రజియా (ఫైల్) ,కాలిన మృతదేహాన్ని పరిశీలిస్తున్న పొదిలి ఇన్‌చార్జి సీఐ మొయిన్
కనిగిరి: కనిగిరిలో అదృశ్యమైన వివాహిత రజియా (32) మర్రిపుడి మండలం కూచిపుడి కొండల్లో హత్యకు గురై కాలి బూడిదగా మారింది. రజియా ప్రియుడు ఖాదర్‌బాషానే ఆమెపై అనుమానంతో కొండ గుహల్లోకి తీసుకెళ్లి హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. వివరాలు.. మండలంలోని కంచర్లవారిపల్లికి చెందిన ఎస్‌కే చాంద్‌బాషా, మీరాబీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె రజియా. కనిగిరి మూడో వార్డుకు చెందిన రసూల్‌బాషాతో సుమారు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నేళ్లుగా దంపతుల మధ్య సంబంధాలు లేవు. పదో తరగతి వరకు చదివిన రజియా కంచర్లవారిపల్లిలోనే ఉంటూ ఐకేపీలో యానిమేటర్‌గా పని చేస్తోంది. పట్టణంలోని ఓ షోరూమ్‌లో కంప్యూటర్ అపరేటర్‌గా పనిచేస్తోంది.
ఇలా రోజూ కనిగిరి వస్తూ..పోతోంది. రోజూ ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో రాక పోకలు సాగిస్తూ కనిగిరి బీసీ కాలనీకి చెందిన వివాహితుడైన స్కూల్ బస్సు డ్రైవర్ ఖాదర్‌బాషాతో సన్నిహితం పెంచుకుని చివరకు సహజీవనం చేసేంత వరకూ వెళ్లింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆమె కుటుంబం కనిగిరికి మకాం మార్చింది. పట్టణంలోని కూచిపుడిపల్లిలో నివాసం ఉంటున్నారు. ప్రియుడు ఖాదర్‌బాషా తన ప్రియురాలు రజియాపై అనుమానం పెంచుకున్నాడు. స్కూల్ బస్సుకు, సొంత భార్య, పిల్లల వద్దకు వెళ్లకుండా రజియా చుట్టూ కాపాలాగా తిరుగుతుండే వాడు. మద్యం తాగి వచ్చి ఇంట్లో ఆమెను కొట్టేవాడు. సంపాదించుకున్న కొద్దిపాటి డబ్బులు కూడా లాక్కుని గందరగోళం చేసేవాడు. కొద్ది రోజుల క్రితం రజియా, ఆమె తల్లి మీరాబీలు కనిగిరి పోలీసుస్టేషన్‌లో ఖాదర్‌బాషాపై ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని పిలిచి తీవ్రంగా మందలించారు. వారి వద్ద తీసుకున్న నగదు తిరిగి ఇవ్వాలని, వారి ఇంటికి వెళ్లవద్దని హెచ్చరించారు. ఐదు నెలలుగా అతడు అలాగే వెళ్లడం లేదు. ఇటీవల రజియాతో మళ్లీ మాటలు కలిపినట్లు సమాచారం. శనివారం యానిమేటర్ విధులకు వెళ్లిన రజియా తిరిగి ఇంటికి రాలేదు. రెండు రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో కూచిపుడి కొండల్లో కాలి బూడిదైనట్లు సమాచారం అందుకుని భోరున విలపిస్తున్నారు.
అనుమానంతోనే చంపేశాడా?
ప్రియుడు ఖాదర్‌బాషా అనుమానంతోనే ఆమెను నమ్మకంగా తీసుకెళ్లి హత్య చేసి కాల్చాడని తెలుస్తోంది. సుమారు ఐదేళ్ల సహజీవనం చేసిన తర్వాత అందంగా ఉండే రజియాపై అతడు అనుమానం పెంచుకున్నాడు. ఎవరితో మాట్లాడినా సహించే వాడు కాదని, పెళ్లిళ్లకు వెళ్లినా, ఏదైనా ఊరికి వెళ్లినా కాపాలాగా తిరిగే వాడని తెలిసింది. ఈ క్రమంలోనే ఆమె తనను వదిలించుకుని ఇంకొకరి సొంతమవుతుందేమోననే అనుమానంతో చంపేసి ఉంటాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రజియాను పెళ్లి చేసుకున్న భర్త రసూల్ మూడు నెలల క్రితం చనిపోయాడు.
సీఐ ఏమంటున్నారంటే..
కనిగిరి సీఐ టీవీవీ ప్రతాప్‌కుమార్‌ను “సాక్షి’ వివరణ కోరగా కూచిపుడి సమీపంలోని ఆండ్రా కొండల్లో కాలి బూడిదైన శవం మహిళదిగా తెలుస్తోందన్నారు. ఆ శవం కనిగిరిలో అదృశ్యమైన రజియాదా.. లేక వేరొకరిదా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహం 90 శాతం కాలడంతో అనావాళ్లు గుర్తుపట్టలేకపోతున్నామన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ వివరించారు.
కూచిపూడి (మర్రిపూడి): మండలంలోని కూచిపూడి ఆండ్ర రామలింగేశ్వరస్వామి కొండ గుహల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గురువారం గుర్తించినట్లు ఎస్‌ఐ సుబ్బరాజు తెలిపారు. కూచిపూడికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామలింగేశ్వరస్వామికొండ గుహల్లో 90 శాతం కాలిన మహిళ మృతదేహం గుర్తించినట్లు చెప్పారు. మృతురాలు కనిగిరి మండలంలో అదృశ్యమైన ఎస్‌కే రజియా(32)గా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు సాగుతోందన్నారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. సంఘటన స్థలాన్ని పొదిలి, కనిగిరి సీఐలు మొయిన్, ప్రతాప్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment