సాక్షి, తెనాలి: నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో తెనాలిలోని ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ జూనియర్ అసిస్టెంట్ తుమ్మల కిరణ్‌కుమార్ పాత్ర స్పష్టమైంది. విజయవాడలోని ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల్లో భారీ మొత్తంలో పట్టుబడిన రెక్టిఫైడ్ స్పిరిట్ (ఆర్‌ఎస్) దిగుమతి చేసుకోవటం ఇందుకు నిదర్శనం. రేపల్లె ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని తుమ్మల పంచాయతీ శివారు గాదెవారిపాలెంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం కోసమే ఆర్‌ఎస్‌ను తెప్పిస్తున్నట్టు రూఢీ అయినట్టే. గాదెవారిపాలెంలో నకిలీ మద్యానికి కీలకమైన పూర్ణిమ వైన్స్ లైసెన్సుదారుడు గుమ్మడి సాంబశివరావు, కిరణ్‌కుమార్ బినామీగా, నకిలీ మద్యం తయారీ సూత్రధారి అతడేనన్న లింకూ స్పష్టమైనట్టే. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు అక్కడ నుంచి విజయవాడకు ఆర్‌ఎస్‌ను తెప్పిస్తూ నకిలీ మద్యాన్ని యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఏజెంటు సాధుల ఆదిత్యను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు, అతడికి సప్లయి చేస్తున్న మహారాష్ట్ర స్మగ్లర్ వేటకు బయలుదేరి వెళ్లారు.
పట్టిచ్చిన ఫోన్ కాల్ జాబితా...
నకిలీ మద్యం సూత్రధారి తుమ్మల కిరణ్‌కుమార్‌కు డిపార్టుమెంటులో సంబంధాలు బలంగా ఉన్నాయి. నకిలీ మద్యం రాకెట్‌ను పట్టుకున్న రోజున, తెనాలి జూనియర్ అసిస్టెంట్ ఫోన్ కాల్ జాబితాను పరిశీలించిన అధికారులకు ఈ విషయం స్పష్టమైంది. అతడి నుంచి రేపల్లె సర్కిల్ కార్యాలయానికి దాదాపుగా అరవై కాల్స్ వెళ్లాయి. మళ్లీ అటువైపు నుంచి అదే సంఖ్యలో కాల్స్ ఇతడికీ వచ్చినట్టు తెలుసుకున్నారు. నకిలీ మద్యం సూత్రధారికి, సర్కిల్ కార్యాలయంతో ఉన్న అనుబంధంతోనే రెస్క్యూ కోసం పడరానిపాట్లు పడ్డారని ఫోన్ కాల్స్ జాబితా చెబుతోంది.
పూర్వ భాగస్వామి సమాచారంతోనే..!
తెనాలి జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్, దుగ్గిరాల సర్కిల్‌లో పని చేస్తూ ‘సిండికేట్ కింగ్’గా పేరు తెచ్చుకున్న కానిస్టేబుల్, తెనాలి డివిజనులో మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు. మద్యం వ్యాపారంలో వీరితో గత కాలంలో భాగస్వామిగా వ్యవహరించిన ఒకరి పక్కా సమాచారంతోనే తుమ్మల పంచాయతీ నకిలీ మద్యం రాకెట్‌ను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్/ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ఛేదించగలిగారని సమాచారం.
కొంచెం అప్రమత్తమైతే నాడే వెలుగులోకి..
కొల్లూరు మండలం క్రాపలో అనధికార దుకాణం పట్టుబడ్డ కేసును పట్టించుకున్నట్టయితే ఆనాడే నకిలీ మద్యం బాగోతం వెల్లడయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెనాలికి సమీపంలోని వేమూరులో లైసెన్సు దుకాణం నుంచి క్రాపలో అనధికార దుకాణం నడుపుతున్నారు. దుగ్గిరాల ఎక్సైజ్ సర్కిల్ పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడ 4–5 కేసుల మద్యం, బస్తా కొత్త మూతలు దొరికాయి. అక్కడ అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ప్రశ్నిస్తే, తెనాలి ఓవర్ బ్రిడ్జి దగ్గర్లోని వైన్స్‌లో పని చేసే శంకర్ అనే యువకుడు, తానూ కలిసి సీసాలకు మూతలు వేసి బెల్టు షాపులకు వేస్తున్నట్టు చెప్పాడు. దీనికి ముందు గతేడాది దుగ్గిరాల సర్కిల్‌లోని ఈమని గ్రామంలో టాస్క్‌ఫోర్స్ దాడిలో సుమారు 20 కేసుల మద్యం, బస్తా కొత్త మూతలు దొరికాయి. ఈ రెండు ఘటనల్లోనూ కీలకమైన యువకుడిని విచారిస్తే తుమ్మలకు చేరుతున్న ఆర్‌ఎస్, ఈ చివరకూ మద్యం రూపంలో అందుతోందని రూఢీ అయ్యేదనే వాదన ఉంది. తుమ్మల ఘటన తర్వాతనైనా అటుకేసి దృష్టి సారిస్తారో? లేదో? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment