కూకట్‌పల్లిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద..
సిటీలో మద్యం విక్రయాలకు వేళాపాళా లేకుండా పోయింది. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి...తెల్లవారుజాము వరకు ఎనీటైం యథేచ్ఛగా మద్యం దొరుకుతోంది. తాగి ఊగే మందుబాబులకు ప్రధాన వీధుల్లో ఉన్న వైన్ షాపులు, బార్లు అడ్డాగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకే లిక్కర్ అమ్ముతున్నారు. వాస్తవంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం షాపులకు అనుమతి ఉంది. కానీ చాలా చోట్ల రెండు గంటల ముందే తెరవడం..అర్ధరాత్రి దాటాక మూసివేయడం చేస్తున్నారు. నిబంధనలు పాటించని, షాపులపై కొరడా ఝళిపించాల్సి ఉన్నా...అలాంటి దాఖలాలు లేవు. మంగళవారం సాక్షి క్షేత్రస్థాయిలో వైన్ షాపులు, బార్ల వద్ద పరిస్థితులను పరిశీలించగా ఈవిషయాలు వెల్లడయ్యాయి.
సాక్షి, సిటీబ్యూరో/సాక్షి నెట్‌వర్క్: గ్రేటర్‌లో వేళాపాళా లేకుండా తాగుతూ.. ఊగుతున్న మందుబాబులకు ప్రధాన వీధుల్లో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు అడ్డాలుగా మారుతున్నాయి. ప్రధాన రహదారులు, సమీప కాలనీలు, బస్తీల్లో మందుబాబుల ఆగడాలు శృతిమించుతుండడంతో మహిళలు, విద్యార్థినులు, పాదచారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు) సుమారు 400 మద్యం దుకాణాలు, 500 బార్లు ఉన్నాయి. ఏటా సుమారు రూ.2 వేల కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. యేటికేడాది వీటి విలువ 15–20 శాతం పెరుగుతోంది. ఆబ్కారీ శాఖ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు.
బార్లను ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. అయితే పలు మద్యం దుకాణాలు ఉదయం 9 గంటలకు తెరుచుకోవడంతో పాటు రాత్రి 1 గంట వరకు అమ్మకాలు జరుగుతున్నాట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ప్రధాన శివార్లలో ఇదే పరిస్థితి నెలకొంది. బార్లు అర్ధరాత్రి 2 గంటల వరకు తెరచి ఉండటం గమనార్హం. అయితే ఆబ్కారీ శాఖ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.మందుబాబుల ఆగడాలు శృతి మించినపుడు స్థానికులు ఫిర్యాదు ఇచ్చినపుడే ఆబ్కారీ, పోలీసుల విభాగాలు హడావుడి చేస్తున్నాయి. అరకొర జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు.ఎక్కడా లైసెన్సులు రద్దు చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. సమయపాలన, పార్కింగ్, పర్మిట్ రూమ్‌ల నిబంధనలు పాటించని దుకాణాలు, బార్లపై చర్యలు లేకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.
‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన అంశాలివీ...
ఎల్బీనగర్, మలక్‌పేట్ నియోజకవర్గాల పరిధిలో..
దిల్‌సుఖ్‌నగర్ నుంచి చాదర్‌ఘాట్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న వైన్‌షాపులు, బార్‌ల యజమానులు నియమ, నిబంధనలను ఖాతరు చేయడం లేదు. పలుదుకాణాలను ఉదయం 9 గంటలకే తెరుస్తుండడం గమనార్హం. దిల్‌సుఖ్‌నగర్ బస్‌డిపో సమీపంలోని వైన్‌షాప్ ఉదయం 9 గంటలకే తెరుచుకోగా. మలక్‌పేట్ యశోద ఆస్పత్రి పక్కన ఉన్న వైన్‌షాపు 9.30 గంటలకు తెరిచి యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారు. కొన్ని వైన్‌షాపుల యజమానులు షాపుల వెనుక వైపు నుంచి ఉదయం 8 గంటల నుంచే మద్యం విక్రయాలు జరుపుతున్నారు. మైనర్లకు సైతం మద్యం విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్ సమీపంలో దేవాలయానికి ఆనుకునే మద్యం దుకాణం ఏర్పాటు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.కొన్ని మద్యం షాపుల యజమానులు సర్వీస్ రోడ్లపైనే పార్కింగ్‌ను ఏర్పాటు చేసి బహిరంగంగా మద్యం విక్రయిస్తున్నారు.
కుత్బుల్లాపూర్‌లో...
నియోజకవర్ పరిధిలో మందుబాబుల ఆగడాలకు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. కుత్బుల్లాపూర్ పరిధిలో పలు వైన్ షాపులు నిబంధనలను పట్టించుకోవడం లేదు.మద్యం దుకాణాలకు ఆనుకొని ఉన్న పర్మిట్ రూమ్‌లను నిబంధనలకు విరుద్ధంగా సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసి మందుబాబులకు అడ్డాగా తీర్చిదిద్దుతున్నారు. పలు దుకాణాల వద్ద మైనర్లే పనులు చేస్తూ కనిపించారు. సుచిత్రా నుంచి కొంపల్లి రూట్లో మద్యం షాపుల వద్ద అక్రమ పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చింతల్, కుత్బుల్లాపూర్ గ్రామం సర్కిల్ కార్యాలయం రోడ్డు, గాజులరామారం రోడ్డులోని వైన్స్ వద్ద నడి రోడ్డుపైనే మందుబాబులు మద్యం సేవిస్తూ కనిపిస్తున్నారు.
నాంపల్లి.. ఆబిడ్స్‌లో..
సమయ పాలన పాటించకుండా తమ ఇష్టానుసారంగా మద్యం దుకాణాలను కొనసాగిస్తున్నారు. ఆబిడ్స్ జోన్ పరిధిలోని పురానాపూల్, జియాగూడ, జుమేరాత్ బజార్, కోఠి, ఎగ్జిబిషన్ గ్రౌండ్, గుడి మల్కాపూర్ తదితర ప్రాంతాలలోని పలు మద్యం దుకాణాల వద్ద ఇదే దుస్థితి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద నున్న ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఉదయం 8 గంటల నుంచే దొడ్డి దారిన తెరిచి విక్రయాలు కొనసాగించడం గమనార్హం. మద్యంతో పాటు తాటి, ఈత కల్లులను కూడా ఒకే ఆవరణలో విక్రయిస్తున్నారు. పురానాపూల్ చౌరస్తాలోని ఓ వైన్ షాప్ ఉదయం 9.15 గంటలకే తెరిచి విక్రయాలు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లోని పలు వైన్స్‌లు, బార్‌లలో పార్కింగ్ సదుపాయం లేక రోడ్లపైనే మందుబాబులు వాహనాలు నిలుపుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సికింద్రాబాద్‌లో...
సికింద్రాబాద్‌లోని పలు వైన్ షాపులు, బార్ల ముందు ఉన్న ప్రధాన రహదారులు వాహనాల పార్కింగులతో నిండిపోయాయి. చిలకలగూడలోని దీంతో ఈ రోడ్డులో తరచూ ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. బౌద్ధనగర్ వారాసీగూడ చౌరస్తాలోని ఓ వైన్ షాపు ముందు ఇదే పరిస్థితి. అసలే ఇరుకైన రోడ్డు దానికి తోడు వాహనాల పార్కింగులతో స్థానికులు అవస్థలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment