సమాశేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ రఘు, సీఐ రోశయ్య. చిత్రంలో ముసుగులో ఉన్న నిందితుడు
కావలి: దాదాపు 50పైగా చోరీలకు పాల్పడి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర గజదొంగను కావలి ఒకటో పట్టణ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి, అతని నుంచి 42 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసకున్నామని కావలి డీఎస్పీ కఠారి రఘు తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ కంట్రోల్ కమాండ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం మండలం ఒంటిమామిడికి చెందిన కె.అచ్యుతరామరాజు అవ్వ–తాతల వద్దనే పెరిగాడు. మోటార్లకు రివైండింగ్ మెకానిక్ పనులు, క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సర్పంచ్ బావమర్దిపై దాడిచేసిన కేసులో 2011లో జైలుకెళ్లాడు. అక్కడ కొందరు దొంగలతో ఏర్పడిన పరిచయంతో దొంగగా మారాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2102లో తిరుపతిలోని అలిపిరిలో ఓ ఇట్లో 120 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు, తిరుచానూరులో ఓ ఇంట్లో 80 గ్రాములు బంగారం, రూ.20 వేల నగదు, తిరుపతిలోని మరో రెండు ఇళ్లల్లో 20 గ్రాములు బంగారం, రూ.40 వేలు నగలు అపహరించాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్, ఆ తర్వాత తిరుపతి సీసీఎస్ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు.
2013 అక్టోబర్‌లో జైలు నుంచి విడుదలై హైదరాబాద్‌కు వెళ్లి క్యాటరింగ్ పనులు చేశాడు. కొద్ది రోజులు తర్వాత హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఓ ఇంట్లో 290 గ్రాములు బంగారం, రూ. 70 వేల నగదు చోరీ చేశాడు. నారాయణగూడ ప్రాంతంలో ఒక ఇంట్లో చోరీ చేసి 120 గ్రాములు బంగారం, వెండి వస్తువులు అపహరిచాడు. 2015 నవంబర్‌లో విశాఖపట్నంలో ఒక ఇంట్లో 600 గ్రాములు బంగారం, ఒక ఏటీఎం కాజేశాడు. ఏటీఎంతో రూ.40 నగదు డ్రా చేశాడు. విశాఖపట్నంలోనే మరో ఇంట్లో 700 గ్రాములు బంగారం, రూ. 20 వేలు నగదు అపహరించాడు. రాజమండ్రి సమీపంలో ఉన్న బొమ్మూరులోని ఒక ఇంట్లో 400 గ్రాములు బంగారం, ధవళేశ్వరంలోని ఒక ఇంట్లో 700 గ్రాములు బంగారం, ఎంఆర్‌పల్లిలో బస్టాండ్ సమీపంలో ఒక ఇంట్లో నగదు, వెండి వస్తువులు చోరీ చేశాడు. 2017 ఆగస్టులో తిరుపతి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లిన సమయంలో మరో దొంగ ద్వారా చెన్నైకు చెందిన గిరిబాబుతో పరిచయం అయ్యాడు. జైలు నుంచి విడుదల అయ్యాక తిరుపతిలో ఒక ఇంట్లో 16 గ్రాములు బంగారం చోరీ చేసి గిరిబాబు వద్ద పెట్టాడు.
సెప్టెంబర్ 11న పల్సర్ వాహనాన్ని గిరిబాబు పేరు మీదనే కొనుగోలు చేశాడు. తిరుపతిలోని పద్మావతినగర్‌లో ఒక ఇంట్లో 252 గ్రాములు బంగారం, కిలో వెండి దేవతా విగ్రహాలను, తిరుపతిలోని వాణినగర్‌లో ఒక ఇంట్లో 157 గ్రాములు బంగారం, ఎస్వీపీ కాలనీలోని ఇంట్లో 90 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, ఆర్‌ఆర్‌నగర్‌లో ఒక ఇంట్లో 40 గ్రాముల బంగారం, నవంబర్‌లో కాకినాడ సాయిగణేష్ వీధిలో ఒక ఇంట్లో 20 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, 2018 జనవరిలో కాకినాడలోని వలసపాకలలో ఒక ఇంట్లో 200 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి చోరీ చేశాడు. చోరీ సొత్తునంతా చెన్నైలో ఉన్న గిరిబాబు వద్దకు తీసుకెళ్లేందుకు తన పల్సర్ వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలో జనవరి 23న కావలి పట్టణంలోని జొన్నాయగుంటలోని చిట్టాబత్తిన ప్రభావతి ఇంట్లో చొరబడి 42 గ్రాముల బంగారం చోరీ చేసి వెళ్తుండగా గమనించిన స్థానిక మహిళ ప్రశ్నించడంతో వాహనాన్ని వదిలి పరారయ్యాడు. ఈ కేసులో బాధితురాలి ఫిర్యాదు కావలి ఒకటో పట్టణ సీఐ ఎం.రోశయ్య, తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కావలిలో జరిగిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన కేసుల్లో ఆయా పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించనున్నారు. అంతరాష్ట్ర దొంగను చాకచక్యంగా పట్టుకున్న సీఐ రోశయ్య, సిబ్బందిని ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ అభినందించి, క్యాష్ అవార్డు ప్రకటించారని డీఎస్పీ రఘు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment