అంతరాష్ట్ర దొంగ సిజోచంద్రన్‌ను విచారిస్తున్న సీఐ దేవప్రభాకర్
ప్రకాశం, సింగరాయకొండ: పలు రాష్ట్రాల్లో హత్యలు, పిల్లల కిడ్నాప్‌లతో సంబంధం ఉన్న అంతర్‌రాష్ట్ర దొంగ సీజో చంద్రన్ తమ అదుపులో ఉన్నట్లు సీఐ ఆర్. దేవప్రభాకర్ ఆదివారం తెలిపారు. గత జూలై 21న క్యాబ్ డ్రైవర్‌పై దాడి కేసులో ముద్దాయి అయిన సిజోచంద్రన్‌ను విచారించామన్నారు. దీంతో నాగపూర్ లో ఒక చిన్నారి కిడ్నాప్‌ను చేసి రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అరెస్టు అయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సారంగపూర్ జైలులో ఉన్నాడని తెలిసిందని తెలిపారు. అతన్ని విచారణ నిమిత్తం సింగరాయకొండ పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వచ్చినట్లు సీఐ ఆర్. దేవప్రభాకర్ తెలిపారు.
బండారం బట్టబయలు
గత జూలై 21న సిజోచంద్రన్ అరక్కోణం నుంచి హైదరాబాద్‌కు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఈ సమయంలో సిజోచంద్రన్ తనకు సంబంధించిన ఐడీ ప్రూఫ్ జెరాక్స్‌లను క్యాబ్ డ్రైవర్ బి. పార్థిపన్‌కు ఇచ్చాడు. అరక్కోణంలో ఇతనితో పాటు మరో ఇద్దరు ఎక్కారు. కారు కావలి సమీపంలోకి రాగానే క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించి కట్టేసి అతని వద్ద ఉన్న ఏటీఎం కార్డు తీసుకుని అందులో నుంచి రూ. 4 వేలు డ్రాచేసుకున్నారు. ఆ తర్వాత డ్రైవర్‌ను సింగరాయకొండ పరిసరాల్లోని జాతీయరహదారిపై శానంపూడి అడ్డరోడ్డు వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అయితే ఉన్నత చదువులు చదువుకున్న పార్థిపన్ గాయాలతోనే అర్ధరాత్రి సమయంలో సింగరాయకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన సీఐ దేవ ప్రభాకర్ తన సిబ్బందిని మూడు బృందాలుగా పంపి క్యాబ్‌ను వెతికే కార్యక్రమం చేపట్టారు. క్యాబ్ డ్రైవర్ బి. పార్థిపన్‌ది తమిళనాడు రాష్ట్రం తిరువెళ్లూరు జిల్లా అయ్యపాకం గ్రామం. తరువాత జూలై 24న చిలకలూరిపేట టౌన్ లో క్యాబ్‌ను గుర్తించిన ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు దానిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ దుండగులు కారుకు అడ్డువచ్చిన పోలీసుల పైకి కారును ఎక్కించే ప్రయత్నం చేయడంతో వారు త్రుటిలో తప్పించుకున్నారు. చివరికి చిలకలూరిపేట సమీపంలోని ఎడ్డపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో మట్టిరోడ్డువద్ద కారును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే సిజోచంద్రన్‌తో సహా మిగిలిన ఇద్దరూ పరారయ్యారు.
కేసును ఛాలెంజ్‌గా స్వీకరించి
సీఐ దేవ ప్రభాకర్ విచారణ చేపట్టి చివరికి ముద్దాయి అయిన సిజో చంద్రన్‌ను అరెస్టు చేశారు. సిజో చంద్రన్‌ది కేరళ రాష్ట్రం కాగా అతను ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. ఇతను మొత్తం 15 రకాలైన.. చిన్నారుల కిడ్నాప్, బ్యాంకు మేనేజర్‌తో పాటు పలు హత్యలతో సంబంధం ఉంది. ఇతను ప్రధానంగా మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన పలు నేరాలతో సంబంధం ఉంది. ఇతను జైలులో తన సహచరులతో సహవాసం ఏర్పరచుకుని వారి సహాయంతో కార్లు దొంగిలించడం తరువాత ఆకారులో ప్యాసింజర్‌లను ఎక్కించుకోవటం కొంతదూరం పోగానే వారిని బెదిరించి వారి వద్ద డబ్బు లాక్కోవటం చేసేవాడు. వారు వినకపోతే చంపేయటం వీరి నైజం. ఈ విధంగా 2015వ సంవత్సరంలో తునిలో జరిగిన బ్యాంకు మేనేజర్ హత్య కేసులోకూడా ఇతనికి సంబంధం ఉంది. అంతేకాక వాడి, పచోరి పోలీస్‌స్టేషన్‌లలో పలు కేసులున్నాయి. విచారణ పూర్తి కాగానే కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని సీఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment