పాల్వంచ రూరల్, న్యూస్‌లైన్: పాల్వంచ పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి నకిలీ మద్యం గుట్టు రట్టు చేశారు. జనావాసాల మధ్య గుట్టుగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తుండగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు రూ. 5లక్షల విలువైన కల్తీ మద్యంతో పాటు వివిధ కంపెనీలకు చెందిన బ్రాందీ, విస్కీ స్టిక్కర్లు, స్పిరిట్, ఖాళీ సీసాలు, రెండు ద్విచక్ర వామనాలు, రూ. 3800 నగదు స్వాధీనం చేసుకున్నారు.
పట్టణ ఎస్సై షణ్ముఖచారి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని బొల్లోరిగూడెంలో సముద్రాల నాగేశ్వరరావు ఇంట్లో కొంత మంది ఓ గదిని అద్దెకు తీసుకుని కొంత కాలంఆ నకిలీ మద్యం తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా కల్తీ మద్యాన్ని తయారుచేసే స్పిరిట్, వివిధ కంపెనీలకు చెందిన లేబుల్స్ (స్టిక్కర్లు), విస్కీ, బ్రాంది స్టిక్కర్లు, ప్లాస్టిక్ బాటిళ్లలో నింపిన కల్తీ మద్యం, వేలాది ఖాళీ సీసాలు, నకిలీ సీసాలకు వినియోగించే సీల్ మూతలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం తయారుచేస్తున్న బాదె హేమాంబరదరరావు, ఇంటి యజమాని నాగేశ్వరరావులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరిద్దరితో పాటు బ్రాందీ షాపు యజమాని చావా శ్రీనివాసరావు, సాయి అనే మరో వ్యక్తిపై కేసు నమోదు చేశామని తెలిపారు. పరారీలో ఉన్న వీరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
నకిలీ మద్యం తయారీ కేంద్రంగా పాల్వంచ...
నకిలీ మద్యం స్థావరంపై పోలీసులు దాడిచేసి నకిలీ మద్యం సీసాలను పట్టుకోవడంతో పట్టణంలో కలకలం రేగింది. వివిధ కంపెనీలకు చెందిన ఒరిజినల్ మద్యాన్ని తలపించే విధంగా నకిలీ మద్యాన్ని తయారుచేస్తున్న సూత్రదారులు పోలీసుల అదుపులో ఉన్న వారేనా..? లేక వారి వెనుక బడా వ్యాపారులు ఎవరైనా ఉన్నారా..? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎంత కాలం నుంచి మద్యం విక్రయిస్తున్నారు..? కేవలం పాల్వంచలోనేనా.. ? లేక కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో కూడా విక్రయించారా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నకిలీ మద్యం పాల్వంచలో తయారు చేస్తుండడంతో ఈ ప్రాంత మద్యం ప్రియుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
నకిలీ మద్యం తయారీ స్థావరంపై అర్ధరాత్రి పోలీసుల దాడి
Published Sun, Mar 2 2014 1:34 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
Advertisement
Advertisement