సాక్షి, హైదరాబాద్: మార్చి 26.. 2020కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు రాష్ట్రంలో ఒక్క రోడ్డు ప్రమాద మరణమూ సంభవించలేదు. ఇదో రికార్డు అని రోడ్ సేఫ్టీ విభాగం అధికారులు చెబుతున్నారు. ఎంత కర్ఫ్యూ విధించినా.. రోడ్డు ప్రమాదాల మరణాలు ఆగిన దాఖలాలు గతంలో ఎప్పుడూ చూడలేదని వారు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ కారణంగా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. మార్చి 22 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన దరిమిలా.. వాహనాల రాకపోకలు పూర్తిగా తగ్గాయి. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా నమోదయ్యాయి. సాధారణంగా అతివేగం, నిర్లక్ష్యం, గూడ్స్ వాహనాల్లో ప్రజలను తరలించడం తదితర కారణాలతో ప్రమాదాలు జరిగి, ప్రాణనష్టం అధి కంగా ఉండేది. రోడ్‌సేఫ్టీ విభాగం గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో సరాసరిన రోజుకు 60కిపైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 80 మందికిపైగా క్షతగాత్రులవుతుండగా, 19 మరణాలు సంభవిస్తున్నాయి. గతేడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలతో 6,964 మంది మృతిచెందారు.
మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు..
లాక్‌డౌన్ విధించిన రోజు నుంచి ఇప్పటి వరకు అత్యల్పంగా మరణాలు నమోదయ్యాయి. మార్చి 22 నుంచి మార్చి 31వ తేదీ వరకు రోడ్డు ప్రమాదాల్లో 52 మంది మృతిచెందగా, 142 మంది గాయపడ్డారు. ఇక ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7 వరకు 23 మంది మృతిచెందగా, 68 మంది క్షతగాత్రులయ్యారు. ఈ మరణాలను సాధారణ సగటుతో పోల్చి చూడగా.. రోజు మరణించే వారి సంఖ్య 19 నుంచి 4కు పడిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదాలు కూడా మితిమీరిన వేగం, అదుపుతప్పి పడిపోవడం వల్లనే జరిగాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మార్చి నెల వరకు రాష్ట్రంలో నమోదైన రోడ్డు ప్రమాదాల మరణాల సంఖ్య 1538గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment