Interstate thief
-
భక్తుడిలా రెక్కీ .. రాత్రికి చోరీ!
విజయవాడ: ఉదయం పూజా సమయంలో భక్తుడిలా దేవాలయంలోకి ప్రవేశించి.. రాత్రికి ఇనుపరాడ్డుతో తలుపులు తెరిచి దేవతామూర్తుల బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లే ఓ ఘరానా అంతర్రాష్ట్ర దొంగను విజయవాడ నగర పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 60.9 లక్షల విలువ చేసే 80 కేజీల వెండి, 224 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలను నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా సోమవారం విలేకరులకు వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన విజయవాడ వన్‌టౌన్‌లోని కుసుమ హరనాథ మందిరంలో జరిగిన దొంగతనంపై దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. సీసీ పుటేజీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ఈ నెల 12వ తేదీన ప్రకాశం బ్యారేజీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సికింద్రాబాద్ తుకారం గేటు ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల అంగోత్ రాములునాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. విచారణలో నిందితుడు చేసిన తాజా చోరీతో పాటు గతంలో చేసిన దొంగతనాలను అంగీకరించడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. అవనిగడ్డలోని సూర్య దేవాలయంలో నిందితుడు రాము 2011లో దొంగతనం చేసి అరెస్టు అయి జైలు శిక్ష అనుభవించినట్లు చెప్పారు. జైలు నుంచి విడుదలయిన తరువాత అదే పంథాలో దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. చోరీ చేసిన సొత్తును కొద్ది రోజుల పాటు దేవాలయానికి సమీపంలోనే దాచి, పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తరువాత ఆభరణాల రూపం మార్చి విక్రయిస్తుంటాడని కమిషనర్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్, చేబ్రోలు, ఆకివీడు, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నకిరేకల్, కొల్లిపర, తెనాలి, నగరంపాలెం, చేబ్రోలు, వినుకొండ, కృష్ణా జిల్లాలోని విజయవాడ, గన్నవరం, ప్రకాశం జిల్లాలోని నాగులపాడు, తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ ప్రాంతాల్లోని దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు రాములునాయక్‌పై ఇప్పటి వరకు 14 పోలీస్ స్టేషన్లలో 18 కేసులు నమోదయినట్లు చెప్పారు. నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న డీసీపీ బాబురావు, ఏసీపీ హనుమంతరావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు శంకర్, మూర్తిని సీపీ అభినందించారు. -
మొక్కులు తీర్చుకున్న పోలీసులు
సాక్షి, చెన్నై: కొలిక్కిరాని కేసు ఛేదించడంతో పోలీసులు మొక్కులు తీర్చుకున్నారు. సమయపురం మారియమ్మన్‌ను దర్శించుకుని తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంక్, లలిత జ్యువెలరీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మురుగన్ దోపిడీల అనంతరం నటీమణులతో జల్సా చేసినట్టు విచారణలో తేలడం ఆ నటీమణులు ఎవరో అని ఆరాతీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరిలో తిరుచ్చి సమయపురం టోల్గేట్ సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. 470 సవర్ల నగలు, రూ. 19 లక్షల నగదును దుండగులు అపహరించుకు వెళ్లారు. ఈ కేసు విచారణ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాయి. కనీసం ఆదారం కూడా లభించకపోవడంతో నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. అదే సమయంలో కొద్ది రోజుల క్రితం తిరుచ్చిలో మరో దోపిడీ జరిగింది. ప్రముఖ నగల షోరూమ్ లలిత జ్యువెలరీలో జరిగిన దోపిడీ స్టైల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టైల్ ఒకే రకంగా ఉండడంతో పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేశారు. లలిత జ్యువెలరీ కేసు విచారణలో లభించిన సమాచారాలు, ఆధారాలు, దోపిడీ దొంగల చెంతకు పోలీసుల్ని తీసుకెళ్లింది. లలిత జ్యువెలరీ కేసులో తొలుత సెంగం కోర్టులో సురేష్ అనే నిందితుడు లొంగిపోయాడు. అతడ్ని విచారించగా, గణేష్ అనే మరో దొంగ దొరికాడు. ఈ దోపిడీల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న తిరువారూర్ మురుగన్ బెంగళూరు కోర్టులో లొంగి పోయాడు. ఇతగాడ్ని ఇక్కడకు తీసుకొచ్చి భూమిలో పాతిపెట్టిన బంగారాన్ని బయటకు తీశారు. మళ్లీ బెంగళూరు పోలీసులు తమ పరిధిలో ఉన్న కేసుల విచారణ నిమిత్తం మురుగన్‌ను పట్టుకెళ్లారు. తలనీలాలు సమర్పించుకుని.. మురుగన్‌ను తమ కస్టడీకి తీసుకునేందుకు తిరుచ్చి పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. అయితే, బెంగళూరు పోలీసు కస్టడీలో ఉన్న దృష్ట్యా, అక్కడ విచారణ ముగించినానంతరం, ఇక్కడకు అతడ్ని తీసుకొచ్చేందుకు నిర్ణయించి ఉన్నారు. లలితా జ్యువెలరీ దోపిడితోపాటు తొమ్మిది నెలల క్రితం జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ దోపిడీ కూడా మురుగన్ ముఠా పనితనంగా తేలింది. ఈ కేసులో రాధాకృష్ణన్ అనే నిందితుడ్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులు కొలిక్కిరావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసును విచారిస్తున్న బృందంలోని ఇద్దరు పోలీసులు హరిహరన్, విజయకుమార్ ఉదయాన్నే సమయపురం మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేసును ఎట్టకేలకు ఛేదించడంలో తమకు దేవుడి ఆశీస్సులు సైతం ఉన్న దృష్ట్యా, మొక్కులు తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించుకోవడం గమనార్హం. 25 కేజీలు బంగారం స్వాధీనం.. లలిత జ్యువెలరీ కేసులో ఇప్పటి వరకు 25 కేజీల బంగారు స్వాధీనం చేసుకున్నట్టు తిరుచ్చి పోలీసు కమిషనర్ అమల్‌రాజ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసు విచారణ గురించి వివరించారు. ప్రస్తుతం నిందితుడు మురుగన్ బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అక్కడ విచారణ ముగించినానంతరం ఇక్కడ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అతడిపై మరెన్ని కేసులు ఉన్నాయో అని ఆరా తీస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ సాగుతున్నదన్నారు. కాగా నిందితుడు మురుగన్ దోపిడీల అనంతరం మోడల్స్, నటీమణులతో కలిసి జల్సా చేసేవాడుగా విచారణలో తేలినట్టు సమాచారం. కొందరికి దోపిడీ చేసిన నగలను సైతం ఇచ్చి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడడం, రెండు సినిమాలకు సైతం ఫైనాన్స్ చేసి ఉన్నట్టు తేలడంతో ఆ నటీమణులు ఎవరో, ఆ సినిమాల వెనుక ఉన్న వాళ్లు ఎవరో ఆరా తీసే పనిలో ప్రత్యేక బృందం నిమగ్నమైంది. -
డీజిల్ చోరీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
నేరేడ్మెట్: డీజిల్ చోరీ కేసులో పోలీసులు మరో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు.ఈ ఘటనకు సంబందించి గత నెలలో నలుగురిని అరెస్టు చేసిన విదితమే. తాజా బుధవారం ప్రధాన సూత్రదారితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గత డిసెంబర్ నెలలో ఘట్కేసర్–చర్లపల్లి మధ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ), భారత్ పెట్రోల్ కార్పొరేషన్(బీపీసీ)కు చెందిన ప్రధాన పైప్‌లైన్‌కు కన్నం వేసిన అంతర్రాష్ట్ర ముఠా దాదాపు 1.30లక్షల లీటర్ల డీజిల్‌ను చోరీ చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు గత జనవరి 17న నలుగురు నిందితులను అరెస్టు చేసి రూ.90.40లక్షల నగదును స్వాధీనం చేసుకొని, ట్యాంకర్‌ను సీజ్ చేశారు. స్క్రాప్ వ్యాపారం పేరుతో ఘట్కేసర్ ప్రాంతంలో స్థలం లీజుకు తీసుకొని ముఠా సభ్యులతో కలిసి ఈ చోరీకి పథకం రూపొందించిన సూత్రదారి ముంబైకి చెందిన స్క్రాప్ వ్యాపారి సర్వర్ షేక్ అలియాస్ సజ్జు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ట్యాంకర్ యజమాని/డ్రైవర్ సురేష్‌కుమార్ ప్రజాపతిలను బుధవారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4,29,878 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చోరీ చేసిన డీజిల్‌ను ప్రజాపతి తన ట్యాంకర్లో మహారాష్ట్రలోని కరాడ్, సిరూర్లోని కేన్ అగ్రోస్, సాయికృపా షుగర్ కంపెనీలకు తరలించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. సర్వర్షేక్పై ముంబైలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు జియాఉల్ చాంద్ షేక్, సునీల్అనిల్, వాసు, శ్రీకాంత్, నరేష్‌రెడ్డి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వరంగల్‌లో డీజిల్ విక్రయంపై ఆధారాలు సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ శివకుమార్, మల్కాజిగిరి సీసీఎస్ ఇన్స్పెక్టర్లు లింగయ్య, జగన్నాథ్‌రెడ్డి, రుద్రభాస్కర్, కీసర సీఐ ప్రకాష్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, కృష్ణారావు, నర్సింహులు, శివప్రసాద్, శ్రీకృష్ణ, రవి, గోవింద్ పాల్గొన్నారు. -
ఓవర్ టు చెన్నై
సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగ కర్రి సతీష్‌ను తమిళనాడు పోలీసులు తీసుకెళ్లారు. ఇతడితో పాటు ప్రధాన అనుచరుడైన నరేంద్రనూ ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్‌పై చెన్నై తరలించారు. హైదరాబాద్ సహా మొత్తం మూడు రాష్ట్రాల్లో 56 చోరీలు చేసిన ఈ ఘరానా దొంగలను సిటీ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన విషయం విదితమే. రాష్ట్రాల్లోని ఖరీదైన ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని చేసిన ఏడు దొంగతనాల్లో ఈ ముఠా రూ.1.05 కోట్ల సొత్తు ఎత్తుకుపోయింది. ఓ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కేవలం ప్లాటినం, బంగారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు మాత్రమే ఎత్తుకుపోవడం వీరి నైజం. ‘సతీష్ అండ్ కో’ చెన్నైలోని నాలుగు చోట్ల దొంగతనాలు చేసినట్లు తేలింది. విశాఖపట్నంలోని కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్ 13 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు. ఇతడిపై సిటీ పోలీసులు 2016లో పీడీ యాక్ట్ ప్రయోగించి చంచల్‌గూడ జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో అప్పటికే జైల్లో ఉన్న నల్లగొండ వాసి నున్సావత్ నరేంద్ర నాయక్ సహా మరొకరితో కలిసి ముఠా కట్టాడు. ఈ ఏడాది మార్చ్‌లో జైలు నుంచి విడుదలైన ఈ గ్యాంగ్ వరుసపెట్టి చోరీలు చేసింది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, ఏపీల్లోనూ పంజా విసిరింది. గూగుల్ మ్యాప్‌లో ‘గుర్తుపెట్టుకుని’... సతీష్, నరేంద్ర ఖరీదైన ప్రాంతాలు, ప్రముఖులనే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోయారు. జూన్‌లో తమిళనాడుకు వెళ్లిన వీరు లాడ్జిలో మకాం వేశారు. స్థానికంగా అద్దెకు తీసుకున్న బైక్‌పై పగటిపూట సంచరిస్తూ అక్కడి అనువైన ప్రాంతాల్లో తాళం వేసున్న ఇళ్లను గుర్తించారు. రాత్రి చోరీ చేయడానికి వచ్చినప్పుడు ఆ ఇంటిని మర్చిపోకుండా ఉండేందుకు దాని లోకేషన్‌ను గూగుల్ మ్యాప్ ద్వారా ఒకరి నుంచి మరొకరి సెల్‌కు షేర్ చేసుకునే వారు. దీని సాయంతో రాత్రి వేళ మళ్లీ ఇంటి వద్దకు వెళ్లి తమ ‘పని’ పూర్తి చేసుకునే వారు. ఈ పంథాలో మొత్తం నాలుగు చోరీలు చేశారు. చెన్నై, నుంగంబాకం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే డాక్టర్ కౌసిఖ్ ఇంట్లో పంజా విసిరి 146.6 గ్రాముల ప్లాటినం నగలు ఎత్తుకుపోయింది. ఆ తర్వాత తైనంపేట్, ముంబాలమ్, మైలాపూర్ల్లోనూ మూడు ఇళ్లల్లో దొంగతనాలు చేసింది. చెన్నైలో చోరీ చేసిన ప్లాటినం నగలను అమ్మడానికి హైదరాబాద్‌తో పాటు కడప, పొద్దుటూరుల్లోనూ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైంది. చివ రకు ముంబైలో అమ్ముదామనే ప్రయత్నాల్లో అక్కడకు పట్టుకుని వెళ్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ బృందానికి సొత్తుతో సహా చిక్కేసింది. అప్పట్లో వీరి నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.1.05 కోట్ల విలువైన 1712 గ్రాముల బరువున్న ప్లాటినం, బంగారం, వజ్రా లు పొదిగిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై పోలీసులకు సమాచారం... సతీష్, నరేంద్రల విచారణ నేపథ్యంలోనే వారిపై ఉన్న కేసులు, నాన్–బెయిలబుల్ వారెంట్ల నేపథ్యంలో సత్తిబాబు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నారని తేలింది. దీంతో వెంటనే సిటీ పోలీసులు ఆయా అధికారులకు సమాచారం ఇచ్చారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గురువారం వీరిద్దరినీ పీటీ వారెంట్‌పై అక్కడకు తీసుకువెళ్లింది. మొత్తం నాలుగు కేసుల్లోనూ అరెస్టుల పరంపర పూర్తి చేసి సోమవారం నాటికి తిరిగి హైదరాబాద్ తీసుకురావాలని భావిస్తోంది. కేవలం సీసీ కెమెరాలు లేని ఇళ్లను మాత్రమే టార్గెట్ చేసే ఈ గ్యాంగ్ నేరం స్థలంలో తమ వేలిముద్రలు సైతం దొరక్కుండా గ్లౌజులు ధరిస్తుంది. డాక్టర్ కౌశిఖ్ ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో వీరి కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. సతీష్ ముఠా బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉంటున్న కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లోనూ చోరీ చేసింది. అక్కడి సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి యత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులూ ఈ గ్యాంగ్‌ను పీటీ వారెంట్లపై తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
పోలీసుల అదుపులో అంతర్ రాష్ట్ర దొంగ
ప్రకాశం, సింగరాయకొండ: పలు రాష్ట్రాల్లో హత్యలు, పిల్లల కిడ్నాప్లతో సంబంధం ఉన్న అంతర్రాష్ట్ర దొంగ సీజో చంద్రన్ తమ అదుపులో ఉన్నట్లు సీఐ ఆర్. దేవప్రభాకర్ ఆదివారం తెలిపారు. గత జూలై 21న క్యాబ్ డ్రైవర్‌పై దాడి కేసులో ముద్దాయి అయిన సిజోచంద్రన్‌ను విచారించామన్నారు. దీంతో నాగపూర్ లో ఒక చిన్నారి కిడ్నాప్‌ను చేసి రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అరెస్టు అయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సారంగపూర్ జైలులో ఉన్నాడని తెలిసిందని తెలిపారు. అతన్ని విచారణ నిమిత్తం సింగరాయకొండ పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వచ్చినట్లు సీఐ ఆర్. దేవప్రభాకర్ తెలిపారు. బండారం బట్టబయలు గత జూలై 21న సిజోచంద్రన్ అరక్కోణం నుంచి హైదరాబాద్‌కు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఈ సమయంలో సిజోచంద్రన్ తనకు సంబంధించిన ఐడీ ప్రూఫ్ జెరాక్స్‌లను క్యాబ్ డ్రైవర్ బి. పార్థిపన్‌కు ఇచ్చాడు. అరక్కోణంలో ఇతనితో పాటు మరో ఇద్దరు ఎక్కారు. కారు కావలి సమీపంలోకి రాగానే క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించి కట్టేసి అతని వద్ద ఉన్న ఏటీఎం కార్డు తీసుకుని అందులో నుంచి రూ. 4 వేలు డ్రాచేసుకున్నారు. ఆ తర్వాత డ్రైవర్‌ను సింగరాయకొండ పరిసరాల్లోని జాతీయరహదారిపై శానంపూడి అడ్డరోడ్డు వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అయితే ఉన్నత చదువులు చదువుకున్న పార్థిపన్ గాయాలతోనే అర్ధరాత్రి సమయంలో సింగరాయకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన సీఐ దేవ ప్రభాకర్ తన సిబ్బందిని మూడు బృందాలుగా పంపి క్యాబ్‌ను వెతికే కార్యక్రమం చేపట్టారు. క్యాబ్ డ్రైవర్ బి. పార్థిపన్‌ది తమిళనాడు రాష్ట్రం తిరువెళ్లూరు జిల్లా అయ్యపాకం గ్రామం. తరువాత జూలై 24న చిలకలూరిపేట టౌన్ లో క్యాబ్‌ను గుర్తించిన ఎస్ఐ నాగమల్లేశ్వరరావు దానిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ దుండగులు కారుకు అడ్డువచ్చిన పోలీసుల పైకి కారును ఎక్కించే ప్రయత్నం చేయడంతో వారు త్రుటిలో తప్పించుకున్నారు. చివరికి చిలకలూరిపేట సమీపంలోని ఎడ్డపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో మట్టిరోడ్డువద్ద కారును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే సిజోచంద్రన్‌తో సహా మిగిలిన ఇద్దరూ పరారయ్యారు. కేసును ఛాలెంజ్‌గా స్వీకరించి సీఐ దేవ ప్రభాకర్ విచారణ చేపట్టి చివరికి ముద్దాయి అయిన సిజో చంద్రన్‌ను అరెస్టు చేశారు. సిజో చంద్రన్‌ది కేరళ రాష్ట్రం కాగా అతను ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. ఇతను మొత్తం 15 రకాలైన.. చిన్నారుల కిడ్నాప్, బ్యాంకు మేనేజర్‌తో పాటు పలు హత్యలతో సంబంధం ఉంది. ఇతను ప్రధానంగా మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన పలు నేరాలతో సంబంధం ఉంది. ఇతను జైలులో తన సహచరులతో సహవాసం ఏర్పరచుకుని వారి సహాయంతో కార్లు దొంగిలించడం తరువాత ఆకారులో ప్యాసింజర్లను ఎక్కించుకోవటం కొంతదూరం పోగానే వారిని బెదిరించి వారి వద్ద డబ్బు లాక్కోవటం చేసేవాడు. వారు వినకపోతే చంపేయటం వీరి నైజం. ఈ విధంగా 2015వ సంవత్సరంలో తునిలో జరిగిన బ్యాంకు మేనేజర్ హత్య కేసులోకూడా ఇతనికి సంబంధం ఉంది. అంతేకాక వాడి, పచోరి పోలీస్స్టేషన్లలో పలు కేసులున్నాయి. విచారణ పూర్తి కాగానే కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని సీఐ వివరించారు. -
చోరీ సొమ్ము రికవర్రీ
అనంతపురం సెంట్రల్: అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు దొంగలను విచారణ చేస్తున్నారు. నిందితుల నుంచి సొమ్ము రికవరీ చేయడంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఏ తప్పూ చేయకున్నా పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. గత రెండురోజులుగా త్రీటౌన్ పోలీసుస్టేషన్ వద్ద పెద్ద వివాదమే నడుస్తోంది. జిల్లాలో దొంగ– పోలీసు ఆట ప్రతిసారీ వివాదాస్పదమవుతోంది. దొంగలను పట్టుకోవడం ఒక ఎత్తు అయితే.. వారి నుంచి రికవరీ చేయడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. సొమ్ములు ఎక్కడ విక్రయించారన్నది దొంగలు చెబుతున్నప్పటికీ రికవరీ మాత్రం కావడం లేదు. తమకు ఎలాంటి సబంధం లేకున్నా పోలీసులు కక్షకట్టి వసూలు చేస్తున్నారని సదరు వ్యక్తులు వాపోతున్నారు. పోలీసులు చెప్పినంత ఇవ్వకపోతే తమపై అక్రమకేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై నగరంలోని బంగారుషాపు నిర్వాహకులంతా ఏకమై పాతూరు నుంచి డీఎస్పీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తొలుత తమ తప్పేమీ లేదంటున్నప్పటికీ తర్వాత కొంతమేర ముట్టుజెబుతుండడం నేరాలను ఒప్పుకున్నట్టు పరోక్షంగా అర్థమవుతోంది. పోలీసులు కూడా ఇలాంటి వారిపై తమకు రికవరీ రూపంలో నగదు, బంగారు ఇచ్చేస్తే చాలు కేసులేమీ అవసరం లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. తరచూ వివాదాలే.. అనంతపురంలో దొంగలను పట్టుకొని పోలీసులు రికవరీ చూపిస్తున్న ప్రతి కేసులోనూ అంతకుముందు వివాదాలు జరుగుతున్నాయి. మూడునెలల క్రితం సీసీఎస్‌లో పనిచేసే ఓ ఎస్ఐ దొంగను వెంటబెట్టుకొని హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఓ వ్యక్తిని బెదిరించి రికవరీ చేసుకొని వచ్చినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ విషయంపై సదరు వ్యక్తి సైబరాబాద్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల తమిళనాడులో ఏకంగా ధర్మవరం పోలీసులపై దాడి జరిగినట్లు తెలిసింది. ఏడాది కాలంలో రెండు, మూడు దఫాలు పోలీసు వర్సెస్ స్వర్ణకారులు అన్న చందంగా ఆందోళనలు జరిగాయి. తాజాగా ప్రస్తుతం సీసీఎస్– త్రీటౌన్‌పోలీసులు అదుపులో ఉన్న దొంగల విషయంలో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెవిలో కమ్మలతో సహా తీసుకొచ్చారని కొంతమంది మహిళలు విలేకరుల ఎదుట వాపోయారు. తమ బంధువులకు ఎలాంటి సంబంధం లేకపోయినా... గతంలో ఒక్క కేసు కూడా లేకపోయినా తీసుకొచ్చారని గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు మాత్రం ఇలాంటివి సర్వసాధారణమేనని, తమ వద్ద అన్ని సాక్షాధారాలు ఉంటేనే తీసుకొస్తామని స్పష్టం చేస్తున్నారు. -
దొంగతనానికి మంగళవారమే మంచిరోజట..
సాక్షి, హైదరాబాద్: వారాలు, తిథులు, నక్షత్రాలు వంటివి గణించుకొని చాలామంది మంచిపనులకు ఉపక్రమించడం ఓ ఆనవాయితీ. అయితే దొంగతనాలే జీవితంగా బతుకుతున్న మహమ్మద్ సమీర్ ఖాన్‌కూ ఓ సెంటిమెంటు ఉందట. కంటిచూపూ సరిగ్గా లేని ఈ నేరగాడు సహాయకుడు ఉంటే చాలు..పగటి పూట అదీ కేవలం మంగళవారం మాత్రమే చోరీలు చేస్తాడు. ఆ రోజు సెలవు దినమైతే మాత్రమే మరుసటి, ఆ తర్వాతి రోజులకు ‘పని’వాయిదా వేస్తాడు. ఇలా ఘరానా నేరచరిత్ర ఉన్న మహమ్మద్ సమీర్ ఖాన్ సహా ఇద్దరిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21 లక్షల విలువైన 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలసి సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు ఆయన ఈ వివరాలు వెల్లడించారు. 18 ఏళ్ల కిందట సిటీకి వలస... సమీర్ ఖాన్‌కు సమీర్ పఠాన్, షోయబ్ అనే మారుపేర్లూ ఉన్నాయి. ఇతడి పూర్వీకులు అఫ్గానిస్తాన్‌లోని కాబూల్ నుంచి బెంగళూరుకు వలసవచ్చారు. చదువులేకున్నా సమీర్ కన్నడ, ఉర్దూ మాట్లాడగలడు. తన తండ్రి మరణానంతరం 2000లో తన తల్లితో కలసి హైదరాబాద్‌కు వచ్చి బార్కస్‌లో స్థిరపడ్డాడు. సీడీలు, వస్త్రాల వ్యాపారం చేశాడు. 2008లో సెల్‌ఫోన్ చోరీ కేసులో ఎస్సార్‌నగర్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లడంతో ఇతడి నేర చరిత్ర ప్రారంభమైంది. అప్పటి నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పలు నేరాలు చేస్తూ జైలుకు వెళ్లి వస్తున్నాడు. 2011లో ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, 2014లో గోల్కొండ, ఆర్సీపురం, మల్కాజ్గిరి, కు షాయిగూడ, కీసర ఠాణాల పరి«ధుల్లో నేరాలు చేసిన సమీర్ఖాన్పై 30 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని కలబురిగీ, బీదర్, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోనూ నేరాలు చేశాడు. తాజాగా జైల్లో పరిచయమైన ఓల్డ్ మలక్‌పేట వాసి మహమ్మద్ షోయబ్‌ను తన అనుచరుడిగా మార్చుకున్నాడు. అతడు బైక్ నడుపుతుంటే వెనుక కూర్చునే సమీర్ వీధుల్లో తిరుగుతూ అనువైన ఇంటి కోసం గాలిస్తుంటాడు. సమీర్ సోదరులూ చోరశిఖామణులే.. సమీర్ ఇద్దరు అన్నయ్యలూ దొంగలే. వీరిపై ఏపీలోని అనేక ఠాణాల్లో కేసులున్నాయి. ఓ అన్న అక్కడి జైల్లో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. మరో అన్న జైలుకు వెళ్లి వస్తుంటాడు. సమీర్ గత ఏడాది నవంబర్‌లో బెంగళూరులోని కడిగెహల్లీ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత బెయిల్‌పై వచ్చి మరికొన్ని నేరాలు చేశాడు. సిటీలో 3, బీదర్‌లో 5, కలబురిగీలో 4, ఏపీలో ఒకటి నేరాలు చేశాడు. ఇతడి కదలికలపై దృష్టి పెట్టిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఎస్సైల బృందం వలపన్ని సమీర్‌తో పాటు అతని సహాయకుడు షోయబ్‌ను పట్టుకున్నారు. కాగా నగర వాసులు ఎవరైనా రెండుమూడు రోజులకు పైబడి ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళుతుంటే స్థానిక ఠాణాలో సమాచారం ఇవ్వాలని కొత్వాల్ అంజనీకుమార్ కోరారు. ఆ రోజు కాకుంటే... అనువైన ఇంటిని ఎంచుకొని తాళం పగులగొట్టాక సమీర్ బంగారం, నగదుతో పాటు ఇతర విలువైనవీ ఎత్తుకొచ్చేస్తాడు. తాను మంగళవారం కాకుండా వేరే రోజుల్లో చోరీకి వెళ్తే ఆ ఇంట్లో ‘గిట్టుబాటు’కాకపోవడమో, పోలీసులకు చిక్కడమో జరుగుతుందని అతడి నమ్మకం. పోలీసులకు చిక్కకుండా తరచూ సిమ్‌కార్డులు మార్చడం, వాహనం నంబర్ మార్చడం వంటివి పాటిస్తాడు.వాహనంపై ఉన్నప్పుడు కచ్చితంగా హెల్మెట్, దొంగతనం చేసేప్పుడు టోపీ ధరించి సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తపడతాడు. గరిష్టంగా 10 నిమిషాల్లో చోరీని పూర్తి చేసి పరారవుతాడు. -
కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
హైదరాబాద్: కరుడుగట్టిన ఓ అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్ తెలిపారు. సోమవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సైబరాబాద్ క్రైమ్ డీసీపీ జానకి షర్మిల, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ సురేందర్‌తో కలసి వివరాలు వెల్లడించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్లు చంద్రబాబు, సుధీర్, సత్యనారాయణ, టి.శ్రీనివాస్, ఏఎస్ఐ రవీందర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు సత్తయ్య, ప్రవీణ్ కుమార్, దశరథ్, రాంకుమార్లను కమిషనర్ ప్రశంసించారు. వివరాలు... అనంతపురం జిల్లాలోని గుల్జారీపేట్కు చెందిన పఠాన్ మహబూబ్‌ఖాన్ అలియాస్ పఠాన్ అలియాస్ పఠాన్ జహీర్‌ఖాన్(42) చాం ద్రాయణగుట్టలోని బాబానగర్‌లో నివాసముంటున్నాడు. రెండు దశాబ్దాలుగా చోరీలకు పాల్పడుతున్నాడు. నిందితుడి వద్ద నుంచి 87 తులాల బంగారు నగలు, రెండు కిలోల 160 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్, రాచకొండ, సూర్యాపేట, బెంగ ళూర్లలో 20 కేసులు, ఆంధ్రప్రదేశ్ 11, తెలంగాణ 22, కర్ణాటకలో 28 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 10 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2005లో ఎల్బీనగర్, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశా రు. ఆ తర్వాత ఆరేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. చోరీ చేసిన సొత్తును చార్మినార్, బెంగళూర్‌లోని శివాజీనగర్‌లో విక్రయించేవాడు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. విలాసవంతమైన జీవితం గడిపేవాడు. ఉదయం పూటే చోరీలు.... తాళం వేసి ఉన్న ఇళ్లపై పఠాన్ రెక్కీ నిర్వహిస్తాడు. ఉదయం 9 గంటల సమయంలో ఇంటికి చేరుకుంటాడు. వీ ఆకారంలో ఉండే రాడ్, స్క్రూ డ్రైవర్‌ను ఎవరికీ కనిపించకుండా తన వెంట తెచ్చుకుంటాడు. తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి అందినకాడికి నగలు, నగదు చోరీ చేసి ఉడాయిస్తాడు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లో క్లూస్ టీం సేకరించిన వేలిముద్రల ద్వారానే చోరీలకు పాల్పడింది పఠాన్‌గా నిర్ధారించారు. అతడు 9 సెల్ ఫోన్లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో తాళం పగులగొట్టి 47 తులాల ఆభరణాలను పఠాన్ చోరీ చేశాడు. చోరీ కేసుల్లో పఠాన్ ముగ్గురు సోదరులు, ఇద్దరు బావ మరుదులు నిందితులుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎవరికి వారే చోరీలు చేస్తుంటారని, రక్త సంబంధీకులు, బంధువుల్లో ఎవరిని ఎవరూ నమ్మరు. ఎవరు, ఎక్కడ నివాసముంటున్నారనే విషయాన్ని కూడా చెప్పుకోరు. పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రం వారి భార్యలు కోర్టులను ఆశ్రయిస్తారు. తాళం వేస్తే పీఎస్‌లో సమాచారమివ్వండి... ఇళ్లకు తాళం వేసి పండుగ సెలవుల్లో ఎవరైనా ఊళ్లకు వెళితే సంబంధిత పీఎస్‌లో సమాచారమివ్వాలని కమిషనర్ సజ్జనార్ తెలిపారు. విలువైన ఆభరణాలు ఇంట్లో పెట్టవద్దని, బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, ఇళ్ల ముందు సీసీ కెమెరా అమర్చుకోవాలని సూచించారు. సైబరాబాద్ పరిధిలో గతంలో 5 వేల కెమెరాలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 50 వేలకు పెరిగిందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సాంకేతిక సీసీ కెమెరాలపై ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
ఖమ్మంక్రైం: పండ్ల తోటలకు కాపలాదారుడిగా ఉండటం అతని వృత్తి. జల్సాగా జీవితం గడపాలన్నది చిన్నప్పటి నుంచి కోరిక. అందుకోసం దొంగతనాలను ప్రవృత్తిగా మార్చుకున్నాడు. క్రమేణా, ఆ ప్రవృత్తినే... వృత్తిగా మార్చుకున్నాడు. పోలీసులకు చిక్కాడు. సీపీ కార్యాలయంలో బుధవారం పోలీస్ కమిషనర్ (సీపీ) తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించిన వివరాలు... ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడి మండలం కామవరపు కోటకు చెందిన నల్లబోతుల సురేష్, పండ్ల తోటలకు కాపలాదారుడిగా పనిచేసేవాడు. జల్సాలకు అలవాటుపడిన ఇతడు, దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 దొంగతనాలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు. అయినప్పటికీ అతడిలో మార్పు రాలేదు. అక్కడ ఇతని ఉనికి అందరికీ తెలియడంతో ఖమ్మం వచ్చాడు. ఇక్కడే దొంగతనాలు చేయసాగాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా ఎంచుకునేవాడు. తాళాలను పగలగొట్టి, లోనికి ప్రవేశించి నగలను కాజేసేవాడు. వాటిని అమ్మి ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఆ డబ్బు అయిపోయిన తర్వాత మరోసారి దొంగతనానికి దిగుతాడు. ఈ క్రమంలోనే ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడుచోట్ల, ఖానాపురం హవేలి పరిధిలో రెండుచోట్ల, వన్ టౌన్ పరిధిలో ఒకచోట చోరీ చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగతనం చేశాడు. అక్కడ అతడిని గుర్తించడంతో పారిపోయాడు. కోదాడ క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఇతడిని సీసీఎస్ ఏసీపీ ఈశ్వరయ్య అధ్వర్యంలో రూరల్ సీఐ తిరుపతిరెడ్డి, సిబ్బంది కలిసి అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతడి వ్యవహారం బయటపడింది. ఇతని వద్ద 25 తులాల బంగారపు నగలను స్వాధీనపర్చుకున్నారు. వీటి విలువ 7.12లక్షల రూపాయలు ఉంటుంది. సిబ్బందికి అభినందన దొంగను అరెస్ట్ చేసి, సొత్తు రికవరీ చేసిన ఏసీపీ ఈశ్వరయ్య, సీసీఎస్ సీఐ వేణుమాధవ్, రూరల్ సీఐ తిరుపతిరెడ్డి, రూరల్ ఎస్ఐ బాణాల రాము, సీసీఎస్ ఎస్ఐ ఆనందరావు, సిబ్బంది కోలా శ్రీనివాస్, రమణ, రవి, లతీఫ్, ఖలీద్, కిరణ్ గాంధీని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర జేబు దొంగ దొరికాడు
కూసుమంచి: అంతర్రాష్ట్ర జేబు దొంగను కూసుమంచి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని నుంచి ఇండికా కారు, 18వేల రూపాయల నగదు, 12 తులాల బంగారం స్వాధీనపర్చుకున్నారు. కూసుమంచి సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఖమ్మం రూరల్ ఏసీపీ పింగళి నరేష్‌రెడ్డి తెలిపిన వివరాలు... ♦ గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెం ప్రకాష్‌నగర్‌కు చెందిన ఉప్పు పిచ్చయ్య, గత 15 సంవత్సరాలుగా జేబు దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నాడు. బహిరంగ సభల్లో, వీఐపీల పర్యటనల్లో జనం రద్దీగా ఉన్నప్పుడు తన చేతివాటం ప్రదర్శించి జేబు దొంగతనాలు చేస్తున్నాడు. ♦ ఈ నెల 7వ తేదీన కూసుమంచిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభమైంది. బ్యాంక్ లాకర్లో దాచేందుకని 12 తులాల బంగారం తో తిప్పారెడ్డి రంగారెడ్డి అనే రైతు వచ్చాడు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన తరువాత బ్యాంకుకు వెళ్దామనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత చూసుకుంటే.. తన బంగారాన్ని ఎవడో కాజేశాడు. ఇదేరోజున ఖమ్మం నగరానికి చెందిన యువకుడు రమేష్ వద్దనున్న 18వేల రూపాయల నగదు కూడా మాయమైంది. ♦ వీరిద్దరి ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యా రు. జేబు దొంగల కోసం నిఘా వేశారు. మరుసటి రోజున, జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌లో కాం గ్రెస్ బహిరంగ సభలోలోనూ ఓ దొంగ చేతివాటం ప్రదర్శించినట్టుగా పోలీసుల దృష్టికి వచ్చింది. ♦ మొత్తానికి ఆ జేబు దొంగను కనిపెట్టారు. కారులో సూర్యాపేట వెళుతున్న ఒకడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే.. గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెం ప్రకాష్‌నగర్‌కు చెందిన ఉప్పు పిచ్చయ్య, ♦ అతని నుంచి కారుతోపాటు కూసు మంచిలో కొట్టేసిన 12 తులాల బంగారం, 18వేల రూపాయల నగ దు, పర్సులోగల నాలుగు విదేశీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రా ల్లో ఇతడు అనేక జేబు దొంగతనాలకు పాల్పడ్డాడు. ♦ ఇతడిని పట్టుకున్న ఎస్ఐ రఘును, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. వారికి మెమెంటోలు, క్యాష్ రివార్డులు అందించారు. సమావేశంలో సీఐ జాఠోత్ వసంత్‌కుమార్, ఎస్ఐ రఘు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర చోరుడు అరెస్ట్
కావలి: దాదాపు 50పైగా చోరీలకు పాల్పడి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర గజదొంగను కావలి ఒకటో పట్టణ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి, అతని నుంచి 42 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసకున్నామని కావలి డీఎస్పీ కఠారి రఘు తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ కంట్రోల్ కమాండ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం మండలం ఒంటిమామిడికి చెందిన కె.అచ్యుతరామరాజు అవ్వ–తాతల వద్దనే పెరిగాడు. మోటార్లకు రివైండింగ్ మెకానిక్ పనులు, క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సర్పంచ్ బావమర్దిపై దాడిచేసిన కేసులో 2011లో జైలుకెళ్లాడు. అక్కడ కొందరు దొంగలతో ఏర్పడిన పరిచయంతో దొంగగా మారాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2102లో తిరుపతిలోని అలిపిరిలో ఓ ఇట్లో 120 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు, తిరుచానూరులో ఓ ఇంట్లో 80 గ్రాములు బంగారం, రూ.20 వేల నగదు, తిరుపతిలోని మరో రెండు ఇళ్లల్లో 20 గ్రాములు బంగారం, రూ.40 వేలు నగలు అపహరించాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్, ఆ తర్వాత తిరుపతి సీసీఎస్ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. 2013 అక్టోబర్‌లో జైలు నుంచి విడుదలై హైదరాబాద్‌కు వెళ్లి క్యాటరింగ్ పనులు చేశాడు. కొద్ది రోజులు తర్వాత హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఓ ఇంట్లో 290 గ్రాములు బంగారం, రూ. 70 వేల నగదు చోరీ చేశాడు. నారాయణగూడ ప్రాంతంలో ఒక ఇంట్లో చోరీ చేసి 120 గ్రాములు బంగారం, వెండి వస్తువులు అపహరిచాడు. 2015 నవంబర్‌లో విశాఖపట్నంలో ఒక ఇంట్లో 600 గ్రాములు బంగారం, ఒక ఏటీఎం కాజేశాడు. ఏటీఎంతో రూ.40 నగదు డ్రా చేశాడు. విశాఖపట్నంలోనే మరో ఇంట్లో 700 గ్రాములు బంగారం, రూ. 20 వేలు నగదు అపహరించాడు. రాజమండ్రి సమీపంలో ఉన్న బొమ్మూరులోని ఒక ఇంట్లో 400 గ్రాములు బంగారం, ధవళేశ్వరంలోని ఒక ఇంట్లో 700 గ్రాములు బంగారం, ఎంఆర్‌పల్లిలో బస్టాండ్ సమీపంలో ఒక ఇంట్లో నగదు, వెండి వస్తువులు చోరీ చేశాడు. 2017 ఆగస్టులో తిరుపతి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లిన సమయంలో మరో దొంగ ద్వారా చెన్నైకు చెందిన గిరిబాబుతో పరిచయం అయ్యాడు. జైలు నుంచి విడుదల అయ్యాక తిరుపతిలో ఒక ఇంట్లో 16 గ్రాములు బంగారం చోరీ చేసి గిరిబాబు వద్ద పెట్టాడు. సెప్టెంబర్ 11న పల్సర్ వాహనాన్ని గిరిబాబు పేరు మీదనే కొనుగోలు చేశాడు. తిరుపతిలోని పద్మావతినగర్‌లో ఒక ఇంట్లో 252 గ్రాములు బంగారం, కిలో వెండి దేవతా విగ్రహాలను, తిరుపతిలోని వాణినగర్‌లో ఒక ఇంట్లో 157 గ్రాములు బంగారం, ఎస్వీపీ కాలనీలోని ఇంట్లో 90 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, ఆర్‌ఆర్‌నగర్‌లో ఒక ఇంట్లో 40 గ్రాముల బంగారం, నవంబర్‌లో కాకినాడ సాయిగణేష్ వీధిలో ఒక ఇంట్లో 20 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, 2018 జనవరిలో కాకినాడలోని వలసపాకలలో ఒక ఇంట్లో 200 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి చోరీ చేశాడు. చోరీ సొత్తునంతా చెన్నైలో ఉన్న గిరిబాబు వద్దకు తీసుకెళ్లేందుకు తన పల్సర్ వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలో జనవరి 23న కావలి పట్టణంలోని జొన్నాయగుంటలోని చిట్టాబత్తిన ప్రభావతి ఇంట్లో చొరబడి 42 గ్రాముల బంగారం చోరీ చేసి వెళ్తుండగా గమనించిన స్థానిక మహిళ ప్రశ్నించడంతో వాహనాన్ని వదిలి పరారయ్యాడు. ఈ కేసులో బాధితురాలి ఫిర్యాదు కావలి ఒకటో పట్టణ సీఐ ఎం.రోశయ్య, తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కావలిలో జరిగిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన కేసుల్లో ఆయా పోలీస్స్టేషన్లకు సమాచారం అందించనున్నారు. అంతరాష్ట్ర దొంగను చాకచక్యంగా పట్టుకున్న సీఐ రోశయ్య, సిబ్బందిని ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ అభినందించి, క్యాష్ అవార్డు ప్రకటించారని డీఎస్పీ రఘు వెల్లడించారు. -
అద్దె కార్లే అతడి టార్గెట్
సాక్షి,సిటీబ్యూరో: తన ఇద్దరు అనుచరుల తో కలిసి టూరిస్ట్ మాదిరిగా వస్తాడు... నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కార్లు అద్దెకు తీసుకుంటాడు... వెంటనే రాష్ట్రం దాటేసి వాటి రూపురేఖలు మార్చేస్తాడు... ఈ వాహనాలను వినియోగించి కొన్నాళ్ళ పాటు గంజా యి స్మగ్లింగ్ చేసి ఆపై అమ్మేసి సొమ్ము చేసుకుంటాడు... ఈ పంథాలో నాలుగు రాష్ట్రాల్లో ‘పనితనం’ ప్రదర్శించిన అంతర్రాష్ట్ర దొంగను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. ఇతడి ముఠా సిటీలోనూ నేరాలు చేసినట్లు వెలుగులోకి రావడంతో విషయం ఆరా తీయాలని ఇక్కడి అధికారులు నిర్ణయించారు. జీపీఎస్ ఉన్న హైఎండ్ వాహనాలే.. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాకు చెందిన దిలీప్‌కుమార్ అలియాస్ సురేంద్ర సింగ్ ఈ ముఠా నాయకుడిగా అదే ప్రాంతానికి చెందిన బల్వీర్, ముఖేష్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ ముగ్గురూ టూరిస్టుల మాదిరిగా దేశంలోని వివిధ నగరాలకు వెళ్తుంటారు. వెళ్ళే ముందే తమ ఫొటోలు, నకిలీ పేర్లు, చిరునామాలతో కూడిన గుర్తింపుకార్డులు తయారు చేసుకుని దగ్గర ఉంచుకుంటారు. ఎంపిక చేసుకున్న నగరానికి చేరుకున్న తర్వాత ట్రావెల్స్ కార్యాలయాల నుంచి కార్లను అద్దెకు తీసుకుంటారు. తామే వాహనాలను డ్రైవ్ చేసుకుంటామంటూ వాటి యాజమాన్యాలతో చెప్తారు. ఈ గ్యాంగ్ ట్రావెల్స్ నిర్వాహకులకు ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరిస్తుంది. సాధారణ కార్లు కాకుండా జీపీఎస్ పరిజ్ఞానం జోడించిన హైఎండ్ వాహనాలే అద్దెకు కావాలని అడుగుతుంది. దీంతో వాటిని ఇవ్వడానికీ యజమానులు వెనుకాడరు. ఇలా తీసుకునే సమయంలో ఈ ముగ్గురూ తమ వెంట తెచ్చుకున్న నకిలీ గుర్తింపు పత్రాలు దాఖలు చేస్తుంటారు. ఇలా కారు తమ చేతికి చిక్కిన వెంటనే రాష్ట్రం దాటేయడంతో పాటు సరిహద్దుల్లోనే జీపీఎస్ పరికరాలు, కారు నెంబర్ ప్లేట్లను తొలగించేస్తారు. ఏ రాష్ట్రానికి వెళ్తున్నారో అదే సిరీస్‌లతో కూడిన నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్లు తగిలించుకుంటారు. ఇలా వాహనాలను తీసుకుని నేరుగా గుజరాత్ లేదా రాజస్థాన్ చేరుకుంటారు. ‘కళ్ళల్లో’ పడే వరకు స్మగ్లింగ్... ఈ చోరీ వాహనాలను వినియోగించే దిలీప్ గ్యాంగ్ ఆ రెండు రాష్ట్రాల్లోనూ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటుంది. పోలీసులకు తాము వినియోగిస్తున్న వాహనంపై అనుమానం వచ్చే వరకు అక్రమ రవాణా చేస్తుంది. అలా జరిగిందని తెలిసిన వెంటనే నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి ఆ వాహనాన్ని అమ్మేస్తుంది. ఆపై మరో నగరాన్ని టార్గెట్‌గా చేసుకుని ‘వచ్చి పోతుంది’. ఈ పంథాలో వీరు బెంగళూరులోని జయప్రకాష్ నగర్, జీవన్‌బీమా నగర్ల్లో ఉన్న జస్ట్ రైడర్, జూమ్ కార్ సంస్థల నుంచి రూ.40 లక్షల విలువైన రెండు హైఎండ్ కార్లను ఎత్తుకుపోవడంతో అక్కడ కేసులు నమోదయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు దిలీప్, బల్వీర్, ముఖేష్‌లు నిందితులుగా గుర్తించారు. వీరు రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించి సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకుని బెంగళూరు తరలించారు. విచారణ నేపథ్యంలో ఈ చోర త్రయం ఇదే పంథాలో ముంబై, చెన్నై, హైదరాబాద్‌ల్లోనే కార్ల చోరీలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ముగ్గురి అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని బెంగళూరు పోలీసులు ఈ మూడు ప్రాంతాలకు అందించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఇక్కడ నమోదైన ఈ తరహా నేరాలపై ఆరా తీస్తున్నారు. త్వరలో ఓ ప్రత్యేక బృందాన్ని బెంగళూరు పంపనున్నట్లు తెలిసింది. -
అంతర్ రాష్ట్ర ఏటీఎం దొంగల అరెస్టు
ఒంగోలు క్రైం: ఏటీఎం సెంటర్ల వద్ద అమాయకులను మోసం చేసి నగదు అపహరిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగలు నలుగురిని అద్దంకి పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటకలోనూ అనేక ఏటీఎంల వద్ద ప్రజలను మోసం చేసిన కరుడుగట్టిన మోసగాళ్లను చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక తన కార్యాలయంలో ఎస్పీ బి.సత్య ఏసుబాబు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. అద్దంకి ఎస్ఐ సుబ్బరాజుకు వచ్చిన సమాచారం మేరకు శింగరకొండ కమ్మ సత్రం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. నలుగురూ కరుడుకట్టిన అంతర్ రాష్ట్ర ఏటీఎం దొంగలుగా గుర్తించారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు రంగసముద్రం భాస్కరరెడ్డితో పాటు అతనికి సహకరించిన అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ గ్రామానికి చెందిన సున్నశెట్టి కృష్ణమూర్తి, ఓబులదేవ చెరువు (ఓడిసి) మండలం నల్లగుంట్లపల్లి గ్రామానికి చెందిన నండూరి వెంకటేష్, గాండ్లపెంట మండలం గాజులవారిపల్లె గ్రామానికి చెందిన ఆకుల హరినాధ్లను అరెస్టు చేశారు. 70కి పైగా నేరాలు మూడు రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తం 70కి పైగా నేరాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రంగసముద్రం భాస్కరరెడ్డి ఏటీఎం దొంగల ముఠాకు నాయకుడు. ఇతను గతంలో హోంగార్డుగా పనిచేశాడు. నేరాలకు పాల్పడుతుండటంతో ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు. గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత కృష్ణమూర్తితో కలిసి కొంతకాలం నేరాలు చేశాడు. 2016 జూన్ నుంచి నండూరి వెంకటేష్, ఆకుల హరినాథ్‌లను ముఠాలో చేర్చుకున్నాడు. మొత్తం 70కి పైగా నేరాలకు పాల్పడగా అందులో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 29 నేరాలు చేశారు. 2017 మే నెలలో 29 కేసుల్లో కదిరి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి నేరాలు చేస్తూనే ఉన్నారు. వీరిపై అనేక పోలీస్స్టేషన్లలో నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. జూదాలు, మగువలు, మద్యానికి బానిసలై విలాసాలకు అలవాటు పడి ఏటీఎంల వద్దకు వచ్చే అమాయకులను మోసం చేయటమే పనిగా పెట్టుకున్నారు. నేరం చేసే విధానం ఇలా.. వీరు ఎస్బీఐ ఏటిఎం సెంటర్లను మాత్రమే టార్గెట్ చేసుకొని అమాయకులను మోసం చేస్తారు. ఏటీఎంల వద్దకు వచ్చే వృద్ధులు, చదువురాని వారు, అమాయకులు వచ్చినప్పుడు వాళ్లకు సాయం చేసినట్లుగా నటిస్తారు. మిషన్‌లో కార్డు వాడటం చేతగాని వారిని గుర్తించి వాళ్ల కార్డును తీసుకొని మిషన్‌లో పెట్టి పిన్ నంబర్ ఎంటర్ చేయమంటారు. ఈ లోగా వీళ్లలో ఒకరు ఆ పిన్ నంబర్ గమనించి గుర్తు పెట్టుకుంటారు. మరొకరు వీరి వద్ద ఉన్న అదే బ్యాంక్ ఏటీఎం కార్డును వారికి ఇచ్చి అసలు కార్డును వీళ్ల వద్ద ఉంచుకుంటారు. వాళ్లు వెళ్లిన తర్వాత అసలు కార్డు ద్వారా ఏటీఎం నుంచి నగదు డ్రా చేస్తారు. ఒకరోజు విత్‌డ్రా బ్యాలెన్స్ పరిమితి దాటితే ఈ ఏటీఎం కార్డు ద్వారా వాళ్ల వద్ద ఉన్న మరో ఏటీఎం కార్డు ఉన్న అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇలా అపహరించిన ఏటీఎం కార్డుల ద్వారా స్వైపింగ్ చేసి బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు. 27 ఏటీఎం సెంటర్లలో మోసం ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తం 27 ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలు చేసినట్లు నిందితులు అంగీకరించారు. జిల్లాలో ఈ ఏడాది అద్దంకిలో ఎస్బీఐ ఏటీఎం వద్ద ఒకరిని మోసం చేసి రూ.49 వేలు కాజేశారు. పొదిలిలో రూ.75 వేలు, పామూరులో రూ.50 వేలు, కనిగిరిలో రూ.40 వేలు కాజేశారు. మూడు రాష్ట్రాల్లో కలిపి రూ.14.75 లక్షలు ఏటీఎంల వద్ద కాజేశారు. వీరి నుంచి రూ.7.88 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు రివార్డులు అంతర్ రాష్ట్ర ఏటీఎం దొంగలను చాకచక్యంగా పట్టుకున్న అద్దంకి సీఐ హైమారావు, ఎస్ఐ సుబ్బరాజు, సంతమాగులూరు ఎస్ఐ నాగరాజు, ఐటీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ ఎం.కోటేశ్వరరావు, కానిస్టేబుల్ యు.కోటేశ్వరరావులను ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేకంగా అభినందించారు. వీరికి నగదు రివార్డులు అందించారు. సమావేశంలో ఏఎస్పీ ఏబీటీఎస్ ఉదయరాణి, ఎస్బీ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు, దర్శి డీఎస్పీ కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
♦ 23 తులాల బంగారం, ♦ 40 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం గుత్తి: అనంతపురం, కర్నూల్ , కడప జిల్లాల పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అగ్రహారం రంగస్వామి అనే అంతర్రాష్ట్ర దొంగను ఎట్టకేలకు గుత్తి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు, 40 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో సీఐ ప్రభాకర్ గౌడ్ విలేఖరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన అగ్రహారం రంగస్వామి అనే 23 సంవత్సరాల యువకుడు గత రెండు, మూడు సంవత్సరాలుగా చోరీలకు పాల్పడుతున్నాడు. అనంతపురం, కర్నూల్, కడప జిల్లాల పరిధిలో పలు చోట్ల తాళాలు వేసిన ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. గుత్తి మున్సిపాలిటీతో పాటు బాచుపల్లి, ధర్మాపురం గ్రామాల్లో కూడా చోరీలకు పాల్పడ్డాడు. మూడు జిల్లాల పోలీసులు ఆ దొంగను పట్టుకోవడానికి శత విధాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో సదరు దొంగ గుత్తిలోని గుంతకల్లు రోడ్డులో ఉన్నట్లు సీఐకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన వెంటనే సిబ్బందిని వెంట బెట్టుకుని దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసుల రాకను పసిగట్టిన దొంగ పరుగు తీశాడు. ఎస్ఐ చాంద్‌బాషా, కానిస్టేబుళ్లు రవి, మోహన్, ఆదిలు సుమారు కిలో మీటరు వెంట పడి దొంగను పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి అతని వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దొంగను కోర్టులో హాజరు పరిచారు. జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. దొంగను పట్టుకోవడంలో ధైర్యసాహసాలు చూపిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను సీఐ అభినందించి నగదు బహుమతులు అందజేశారు. -
వీడు మామూలోడు కాదు !
►అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ ►నిందితుడిపై ఏపీ, తెలంగాణలో 17 కేసులు ►హత్య కేసులో జైలుకూ వెళ్లాడు, మరో హత్య కేసులో విచారణ ►సెల్‌ఫోన్ చోరీ కేసు దర్యాప్తులో వెలుగు చూసిన నేరాలు ►రూ.12 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, ద్విచక్రవాహనం స్వాధీనం ►అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి వెల్లడి తిరుపతి క్రైం: అంతర్రాష్ట్ర గజ దొంగను గురువారం సాయంత్రం రేణిగుంట, చంద్రగిరి హైవేరోడ్డులోని రామానుజపల్లె క్రాస్ వద్ద అరెస్ట్ చేసినట్లు అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతనిపై మొత్తం 17 కేసులు నమోదై ఉన్నాయని, హత్య కేసులో అతను జైలుకూ వెళ్లాడని, మరో హత్య కేసు నడుస్తోందని చెప్పారు. ఓ సెల్‌ఫోన్ చోరీ కేసుకు సంబంధించి చేసిన విచారణలో అతని దారుణ కృత్యాలు, చోరీలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. శుక్రవారం అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పెద్దపూజార్లు గ్రామానికి చెందిన నారా బసవరాజు అలియాస్ రాజు, అలియాస్ మహేష్(38)ప్రస్తుతం బెంగళూరు సమీపంలోని బుధగేరిలో నివాసం ఉంటున్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి విచారణ చేయగా,19 ఏళ్ల కాలంగా అతను ఎన్నో నేరాలకు పాల్పడినట్లు తేలింది. గతంలో హైదరాబాద్‌లో ఉంటూ అక్కడ తనతో పాటు నేరస్తుడైన ఇబ్రహీం అనే వ్యక్తిని 2003లో గొడవ పడి చంపేశాడు. ఆ హత్య కేసులో జైలుకూ వెళ్లాడు. అయితే ఆ కేసు కొన్ని రోజుల తరువాత కొట్టేశారు. అలాగే, తనతోపాటు చోరీలకు పాల్పడే స్వగ్రామానికి చెందిన సలీంను కూడా పాతకక్షలతో 2011లో చంపేశాడు. ఆకేసులో కోర్టులో శిక్ష పడగా దానిపై ఇతను అప్పీలుకెళ్లాడు. అనంతరం 2010లో బళ్లారి నుంచి ఇన్నోవా కారును బాడుగకు మాట్లాడుకుని ఇద్దరు స్నేహితులతో కలసి విజయవాడకు వెళ్లే దారిలో అద్దంకి సర్కిల్ పరిధిలో డ్రైవర్‌ను హతమార్చి, కారును తీసుకెళ్లాడు. ఇంకా ఆ కేసు పెండింగ్‌లో ఉంది.నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో దొంగతనంలో ఎన్బీడబ్ల్యూ కేసు పెండింగ్‌లో ఉంది. హైదరాబాద్‌లో ఉంటూ వనస్థలిపురం, ఎల్బి.నగర్, సరూర్‌నగర్, హయత్‌నగర్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లో చోరీలకు పాల్పడి పలుమార్లు జైలుకెళ్లివచ్చాడు.2015 నవంబర్ 5న నంద్యాల జైలు నుంచి బయటకు వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్సార్ జిల్లా మాధవవరం, బెంగళూరులో బుధగేరిలో కాపురం ఉంటూ రాజంపేట, బద్వేల్, మార్గాపురం, ఆదోని, ఆత్మకూర్, గుంతకల్, అనంతపురం, మదనపల్లె, ఒంగోలు, గూడూరు, నెల్లూరు తిరుపతిలో చోరీలకు పాల్పడ్డాడు. అలా ఇళ్లలో చోరీ వస్తువులను ఆదోనిలో బంగారు వ్యాపారస్తులకు అమ్మేశాడు. అలాగే హోస్పేట్లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో, మరో ఫైనాన్స్ కంపెనీలో కుదువపెట్టి బంగారు ఆభరణాలు విక్రయించినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, నందలూరు, ఒంగోలు ప్రాంతాల్లో చోరీ కేసులకు సంబంధించి వస్తువులను మాధవరంలో నిందితుడు నివాసం ఉన్న ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 250 గ్రాముల బంగారు, 9 కేజీల వెండి, టీవీ, సెల్‌ఫోన్, ట్యాబ్‌లు, మోటార్ సైకిల్‌తో పాటు హత్యకు ఉపయోగించిన కత్తి, దొంగతనాలకు ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే ఇతని 11కేసులు నమోదై ఉన్నాయి.ఈ కేసును ఛేదించడంలో క్రైం ఏఎస్పీ సిద్ధారెడ్డి, డీఎస్పీ కొండారెడ్డి, సీఐలు సత్యనారాయణ, శరత్చంద్ర, పద్మలత, ఎస్ఐలు ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌పిళ్లై, మోహన్‌గౌడ్, రామ్మూర్తి, సుదర్శన్‌రావు తదితరులు ఎంతగానో కృషి చేశారని, వీరందరికీ రివార్డులు వచ్చేలా చూస్తామని జయలక్ష్మి చెప్పారు. -
వెరైటీ చోరుడు
♦ అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ ఖరీదైన వస్తువులపైనే కన్ను ♦ చదివింది పదో తరగతే మూడు భాషల్లో ప్రావీణ్యం ♦ చోరీసొత్తుతో దేవాలయాలకు విరాళాలు ఈఓల క్వార్టర్లలోనే బస పంజగుట్ట : ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర రావు, ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన అబ్బూరి సోమయ్య అలియస్ శ్రీకాంత్ చౌదరీ అలియస్ అక్కినేని అలియాస్ కార్తీక్ (35) 2007లో కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చి వైజాగ్‌లో దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. ఆ తరువాత గన్నవరం, చెన్నై, విజయవాడ, మాదాపూర్, కేపిహెచ్పి, త్రివేండ్రం, బెంగళూరు, నర్సారావుపేట్, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో ఇతనిపై 41 కేసులు నమోదై ఉన్నాయి. చెన్నైలోనే 17 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతనిపై చైన్నై పోలీసులు 2010 పీడీ యాక్ట్ నమోదు చేశారు. కేవలం పదవ తరగతి చదివిన సోమయ్య తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని వారిని ప్రలోభపెట్టి వారి నుంచి బంగారు ఆభరణాలు, ఖరీదైన సెల్ఫోన్లు దొంగిలించుకొని పారిపోతాడు. ఇతనిపై నర్సారావుపేట్, విజయనగరం పోలీస్స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. ఖరీదైన హాస్టళ్లలో ఉంటూ వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, ఐపాడ్లను కాజే సేవాడు. క్యాబ్‌లలో తిరుగుతూ డ్రైవర్ల దృష్టి మరల్చి వారి ఖరీదైన ఫోన్లు కూడా ఎత్తుకెళ్లేవాడు. ఆలయ ఈఓల గదుల్లోనే బస ఇతనికి దక్షిణ భారత దేశంలోని పలు దేవాలయాల్లో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయి. దొంగతనం చేయగా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని ఆలయ ఇఓలకు నేరుగా చందాల రూపంలో అందజేసి వారి గదిలోనే బస చేసేవాడు. ఇతని ఇతర అలవాట్లు లేకపోగా, కేవలం ఖరీదైన ఫోన్లు వాడటం, ఖరీదైన అద్దె కార్లలో తిరగడం, జల్సాలకు చోరీ సొత్తును ఖర్చు చేసేవాడు. కారు డ్రైవింగ్ రాకపోవడంతో అద్దెకార్లలో తిరుగుతూ వాటి డ్రైవర్లను మోసం చేసేవాడు. శ్రీనగర్‌కాలనీలో దొంగిలించిన సొమ్మును అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పంజగుట్ట డీఐ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎసైై్స శివకుమార్ వలపన్ని పట్టుకున్నారు. నిందితుని నుంచి 13 ల్యాప్‌టాప్‌లు, ఒక యాపిల్ ఐ పాడ్, 14 ఖరీదైన సెల్ఫోన్లు, ఐదు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు డీసీపీ తెలిపారు. -
అంతర్ రాష్ట్ర మహిళా దొంగ అరెస్ట్
వరంగల్ జిల్లా: ఓ అంతర్ రాష్ట్ర మహిళా దొంగను అరెస్ట్ చేసిన వరంగల్ క్రైం పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట హాజరుపరిచారు. ఆమె నుంచి 21 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరెవరి ఇళ్లలో దొంగతనానికి పాల్పడిందనే వివరాలు తీసుకుని వారికి తిరిగి ఆభరణాలు అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు.