హరిసాయి (ఫైల్), రాజశేఖర్ (ఫైల్)
ఆ ఇద్దరు యువకులు జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఓ వైపు కుటుంబాన్ని పోషిస్తూ.. మరో వైపు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కష్టపడుతున్నారు. మరో వ్యక్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారి జీవితాలను కబళించింది. దీంతో ఆయా కుటుంబాలకు చెందిన వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సాక్షి, నెల్లూరు(చిల్లకూరు): మండలంలోని చేడిమాల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు వ్యక్తులు తమ కుటుంబాలను పోషిస్తున్న వారే. వారి మృతితో మూడు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు.. గూడూరు అడివి కాలనీకి చెందిన మిడతూరి సుధాకర్ (50) ఆటో నడుపుతుంటాడు. గూడూరు రూరల్ మండలంలోని చెన్నూరులో దళితవాడకు చెందిన నందిపాక హరిసాయి (27), మాతంగి రాజశేఖర్ (28) సమీప బంధువులు. ఇద్దరూ గూడూరులోని సొసైటీ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. కంపెనీకి చెందిన వస్తువులను చుట్టుపక్కల మండలాల్లో చిన్నపాటి దుకాణాలకు విక్రయిస్తుంటారు.
వస్తువులు విక్రయించి వెళ్తుండగా..
సుధాకర్ ఆటోలో బుధవారం హరిసాయి, రాజశేఖర్ కోట, చింతవరం వెళ్లారు. అక్కడ వస్తువులు విక్రయించి రాత్రి తిరిగి గూడూరుకు బయలుదేరారు. చేడిమాల వద్ద రోడ్డుపై వెళ్తున్నారు. అక్కడ కంకర తోలి ఉండడంతో సుధాకర్ ఆటోను పక్కకు తప్పించబోయిన సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు కాగా అందులో ఉన్న ముగ్గురూ లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలొదిలారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై సుధాకర్‌రెడ్డి సిబ్బందితో కలసి అక్కడికి చేరుకుని చక్రాల కింద నిలిగిన మృతదేహాలను బయటకు తీయించి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడ మూడు కుటుంబాలు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు
►చెన్నూరుకు చెందిన నందిపాక రమణయ్య, కృష్ణమ్మలకు ఒక్కగానొక్క కుమారుడు హరిసాయి. బీఎస్సీ చదివాడు. ఎస్సై అవ్వడమే అతని లక్ష్యం. ఓ వైపు అందుకు సిద్ధమవుతూ.. మరోవైపు కుటుంబ పోషణ నిమిత్తం ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. హరిసాయి సంపాదన మీదనే కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. మరో నెలలో ఇతడి వివాహం జరగాల్సి ఉంది. దీనికోసం తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే కొడుకు చనిపోవడంతో వారు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
►మాతంగి రాగయ్య, మాధవిలకు ఒక్కగానొక్క కుమారుడు రాజశేఖర్. ఇతను బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇంతలో ఖాళీగా ఉండడం ఇష్టంలేక కుటుంబానికి అండగా ఉండేందుకు హరిసాయితో కలిసి పని చేస్తున్నాడు. ఇద్దరూ ప్రమాదంలో మృతిచెందడంతో దళితవాడలో విషాదం నెలకొంది.
►ఆటో డ్రైవర్ సుధాకర్‌కు భార్య ఉన్నారు. వారిద్దరి కొడుకులకు వివాహమైంది. ప్రస్తుతం భార్య, సుధాకర్ కలిసి ఉంటున్నారు. ఇంటి పెద్ద చనిపోవడంతో ఆమె గుండెలవిసేలా విలపిస్తున్నారు.
చదవండి: (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోం.. కూతురి గోల్డ్ చైన్ విషయమై భర్తతో గొడవ, దాంతో)
Comments
Please login to add a commentAdd a comment