3 రోజులు..రూ.450 కోట్లు | Amid Lockdown Liquor Traders Maintain Huge Stocks In Telangana | Sakshi
Sakshi News home page

3 రోజులు..రూ.450 కోట్లు

Published Sat, May 9 2020 3:21 AM | Last Updated on Sat, May 9 2020 5:10 AM

Amid Lockdown Liquor Traders Maintain Huge Stocks In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా ఆంక్షలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం వ్యాపారులు భారీ స్థాయిలో లిక్కర్‌ స్టాక్‌ తెచ్చి పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని 20 ఐఎంఎల్‌ డిపోల నుంచి అమ్మకాలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే దాదాపు రూ. 450 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాల్లో నిల్వ చేసుకున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇంత విలువలో అమ్మకాలు జరిగేందుకు దాదాపు 12 రోజులు పడుతుందని, ఇప్పుడు ధరలు, విక్రయాలు పెరిగిన నేపథ్యంలో 7–10 రోజుల్లోనే ఈ స్టాక్‌ అమ్ముడవుతుందని బ్రేవరేజెస్‌ కార్పొరేషన్‌ వర్గాలంటున్నాయి.
(చదవండి: మనో బలం మన సొంతం)

రోజుకు 2 లక్షల లిక్కర్‌ కేసులు..
రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు బుధవారం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించగా అదే రోజు నుంచి డిపోల ద్వారా విక్రయాలు కూడాప్రారంభమయ్యాయి. అయితే బుధవారమంతా గతంలో తమ వద్ద ఉన్న స్టాక్‌ అమ్మామని వైన్స్‌ యజమానులు పేర్కొనగా ఇదే విషయాన్ని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కూడా ధ్రువీకరించి వైన్స్‌ యజమానులకు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. కానీ బుధవారం డిపోల నుంచి పెద్ద ఎత్తున లిక్కర్‌ దుకాణాలకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. 

డిపోల నుంచి ప్రతిరోజూ బ్రేవరేజెస్‌ కార్పొరేషన్‌కు వచ్చే లెక్కల ప్రకారం బుధవారం రూ. 72 కోట్ల విలువైన ఇండెంట్లు మద్యం షాపుల నుంచి వచ్చాయి. దాని ప్రకారం 72 వేలకుపైగా కేసుల లిక్కర్, 1.12 లక్షల కేసుల బీర్లు దుకాణాలకు చేరాయి. అలాగే గురువారం ఏకంగా 2 లక్షలకుపైగా లిక్కర్‌ కేసులు వైన్స్‌ బాట పట్టాయి. బీర్లు అయితే లక్ష కేసులు దాటాయి. శుక్రవారం కూడా ఇదే ఒరవడి కొనసాగింది. గురువారం జరిగిన స్థాయిలోనే శుక్రవారం కూడా డిపోల నుంచి మద్యం రవాణా జరిగింది. దీంతో ఈ మూడు రోజుల్లో 5 లక్షలకుపైగా కేసుల లిక్కర్, 3 లక్షల కేసులకుపైగా బీర్లు రాష్ట్రంలోని 2 వేలకుపైగా ఉన్న మద్యం దుకాణాలకు చేరాయి. 

తగ్గిన బీర్ల అమ్మకాలు...
గతంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు తగ్గాయని తెలుస్తోంది. అందుకే బీర్ల ఇండెంట్‌ కూడా మూడు రోజులకు 3 లక్షల కేసులు దాటలేదని బీర్ల కంపెనీలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్, మేలలో 45–50 లక్షల చొప్పున బీర్లు అమ్ముడవుతాయి. అంటే రోజుకు కనీసం 1.5 లక్షల బీర్‌ కేసులు అమ్ముడుపోతాయి. కానీ తాజా ఇండెంట్‌ను పరిశీలిస్తే రోజుకు లక్ష కేసుల బీర్లు కూడా రాలేదు. ఇందుకు రెండు కారణాలున్నాయని బీర్ల కంపెనీలు అంటున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో మద్యం అమ్మినంతగా, బీర్లు అమ్మలేదని, అందుకే స్టాక్‌ ఉన్న బీర్లు అమ్ముకున్న తర్వాతే మళ్లీ ఇండెంట్లు పెడుతున్నారని చెబుతున్నాయి. దీంతోపాటు ఇళ్లలో లిక్కర్‌ పెట్టుకున్నంత సులువుగా బీర్లు స్టాక్‌ పెట్టుకోలేరని, అందుకే నిల్వ చేసుకునేందుకు కూడా అవకాశం లేదని అంటున్నారు. 

లిక్కర్‌... లిక్విడ్‌ స్టాక్‌
మందుబాబులు మద్యాన్ని విపరీతంగా కొంటున్నారని లిక్కర్‌ ఇండెంట్‌ గణాంకాల ద్వారా అర్థమవుతోంది. మళ్లీ మద్యం షాపులు మూసేస్తారనే అనుమానంతో కొన్ని రోజులకు సరిపడా మద్యం తీసుకెళ్తున్నారని తెలుస్తోంది. అయితే చీప్‌లిక్కర్‌ అమ్మకాలు కొంత తగ్గాయని, లేదంటే లిక్కర్‌ అమ్మకాలు ఇప్పుడు తారస్థాయిలో ఉండేవని వైన్స్‌ యజమానులు చెబుతున్నారు. 

నాలుగో తరగతి ఉద్యోగులు, దిగువ మధ్యతరగతికి చెందిన వారు, గ్రామీణ పేదలు, వలస కూలీలు ఎక్కువగా తాగే చీప్‌ లిక్కర్‌ ఆశించిన స్థాయిలో అమ్ముడుపోవడం లేదని వారంటున్నారు. ఇందుకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన గుడుంబాతోపాటు వేసవిలో ఎక్కువగా లభించే కల్లు కూడా కారణమని తెలుస్తోంది. మొత్తంమీద అమ్మకాలు ఎలా ఉన్నా మందుబాబులు, లిక్కర్‌ వ్యాపారుల ముందుచూపుతో పెద్ద ఎత్తున సరుకు మాత్రం దుకాణాలకు చేరుకుంటోంది. 

(చదవండి: ఆన్‌లైన్‌లో మద్యం విక్రయంపై ఆలోచించండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement