నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలు. (ఇన్‌సెట్‌లో) సమీర్ ఖాన్
సాక్షి, హైదరాబాద్: వారాలు, తిథులు, నక్షత్రాలు వంటివి గణించుకొని చాలామంది మంచిపనులకు ఉపక్రమించడం ఓ ఆనవాయితీ. అయితే దొంగతనాలే జీవితంగా బతుకుతున్న మహమ్మద్ సమీర్ ఖాన్‌కూ ఓ సెంటిమెంటు ఉందట. కంటిచూపూ సరిగ్గా లేని ఈ నేరగాడు సహాయకుడు ఉంటే చాలు..పగటి పూట అదీ కేవలం మంగళవారం మాత్రమే చోరీలు చేస్తాడు. ఆ రోజు సెలవు దినమైతే మాత్రమే మరుసటి, ఆ తర్వాతి రోజులకు ‘పని’వాయిదా వేస్తాడు. ఇలా ఘరానా నేరచరిత్ర ఉన్న మహమ్మద్ సమీర్ ఖాన్ సహా ఇద్దరిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21 లక్షల విలువైన 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలసి సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
18 ఏళ్ల కిందట సిటీకి వలస...
సమీర్ ఖాన్‌కు సమీర్ పఠాన్, షోయబ్ అనే మారుపేర్లూ ఉన్నాయి. ఇతడి పూర్వీకులు అఫ్గానిస్తాన్‌లోని కాబూల్ నుంచి బెంగళూరుకు వలసవచ్చారు. చదువులేకున్నా సమీర్ కన్నడ, ఉర్దూ మాట్లాడగలడు. తన తండ్రి మరణానంతరం 2000లో తన తల్లితో కలసి హైదరాబాద్‌కు వచ్చి బార్కస్‌లో స్థిరపడ్డాడు. సీడీలు, వస్త్రాల వ్యాపారం చేశాడు. 2008లో సెల్‌ఫోన్ చోరీ కేసులో ఎస్సార్‌నగర్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లడంతో ఇతడి నేర చరిత్ర ప్రారంభమైంది. అప్పటి నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పలు నేరాలు చేస్తూ జైలుకు వెళ్లి వస్తున్నాడు. 2011లో ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, 2014లో గోల్కొండ, ఆర్సీపురం, మల్కాజ్‌గిరి, కు షాయిగూడ, కీసర ఠాణాల పరి«ధుల్లో నేరాలు చేసిన సమీర్‌ఖాన్‌పై 30 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని కలబురిగీ, బీదర్, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోనూ నేరాలు చేశాడు. తాజాగా జైల్లో పరిచయమైన ఓల్డ్ మలక్‌పేట వాసి మహమ్మద్ షోయబ్‌ను తన అనుచరుడిగా మార్చుకున్నాడు. అతడు బైక్ నడుపుతుంటే వెనుక కూర్చునే సమీర్ వీధుల్లో తిరుగుతూ అనువైన ఇంటి కోసం గాలిస్తుంటాడు.
సమీర్ సోదరులూ చోరశిఖామణులే..
సమీర్ ఇద్దరు అన్నయ్యలూ దొంగలే. వీరిపై ఏపీలోని అనేక ఠాణాల్లో కేసులున్నాయి. ఓ అన్న అక్కడి జైల్లో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. మరో అన్న జైలుకు వెళ్లి వస్తుంటాడు. సమీర్ గత ఏడాది నవంబర్‌లో బెంగళూరులోని కడిగెహల్లీ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత బెయిల్‌పై వచ్చి మరికొన్ని నేరాలు చేశాడు. సిటీలో 3, బీదర్‌లో 5, కలబురిగీలో 4, ఏపీలో ఒకటి నేరాలు చేశాడు. ఇతడి కదలికలపై దృష్టి పెట్టిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఎస్సైల బృందం వలపన్ని సమీర్‌తో పాటు అతని సహాయకుడు షోయబ్‌ను పట్టుకున్నారు. కాగా నగర వాసులు ఎవరైనా రెండుమూడు రోజులకు పైబడి ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళుతుంటే స్థానిక ఠాణాలో సమాచారం ఇవ్వాలని కొత్వాల్ అంజనీకుమార్ కోరారు.
ఆ రోజు కాకుంటే...
అనువైన ఇంటిని ఎంచుకొని తాళం పగులగొట్టాక సమీర్ బంగారం, నగదుతో పాటు ఇతర విలువైనవీ ఎత్తుకొచ్చేస్తాడు. తాను మంగళవారం కాకుండా వేరే రోజుల్లో చోరీకి వెళ్తే ఆ ఇంట్లో ‘గిట్టుబాటు’కాకపోవడమో, పోలీసులకు చిక్కడమో జరుగుతుందని అతడి నమ్మకం. పోలీసులకు చిక్కకుండా తరచూ సిమ్‌కార్డులు మార్చడం, వాహనం నంబర్ మార్చడం వంటివి పాటిస్తాడు.వాహనంపై ఉన్నప్పుడు కచ్చితంగా హెల్మెట్, దొంగతనం చేసేప్పుడు టోపీ ధరించి సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తపడతాడు. గరిష్టంగా 10 నిమిషాల్లో చోరీని పూర్తి చేసి పరారవుతాడు.
Comments
Please login to add a commentAdd a comment