పట్టుబడిన నకిలీ మూతలు
కనిగిరి: మద్యం బాటిళ్ల నకిలీ మూతల రవాణాతో ఒక్కో మూతకు కేవలం రూపాయే లాభం. కానీ అందులోని మద్యమే మార్చితే వాటి వెల ప్రాణాలే..అన్నది నగ్నసత్యం. ఆ కోణంలో ప్రధానంగా ఎక్సైజ్ శాఖ దీనిపై ప్రత్యేక దృష్టితో వేట సాగిస్తోంది. మూతల తయారీ వ్యవహారం రాష్ట్ర హద్దులు దాటడంతో జిల్లా, ఎస్‌టీఎఫ్ టీమ్‌లు తమ దర్యాప్తును స్టేట్ ఉన్నతాధికారుల కనుసన్నల్లో ఇతర రాష్ట్ర అధికారుల సహకారంతో సాగిస్తోంది. ఈ వేటలో ఎంతవరకు సఫలీకృతులవుతారన్న సంగతి పక్కన ఉంచితే.. బెంగళూరులోని ముఠా సభ్యుడు భాయ్ పట్టుబడితే తయారీ కేంద్రం..గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది.
చాలెంజ్‌గా ఎందుకు తీసుకున్నారంటే..
బ్రాండ్ మిక్సింగ్ (కల్తీ మద్యం) కేసులో పట్టుబడిన పలువురు నిందితులను ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు విచారించారు. దొరికినవారంతా తాము కేవలం ఓసీ రూ.100 క్వార్టర్ బాటిల్‌లో రూ.50 విలువ చేసే హెచ్‌డీ (తక్కువ ఖరీదు) మద్యాన్ని మాత్రమే మిక్స్ చేసినట్లు వెల్లడించారు. అది కూడా చట్టరీత్య నేరమే. రెండూ మద్యమే అయినా ఒక బ్రాండ్‌లో మరొక బ్రాండ్ (ఎక్కవ ఖరీదులో.. తక్కువ రకం) కలిపి మోసం చేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణించారు. కనిగిరిలో, లేదా ఇప్పటి వరకు దొరికిన నిందుల విచారణలో కేవలం ఓసీ బాటిల్ నకిలీ మూతలే దొరికాయి. ఇవి కాకుండా ఇంకేమైనా బ్రాండ్ కంపెనీల మూతలు కూడా తయారై చలామణీ అవుతున్నాయా..? సెకండ్స్ మద్యం అక్రమ తయారీతో ప్రభుత్వానికి గండి కొడుతున్నారా..? అసలు అనుమతి లేని స్పిరిట్‌తో మద్యం అక్రమ వ్యాపారం ఏమైనా జరుగుతుందా..? కేవలం మూతల రవాణా వ్యాపారమేనా..? అసలు మూతల తయారీ కేంద్రం ఎక్కడ.. తెరవెనుక ఉన్న మాఫీయా కింగ్ ఎవరు..? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కేవలం బ్రాండ్ మిక్సింగ్, నకిలీ మూతల అక్రమ మార్పిడి, రవాణానే కాకుండా ఇంకేమైనా అక్రమాలు జరిగి.. ప్రాణహాని సంభవిస్తే మొత్తం ఆబ్కారీ శాఖకే మచ్చ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్లే ఆబ్కారి శాఖ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోతుగా నకిలీ మూలాలను వెలికి తీసే పనిలో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
చైన్ లింక్ ఇలా..
ఇప్పటి వరకు దొరికిన నిందితులందించిన వివరాల ప్రకారం.. బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన శివ నుంచి మూత రూ.3.50 రూపాయలకు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన పార్దుకు రవాణ చేస్తాడు. అక్కడి పార్దు, జనార్దన్, రమణాలు మూత ఒకటి రూ.4.50 రూపాయలకు (బొట్లగూడురుకు చెందిన కె.మాల్యాద్రి ద్వారా అదే గ్రామానికి చెందిన రెస్టారెంట్, వైన్‌షాపు నిర్వాహకుడు పి.శ్రీనుకు సరఫరా చేస్తారు. పి.శ్రీను అతని బావమరిది కలిసి నెల్లూరు జిల్లా కొండాపురంలో అతని వైన్ షాపులో స్టాక్ పాయింట్ పెట్టుకుని వ్యాపారం సాగిస్తూ పామూరు చెందిన వలిబాషా (ఆటో డ్రైవర్ మద్యం ఖాళీ బాటిల్ అమ్మకాలు కొనుగోలు చేసే)కు రూ.6లకు విక్రయిస్తాడు. అతను కనిగిరి, సీఎస్‌పురం మండలాల్లోని వైన్ షాపులకు (నందిని, కళ్యాణి, టీఎన్‌ఆర్ దుకాణాలకు) రూ.7.50కు విక్రయిస్తాడు. ఇలా నకిలీ మూతలు కనిగిరి నియోజకవర్గంలో చైన్ లింక్‌తో సరఫరా అయ్యాయి. అసలు అక్రమ వ్యాపారానికి పునాది బతుకు దెరువుకోసం షోడో వ్యాపారిని అనంతపురం జిల్లా ధర్మవరానికి వెళ్లిన మాల్యాద్రి అయితే అక్రమార్గానికి మరింత ఆజ్యం పోసి రెండు జిల్లాల్లో విస్తరింప చేసింది శ్రీనుగా తేలింది.
Comments
Please login to add a commentAdd a comment