ప్రథమ పౌరుడి పదవీ పాట్లు
సాక్షి, కర్నూలు: జిల్లా ప్రథమ పౌరుడు నకిలీ మద్యం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పదవిని కాపాడుకునేందుకు.. కేసు నుంచి బయటపడేందుకు టీడీపీ ముఖ్య నేతకు కోట్లాది రూపాయలు సమర్పించుకున్నట్లు ఆ పార్టీ వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. కేసు నమోదయ్యాక ఎక్సైజ్ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలో గడిపిన ఆయన.. జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పాల్గొన్న కార్యక్రమాల్లో మాత్రమే తారసపడ్డారు.
ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల్లో.. కలెక్టరేట్‌లో నిర్వహించే సమీక్ష సమావేశాల్లోనూ వేదికను అలంకరిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్య నేత భరోసాతోనే ఆయన జనజీవన శ్రవంతిలోకి వచ్చినట్లు పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. నకిలీ మద్యం కేసులో ఎ-5గా ఉన్న జెడ్పీ చైర్మన్ అరెస్టుకు ఎక్సైజ్ పోలీసులు మీనమేషాలు లెక్కిస్తుండటం వెనుక భారీగా డబ్బు చేతులు మారినట్లు తెలుస్తోంది.
మొత్తంగా ఈ కేసుతో జెడ్పీ ప్రతిష్ట మంటగలిసింది. ‘నకిలీ మద్యం వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేసుకోండని.. ఎలాంటి ఇబ్బందులొచ్చినా తాను అండగా నిలుస్తా’నంటూ స్వయంగా జెడ్పీ చైర్మన్ తమకు భరోసానిచ్చినట్లు ఆ కేసులో నిందితులుగా ఉన్న రామన్‌గౌడ్, ఉమామహేశ్వరగౌడ్‌లు పోలీసుల ఎదుట అంగీకరించారు. జెడ్పీ చైర్మన్ పీఏ రాజశేఖర్ సహకారంతో చైర్మన్‌ను కర్నూలులోని మౌర్యాఇన్ హోటల్‌లో కలిసినట్లు వారు స్పష్టం చేయడం తెలిసిందే.
ఆ మేరకు పీఏపైనా ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టు తర్వాత చైర్మన్‌ను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కొందరు తక్షణమే రాజశేఖర్‌గౌడ్‌ను చైర్మన్ పదవి నుంచి తప్పించాలని.. లేకపోతే పార్టీ పరువు, ప్రతిష్ట దెబ్బతింటుందనే అభిప్రాయాన్ని అధినేత ముందుంచారు.
రూ.4 కోట్లకు డీల్!
వ్యయప్రయాసలకోర్చి జెడ్పీ పీఠం దక్కించుకున్న రాజశేఖరగౌడ్.. ఆ సంతోషం మూన్నాల్ల ముచ్చట కాకూడదనే ఉద్దేశంతో పదవిని కాపాడుకునేందుకు ముప్పుతప్పలు ఎదుర్కొంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఎంతో కష్టం మీద టీడీపీకే చెందిన ఓ ముఖ్యనేత, ఆయన సోదరుల ఆశీస్సులు పొందినట్లు తెలుస్తోంది.
ఒక దశలో జెడ్పీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని వారు సూచించడంతో కాసుల బేరానికి దిగినట్లు సమాచారం. కేసు నుంచి తప్పించడమో.. లేదంటే అరెస్టు కాకుండా చూడటమో చేస్తే రూ.4కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు వినికిడి. ఆ తర్వాతే జెడ్పీ చైర్మన్ రాజశేఖరగౌడ్ అజ్ఞాతం వీడినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు.
ఈ విషయంలో నందికొట్కూరుకు చెందిన టీడీపీ నేత కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. డీల్‌కు సంబంధించిన మొత్తాన్ని కూడా ఆయనే సమకూర్చినట్లు సమాచారం. ఇదిలాఉంటే నకిలీ మద్యం కేసు నుంచి బయటపడేందుకు చైర్మన్ రాజశేఖర్‌గౌడ్ తన పీఏ రాజశేఖర్ అలియాస్ చిక్కా నాగశేఖరప్పను కూడా బలిపశువును చేసేందుకు వెనుకాడటం లేదని చర్చ కొనసాగుతోంది.
నకిలీ.. మకిలీ
Published Mon, Nov 24 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM
Advertisement
Advertisement