మద్యం వ్యాపారుల గుండె గుబిల్లు
సాక్షిప్రతినిధి, అనంతపురం : మద్యం అమ్మకాల్లో సరికొత్త విధానానికి ఎక్సైజ్ శాఖ శ్రీకారం చుట్టింది. నకిలీ మద్యాన్ని నివారించే చర్యలకు ఉపక్రమించింది. నాణ్యతతో పాటు మద్యం తయారీ, అమ్మకాలపై పారదర్శకత పాటించేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. మద్యం సీసాలపై హోలోగ్రామ్‌లు వేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తె చ్చిపెడుతున్న ఎక్సైజ్ శాఖలో సరికొత్త విధానాలను అవలంభించడం ద్వారా సేవలను విస్తృతం చేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చనేది ఈ కొత్త పంథా ప్రధాన ఉద్దేశం.
ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త కంప్యూటర్ బిల్లింగ్, హోలోగ్రామ్ విధానం డిసెంబరు నుంచి అమలు చేసేందుకు కసరత్తు మొదలెట్టారు. ప్రతీ మద్యం దుకాణంలో ఆన్‌లైన్ కంప్యూటర్ బిల్లు ఇచ్చేందుకు పరికరాలను ఏర్పాటు చేస్తారు. సూపర్ మార్కెట్ తరహాలో మద్యం విక్రయించగానే కంప్యూటర్ స్క్రాచ్ ద్వారా బిల్లు వేసి, బిల్లు ప్రతిని కొనుగోలు దారుడికి అందజేయాలి. ఈ బిల్లు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఎకై ్స జ్ కమిషనర్ కార్యాలయానికి చేరుతుంటాయి.
ప్రతీ మద్యం సీసాపై హోలోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. దానిపై ఒక సీరియల్ నెంబర్‌ను ముద్రిస్తారు. ఆ నెంబర్‌కు సీసాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. బాటిల్‌పై ఓ టోల్‌ఫ్రీ నెంబరును ముద్రిస్తారు. తాను కొన్న మద్యం సీసా గురించి తెలుసుకోవాలనుకునే కొనుగోలుదారుడు సీసాపై ఉన్న టోల్‌ఫ్రీ నెంబరుకు ఎస్‌ఎంఎస్ పంపితే చాలు. ఆ సీసా ఎప్పుడు.. ఎక్కడ తయారు చేశారు.. ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది.. ఏ దుకాణానికి చేరింది.. అనే వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి.
అక్రమ ప్రవాహానికి అడ్డుకట్ట
ప్రస్తుతం మద్యం సీసాలపై లేబుల్స్ ఉన్నాయి. కొందరు మాఫియా అవతారమెత్తి నకిలీ లేబుళ్లను తయారు చేసి, నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి మద్యాన్ని భారీగా దిగుమతి చేస్తున్నారు. కర్ణాటకలో మద్యం ధరలు తక్కువ. పైగా ట్యాక్స్ వెసులుబాటు ఉంటుంది. దీంతో మద్యం వ్యాపారులు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కొత్త విధానం ద్వారా వీటిని పూర్తిగా నివారించే అవకాశం ఉంది.
నకిలీ మద్యంలో ప్రమాదకర రసాయనాల కారణంగా దాన్ని తాగిన వారు అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ప్రతీ నెలా 75 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కొత్త విధానం అమలైతే మద్యం మాఫియా ఆగడాలకు బ్రేక్‌పడుతుంది. కల్తీ, అక్రమ మద్యం సరఫరా నిలిచిపోతుంది. దీంతో ఎకై ్సజ్ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.
దీంతో కొత్త విధానంపై మద్యం వ్యాపారులు గుర్రుగా ఉన్నారు. అయితే ఎకై ్సజ్ అధికారులు మాత్రం తమ పని సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. కాగా, తమ అదనపు ఆదాయం తగ్గుతుందని కొందరు అధికారులు దిగాలుగా ఉన్నారు.
వ్యాపారులకు ముచ్చెమటలు
ఆన్‌లైన్ విధానం అమలుపై మద్యం వ్యాపారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఎమ్మార్పీ కంటే 10-15 రూపాయల అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఆన్‌లైన్ బిల్లు అంటే ఇది కుదరదు. పైగా కంప్యూటర్ల కోసం 90 వేల రూపాయలు చెల్లించాలి. దీనికి కొంతమంది వెనకడుగు వేస్తున్నారు.
ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేయలేకపోతే తామే కంప్యూటర్లను ఏర్పాటు చేస్తామని, ప్రతీ నెలా 5 వేల రూపాయలు అద్దె రూపంలో వసూలు చేస్తామని చెబుతోంది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లినా ఫలితం కనపడ లేదు. తాడిపత్రి, రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండలోని వ్యాపారులు సొంతంగా కొనుగోలు చేశారు. తక్కిన వ్యాపారులు అద్దె వాటిపై మొగ్గు చూపారు.
డిసెంబరు 1 నుంచి అమలుకు కృషి
డిసెంబరు 1నుంచి ఆన్‌లైన్, హోలోగ్రామ్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో 90 శాతం మద్యం దుకాణాలకు ఆన్‌లైన్ బిల్లింగ్ సామగ్రి ఏర్పాటు, మద్యం దుకాణాల నుంచి ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయానికి సాప్ట్‌వేర్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఒకవేళ డిసెంబర్ నుంచి అమలు చేయలేకపోతే, జనవరి నుంచి కొత్త విధానం కచ్చితంగా అమలు చేస్తాం.
- జీవన్‌సింగ్, డిప్యూటీ కమిషనర్, ఎకై ్సజ్ శాఖ.