liquor traders
-
మద్యం సిండికేట్ దోపిడీకి టీడీపీ రాచబాట
-
శని, ఆదివారాలు చెక్కులిచ్చినా.. లిక్కర్ ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆదాయార్జనలో అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఎక్సైజ్ శాఖ వదిలిపెట్టడంలేదు. కొత్త మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటు పేరుతో ఔత్సాహికుల నుంచి నెల రోజుల్లోనే రూ. 75 కోట్లకుపైగా సంపాదించిన ఆబ్కారీ శాఖ ఇప్పుడు మద్యం వ్యాపారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. శని, ఆదివారాలు సెలవులు ఉన్న నేపథ్యంలో చెక్కు ఇచ్చినా సరే డిపోల నుంచి రిటైలర్లకు మందు సరఫరా చేయాలని నిర్ణయించింది. దీన్ని బట్టి ఖజానాను నింపుకొనే క్రమంలో రెండు రోజుల సమయాన్ని కూడా ఆ శాఖ వదులుకోవడంలేదని అర్ధమవుతోంది. గతంలో డీడీలు ఇప్పుడు చెక్‌లు రాష్ట్రంలోని రిటైల్ మద్యం వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ ఇప్పటివరకు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మాత్రమే మందు అమ్ముతోంది. అంటే ఏదైనా వైన్ లేదా బార్ షాపునకు మద్యం కావాలంటే కొనుగోలు విలువకు సరిపడా నగదును బ్యాంకులో చెల్లించి డీడీ రూపంలో సమర్పిస్తేనే డిపో నుంచి షాపునకు మద్యం పంపేది. కానీ, ఇప్పుడు చెక్కు ఇచ్చినా మద్యం సరఫరా చేయాలని శాఖ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. రెండు రోజులను కూడా వృధా చేసుకోకుండా కాసులు రాబట్టుకునేందుకే చెక్కుల నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, చెక్కు బౌన్స్ అయితే మాత్రం 20 శాతం పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. -
లైసెన్సులు వెనక్కి తీసుకోండి మహా ప్రభో!
డెహ్రాడూన్: కోవిడ్ దెబ్బతో ఉత్తరాఖండ్‌లోని మద్యం దుకాణాదారులు వాటిని మూసివేసే పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. అమ్మకాలు తగ్గిపోయి భారీ నష్టాల్లో కూరుకుపోయామని, తమ లైసెన్సులను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 దుకాణాదారులు ప్రభుత్వానికి ఈమేరకు వినతులు సమర్పించారు. తమ నష్టాలకు ప్రధాన కారణం అమ్మకాలు తగ్గిపోవడం ఒకటైతే, ప్రభుత్వానికి నెలవారీ చెల్లించే కనీసం గ్యారెంటీ మొత్తం మరొకటని చెప్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 650 మద్యం దుకాణాలతో ప్రభుత్వానికి ఏటా రూ.3 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి అధిక మొత్తంలో ఆదాయం అందించే వనరు ఇదే కావడం గమనార్హం. అక్కడ లైసెన్సు గడవు ఒక ఏడాది. (చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్, చిక్కుల్లో బీజేపీ నేత) లాక్‌డౌన్‌తో అమ్మకాలు నిలిచిపోగా.. అన్‌లాక్-1 అమలైనప్పటికీ డిమాండ్ అంతగా లేదని దుకాణాదారులు తెలిపారు. అమ్మలకాలతో సంబంధం లేకుండా నెలకు రూ.40 లక్షల నుంచి రూ. కోటి వరకు చెల్లించాల్సి ఉంటుందని జైస్వాల్ అనే దుకాణదారు చెప్పారు. అందుకే లైసెన్సులు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరామని, ఇప్పటి వరకు రిప్లై రాలేదని తెలిపారు. ఇంతకు ముందు అమ్మకాలపై 20 శాతం వాటా ఉండేదని, ఇప్పుడు దానిని 14.5 శాతానికి తగ్గించారని చెప్పారు. ఇది కూడా తమ నష్టాలకు ప్రధాన కారణమని అన్నారు. ఇదిలాఉండగా.. లాక్డౌన్ సమయంలో బకాయిపడ్డ నెలవారీ గ్యారెంటీ మొత్తం రూ. 230 కోట్లు మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనిపై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. మద్యం దుకాణాలపై కనికరం అవసరమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం స్పందన కోరుతూ హైకోర్టు మూడు వారాలకు విచారణ వాయిదా వేసింది. (పామును పట్టుకోండి..) -
3 రోజులు..రూ.450 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా ఆంక్షలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం వ్యాపారులు భారీ స్థాయిలో లిక్కర్ స్టాక్ తెచ్చి పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని 20 ఐఎంఎల్ డిపోల నుంచి అమ్మకాలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే దాదాపు రూ. 450 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాల్లో నిల్వ చేసుకున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇంత విలువలో అమ్మకాలు జరిగేందుకు దాదాపు 12 రోజులు పడుతుందని, ఇప్పుడు ధరలు, విక్రయాలు పెరిగిన నేపథ్యంలో 7–10 రోజుల్లోనే ఈ స్టాక్ అమ్ముడవుతుందని బ్రేవరేజెస్ కార్పొరేషన్ వర్గాలంటున్నాయి. (చదవండి: మనో బలం మన సొంతం) రోజుకు 2 లక్షల లిక్కర్ కేసులు.. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు బుధవారం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించగా అదే రోజు నుంచి డిపోల ద్వారా విక్రయాలు కూడాప్రారంభమయ్యాయి. అయితే బుధవారమంతా గతంలో తమ వద్ద ఉన్న స్టాక్ అమ్మామని వైన్స్ యజమానులు పేర్కొనగా ఇదే విషయాన్ని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా ధ్రువీకరించి వైన్స్ యజమానులకు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ బుధవారం డిపోల నుంచి పెద్ద ఎత్తున లిక్కర్ దుకాణాలకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. డిపోల నుంచి ప్రతిరోజూ బ్రేవరేజెస్ కార్పొరేషన్‌కు వచ్చే లెక్కల ప్రకారం బుధవారం రూ. 72 కోట్ల విలువైన ఇండెంట్లు మద్యం షాపుల నుంచి వచ్చాయి. దాని ప్రకారం 72 వేలకుపైగా కేసుల లిక్కర్, 1.12 లక్షల కేసుల బీర్లు దుకాణాలకు చేరాయి. అలాగే గురువారం ఏకంగా 2 లక్షలకుపైగా లిక్కర్ కేసులు వైన్స్ బాట పట్టాయి. బీర్లు అయితే లక్ష కేసులు దాటాయి. శుక్రవారం కూడా ఇదే ఒరవడి కొనసాగింది. గురువారం జరిగిన స్థాయిలోనే శుక్రవారం కూడా డిపోల నుంచి మద్యం రవాణా జరిగింది. దీంతో ఈ మూడు రోజుల్లో 5 లక్షలకుపైగా కేసుల లిక్కర్, 3 లక్షల కేసులకుపైగా బీర్లు రాష్ట్రంలోని 2 వేలకుపైగా ఉన్న మద్యం దుకాణాలకు చేరాయి. తగ్గిన బీర్ల అమ్మకాలు... గతంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు తగ్గాయని తెలుస్తోంది. అందుకే బీర్ల ఇండెంట్ కూడా మూడు రోజులకు 3 లక్షల కేసులు దాటలేదని బీర్ల కంపెనీలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్, మేలలో 45–50 లక్షల చొప్పున బీర్లు అమ్ముడవుతాయి. అంటే రోజుకు కనీసం 1.5 లక్షల బీర్ కేసులు అమ్ముడుపోతాయి. కానీ తాజా ఇండెంట్‌ను పరిశీలిస్తే రోజుకు లక్ష కేసుల బీర్లు కూడా రాలేదు. ఇందుకు రెండు కారణాలున్నాయని బీర్ల కంపెనీలు అంటున్నాయి. లాక్డౌన్ సమయంలో మద్యం అమ్మినంతగా, బీర్లు అమ్మలేదని, అందుకే స్టాక్ ఉన్న బీర్లు అమ్ముకున్న తర్వాతే మళ్లీ ఇండెంట్లు పెడుతున్నారని చెబుతున్నాయి. దీంతోపాటు ఇళ్లలో లిక్కర్ పెట్టుకున్నంత సులువుగా బీర్లు స్టాక్ పెట్టుకోలేరని, అందుకే నిల్వ చేసుకునేందుకు కూడా అవకాశం లేదని అంటున్నారు. లిక్కర్... లిక్విడ్ స్టాక్ మందుబాబులు మద్యాన్ని విపరీతంగా కొంటున్నారని లిక్కర్ ఇండెంట్ గణాంకాల ద్వారా అర్థమవుతోంది. మళ్లీ మద్యం షాపులు మూసేస్తారనే అనుమానంతో కొన్ని రోజులకు సరిపడా మద్యం తీసుకెళ్తున్నారని తెలుస్తోంది. అయితే చీప్‌లిక్కర్ అమ్మకాలు కొంత తగ్గాయని, లేదంటే లిక్కర్ అమ్మకాలు ఇప్పుడు తారస్థాయిలో ఉండేవని వైన్స్ యజమానులు చెబుతున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులు, దిగువ మధ్యతరగతికి చెందిన వారు, గ్రామీణ పేదలు, వలస కూలీలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్ ఆశించిన స్థాయిలో అమ్ముడుపోవడం లేదని వారంటున్నారు. ఇందుకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన గుడుంబాతోపాటు వేసవిలో ఎక్కువగా లభించే కల్లు కూడా కారణమని తెలుస్తోంది. మొత్తంమీద అమ్మకాలు ఎలా ఉన్నా మందుబాబులు, లిక్కర్ వ్యాపారుల ముందుచూపుతో పెద్ద ఎత్తున సరుకు మాత్రం దుకాణాలకు చేరుకుంటోంది. (చదవండి: ఆన్లైన్లో మద్యం విక్రయంపై ఆలోచించండి) -
మద్యం వ్యాపారులకు షాక్
లక్నో : మద్యం వ్యాపారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై యూపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఎంఆర్పీ కంటే అధికంగా మద్యం విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. నిర్ధేశిత ఎంఆర్పీపై ఎట్టిపరిస్థితుల్లోనూ అధిక ధరలకు విక్రయించరాదని ఎక్సైజ్ మంత్రి రాంనరేష్ అగ్రిహోత్రి ఆదేశించారు. ఈ మేరకు కఠిన ఉత్తర్వులు జారీ చేశామని, మద్యం కొనుగోలు చేసేవారు బాటిల్స్‌పై ముద్రించిన ఎంఆర్పీ పరిశీలించాకే నగదు చెల్లించాలని..అంతకుమించి మద్యం విక్రేతకు చెల్లించవద్దని ప్రిన్సిపల్ కార్యదర్శి (ఎక్సైజ్) సంజయ్ తెలిపారు. మద్యం వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ తొలిసారి పట్టుబడితే రూ 75,000 రెండోసారి పట్టుబడితే రూ 1.5 లక్షల జరిమానా విధిస్తామని, మూడోసారి ఇదే నేరానికి పాల్పడితే వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ జిల్లా, క్షేత్రస్ధాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చదవండి : మద్యం అమ్మకాలు; మండిపడ్డ మహిళలు -
పండుగ చేసుకున్నారు!
సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారులు, రైల్వేశాఖ, ఆర్టీసీ, మెట్రోసంస్థలు పండుగ చేసుకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా వాటికి కాసులపంట పండింది. రూ.వందకోట్ల మేర మద్యం విక్రయమైనట్లు ఆబ్కారీశాఖ అంచనా వేస్తోంది. దూర ప్రాంతాలకు ప్రయాణించినవారితో రైల్వేశాఖకు రూ.50 కోట్లు, ఆర్టీసీకి రూ.15 కోట్లు, మెట్రోకు రూ.5 కోట్ల మేర ఆదాయం లభించినట్లు ఆయా విభాగాల అధికారులు అంచనా వేస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో అటు మెట్రోరైళ్లు సైతం కిటకిటలాడాయి. నగరం ఒక చివరి నుంచి మరో చివరికి.. అంటే అత్యధిక రద్దీ ఉండే ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ.) మార్గంలో మెట్రోరైళ్లు అందుబాటులోకి రావడంతో మెజార్టీ సిటిజన్లు మెట్రోసేవలను వినియోగించుకున్నారు. ఐదురోజులుగా మెట్రోకు సుమారు రూ.5 కోట్ల ఆదాయం లభించినట్లు అంచనా వేస్తున్నారు. వరుస సెలవులు రావడంతో నుమాయిష్‌ను తిలకించేందుకు మెజార్టీ సిటిజన్లు మెట్రోరైళ్లలో ప్రయాణం చేసినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఆర్టీసీకి రూ.15 కోట్లు.. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు, నగరాలకు సుమారు పదివేల రెగ్యులర్, ప్రత్యేక బస్సులు నడిపింది. ఈ బస్సుల్లో సుమారు 10 లక్షలమంది ఆయా ప్రాంతాలకు ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో 4 రోజులుగా సుమారు రూ.15 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే పండుగ సందర్భంగా రూ.50 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. శని, ఆది, సోమ, మంగళవారాల్లో మద్యం దుకాణాలు, బార్లు కిటకిటలాడాయి. వరుస సెలవులు రావడంతో 4 రోజుల్లో వందకోట్ల విలువైన మద్యం విక్రయమైనట్లు ఆబ్కారీశాఖ అంచనా వేస్తోంది. -
ఘల్లుమంది గ్లాసు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంతో అమ్మకాల వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. గతేడాది జనవరిలో రాష్ట్రంలో రూ.1,306 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది జనవరిలో రూ.1,690 కోట్లు విక్రయాలు జరిగాయి. అంటే.. 29.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. గత ఫిబ్రవరిలో రూ.522 కోట్ల మద్యం విక్రయించగా, ఈ నెల 15 నాటికే అమ్మకాల విలువ రూ.780 కోట్లకు చేరింది. ఫిబ్రవరిలో 15 రోజులకే రూ.258 కోట్ల అధికంగా అమ్మకాలు జరిగాయి. 15 రోజులకే గతేడాది ఫిబ్రవరి కంటే 49.22 శాతం వృద్ధి రేటు నమోదు కావడంపై ఎక్సైజ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ ఫిబ్రవరిలో మద్యం విక్రయాలను పరిశీలిస్తే.. అమ్మకాల్లో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో ఉంది. చిత్తూరు జిల్లాలో రూ.79 కోట్లు, వైఎస్సార్ జిల్లాలో రూ.19.58 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది అమ్మకాలపై మొత్తం రూ.15,133 కోట్లకు పైగా ఆర్జించగా, ఈ ఏడాది రూ.17 వేల కోట్ల అమ్మకాల లక్ష్యాన్ని విధించడం గమనార్హం. 2014లో రూ.11,569 కోట్లుగా ఉన్న అమ్మకాల విలువ ఇప్పటివరకు సుమారు రూ.4 వేల కోట్ల వరకు పెరగడం గమనార్హం. ఈవెంట్ల పేరిట విచ్చలవిడిగా అమ్మకాలు మద్యం అమ్మకాల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈవెంట్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలకు అనుమతిలిచ్చింది. కొత్త ఏడాది ప్రారంభం రోజు పార్టీల కోసం ఇష్టమొచ్చినట్లు ఈవెంట్ల పర్మిషన్లు, పగలూ, రాత్రి తేడా లేకుండా అమ్మకాలకు అనుమతులివ్వడంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల మహాశివరాత్రి పర్వదినాన కూడా ఈవెంట్ల పేరుతో ఎక్సైజ్ శాఖ అనుమతులు జారీ చేసింది. అమ్మకాలు పెరగడానికి కారణాలివే.. - డిస్టిలరీల నుంచి మద్యం నిల్వకు 13 జిల్లాల్లో మద్యం డిపోల సంఖ్య పెరిగింది. డిపోలను పెంచి సరుకు సరఫరాకు అందుబాటులో ఉంచారు. - గతేడాది రూ.15 వేల కోట్ల మద్యం ఆదాయం కోసంరాష్ట్ర ప్రభుత్వం 15 వేల కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా (ఎండీఆర్‌లుగా) మార్చేసింది. - చీప్ లిక్కర్‌ను ఏరులై పారించేందుకు ఏకంగా టెట్రా ప్యాకెట్లలో సరఫరా చేసింది. - మద్యం వ్యాపారులకు కమీషన్లను 7 శాతం నుంచి 15 శాతానికి పెంచే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. - బెల్టు షాపుల సంఖ్య గతంలో కంటే అధికంగా పెరిగాయి. ఫోన్ చేస్తే ఇంటికే మద్యం వచ్చేలా సిండికేట్లు ఏర్పాట్లు చేశారు. -
నల్ల‘మందు’తో తెల్ల‘ధనం’
► బెల్టుబాబు డెరైక్షన్.. సిండికేట్ సభ్యుల యాక్షన్ ► మద్యం సిండికేటు నయాదందా ► మూడు రోజులుగా పాతనోట్లు తీసుకోని లిక్కర్ వ్యాపారులు ► కానీ ఆదాయ లెక్కల్లో.. బ్యాంకు జమల్లో మాత్రం అవే ► బ్లాక్‌ను వైట్ చేసుకునే పనిలో బిజీబిజీ పాత రూ.500, రూ.వెయ్యి నోట్లు ఎక్కడా.. ఎవరూ తీసుకోకపోయినా.. వైన్ షాపులు, బార్లలో మాత్రం కళ్లకద్దుకొని తీసుకున్నారు. బోర్డులు పెట్టి మరీ ఆహ్వానించి మందుబాబులను ఊరించారు.. ఆదాయం కిక్కు పెంచుకుందమనుకున్నారు.. నోట్లు రద్దయిన రెండు మూడు రోజుల వరకు అదే జరిగింది కూడా..కానీ ఆ తర్వాతే సీను మారిపోయింది. మందుబాబులకు బంపర్ ఆఫర్ అందకుండాపోయింది. లిక్కర్ వ్యాపారులు పాత నోట్లు తీసుకోవడం మానేశారు..ఉన్న పళంగా వారి వైఖరిలో ఈ మార్పునకు కారణమేంటి?!.. ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశాలే వెలుగుచూశాయి.దాని వెనుక ఓ బెల్టుబాబు మాస్టర్‌మైండ్ ఉందని.. అందులో నల్లడబ్బును మద్యంలో ముంచి తెల్లగా మార్చేసుకోవాలన్న స్వార్థపూరిత ఆలోచనలున్నాయని తేటతెల్లమైంది.మన దగ్గరే గుట్టలు గుట్టలుగా పాత పెద్దనోట్లు ఉండగా.. జనం నుంచి తీసుకోవడమెందుకు?.. వారి నుంచి కొత్త నోట్లే తీసుకొని.. వాటి స్థానంలో పాత నోట్లను చెల్లుబాటు చేసుకోవాలన్న దురాలోచన ఆ బెల్లుబాబుదే.. ఫలితం.. సిండికేట్ పరిధిలోని షాపులవారు పాత నోట్లకు ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను వెనక్కి తీసేసుకున్నారు. -సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం విశాఖపట్నం: నోట్ల కట్టలు.. గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి.. ఇప్పుడవన్నీ బయట చెల్లుబాటు కావు. ఈ బ్లాక్‌ను ఎలా వైట్ చేసుకోవాలి?!.. ప్రధాని ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇదే విషయమై మథనపడిన నగరంలోని లిక్కర్ సిండికేట్ లీడరు అలియాస్ టీడీపీ ప్రజాప్రతినిధి అలియాస్ బెల్టుబాబుకు ఎట్టకేలకు మెరుపులాంటి ఆలోచన తట్టింది. వెంటనే తనవారందరికీ మార్గదర్శనం చేశారట. వైన్‌షాపులు, బార్లలో ఇక వినియోగదారుల నుంచి పాత రూ.500, వెయ్యి నోట్లు తీసుకోకుండా కొత్త 2వేల రూపాయల నోటు, లేదా రూ.వంద100, రూ.50 నోట్లు మాత్రమే తీసుకోవాలని లోపాయికారీగా ఆదేశాలు జారీ చేశారు. అలా వచ్చే రోజూవారీ వసూళ్ల స్థానంలో పాత నోట్ల కట్టలను తీసుకొచ్చి ఆదాయం లెక్కల్లోచూపించేస్తే.. బ్లాక్‌లో ఉన్న కొంత సొమ్మయినా వైట్ చేసుకునే వీలుంటుందని సదరు బెల్టుబాబు లెక్కట. అందుకే ఇప్పుడు నగరం, నగర శివారులోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో కొత్త నోట్లు మాత్రమే తీసుకుంటామని బోర్డులు పెడుతున్నారు. వాస్తవానికి ఈ నెల 8వ తేదీ రాత్రి కేంద్రం రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆయా నోట్లను తీసుకునేది లేదంటూ బోర్టులు పెట్టేశాయి. కానీ విశాఖ నగరం, శివారులోని మద్యం షాపులు, బార్ల యజమానులు మాత్రం పాత నోట్లను తీసుకుంటామని బోర్డులు పెట్టి మరీ మందుబాబులను ఆహ్వానించారు. బ్లాక్ టు వైట్‌కు ఇదే అదను.. నగరంలోని లిక్కర్ వ్యాపారుల తరఫున దళారీగా వ్యవహరించే సదరు టీడీపీ ప్రజాప్రతినిధి నల్లధనాన్ని వైట్ చేసుకోవాలంటే ఇదే సరైన సమయమని భావించాడు. అందుకే రోజూవారీ ఆదాయంలో భాగంగా పాత నోట్లను తీసుకోకుండా కేవలం కొత్త రూ.2వేల నోట్లు, వందలు, యాభైలు, చిల్లర మాత్రం తీసుకోవాలని సిండికేట్ వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశాడని అంటున్నారు. రోజువారీ లావాదేవీల్లో వచ్చే సొమ్మును ఎలాగూ ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం గొడౌన్లోనో.. బ్యాంకుల్లోనో చెల్లిస్తారు కనుక వైట్ అయిపోతుందన్నది ఆయనగారి వ్యూహం. ఆ మేరకు ఈ నెల 14వ తేదీ నుంచి నగరంలోని అన్ని మద్యం దుకాణాల వద్ద పాతనోట్లు చెల్లవని బోర్డులు పెట్టేశారు. విశాఖ, నగర శివారుల్లో కలిపి దాదాపు 110 మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. సగటున రోజుకి ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల విక్రయాలు జరుగుతుంటాయని అంచనా. వాస్తవానికి గత వారంరోజులుగా సరైన విక్రయాలు లేక రోజూవారీ ఆదాయం ఒకింత తగ్గింది. అయితే రోజూవారీ ఆదాయం పది కోట్లుపైగా చూపిస్తూ ఇప్పటికే భారీమొత్తంలో బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారని చెబుతున్నారు. బెల్టుబాబుతో సహా సిండికేట్ సభ్యులు దాచుకున్న మొత్తం సొమ్ము వైట్ చేసుకోలేకపోయినా.. కొంతలో కొంత మార్పిడి చేసుకునేందుకు ఇదే అవకాశంగా భావిస్తున్నారు. సహజంగానే బెల్టుబాబు అలియాస్ టీడీపీ ప్రజాప్రతినిధి దెబ్బకు.. వైన్‌షాపుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకోవడం తప్ప మిగిలిన వాటి జోలికిపోని ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు కూడా ఏమీ తెలియనట్లే నిద్ర నటిస్తున్నారు. -
మద్యం వ్యాపారుల గుండె గుబిల్లు
సాక్షిప్రతినిధి, అనంతపురం : మద్యం అమ్మకాల్లో సరికొత్త విధానానికి ఎక్సైజ్ శాఖ శ్రీకారం చుట్టింది. నకిలీ మద్యాన్ని నివారించే చర్యలకు ఉపక్రమించింది. నాణ్యతతో పాటు మద్యం తయారీ, అమ్మకాలపై పారదర్శకత పాటించేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. మద్యం సీసాలపై హోలోగ్రామ్‌లు వేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తె చ్చిపెడుతున్న ఎక్సైజ్ శాఖలో సరికొత్త విధానాలను అవలంభించడం ద్వారా సేవలను విస్తృతం చేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చనేది ఈ కొత్త పంథా ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త కంప్యూటర్ బిల్లింగ్, హోలోగ్రామ్ విధానం డిసెంబరు నుంచి అమలు చేసేందుకు కసరత్తు మొదలెట్టారు. ప్రతీ మద్యం దుకాణంలో ఆన్లైన్ కంప్యూటర్ బిల్లు ఇచ్చేందుకు పరికరాలను ఏర్పాటు చేస్తారు. సూపర్ మార్కెట్ తరహాలో మద్యం విక్రయించగానే కంప్యూటర్ స్క్రాచ్ ద్వారా బిల్లు వేసి, బిల్లు ప్రతిని కొనుగోలు దారుడికి అందజేయాలి. ఈ బిల్లు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎకై ్స జ్ కమిషనర్ కార్యాలయానికి చేరుతుంటాయి. ప్రతీ మద్యం సీసాపై హోలోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. దానిపై ఒక సీరియల్ నెంబర్‌ను ముద్రిస్తారు. ఆ నెంబర్‌కు సీసాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. బాటిల్‌పై ఓ టోల్‌ఫ్రీ నెంబరును ముద్రిస్తారు. తాను కొన్న మద్యం సీసా గురించి తెలుసుకోవాలనుకునే కొనుగోలుదారుడు సీసాపై ఉన్న టోల్‌ఫ్రీ నెంబరుకు ఎస్ఎంఎస్ పంపితే చాలు. ఆ సీసా ఎప్పుడు.. ఎక్కడ తయారు చేశారు.. ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది.. ఏ దుకాణానికి చేరింది.. అనే వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. అక్రమ ప్రవాహానికి అడ్డుకట్ట ప్రస్తుతం మద్యం సీసాలపై లేబుల్స్ ఉన్నాయి. కొందరు మాఫియా అవతారమెత్తి నకిలీ లేబుళ్లను తయారు చేసి, నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి మద్యాన్ని భారీగా దిగుమతి చేస్తున్నారు. కర్ణాటకలో మద్యం ధరలు తక్కువ. పైగా ట్యాక్స్ వెసులుబాటు ఉంటుంది. దీంతో మద్యం వ్యాపారులు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కొత్త విధానం ద్వారా వీటిని పూర్తిగా నివారించే అవకాశం ఉంది. నకిలీ మద్యంలో ప్రమాదకర రసాయనాల కారణంగా దాన్ని తాగిన వారు అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ప్రతీ నెలా 75 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కొత్త విధానం అమలైతే మద్యం మాఫియా ఆగడాలకు బ్రేక్‌పడుతుంది. కల్తీ, అక్రమ మద్యం సరఫరా నిలిచిపోతుంది. దీంతో ఎకై ్సజ్ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కొత్త విధానంపై మద్యం వ్యాపారులు గుర్రుగా ఉన్నారు. అయితే ఎకై ్సజ్ అధికారులు మాత్రం తమ పని సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. కాగా, తమ అదనపు ఆదాయం తగ్గుతుందని కొందరు అధికారులు దిగాలుగా ఉన్నారు. వ్యాపారులకు ముచ్చెమటలు ఆన్లైన్ విధానం అమలుపై మద్యం వ్యాపారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఎమ్మార్పీ కంటే 10-15 రూపాయల అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఆన్లైన్ బిల్లు అంటే ఇది కుదరదు. పైగా కంప్యూటర్ల కోసం 90 వేల రూపాయలు చెల్లించాలి. దీనికి కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేయలేకపోతే తామే కంప్యూటర్లను ఏర్పాటు చేస్తామని, ప్రతీ నెలా 5 వేల రూపాయలు అద్దె రూపంలో వసూలు చేస్తామని చెబుతోంది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లినా ఫలితం కనపడ లేదు. తాడిపత్రి, రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండలోని వ్యాపారులు సొంతంగా కొనుగోలు చేశారు. తక్కిన వ్యాపారులు అద్దె వాటిపై మొగ్గు చూపారు. డిసెంబరు 1 నుంచి అమలుకు కృషి డిసెంబరు 1నుంచి ఆన్లైన్, హోలోగ్రామ్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో 90 శాతం మద్యం దుకాణాలకు ఆన్లైన్ బిల్లింగ్ సామగ్రి ఏర్పాటు, మద్యం దుకాణాల నుంచి ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయానికి సాప్ట్వేర్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఒకవేళ డిసెంబర్ నుంచి అమలు చేయలేకపోతే, జనవరి నుంచి కొత్త విధానం కచ్చితంగా అమలు చేస్తాం. - జీవన్‌సింగ్, డిప్యూటీ కమిషనర్, ఎకై ్సజ్ శాఖ. -
నేటి నుంచి ‘వైన్ స్కాన్’..!
కంప్యూటర్ బిల్లు తప్పనిసరి స్కానర్ ఉంటేనే మద్యం స్టాకు గగ్గోలు పెడుతున్న వ్యాపారులు చిత్తూరు(అర్బన్): నూతన ఎక్సైజ్ విధానం మద్యం వ్యాపారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జిల్లాలో ఆగస్టు ఒకటి (శుక్రవారం) నుంచి ప్రతి మద్యం దుకాణంలో కంప్యూటర్ బిల్లింగ్, మద్యం బాటిళ్లను స్కాన్ చేయడం తప్పనిసరంటూ అధికారులు నిబంధనలు విధించడంతో మద్యం దుకాణాదారులు దిగులుచెందుతున్నారు. కంప్యూటర్లు పెట్టుకోని వారికి స్టాకు ఇచ్చేదిలేదని ఎక్సైజ్ అధికారులు ఖరాకండిగా చెబుతున్నారు. ఇదే జరిగితే దుకాణాలు మూసేయూల్సిందేనని మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలివీ... జిల్లాలో 458 మద్యం దుకాణాల నిర్వహణకు ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వడం, ఇందులో 385 దుకాణాలకు వ్యాపారులు లెసైన్సులు దక్కించుకోవడం జరిగిపోయింది. నూతన పాలసీతో ఇప్పటికే ప్రభుత్వానికి జిల్లా ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.120 కోట్ల వరకు ఆదాయం దక్కింది. అయితే నూతన పాలసీలో ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ఇందులో భాగంగా స్కాన్ అండ్ ట్రేస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో ప్రతి మద్యం సీసాపై హోలోగ్రాఫిక్ ఎక్సైజ్ అడహేషన్ లేబుల్ (హెచ్‌ఈఏఎల్) ఏర్పాటు చేయాలి. అంటే మద్యం స్టాకును దుకాణాలకు తరలించేప్పుడే ప్రతి బాటిల్, బాక్సులకు హెచ్‌ఈఏఎల్ వేస్తారు. వీటిని దుకాణాల్లో విక్రయించేప్పుడు అక్కడ ఓ కంప్యూటర్, ప్రింటర్, స్కానింగ్ పరికరాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి బాటిల్ విక్రయానికి కంప్యూటర్ బిల్లింగ్ ఇచ్చి గరిష్ట చిల్లర ధర మాత్రమే వసూలు చేయాలి. ఇప్పటికే 20 శాతం వరకు లెసైన్సు ఫీజులు పెరగడం, ప్రతి మద్యం దుకాణానికి రూ.2 లక్షలు చెల్లించి పర్మిట్ గది తీసుకోవడం, ఏడు సార్లు షాపులు నిర్వహించిన వాటికి లెసైన్సు ఫీజులో ఎనిమిది శాతం ప్రివిలైజేషన్ రుసుము అదనంగా చెల్లించాలనే నిబంధనలకు తలూపిన మద్యం వ్యాపారులు తాజాగా కంప్యూటర్ బిల్లింగ్ ఇవ్వడానికి మాత్రం ససేమిరా అంటున్నారు. కానీ ఆగస్టు ఒకటి నుంచి డిపోల్లో తీసుకునే మద్యం స్టాకుకు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లు ఉండాలని, లేనిపక్షంలో స్టాకు ఇవ్వడం కుదరదని అధికారులు చెబుతున్నారు. వ్యాపారుల ఇబ్బందులు... మద్యం బాటిల్‌పై కంప్యూటర్ స్కానింగ్ పద్ధతి ఉండటంతో ఎవరైనా కేసుల కొద్దీ మద్యం కొనుగోలు చేసి బయట విక్రయిస్తే బెల్టుషాపు నిర్వహస్తున్నారని స్టాకు ఇచ్చిన తమపై కేసు నమోదు చేస్తారని వ్యాపారులు భయపడుతున్నారు. ప్రైవేటు ఏజెన్సీలకు కొమ్ము కాయడానికే అంద రినీ ఒకే వ్యక్తి నుంచి కంప్యూటర్ పరికరాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతి బాటిల్‌ను స్కానింగ్ చేస్తూ, బిల్లులు ఇచ్చుకుంటూ వెళితే రద్దీగా ఉన్నప్పుడు, విద్యుత్ సరఫరా లేనప్పుడు వ్యాపారం జరగదని చెబుతున్నారు. బిల్లింగ్ ఉండాల్సిందే... వ్యాపారులు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లులు పెట్టాల్సిందే. లేకుంటే మద్యం స్టాకు ఇచ్చే ప్రసక్తేలేదు. గెజిట్ నోటిఫికేషన్లో ఈ అంశాలన్నీ స్పష్టంగా పేర్కొన్నాం. బిల్లింగ్ లేకుండా మద్యం విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటా. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు. - శేషారావు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్, చిత్తూరు. -
మూడు మాసాలు.. రూ.211.48 కోట్లు
ఎన్నికల వేళ భారీగా పెరిగిన మద్యం రాబడి - గత ఏడాదితో పోలిస్తే రూ.20.29 కోట్లు అదనం - జోరుగా సాగిన మద్యం అమ్మకాలు - వ్యాపారులకు కలిసొచ్చిన వరుస ఎన్నికలు - కోడ్ కంటే ముందుగానే కొనుగోళ్లు నల్లగొండ, న్యూస్‌లైన్ : జిల్లాలో జరిగిన వరుస ఎన్నికల్లో మద్యం ప్రవాహం ఉరకలెత్తింది. మద్యం వ్యాపారులు ఊహించిన దాని కంటే అధికంగా అమ్మకాలు సాగాయి. ఎన్నికల కోడ్ పొంచి ఉన్నప్పటికీ భారీగా మద్యం అమ్మకాలు సాగడం విశేషం. ఫలితంగా ఎక్సైజ్ శాఖకు కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చి చేరింది. ఎన్నికల సంఘం బెల్టుషాపులు ఎత్తివేయాలని మార్చిలోనే ఆదేశాలు జారీ చేయడంతో మద్యం వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరించి కోట్ల రూపాయల మద్యాన్ని ముందుగానే కొనుగోలు చేశారు. ఎన్నికల్లో మద్యం కీలకం కావడంతో రాజకీయ పార్టీలు సైతం భారీ మొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేసి ఎన్నికల వేళ ఏరులై పారించాయి. ఫలితంగా జిల్లాలో గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఎన్నికల హడావుడి నెలకొన్న ఈ మూడు మాసాల్లో కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. జిల్లాలో 255 మద్యం దుకాణాల్లో గతేడాది ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు 191.18 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే ఈ ఏడాది అదే నెలల్లో రూ.211.47 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే ఈ ఎన్నికల్లో అదనంగా రూ.22.29 కోట్ల మద్యం ఎక్కువగా అమ్ముడైంది. రికార్డుస్థాయిలో అమ్మకాలు.. జిల్లాలో మొత్తం 15 ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో కోదాడ, హుజూర్నగర్, నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, హాలియా, నాంపల్లి సర్కిళ్లలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉంటాయని భావించిన వ్యాపారులు ఫిబ్రవరిలోనే కోట్ల రూపాయల మద్యాన్ని కొనుగోలు చేశారు. దీంతో గతేడాది ఫిబ్రవరిలో రూ.56 కోట్ల 91 లక్షల మద్యం అమ్మకాలు జరిగితే ఈ ఏడాది అదే నెలలో రూ.72 కోట్లకు పెరిగింది. ఈ ఒక్క నెలలో జరిగిన అమ్మకాల ద్వారానే ప్రభుత్వానికి రూ.15 కోట్ల మేర ఆదాయం వచ్చి చేరింది. ఇక బెల్టుషాపులు ఎత్తివేసిన మార్చిలో మాత్రం మద్యం సేల్స్ ఓ మోస్తారుగానే పెరిగాయి. జిల్లాలో గతేడాది మార్చిలో రూ.63 కోట్ల 47 లక్షల మద్యం అమ్మకాలు జరిగితే ఈ సారి మార్చిలో రూ.65 కోట్ల 52 లక్షల అమ్మకాలు జరిగి రూ.2 కోట్ల మేర ఆదాయం సమకూరింది. సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఏప్రిల్‌లో కూడా బెల్టుషాపులపై గట్టి నిఘా ఉండటంతో ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు వ్యాపారులకు ముందస్తు అడ్వాన్సులు చెల్లించి పెద్దమొత్తంలో మద్యం నిల్వలు దాచారు. దీంతో గతేడాది ఏప్రిల్‌లో రూ.70 కోట్ల 80 లక్షల మద్యం అమ్మకాలు జరిగితే ఈ ఏడాది అదే నెలలో రూ.73 కోట్ల 95 లక్షల వ్యాపారం జరిగింది. ఈ నెలలో జరిగిన అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.3 కోట్ల 15 లక్షల ఆదాయం వచ్చింది. మొత్తంగా మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల పుణ్యమాని మద్యం అమ్మకాలు ఇటు వ్యాపారులకు, అటు ప్రభుత్వానికి మంచి ఆదాయాన్నే తెచ్చిపెట్టాయి. ఏరులైపారిన లిక్కర్... ఈ ఎన్నికల్లో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగాయి. గ్రామాల్లో ఓటర్లును ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు మద్యం బాటిళ్లను విచ్చలవిడిగా పంపిణీ చేశారు. దీంతో కిందటేడుతో పోలిస్తే ఈ దఫా లక్షల్లో లిక్కర్ పెట్టెలు అమ్ముడయ్యాయి. గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో కలిపి మొత్తం లిక్కర్ 2,99,422 పెట్టెలు అమ్ముడుకాగా, ఈ ఏడాది అదే నెలల్లో 3,57,636 పెట్టెలు అమ్ముడయ్యాయి. అదే విధంగా బీర్ల విషయానికొస్తే గతేడాది 7,57,613 పెట్టెలు అమ్ముడుకాగా, ఈ ఏడాది అదే నెలల్లో 6,65,577 పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనిని బట్టి గమనిస్తే ఎన్నికల్లో బీర్ల కంటే లిక్కర్ ప్రభావం బాగా పనిచేసినట్లు స్పష్టమవుతోంది.