నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సత్య ఏసుబాబు
ఒంగోలు క్రైం: ఏటీఎం సెంటర్ల వద్ద అమాయకులను మోసం చేసి నగదు అపహరిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగలు నలుగురిని అద్దంకి పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటకలోనూ అనేక ఏటీఎంల వద్ద ప్రజలను మోసం చేసిన కరుడుగట్టిన మోసగాళ్లను చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక తన కార్యాలయంలో ఎస్పీ బి.సత్య ఏసుబాబు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. అద్దంకి ఎస్‌ఐ సుబ్బరాజుకు వచ్చిన సమాచారం మేరకు శింగరకొండ కమ్మ సత్రం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. నలుగురూ కరుడుకట్టిన అంతర్ రాష్ట్ర ఏటీఎం దొంగలుగా గుర్తించారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు రంగసముద్రం భాస్కరరెడ్డితో పాటు అతనికి సహకరించిన అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ గ్రామానికి చెందిన సున్నశెట్టి కృష్ణమూర్తి, ఓబులదేవ చెరువు (ఓడిసి) మండలం నల్లగుంట్లపల్లి గ్రామానికి చెందిన నండూరి వెంకటేష్, గాండ్లపెంట మండలం గాజులవారిపల్లె గ్రామానికి చెందిన ఆకుల హరినాధ్‌లను అరెస్టు చేశారు.
70కి పైగా నేరాలు
మూడు రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తం 70కి పైగా నేరాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రంగసముద్రం భాస్కరరెడ్డి ఏటీఎం దొంగల ముఠాకు నాయకుడు. ఇతను గతంలో హోంగార్డుగా పనిచేశాడు. నేరాలకు పాల్పడుతుండటంతో ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు. గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత కృష్ణమూర్తితో కలిసి కొంతకాలం నేరాలు చేశాడు. 2016 జూన్ నుంచి నండూరి వెంకటేష్, ఆకుల హరినాథ్‌లను ముఠాలో చేర్చుకున్నాడు. మొత్తం 70కి పైగా నేరాలకు పాల్పడగా అందులో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 29 నేరాలు చేశారు. 2017 మే నెలలో 29 కేసుల్లో కదిరి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి నేరాలు చేస్తూనే ఉన్నారు. వీరిపై అనేక పోలీస్‌స్టేషన్లలో నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. జూదాలు, మగువలు, మద్యానికి బానిసలై విలాసాలకు అలవాటు పడి ఏటీఎంల వద్దకు వచ్చే అమాయకులను మోసం చేయటమే పనిగా పెట్టుకున్నారు.
నేరం చేసే విధానం ఇలా..
వీరు ఎస్‌బీఐ ఏటిఎం సెంటర్లను మాత్రమే టార్గెట్ చేసుకొని అమాయకులను మోసం చేస్తారు. ఏటీఎంల వద్దకు వచ్చే వృద్ధులు, చదువురాని వారు, అమాయకులు వచ్చినప్పుడు వాళ్లకు సాయం చేసినట్లుగా నటిస్తారు. మిషన్‌లో కార్డు వాడటం చేతగాని వారిని గుర్తించి వాళ్ల కార్డును తీసుకొని మిషన్‌లో పెట్టి పిన్ నంబర్ ఎంటర్ చేయమంటారు. ఈ లోగా వీళ్లలో ఒకరు ఆ పిన్ నంబర్ గమనించి గుర్తు పెట్టుకుంటారు. మరొకరు వీరి వద్ద ఉన్న అదే బ్యాంక్ ఏటీఎం కార్డును వారికి ఇచ్చి అసలు కార్డును వీళ్ల వద్ద ఉంచుకుంటారు. వాళ్లు వెళ్లిన తర్వాత అసలు కార్డు ద్వారా ఏటీఎం నుంచి నగదు డ్రా చేస్తారు. ఒకరోజు విత్‌డ్రా బ్యాలెన్స్ పరిమితి దాటితే ఈ ఏటీఎం కార్డు ద్వారా వాళ్ల వద్ద ఉన్న మరో ఏటీఎం కార్డు ఉన్న అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. ఇలా అపహరించిన ఏటీఎం కార్డుల ద్వారా స్వైపింగ్ చేసి బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు.
27 ఏటీఎం సెంటర్లలో మోసం
ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తం 27 ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలు చేసినట్లు నిందితులు అంగీకరించారు. జిల్లాలో ఈ ఏడాది అద్దంకిలో ఎస్‌బీఐ ఏటీఎం వద్ద ఒకరిని మోసం చేసి రూ.49 వేలు కాజేశారు. పొదిలిలో రూ.75 వేలు, పామూరులో రూ.50 వేలు, కనిగిరిలో రూ.40 వేలు కాజేశారు. మూడు రాష్ట్రాల్లో కలిపి రూ.14.75 లక్షలు ఏటీఎంల వద్ద కాజేశారు. వీరి నుంచి రూ.7.88 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులకు రివార్డులు
అంతర్ రాష్ట్ర ఏటీఎం దొంగలను చాకచక్యంగా పట్టుకున్న అద్దంకి సీఐ హైమారావు, ఎస్‌ఐ సుబ్బరాజు, సంతమాగులూరు ఎస్‌ఐ నాగరాజు, ఐటీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ ఎం.కోటేశ్వరరావు, కానిస్టేబుల్ యు.కోటేశ్వరరావులను ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేకంగా అభినందించారు. వీరికి నగదు రివార్డులు అందించారు. సమావేశంలో ఏఎస్పీ ఏబీటీఎస్ ఉదయరాణి, ఎస్‌బీ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు, దర్శి డీఎస్పీ కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment