదు ల్యాబ్‌లో తనిఖీ చేయిస్తే కల్తీ మద్యం అని రూఢీ అయ్యింది. దీంతో ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఈ నెల 15వ తేదీన సీజ్‌ చేశారు.

రాజధాని స్థాయిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్తేనో, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు చేస్తేనో ఈ రెండు అక్రమ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి! అసలే మద్యం మహమ్మారి ఇల్లూ ఒళ్లూ గుల్ల చేస్తుంటే మరోవైపు చాపకింద నీరులా కల్తీ మద్యం మరింత ప్రమాదకర స్థాయిలో పట్టణాల్లో, గ్రామాల్లో విస్తరిస్తోంది. గత నెల రోజు వ్యవధిలోనే 11 మద్యం దుకాణాలను ఇదే కారణంతో సీజ్‌ చేశారంటే పరిస్థితి ఊహించవచ్చు. ఈ కల్తీ భూతం విస్తరణకు బెల్ట్‌షాపులే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. నెల రోజుల్లో 210 బెల్ట్‌షాపులపై దాడులు చేసి 192 మంది నిర్వాహకులను ఎక్సైజ్‌ శాఖ అధికారుల అదుపులోకి తీసుకున్నా ఏమాత్రం నకిలీ మద్యం జోరు తగ్గట్లేదు. ఈ అక్రమార్కులకు అధికార పార్టీ నాయకుల నుంచి అండదండలు పుష్కలంగా ఉండటమే దీనికికారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న విపరీత ధోరణిపై విమర్శలు వస్తున్నా తీరు మారట్లేదు!

చంద్రబాబు సంతకం చేసినా....
బెల్ట్‌ షాపులు మూసేయిస్తానని చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తొలిరోజే చేసిన సంతకం చెల్లుబాటు కావట్లేదు! బెల్ట్‌షాపులు మూతపడలేదు సరికదా కల్తీ మద్యం అక్రమాలకు కేంద్రాలుగా మారాయి. అక్రమార్కులు బ్రాండెడ్‌ మద్యం బాటిళ్లలో చీప్‌లిక్కర్, తక్కువ ఖరీదు మద్యం కల్తీ చేసి నకిలీ మూతలను టాంపరింగ్‌ చేస్తున్నారు. ఈ సరుకు బెల్ట్‌షాపులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో కోటబొమ్మాళి, శ్రీకాకుళం, పాతపట్నం కూడా భారీఎత్తున నకిలీ మూతలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ మూతల రంగు, టైటిల్, లెటరింగ్, లేబుళ్లు... అన్నీ మక్కీకిమక్కీగా రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఈ నకిలీ మూతల తయారీకే ఒక పరిశ్రమ నడుస్తోందన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. మూతకు రూపాయి చొప్పున కొనుగోలు చేస్తున్న వ్యాపారులు జిల్లాకు తీసుకొచ్చి మద్యం అక్రమార్కులకు రూ.3 నుంచి రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. 

షాపుల్లో, ఇళ్లల్లో కల్తీ..
టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో పట్టుబడిన నకిలీ మూతలను బట్టిచూస్తే మద్యం కల్తీ అంతా వైన్‌ షాపుల్లో లేదంటే అక్రమార్కుల ఇళ్లల్లో జరుగుతుందనే విషయం తేటతెల్లమవుతోంది. జిల్లాలో 239 మద్యం దుకాణాలు, 17 బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు ఉన్నాయి. వీటిద్వారా మద్యం అమ్మకాలు నెలకు సగటున రూ.60 కోట్ల వరకూ జరుగుతున్నాయి. మరోవైపు దుకాణానికి నెలనెలా రూ.50 వేల చొప్పున అధికార పార్టీలో కీలక నాయకుడి అనుచరులు మామ్మూళ్లు వస్తున్నారు. వీటన్నింటికీ తోడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తాపత్రయంతో వైన్‌షాపుల నిర్వాహకులు కొందరు బ్రాండెడ్‌ మిక్సింగ్‌కు తెగిస్తున్నారు. బ్రాండెడ్‌ మద్యం బాటిళ్ల మూతలను తొలగించి అందులోనుంచి కొంత మద్యం తీసేస్తున్నారు. ఆ మేరకు తక్కువ ఖరీదు మద్యం, చీప్‌ లిక్కర్‌ కల్తీ చేస్తున్నారు. కొన్నిచోట్ల నీళ్లు కలిపేస్తున్నారు. ఇటీవల రాజాంలో ఈ తరహా ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాటిళ్లకు నకిలీమూతలను బిగించేసి యథావిధిగా నకిలీ సీళ్లనే వేసేస్తున్నారు. ఈ కల్తీ సరుకు విక్రయాలు బెల్ట్‌షాపుల్లో జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో బెల్ట్‌షాపుల్లో విక్రయాలు ఎక్కువగా రాత్రిపూట జరుగుతున్నాయి. వెలుతురు సరిగా లేని ఆ దుకాణాల్లో నకిలీ మూతలను మందుబాబులు గుర్తించలేకపోతున్నారు. ఈ కల్తీ మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎక్సైజ్‌ శాఖ నిర్లక్ష్యమే కారణమా?
కల్తీ మద్యం వ్యవహారాలను అరికట్టేందుకు తరచుగా తనిఖీలు నిర్వహించాలి. వైన్‌షాపుల్లో మద్యం శాంపిళ్లు తీసి ల్యాబ్‌ల్లో పరీక్ష చేయించాలి. మరోవైపు నకిలీమూతల తయారీదారులు, పంపిణీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడే మద్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్సైజ్‌ శాఖలో ఈ తరహా చర్యలు కనిపించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలు, మామూళ్ల వ్యవహారాలే ఈ అలక్ష్యానికి కారణమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబరు 3వ తేదీన సాక్షాత్తూ జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఇన్‌చార్జ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం.శివప్రసాద్‌ ఇంట్లోనే ఏసీబీ అధికారులు రూ.4.50 లక్షల భారీ మొత్తాన్ని పట్టుకున్న వ్యవహారమే దీనికి పరాకాష్ట. గతంలో జిల్లా కలెక్టరుగా పనిచేసిన ప్రస్తుతం ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ పి.లక్ష్మీనరసింహం కార్యాలయానికి కూడా జిల్లాలో అక్రమ మద్యం వ్యవహారాలపై ఫిర్యాదులు వెళ్తున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement