సారాయి సాధ్యమేనా? | CM YS Jagan comments On Chandrababu In Assembly | Sakshi
Sakshi News home page

సారాయి సాధ్యమేనా?

Published Wed, Mar 16 2022 4:03 AM | Last Updated on Wed, Mar 16 2022 9:01 AM

CM YS Jagan comments On Chandrababu In Assembly - Sakshi

ఏమైనా లాజిక్‌ ఉందా...?
నిత్యం ప్రజలు సంచరించే ప్రాంతం.. పోలీస్‌స్టేషన్‌తో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలున్న జంగారెడ్డిగూడెం లాంటి చోట అందరి కళ్లుగప్పి నాటు సారా తయారీ సాధ్యమయ్యే పనేనా? ఎక్కడో మారుమూలన, నిర్జన ప్రాంతంలో అలా జరుగుతోందంటే నమ్మవచ్చేమో..! విపక్షం కాస్త లాజిక్‌గా ఆలోచించాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: నాటుసారా కాసేవారికి అండగా నిలిచే ప్రసక్తే లేదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కల్తీ మద్యం తయారీదారులపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఎస్‌ఈబీని ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. జంగారెడ్డిగూడెం ఘటనపై టీడీపీ సభ్యులు మంగళవారం కూడా సభా కార్యక్రమాలకు అడ్డు తగలడంతో సీఎం స్పందిస్తూ అక్రమ మద్యానికి సంబంధించి ఇప్పటికే 13 వేల కేసులు నమోదు చేశామంటే ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో అందరికీ అర్థమవుతోందని తెలిపారు. టీడీపీ సభ్యులు నాగరికంగా ప్రవర్తించాలని, సభ జరగకూడదనే ఆలోచనను పక్కన పెట్టాలని సూచించారు. లాజిక్‌గా కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలని, వారు ప్రస్తావిస్తున్న అంశాలపై తాను కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. 

కళ్లుగప్పి సారా తయారీ సాధ్యమేనా? 
దాదాపు 55 వేల జనాభా నివసిస్తున్న జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎవరైనా సారా కాయగలరా? అని సీఎం ప్రశ్నించారు. పైగా అది ఒక మున్సిపాలిటీ అని గుర్తు చేశారు. 2011 లెక్కల ప్రకారం అక్కడ 44 వేల జనాభా ఉండగా ప్రస్తుతం దాదాపు 55 వేల మంది నివసిస్తున్నట్లు తెలిపారు. అక్కడ పోలీస్‌ స్టేషన్, వార్డు సచివాలయాలు, మహిళా పోలీస్‌లున్నారని చెప్పారు. వారందరి కళ్లు గప్పి సారా కాయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. ఎక్కడో మారుమూల గ్రామంలో, నిర్జన ప్రదేశంలో సారా కాస్తున్నారంటే నమ్మవచ్చని, జంగారెడ్డిగూడెం లాంటి పట్టణంలో సారా కాయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

చంద్రబాబు మాటలకు పొంతన ఉందా?
ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఒకవైపు ప్రభుత్వం మద్యం విక్రయాలను పెంచుతోందంటూ మరోవైపు జనం సారా తాగుతున్నారని పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నాటు సారా తాగిస్తే ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది కదా అనే కామన్‌సెన్స్‌ లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. ‘రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.25 వేల కోట్ల అప్పు తేవడంతో పాటు మరో రూ.25 వేల కోట్లు రుణానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని చంద్రబాబు అంటున్నారు. మద్యం విక్రయాలు బాగా పెంచి ఆదాయం పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు నాటు సారా తాగి మనుషులు చనిపోయారని చెబుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదు’ అని మండిపడ్డారు.  

‘ఈనాడు’ వక్రభాష్యం
ప్రతి గ్రామంలో 90 సహజ మరణాలుంటాయని తాను వ్యాఖ్యానించినట్లు ఈనాడులో వ్యంగ్యంగా రాశారని సీఎం పేర్కొన్నారు. 2011 లెక్కల ప్రకారం జంగారెడ్డిగూడెం జనాభా 44 వేలు కాగా పదేళ్ల తర్వాత 12 శాతం పెరుగుదలతో ఇప్పుడు దాదాపు 55 వేల మంది ఉన్నట్లు చెప్పామన్నారు. దేశంలో 2 శాతం మరణాల రేటు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని, ఆ మరణాలు.. వృద్ధాప్యం, అనారోగ్యం, మరే ప్రమాదం వల్లైనా కావచ్చన్నారు. ఆ మేరకు 55 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో 2 శాతం సగటుగా తీసుకుంటే ఏటా దాదాపు వెయ్యి మంది చనిపోతున్నారని, అంటే నెలకు దాదాపు 90 మంది చనిపోతున్నట్లు అవుతుందన్నారు.

ఈనాడు పత్రిక దాన్ని కూడా వక్రీకరించి రాసిందన్నారు. నిజానికి జంగారెడ్డిగూడెంలో ఆ మరణాలన్నీ ఒకే చోట, ఒకే రోజు జరగలేదన్నారు. వేర్వేరు చోట్ల వారం వ్యవధిలో చోటు చేసుకున్నాయని, మరణించిన వారి అంత్యక్రియలు కూడా జరిగాయన్నారు. అప్పుడు ఏ రాద్ధాంతం జరగలేదన్నారు. ఒకచోట ప్రభుత్వమే చొరవ చూపి పాతిపెట్టిన భౌతిక కాయానికి పోస్టుమార్టమ్‌ నిర్వహించిందన్నారు. నిజంగానే అది సారా మరణం అయితే ప్రభుత్వం పోస్టుమార్టమ్‌ నిర్వహిస్తుందా? అని ప్రశ్నించారు.

గోబెల్స్‌ ప్రచారం...
‘ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి.. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఢంకా భజాయించాలి... ఆ విధంగా గోబెల్స్‌ ప్రచారం చేయాలి. ఓ అబద్ధాన్ని వందసార్లు చెబితే ప్రజలు విశ్వసిస్తారని వారి నమ్మకం. అందుకే ముందు ఒకరు అందుకుంటారు.. ఆ వెంటనే మిగిలిన వారు, చంద్రబాబు పదేపదే అదే విషయాన్ని చెబుతారు. కొన్ని మీడియా సంస్థలు, వాటి యాజమాన్యాలు, చంద్రబాబు కలసి వాస్తవాలను వక్రీకరిస్తున్నారు..’ అని సీఎం జగన్‌ మండిపడ్డారు.

జరగని దాన్ని జరిగినట్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి మంచి చేయడానికి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, అంతే కానీ ఇలాంటి ప్రవర్తనతో సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దని టీడీపీ సభ్యులకు సూచించారు. బడ్జెట్‌ చర్చల్లో విపక్షం పాలుపంచుకోవాలని, సలహాలు ఇస్తే నోట్‌ చేసుకుంటామన్నారు. పద్ధతి మార్చుకోవాలని, ఇలాగే వ్యవహరిస్తూ కొత్త రూల్‌ ప్రకారం సస్పెండ్‌ కాదలచుకుంటే వారి ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement