ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద సోమ వారం ఉదయం క్వాలిస్ రాంగ్‌రూట్‌లో వచ్చి మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదం లో కారులో ఉన్న నాన్నమ్మ, తాతలతోపాటు వారి మనవడు కూడా ప్రాణాలొదిలారు.
నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలో ఇటీవల రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు.
లాక్‌డౌన్ కాలంలో రోడ్డుప్రమాదాలు తగ్గినట్టే తగ్గినా, ఇప్పుడు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్ అనంతరం జనజీవితం క్రమంగా సాధారణస్థితికి చేరుకుంటోంది. ఈ క్రమంలో చాలామంది దైవదర్శనాలు, వివాహాలు, ఇతర వేడుకల కోసం దూరప్రయాణాలు చేస్తున్నారు. అయితే కరోనా నివారణలో భాగంగా ప్రజారవాణా వాహనాలకు బదులుగా వ్యక్తిగత వాహనాలవైపే ఎక్కుమంది మొగ్గు చూపుతుండటం మంచిదే అయినా.. హైవేలపై వాహనాలను చాలామంది సరిగా నియంత్రించలేకపోతున్నారని పోలీసులు అంటున్నారు.
అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు మునుపటిస్థాయికి చేరుకున్నాయని తెలిపారు. గతేడాది 12 నెలల్లో 6,882 మంది రోడ్డుప్రమాదాల్లో మరణించగా, ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 30వ తేదీ వరకు 3,245 మంది పౌరులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని రోడ్‌సేఫ్టీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మే నెలలో తగ్గినట్టే తగ్గి..
కరోనా వైరస్ నియంత్రణకుగాను ఏప్రిల్ చివరివారం నుంచి జూన్ మొదటివారం వరకు వివిధ దశల్లో రాత్రిపూట కర్ఫ్యూ, తర్వాత పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ కొనసాగింది. ఈ క్రమంలో వాహనాల సంచారంపై నియంత్రణ ఉండటంతో ప్రమాదాలు కాస్త తగ్గాయి. మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 1,315 ప్రమాదాల్లో 1,092 మంది గాయపడగా, 474 మంది మరణించారు. జూన్‌లో కరోనా ఆంక్షలు సడలించగా రోడ్లపై వాహనాల రద్దీ పెరగడంతో ఆ 1,598 ప్రమాదాలు జరిగాయి. అందులో 1,467 మంది గాయపడగా.. 530 మంది విగతజీవులుగా మారారని రోడ్‌సేఫ్టీ గణాంకాలు వెల్లడించాయి.
మే నెలలో రోజుకు 42 ప్రమాదాలు జరగ్గా.. అందులో సగటున 15 మంది మరణించారు. 35 మంది గాయాలపాలయ్యారు. జూన్‌లో రోజుకు 51 ప్రమాదాలు జరగగా, 17 మరణాలు సంభవించాయి. 47 మంది గాయపడ్డారు. జూన్ 30 వరకు మొత్తం 6,130 రోడ్డుప్రమాదాలు సంభవించగా అందులో 3,245 మంది మరణించారు. 9,575 మంది క్షతగాత్రులయ్యారు. వివిధ పోలీస్ యూనిట్లపరంగా మృతుల సంఖ్య... రాచకొండ(274), సైబరాబాద్ (264), సంగారెడ్డి(212), వరంగల్ (207), రామగుండం (202)లు ముందు వరుసలో నిలిచాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా జాతీయ రహదారులు ఉన్న జిల్లాల పరిధిలోనే చోటుచేసుకోవడం గమనార్హం.
రూ.84 కోట్లకు చేరుకున్న ఉల్లంఘనలు
రోడ్డు భద్రతానియమాలు పాటించకపోవడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతుండటం గమనార్హం. ఎంత జరిమానాలు విధించినా చాలామంది నిబంధనలు పాటించడంలేదు. కేవలం ఆరునెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా విధించిన ట్రాఫిక్ చలానాలు రూ.84.11 కోట్లకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం.
ఉల్లంఘన రకం కేసులు విధించిన జరిమానా
ఓవర్ స్పీడింగ్ 7,61,926 రూ.68.51 కోట్లు
ఓవర్ లోడింగ్ 1,10,626 రూ.97.66 లక్షలు
రాంగ్ పార్కింగ్ 4,42,933 రూ.8.81 కోట్లు
మొబైల్ డ్రైవింగ్ 66,813 రూ.4.60 కోట్లు
సీటుబెల్టు ధరించనివారు 62,174 రూ.67.35 లక్షలు
మొత్తం 14,75,725 రూ.84.11 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment