మూడు మాసాలు.. రూ.211.48 కోట్లు | Three months in rs.211.48 crore | Sakshi
Sakshi News home page

మూడు మాసాలు.. రూ.211.48 కోట్లు

Published Mon, May 5 2014 1:15 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

మూడు మాసాలు.. రూ.211.48 కోట్లు - Sakshi

మూడు మాసాలు.. రూ.211.48 కోట్లు

ఎన్నికల వేళ భారీగా పెరిగిన మద్యం రాబడి
- గత ఏడాదితో పోలిస్తే రూ.20.29 కోట్లు అదనం  
- జోరుగా సాగిన మద్యం అమ్మకాలు
- వ్యాపారులకు కలిసొచ్చిన వరుస ఎన్నికలు
- కోడ్ కంటే ముందుగానే కొనుగోళ్లు
 
 
నల్లగొండ, న్యూస్‌లైన్ : జిల్లాలో జరిగిన వరుస ఎన్నికల్లో మద్యం ప్రవాహం ఉరకలెత్తింది. మద్యం వ్యాపారులు ఊహించిన దాని కంటే అధికంగా అమ్మకాలు సాగాయి. ఎన్నికల కోడ్ పొంచి ఉన్నప్పటికీ భారీగా మద్యం అమ్మకాలు సాగడం విశేషం. ఫలితంగా ఎక్సైజ్ శాఖకు కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చి చేరింది. ఎన్నికల సంఘం బెల్టుషాపులు ఎత్తివేయాలని మార్చిలోనే ఆదేశాలు జారీ చేయడంతో మద్యం వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరించి కోట్ల రూపాయల మద్యాన్ని ముందుగానే కొనుగోలు చేశారు.

ఎన్నికల్లో మద్యం కీలకం కావడంతో రాజకీయ పార్టీలు సైతం భారీ మొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేసి ఎన్నికల వేళ ఏరులై పారించాయి. ఫలితంగా జిల్లాలో గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఎన్నికల హడావుడి నెలకొన్న ఈ మూడు మాసాల్లో కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. జిల్లాలో 255 మద్యం దుకాణాల్లో గతేడాది ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు  191.18 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే ఈ ఏడాది అదే నెలల్లో రూ.211.47 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే ఈ ఎన్నికల్లో అదనంగా రూ.22.29 కోట్ల మద్యం ఎక్కువగా అమ్ముడైంది.

రికార్డుస్థాయిలో అమ్మకాలు..

జిల్లాలో మొత్తం 15 ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో కోదాడ, హుజూర్‌నగర్, నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, హాలియా, నాంపల్లి సర్కిళ్లలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉంటాయని భావించిన వ్యాపారులు ఫిబ్రవరిలోనే కోట్ల రూపాయల మద్యాన్ని కొనుగోలు చేశారు. దీంతో గతేడాది ఫిబ్రవరిలో రూ.56 కోట్ల 91 లక్షల మద్యం అమ్మకాలు జరిగితే ఈ ఏడాది అదే నెలలో రూ.72 కోట్లకు పెరిగింది.

 ఈ ఒక్క నెలలో జరిగిన అమ్మకాల ద్వారానే ప్రభుత్వానికి రూ.15 కోట్ల మేర ఆదాయం వచ్చి చేరింది. ఇక బెల్టుషాపులు ఎత్తివేసిన మార్చిలో మాత్రం మద్యం సేల్స్ ఓ మోస్తారుగానే పెరిగాయి. జిల్లాలో గతేడాది మార్చిలో రూ.63 కోట్ల 47 లక్షల మద్యం అమ్మకాలు జరిగితే ఈ సారి మార్చిలో రూ.65 కోట్ల 52 లక్షల అమ్మకాలు జరిగి రూ.2 కోట్ల మేర ఆదాయం సమకూరింది.

సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఏప్రిల్‌లో కూడా బెల్టుషాపులపై గట్టి నిఘా ఉండటంతో ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు వ్యాపారులకు ముందస్తు అడ్వాన్సులు చెల్లించి పెద్దమొత్తంలో మద్యం నిల్వలు దాచారు. దీంతో గతేడాది ఏప్రిల్‌లో రూ.70 కోట్ల 80 లక్షల మద్యం అమ్మకాలు జరిగితే ఈ ఏడాది అదే నెలలో రూ.73 కోట్ల 95 లక్షల వ్యాపారం జరిగింది. ఈ నెలలో జరిగిన అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.3 కోట్ల 15 లక్షల ఆదాయం వచ్చింది. మొత్తంగా మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల పుణ్యమాని మద్యం అమ్మకాలు ఇటు వ్యాపారులకు, అటు ప్రభుత్వానికి మంచి ఆదాయాన్నే తెచ్చిపెట్టాయి.

 

ఏరులైపారిన లిక్కర్...

ఈ ఎన్నికల్లో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగాయి. గ్రామాల్లో ఓటర్లును ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు మద్యం బాటిళ్లను విచ్చలవిడిగా పంపిణీ చేశారు. దీంతో కిందటేడుతో పోలిస్తే ఈ దఫా లక్షల్లో లిక్కర్ పెట్టెలు అమ్ముడయ్యాయి. గతేడాది  ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో కలిపి మొత్తం లిక్కర్ 2,99,422 పెట్టెలు అమ్ముడుకాగా, ఈ ఏడాది అదే నెలల్లో 3,57,636 పెట్టెలు అమ్ముడయ్యాయి. అదే విధంగా బీర్ల విషయానికొస్తే గతేడాది 7,57,613 పెట్టెలు అమ్ముడుకాగా, ఈ ఏడాది అదే నెలల్లో 6,65,577 పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనిని బట్టి గమనిస్తే ఎన్నికల్లో బీర్ల కంటే లిక్కర్ ప్రభావం బాగా పనిచేసినట్లు స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement